Credit Limit
-
క్రెడిట్ కార్డ్.. గీత దాటొద్దు..!
క్రెడిట్ కార్డు యూజర్ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి యాక్టివ్ కార్డులు 10 కోట్ల మార్క్‌ను దాటగా.. వచ్చే ఐదేళ్లలో (2029 మార్చి నాటికి) 20 కోట్లకు పెరుగుతాయని పీడబ్ల్యూసీ అంచనా. యూపీఐ దెబ్బకు డెబిట్ కార్డుల వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. చెల్లింపులకు వచ్చే సరికి యూపీఐ తర్వాత క్రెడిట్ కార్డుల హవాయే నడుస్తోంది. బ్యాంకు ఖాతాలో బ్యాలన్స్ ఉంటేనే యూపీఐ. బ్యాలన్స్ లేకపోయినా క్రెడిట్ (అరువు)తో కొనుగోళ్లకు క్రెడిట్ కార్డులు వీలు కల్పిస్తాయి. అందుకే వీటి వినియోగం పట్ల ఆసక్తి పెరుగుతూ పోతోంది. కానీ, క్రెడిట్ కార్డ్‌లను ఇష్టారీతిన వాడేయడం సరికాదు. ఇది క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేస్తుంది. భవిష్యత్‌లో రుణాల అర్హతకు గీటురాయిగా మారుతుంది. రుణ ఊబిలోకి నెట్టేసే ప్రమాదం లేకపోలేదు. క్రెడిట్ కార్డుపై లిమిట్ ఎంత? ఎంత వ్యయం చేయాలి? గీత దాటితే ఏమవుతుంది? తదితర అంశాలపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఇప్పడంతా డిజిటల్ చెల్లింపులే. కరోనా విపత్తు తర్వాత నుంచి నగదు చెల్లింపులు గణనీయంగా తగ్గిపోయాయి. వినియోగదారులు నగదుకు బదులు క్రెడిట్ కార్డుతో షాపింగ్‌కు వెళితే మరింత ఎక్కువ ఖర్చు చేస్తున్నట్టు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. పైగా గతంతో పోలిస్తే జీనవశైలి ఖర్చులు గణనీయంగా పెరిగిపోయాయి. దీంతో క్రెడిట్ కార్డుల స్వైపింగ్ మితిమీరుతోంది. పండుగల సందర్భంగా ఆకర్షించే ఆఫర్లు కూడా ఇందుకు ఒక కారణం. కార్డు ఉంది కదా అని చెప్పి ఇష్టారీతిన ఖర్చు చేస్తే.. తిరిగి చెల్లించేటప్పుడు ఆ భారం మోయాల్సి వస్తుంది. పైగా క్రెడిట్ స్కోర్‌ను ఇది ప్రతికూలంగా ప్రభావితం చేయగలదు. అందుకే క్రెడిట్ కార్డు వినియోగం విషయమై ప్రతి ఒక్కరూ అవగాహనతో, బాధ్యతతో వ్యవహరించాలి. క్రెడిట్ లిమిట్ కార్డుపై ఉన్న గరిష్ట వ్యయ పరిమితి ఇది. ఏ కాలంలో అయినా ఈ మేరకు గరిష్టంగా వినియోగించుకోవచ్చు. వినియోగించుకున్న మేర తదుపరి గడువు నాటికి పూర్తిగా చెల్లించేస్తే ఎలాంటి వడ్డీ భారం పడదు. ఆదాయం, వ్యక్తిగత ఆర్థిక చరిత్ర, రిస్క్ ఆధారంగా క్రెడిట్ లిమిట్‌ను కార్డు జారీ సమయంలోనే బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు నిర్ణయిస్తుంటాయి. సాధారణంగా ఆరంభంలో తక్కువ లిమిట్‌తో కార్డులు జారీ చేస్తుంటాయి. కార్డుపై వినియోగం, చెల్లింపుల తీరు ఆధారంగా తర్వాతి కాలంలో ఈ లిమిట్‌ను సవరించుకునే అవకాశం ఉంటుంది. వినియోగం కార్డుపై క్రెడిట్ లిమిట్ రూ.లక్ష ఉందనుకుంటే.. గరిష్టంగా రూ.లక్ష వరకు వినియోగించుకోవచ్చని అర్థం. ఇలా పూర్తి పరిమితి మేర ప్రతి నెలా కార్డు ఖర్చు చేస్తుంటే అది క్రెడిట్ స్కోర్‌కు ఏ మాత్రం మంచిది కాదు. క్రెడిట్ వినియోగ నిష్పత్తి (సీయూఆర్) అని ఒకటి ఉంటుంది. రూ.లక్ష క్రెడిట్ లిమిట్ ఉన్నప్పుడు ఒక నెలలో రూ.90,000 ఖర్చు పెట్టారని అనుకుందాం. అప్పుడు సీయూఆర్ 90 శాతం అవుతుంది. ‘‘అధిక క్రెడిట్ వినియోగ నిష్పత్తి రుణ దాహార్తిని తెలియజేస్తుంది. ఇది క్రెడిట్ స్కోర్‌ను తగ్గించేస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో సీయూఆర్ దాటి ఖర్చు చేయడం తప్పు కాదు. కానీ అది అరుదుగానే ఉండాలి. సీయూఆర్ 30 శాతం మించకుండా చూసుకుంటేనే మంచిది. కార్డుపై బకాయి మొత్తాన్ని గడువులోపు పూర్తిగా చెల్లించేయాలి. ఇలా చేయడం వల్ల క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది. దీనివల్ల తర్వాతి కాలంలో క్రెడిట్ లిమిట్‌ను సులభంగా పెంచుకోవచ్చు. రుణాలను తక్కువ వడ్డీ రేటుకు పొందొచ్చు’’అని బ్యాంక్ బజార్ సీఈవో ఆదిల్ శెట్టి సూచించారు. సాధారణంగా సీయూఆర్ 70 శాతం మించితే అది క్రెడిట్ స్కోర్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఖర్చులపై నియంత్రణలేమిని, బలహీన ఆర్థిక పరిస్థితులను ఇది తెలియజేస్తుంది. క్రెడిట్ స్కోర్‌పై రిమార్క్ కార్డు బకాయిల తిరిగి చెల్లింపులు తీరు క్రెడిట్ స్కోర్‌పై 35 శాతం మేర ప్రభావం చూపిస్తుందని బ్యాంక్ బజార్ చెబుతోంది. మెరుగైన క్రెడిట్ స్కోర్ కొనసాగాలంటే సకాలంలో బకాయిలు చెల్లించడం ఎంతో అవసరం. లేదంటే అధిక వడ్డీలకుతోడు, ఆలస్య రుసుములు చెల్లించాల్సి వస్తుంది. క్రెడిట్ స్కోర్ కూడా తగ్గిపోతుంది. క్రెడిట్ వినియోగ రేషియో అధికంగా ఉన్నా, క్రెడిట్ ఓవర్ లిమిట్‌కు వెళ్లినా కానీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడుతుంది. క్రెడిట్ స్కోరును లెక్కించే సందర్భంగా తక్కువ సీయూఆర్‌ను సానుకూలంగా చూస్తామని క్రిఫ్ హైమార్క్ (క్రెడిట్ బ్యూరో) మాజీ ఎండీ సంజీత్ దావర్ తెలిపారు.క్రెడిట్ ఓవర్ లిమిట్ ఒక బిల్లు సైకిల్ పరిధిలో క్రెడిట్ లిమిట్‌ను మొత్తం వాడేస్తే.. తదుపరి చెల్లింపులకు అవకాశం ఉండదు. కానీ, క్రెడిట్ స్కోర్ అధికంగా ఉన్న వారికి ఇందులో వెసులుబాటు ఉంది. క్రెడిట్ ఓవర్ లిమిట్ సదుపాయం వినియోగించుకోవచ్చు. కార్డు లిమిట్ పూర్తయినప్పటికీ.. అదే కార్డుపై మరింత లిమిట్ తీసుకోవచ్చు. ఇందుకు అదనపు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ‘‘కొన్ని సందర్భాల్లో మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న కస్టమర్లకు తాత్కాలికంగా క్రెడిట్ లిమిట్‌ను బ్యాంక్‌లు పెంచుతాయి. ఇందుకోసం ముందుగానే సంప్రదించాలి. కొన్ని కార్డు సంస్థలు క్రెడిట్ లిమిట్ మించిపోయినప్పటికీ, లావాదేవీలను అనుమతిస్తుంటాయి. కాకపోతే అందుకు ఓవర్ లిమిట్ ఫీజు వడ్డిస్తాయి. పెనాల్టీ వడ్డీ రేట్లను కొన్ని అమలు చేస్తాయి. ఇవి సాధారణ రేట్ల కంటే అధికంగా ఉంటాయి’’అని ఆదిల్ శెట్టి వివరించారు. క్రెడిట్ ఓవర్ లిమిట్‌పై చార్జీలు అన్ని క్రెడిట్ కార్డు సంస్థల్లో ఒకే విధంగా ఉండవు. కొన్ని బ్యాంక్‌లు 2.5 శాతం లేదా కనీసం రూ.550, కొన్ని సంస్థలు 3 శాతం చొప్పున చార్జీ వసూలు చేస్తున్నాయి. క్రెడిట్ ఓవర్ లిమిట్ ఆప్షన్‌తో కొన్ని ప్రత్యేక కార్డులు కూడా ఉన్నాయి. లేని వారు బ్యాంక్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు. ఏదైనా అసాధారణ పరిస్థితుల్లో తప్పించి, దీన్నొక అలవాటుగా మార్చుకోకూడదు. ఒకరికి ఎన్ని కార్డులు ‘‘అందరికీ ఒక్కటే సూత్రం వర్తించదు. ఆర్థిక పరిస్థితులు, ఖర్చు చేసే అలవాట్లపై ఎన్ని క్రెడిట్ కార్డులు అన్నది ఆధారపడి ఉంటుంది. బాధ్యతాయుతంగా వినియోగిస్తూ, సకాలంలో చెల్లింపులు చేసే వారు ఎన్ని కార్డులు అయినా కలిగి ఉండొచ్చు. కాకపోతే ఒకరికి రెండు లేదా మూడు కార్డులు మించి ఉండరాదన్నది సాధారణ సూత్రం’’అని మై మనీ మంత్ర వ్యవస్థాపకుడు రాజ్‌ఖోస్లా వివరించారు. ఆన్లైన్ చెల్లింపులకు వినియోగించేందుకు తక్కువ లిమిట్‌తో ఒక కార్డు, ఇతర ముఖ్యమైన, అత్యవసరాల కోసం మరొక కార్డు కలిగి ఉండొచ్చని ప్లాన్ అహెడ్ వెల్త్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు విశాల్ ధావన్ సూచించారు. మినిమం డ్యూ ఒక నెలలో కార్డుపై చేసిన వ్యయం మొత్తాన్ని బిల్లు జారీ చేసిన నాటి నుంచి 20 రోజుల్లోపు చెల్లించాల్సి ఉంటుంది. అంత మొత్తం చెల్లించే వెసులుబాటు లేకపోతే, మినిమం డ్యూ అమౌంట్ అని ఉంటుంది. అంత చెల్లించినా సరిపోతుంది. మొత్తం బిల్లులో ఇది సుమారు 5 శాతంగా ఉంటుంది. అప్పుడు మిగిలిన బకాయిపై నెలవారీ 3 శాతానికి పైనే వడ్డీ రేటు పడిపోతుంది. ఇతర చార్జీలు కూడా చెల్లించుకోవాలి. మినిమం డ్యూ అమౌంట్ చెల్లించడం చెల్లింపుల వైఫల్యం కిందకు రాదు. బకాయి మొత్తాన్ని వెంటనే చెల్లించలేని వారు పెద్ద లావాదేవీలను ఈఎంఐ కిందకు మార్చుకోవచ్చు. లేదంటే లోన్ ఎగైనెస్ట్ క్రెడిట్ కార్డ్ (కార్డుపై రుణం) ఆఫర్‌ను వినియోగించుకోవడం ద్వారా రుణం పొంది సత్వర చెల్లింపుల నుంచి గట్టెక్కొచ్చు. క్రెడిట్ లిమిట్ కార్డుపై ఉన్న గరిష్ట వ్యయ పరిమితి ఇది. ఏ కాలంలో అయినా ఈ మేరకు గరిష్టంగా వినియోగించుకోవచ్చు. వినియోగించుకున్న మేర తదుపరి గడువు నాటికి పూర్తిగా చెల్లించేస్తే ఎలాంటి వడ్డీ భారం పడదు. ఆదాయం, వ్యక్తిగత ఆర్థిక చరిత్ర, రిస్క్ ఆధారంగా క్రెడిట్ లిమిట్‌ను కార్డు జారీ సమయంలోనే బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు నిర్ణయిస్తుంటాయి. సాధారణంగా ఆరంభంలో తక్కువ లిమిట్‌తో కార్డులు జారీ చేస్తుంటాయి. కార్డుపై వినియోగం, చెల్లింపుల తీరు ఆధారంగా తర్వాతి కాలంలో ఈ లిమిట్‌ను సవరించుకునే అవకాశం ఉంటుంది. లిమిట్ పెంచుకోవచ్చు.. క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండి, కార్డుపై అధిక వ్యయం చేసే వారికి ఉచితంగా లిమిట్‌ను పెంచుకునేందుకు బ్యాంక్‌లు ఆఫర్లు ఇస్తుంటాయి. లేదంటే ఎవరికి వారే స్వచ్ఛందంగా కార్డు సంస్థను సంప్రదించి లిమిట్ పెంచాలని కోరొచ్చు. వినియోగం 70–80 శాతం దాటుతున్న వారు ప్రస్తుత కార్డుపైనే లిమిట్‌ను పెంచుకోవడం లేదంటే మరో కార్డు తీసుకుని వ్యయాలను రెండు కార్డుల మధ్య వైవిధ్యం చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. దీనివల్ల క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (సీయూఆర్)ను తగ్గించుకోవచ్చు. స్వీయ నియంత్రణ క్రెడిట్ కార్డుపై వాస్తవ రుణ పరిమితి (క్రెడిట్ లిమిట్) కంటే తక్కువ లిమిట్‌ను ఎవరికి వారే విధించుకోవచ్చు. దీనివల్ల వ్యయాలపై నియంత్రణ సాధ్యపడుతుంది. బ్యాంక్/ఎన్బీఎఫ్సీ యాప్ ద్వారా క్రెడిట్ లిమిట్లో మార్పులు చేసుకోవచ్చు. ఉదాహరణకు రూ.3 లక్షల క్రెడిట్ లిమిట్ ఉన్నప్పుడు రూ.లక్ష పరిమితిని సొంతంగా నిర్ణయించుకోవచ్చు. అటువంటప్పుడు కార్డుపై ఒక నెలలో వ్యయం రూ.లక్షకు చేరగానే తదుపరి చెల్లింపులు తిరస్కరణకు గురవుతాయి. ఎలాంటి పెనాల్టీ చార్జీలు పడవు. ఖర్చులు చేయిదాటిపోకుండా, గుర్తు చేసేందుకు ఈ సదుపాయం అక్కరకు వస్తుంది. యాప్‌లోకి వెళ్లి ఈ పరిమితిలో ఎప్పుడైనా మార్పులు చేసుకోవచ్చు. లాభ–నష్టాలు.. → అధిక లిమిట్ అత్యవసర వైద్యం, ప్రయాణాలప్పుడు ఆదుకుంటుంది. → కార్డులు పెరిగేకొద్దీ వాటిపై వ్యయాలు కూడా ఇతోధికం అవుతుంటాయి. అన్నీ కలసి రుణ భారాన్ని పెంచేస్తాయి. → స్వీయ నియంత్రణ లేనట్టయితే, అధిక క్రెడిట్ లిమిట్ విషయంలో హద్దులేనట్టుగా వ్యవహరించినట్టయితే రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఎదురవుతుంది. → కార్డులు ఎక్కువైనప్పుడు వాటి వేర్వేరు గడువు తేదీలను గుర్తు పెట్టుకుని, సకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. → చెల్లింపుల వైఫల్యాలు, అధిక క్రెడిట్ వినియోగం క్రెడిట్ స్కోర్‌ను తగ్గించేస్తాయి. → బాధ్యతతో, వివేకంతో వినియోగిస్తే క్రెడిట్ కార్డు ద్వారా తగ్గింపు ఆఫర్లు పొందొచ్చు. వినియోగంపై రివార్డు పాయింట్లను కూడా పొందొచ్చు. క్రెడిట్ స్కోరును బలోపేతం చేసుకోవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ముద్రా రుణాల పరిమితి రెట్టింపు చేయాలి
రాబోయే బడ్జెట్లో ముద్రా యోజన కింద ఇచ్చే రుణాల పరిమితిని రెట్టింపు చేయాలని, రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచాలని చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) కేంద్రాన్ని కోరుతున్నాయి. అలాగే అన్సెక్యూర్డ్ రుణాలకు రుణ హామీ కవరేజీని రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్లకు పెంచాలని ఆశిస్తున్నాయి. అటు అంతర్జాతీయంగా తమ ఉత్పత్తులను విక్రయించుకోవడానికి తగు మద్దతు కూడా కలి్పంచాలని కోరుకుంటున్నాయి. ఎంఎస్ఎంఈల వృద్ధికి ఊతమిచ్చేలా ప్రభుత్వం తన ఎజెండాను కొనసాగించే అవకాశం ఉందని బడ్జెట్‌పై నెలకొన్న అంచనాలను అర్క ఫిన్‌క్యాప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నవీన్ సైనీ తెలిపారు. ముద్రా రుణాల పరిమితిని పెంచడం తదితర అంశాలతో ఎంఎస్ఎంఈలకు మరిన్ని ఆర్థిక వనరులు అందుబాటులోకి రాగలవని, వాటి ఎదుగుదలతో పాటు ఎకానమీ వృద్ధికి కూడా దోహదపడగలవని వివరించారు. రియల్టీ ఆశలు.. బడ్జెట్‌పై రియల్ ఎస్టేట్ రంగానికి చాలా ఆశలు ఉన్నట్లు క్రిసుమి కార్పొరేషన్ ఎండీ మోహిత్ జైన్ తెలిపారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లు రికార్డు స్థాయికి చేరడంలో వేతన జీవులు కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో గృహ రుణాలపై చెల్లించే అసలు, వడ్డీపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. గత కొన్నాళ్లుగా ప్రాపరీ్టల విలువ భారీగా పెరిగినందున గృహ రుణ వడ్డీపై పన్ను రిబేటును ప్రస్తుతమున్న రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని పేర్కొన్నారు. మరోవైపు స్టార్టప్‌ల కోసం పన్నుల విధానాన్ని సరళతరం చేస్తే అంకుర సంస్థలకు ఊరట లభించగలదని సీఆర్ఐబీ సహ వ్యవస్థాపకుడు సన్నీ గర్గ్ తెలిపారు. ఏంజెల్ ట్యాక్స్‌ను తొలగించడం లేదా క్రమబదీ్ధకరించడమో చేస్తే దేశీయంగా నిధుల లభ్యత మెరుగుపడుతుందని, ప్రారంభ దశలోని అంకుర సంస్థలకు ఫండింగ్‌పరమైన వెసులుబాటు లభించగలదని పేర్కొన్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రి‘కార్డ్’ స్థాయిలో క్రెడిట్!.. జాగ్రత్తగా ఉండకపోతే జేబుకు చిల్లే
‘రండి బాబూ రండి.’ అంటూ క్రెడిట్ కార్డులిస్తున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఏ అవసరానికైనా అప్పటికప్పుడే డబ్బు సర్దుబాటు అవుతుందంటూ గాలం ఫేస్బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, ఎస్ఎంఎస్.. ఏది చూసినా ఇవే ప్రకటనలు ఒక్క మే నెలలోనే 17 లక్షల క్రెడిట్ కార్డులు జారీ చేసిన సంస్థలు జూన్‌లో క్రెడిట్ కార్డుల లావాదేవీలు ఏకంగా రూ.1.14 లక్షల కోట్లు సులువుగా అందుతుండటంతో భారీగా పెరిగిన వినియోగం అడ్డగోలుగా క్రెడిట్ లిమిట్ వాడేస్తూ.. కట్టలేక చార్జీలు, వడ్డీలతో ఇబ్బందులు ఒకప్పుడు అప్పు చేయాలంటే ఒకటిCrకి రెండు సార్లు ఆలోచించేవారు. ఇప్పుడు తమ ఆదాయానికి తగ్గట్టు కొందరు.. ఆదాయానికి మించి ఇంకొందరు ఎడాపెడా అప్పులు చేస్తూనే ఉన్నారు. బ్యాంకులూ ఈ పరిస్థితిని అనుకూలంగా ఉపయోగించుకుని ప్రాసెసింగ్ ఫీజులు, సర్వీసు చార్జీలు, అపరాధ రుసుముల పేరిట వినియోగదారుల జేబులు ఖాళీ చేస్తున్నాయి. ఫీజులు, జరిమానాలు కొండంత అని తెలిసినా వినియోగదారుల్లో క్రెడిట్ కార్డులపై మోజు తగ్గకపోగా అంతకంతకూ పెరిగిపోతోంది. అదే సమయంలో బ్యాంకులు కూడా ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయా, లేదా? అన్నది కూడా చూసుకోవడం లేదన్నంతగా అప్పులు ఇచ్చేస్తున్నాయి! పది మందిలో ఇద్దరు లేదా ముగ్గురు అప్పు ఎగవేసినా ఇబ్బంది లేని రీతిలో బ్యాంక్‌లు ఉన్నాయి. ఎందుకంటే బాగా చెల్లించగలిగిన ఆ ఏడెనిమిది మంది నుంచే క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంక్‌లు వసూలు చేస్తున్న వడ్డీ 45 శాతం (నెలవారీగా). బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఓ బ్యాంకర్ చెప్పిన మాట ఇది. సక్రమ చెల్లింపులతో బ్యాంకులకు నష్టమే! వినియోగదారులు నిబంధనల ప్రకారం సకాలంలో సొమ్ము చెల్లిస్తే తమకు నష్టమేనని ప్రైవేట్ క్రెడిట్ కార్డు సంస్థలు, బ్యాంకులు అంటున్నాయి. ‘‘ఇచ్చిన వంద రూపాయల అప్పును వినియోగదారుడు నిర్దిష్ట వ్యవధిలోగా తిరిగి చెల్లిస్తే మాకు ఏమీ గిట్టుబాటు కాదు. ఒకవేళ ఆ తేదీ నాటికి వినియోగదారుడు పూర్తి మొత్తం కాకుండా, కనీస మొత్తంగా పది రూపాయలు చెల్లించాడనుకుంటే.. మిగతా రూ.90పై 43% దాకా వడ్డీ పడుతుంది. దీనినే రివాల్వింగ్ క్రెడిట్ అంటారు. ఇలాంటి జరిమానాలు, వడ్డీలతోనే బ్యాంకులకు లాభాలొస్తాయి’’ అని ఓ బ్యాంకింగ్ నిపుణుడు విశ్లేషించారు. కొన్ని బ్యాంకులు తమ షరతులను వినియోగదారులకు వివరించకుండానే కార్డులు జారీ చేస్తున్నాయి. ఇలాంటి బ్యాంకులకు ముకుతాడు వేసేందుకు రిజర్వ్ బ్యాంకు తాజాగా కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. వీటి ప్రకారం క్రెడిట్ కార్డు సంస్థలు వినియోగదారుడికి తగినంత సమయం, సమాచారం ఇవ్వకుండా కార్డుల జారీ చేయరాదు. ఉన్నవాటి స్థాయి పెంచరాదు. వినియోగదారుడు కార్డును రద్దు చేసుకుంటానంటే ఆ విజ్ఞప్తిని పోస్ట్ ద్వారానే పంపాలని చెప్పకూడదు. ఈ–మెయిల్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా కూడా వినియోగదారులకు సమాచారం అందించాలి. కొంచెం జాగ్రత్త.. ►క్రెడిట్ కార్డుల వినియోగం, బిల్లుల చెల్లింపులో అజాగ్రత్తగా వ్యవహరిస్తే జేబుకు చిల్లు పడటం ఖాయం. ఆ పరిస్థితి రాకుండా కొన్ని సూచనలివీ.. ►అన్నిరకాల క్రెడిట్ కార్డులను పరిశీలించి తక్కువ వడ్డీ రేట్లు ఉన్న వాటిని ఎంచుకోవాలి. చాలా ఆర్థిక సంస్థలు ఇప్పుడు వార్షిక రుసుము వసూలు చేయడం లేదు. దీనిపైనా ఓ కన్నేసి ఉంచాలి. క్యాష్ అడ్వాన్స్ ఫీజు, లేట్ పేమెంట్ చార్జీలు, చెక్ బౌన్స్ చార్జీలు, స్టేట్మెంట్ కోసం చెల్లించాల్సిన డబ్బులు.. ఇలా రకరకాల పేర్లతో డబ్బు వసూలు చేస్తుంటాయి. వీటి గురించి ముందే తెలుసుకుని, వీలైనంత వరకూ ఆ లావాదేవీలకు దూరంగా ఉంటే సొమ్ము ఆదా అవుతుంది. ►అత్యవసర పరిస్థితుల్లో లేదా నెలవారీ చెల్లింపుల కోసం మాత్రమే క్రెడిట్ కార్డులు వాడటం మేలు. ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు నాలుగు నుంచి ఐదు వారాల సమయం ఉంటుంది కాబట్టి.. అంత సమయం వడ్డీ లేకుండా అప్పు దొరుకుతుందన్నమాట. సకాలంలో చెల్లించకపోతే పెనాల్టీలు తడిసి మోపెడవుతాయి. చెల్లింపు ►గడువునాటికి సరిపడా డబ్బు లేకుంటే.. కనీస మొత్తానికంటే ఎక్కువ కట్టడం ద్వారా వడ్డీ, పెనాల్టీ బాధ తగ్గించుకోవచ్చు. లేకుంటే నెలవారీ కిస్తీలుగా మార్చుకుని ఎప్పటికప్పుడు చెల్లించడం మేలు. ►బిల్లులు గడువులోగా చెల్లించకుంటే సిబిల్ రేటింగ్ పడిపోతుందని, ఇతర ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వడాన్ని నిలిపివేస్తాయని గుర్తుంచుకోవాలి. మార్చిలో లక్ష కోట్లు ఈ ఏడాది మార్చి నెలలో కేవలం క్రెడిట్ కార్డుల ద్వారా చేసిన కొనుగోళ్ల విలువ ఏకంగా రూ.లక్ష కోట్లు. రెండు నెలలు గడిచి జూన్ వచ్చేసరికి రికార్డు స్థాయిలో లక్షా 14 వేల కోట్ల రూపాయలకు చేరింది. అంటే నెలకు ఎనిమిది శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 118 శాతం ఎక్కువ. మరో విషయం ఏమిటంటే మేలో దేశంలోని మొత్తం అన్ని బ్యాంకులు కలిసి దాదాపు 17 లక్షల క్రెడిట్ కార్డులు జారీ చేశాయి. గత రెండేళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ వంటి బ్యాంకులు అత్యధికంగా కార్డులిచ్చాయి. అంతేకాదు ఇచ్చిన అప్పులు తిరిగి వసూలైన విషయంలోనూ మేలో ఒక రికార్డు నమోదైంది. గత మూడేళ్లతో పోలిస్తే అతి తక్కువ బౌన్స్ రేటు ఈ నెలలోనే ఉంది. కారణాలు ఏమిటి? స్థూలంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి కోవిడ్ తరువాతి పరిస్థితులైతే, రెండోది డిజిటల్ వ్యవహారాలు పెరిగిపోవడం. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు ఇళ్లకే పరిమితమైనవారు ఇప్పుడిప్పుడే వినోద, విహారాలకూ సిద్ధమవుతున్నారు. కోవిడ్ సమయంలో జేబులు ఖాళీ అయిన వారే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తక్షణావసరాలకు క్రెడిట్‌కార్డులు ఉపయోగిస్తే తప్పేమిటన్న భావన ఏర్పడింది. దీనికితోడు కోవిడ్ సమయంలో డిజిటల్ లావాదేవీలకు ప్రజలు అలవాటు పడటం కూడా కార్డుల వాడకం పెరిగేందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘‘మేం ఎప్పటికీ క్రెడిట్ కార్డులు తీసుకోం. మాకు ఆ పరిస్థితి రాదని 2016–2019 మధ్య మేం సర్వే చేసిన వారిలో 23 శాతం మంది చెప్పారు. కానీ కరోనా తదనంతర పరిస్థితుల్లో వారిలో 17 శాతం మంది క్రెడిట్‌కార్డులు తీసుకున్నారు’’ అని మనీ కంట్రోల్ ఆర్గనైజేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేవేంద్ర ద్వివేది చెప్పారు. డిజిటల్ లావాదేవీల వల్ల ప్రతి వ్యక్తి ఆర్థిక స్థితిగతులపై బ్యాంకులకు అవగాహన ఏర్పడిందని, దీంతో కార్డుల జారీ మరింత వేగిరం చేశాయని హైదరాబాద్‌కు చెందిన ఆర్బీఐ జనరల్ మేనేజర్ ఒకరు చెప్పారు. అయితే పాక్షికంగా ఆర్థిక సంక్షోభం వచ్చినా బ్యాంక్‌లు నష్టపోయే ప్రమాదం ఉందని ఆర్బీఐ హెచ్చరించిందని కూడా వివరించారు. - కంచర్ల యాదగిరిరెడ్డి -
వరికి, పత్తికి ఎకరాకు రూ.40 వేల రుణం
సాక్షి, హైదరాబాద్: వరి, పత్తి, ఆయిల్‌పాం, మొక్కజొన్న, సోయాబీన్, మిర్చి తదితర పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ (రుణ పరిమితి) పెరిగింది. వచ్చే వ్యవసాయ సీజన్‌కు రుణ పరిమితిని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఖరారు చేసింది. రాష్ట్రంలో పండించే 120 రకాల పంటలకు 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఎంతెంత రుణాలు ఇవ్వాలన్న దానిపై టెస్కాబ్ భారీ కసరత్తు చేసింది. సాగు ఖర్చు, ఉత్పాదకత, నీటి వసతి ఆధారంగా రుణ నిర్ధారణ చేసింది. రుణ పరిమితి నివేదికను రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ)కి పంపిం చింది. తాము ఖరారు చేసినట్లుగా రైతులకు పంట రుణా లు ఇవ్వాలని సూచించింది. రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేసే పత్తి, వరి పంటలకు ఎకరానికి రూ.40 వేలు ఖరారు చేసింది. సాగునీటి ప్రాజెక్టులు ఉన్నచోట వరికి గతేడాది రూ.34 వేల నుంచి రూ. 38 వేల వరకున్న పంట రుణా లను, ఈసారి రూ.36 వేల–రూ. 40 వేలకు పెంచింది. అంటే గతేడాది కంటే రూ.2 వేలు అధికంగా పెంచింది. శ్రీ పద్ధతిలో సాగు చేసే వరికి రూ.34 వేల నుంచి రూ. 36 వేలు ఖరారు చేసింది. గరిష్ట పరిమితి గతేడాదితో సమానంగా ఉంది. అలాగే వరి విత్తనోత్పత్తికి గతేడాది మాదిరిగానే రూ. 42 వేల నుంచి రూ.45 వేలుగా ఖరారు చేసింది. ఇక పత్తికి గతేడాది రుణ పరిమితి రూ.35 వేల నుంచి రూ. 38 వేలు ఉండగా, ఈసారి దాన్ని రూ.38 వేల నుంచి రూ.40 వేలకు పెంచింది. ఈసారి 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ పెరుగుదల రైతులకు ఉపయోగపడనుంది. ఆయిల్‌పామ్‌కు రూ. 42 వేల రుణం... ►ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈసారి ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనికోసం బడ్జెట్లో రూ. వెయ్యి కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయిల్‌పామ్ రుణాన్ని పెంచాలని నిర్ణయించినట్లు టెస్కాబ్ వర్గాలు తెలిపాయి. గతేడాది ఆయిల్‌పామ్ పంటలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.38 వేల వరకు రుణ పరిమితి ఉండగా, ఈసారి దాన్ని రూ.40 వేల నుంచి రూ.42 వేలకు పెంచడం గమనార్హం. ►సాగునీటి వసతి ఉన్నచోట మినుము పంటకు ఎకరాకు రూ. 18–21 వేలు, సాగునీటి వసతి లేని చోట 15–17వేలు ఖరారు చేశారు. సేంద్రియ విధానంలో పండించే మినుముకు 18–21 వేలు ఖరారు చేశారు. ►పెసరకు సాగునీటి వసతి ఉన్నచోట రూ.18–21 వేలు, సాగునీటి వసతి లేనిచోట రూ. 15–17 వేలు ఖరారు చేశారు. సేంద్రియ విధానంలో పండించే పెసరకు రూ. 18–21 వేలు నిర్దారించారు. ►శనగకు రూ. 22–24 వేలు చేశారు. ►సాగునీటి వసతి ఉన్న చోటమొక్కజొన్నకు రూ. 28–32 వేలు, నీటి వసతి లేని చోట రూ. 24–26 వేలు చేశారు. ►సాధారణ పద్ధతిలో పండించే కందికి సాగునీటి వసతి ప్రాంతాల్లో రూ.18–21 వేలు, సాగునీటి వసతి లేని చోట రూ.16–19 వేలు ఖరారు చేశారు. ఆర్గానిక్‌లో పండించే కందికి రూ. 18–21 వేలు ఖరారు చేశారు. ►సోయాబీన్‌కు రూ. 24 వేల నుంచి రూ. 26 వేలు ఇస్తారు. సోయా విత్తనోత్పత్తి రైతులకు రూ. 30 వేల నుంచి రూ. 32 వేల వరకు ఇస్తారు. ►మెడికల్, ఎరోమాటిక్ ప్లాంట్స్‌కు రూ. 37,500 నుంచి రూ. 42,500 వరకు ఇస్తారు. ►రూఫ్ గార్డెన్‌కు దశలవారీగా మొదటిసారి రూ. 28,500 నుంచి రూ. 31,500 వరకు ఇస్తారు. రెండో దశలో రూ.19 వేల నుంచి 21 వేలు, మూడోదశలో 9,500 నుంచి రూ. 10,500 వరకు ఇవ్వాలని నిర్ణయించారు. ►ఇక డ్రాగన్ ఫ్రూట్‌కు రూ. 65 వేల నుంచి రూ. 75 వేల వరకు ఇస్తారు. విత్తన రహిత ద్రాక్షకు రూ.1.25 లక్షల నుంచి రూ. 1.30 లక్షల రుణం ఇవ్వనున్నారు. ►పత్తి విత్తనాన్ని సాగు చేస్తే రూ.1.10 లక్షల నుంచి రూ.1.40 లక్షలకు ఖరారు చేశారు. ►పసుపు సాగుకు 75వేల నుంచి 80 వేల వరకు ఇస్తారు. ►ఉల్లిగడ్డ సాగుకు ఎకరానికి రూ.37 వేల నుంచి రూ.42 వేలు ఇస్తారు. -
పండగ సీజన్లో ఫ్లిప్‌కార్ట్ మరో ఆఫర్ !
Flipkart Pay Later Limit: పండగ వేళ కస్టమర్లకు మరో ఆఫర్‌ని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఈ కామర్స్ ఫ్టాట్ఫామ్పై తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేసి తదుపరి నెలలో బిల్ పే చేసే అవకాశాన్ని పే లేటర్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ కల్పిస్తోంది. కొత్త వారికి అవకాశం ప్రస్తుతానికి ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ ఆప్షన్ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పది కోట్ల మంది కష్టమర్లకే ఇప్పటి వరకు అందుబాటులో ఉంది. పండగ సీజన్‌ని పురస్కరించుకుని మరింత మందికి పే లేటర్ అవకాశం కల్పిస్తోంది. పే లేటర్ ఆప్షన్ పొందాలని అనుకునే వారు ఆధార్‌కార్డు, బ్యాంకు డిటైల్స్ అందివ్వడం ద్వారా పే లేటర్‌ని ఏనేబుల్ చేసుకోవచ్చు. కొత్తగా పది కోట్ల మందిని ఈ ఆప్షన్ పరిధిలోకి తేవాలని ఫిప్కార్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్లిప్‌కార్ట్ యాప్‌లో మోర్ ఆన్ ఫ్లిప్‌కార్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి క్రెడిట్ ఆప్షన్‌లోకి వెళితే పే లేటర్ వివరాలు కనిపిస్తాయి. అక్కడ ఇచ్చిన సూచనలు పాటిస్తూ ఈ ఆప్షన్ని పొందవచ్చు. లిమిట్ పెంపు పే లేటర్ ఆప్షన్లో ప్రస్తుతం క్రెడిట్ లిమిట్ కేవలం రూ. 10,000గానే ఉంది. తాజాగా ఈ మొత్తాన్ని రూ. 70,000లకు పెంచుతూ ఫ్లిప్‌కార్ట్ నిర్ణయం తీసుకుంది. పండగ సీజన్లో కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్రెడిట్ లిమిట్‌ను పెంచినట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. పే లేటర్ ఆప్షన్లో వినియోగించిన మొత్తాన్ని కస్టమర్లు తమ వెసులుబాటును బట్టి ఏడాదిలోగా ఈఎంఐ పద్దతిలో చెల్లించే వీలు సైతం కల్పించింది. పే లేటర్ ఈ కామర్స్ సైట్లలో కొనుగోలు సందర్భంగా పదే పదే బిల్లులు చెల్లింపులు చేయడానికి బదులు నెలలో జరిగిన చెల్లింపులకు ఒకే సారి బిల్లును పొంది,ఆ మొత్తాన్ని తదుపరి నెలలో ఒకే సారి చెల్లించవచ్చు. అంతేకాదు క్రెడిట్కార్లు లేక కోనుగోలు చేయడానికి ఇబ్బందులు పడుతున్న వారికి సైతం ఈ పే లేటర్ ఆప్షన్ ఉపయుక్తంగా ఉంటుంది. చదవండి: వచ్చేస్తోంది.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్..! 80 శాతం మేర భారీ తగ్గింపు...! -
ప్రాపర్టీప్లస్ 24th June 2018
-
క్రెడిట్ కార్డు లిమిట్ పెంపా.. ఇలా చేయండి..
క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. వీరిలో చాలా మంది వారి కార్డు క్రెడిట్ లిమిట్ పెరిగితే బాగుండేదని ఒక్కసారైన అనుకొనే ఉంటారు. కస్టమర్ విరివిగా కార్డును వినియోగిస్తూ, బిల్లులను సక్రమంగా చెల్లిస్తూ ఉంటే కార్డు జారీ కంపెనీలు, బ్యాంకులు ఆటోమేటిక్‌గానే క్రెడిట్ లిమిట్‌ను పెంచుకుంటూ వెళ్తాయి. క్రెడిట్ లిమిట్‌ను పెంచుకోవాలంటే ముందుగా మనకు కావాల్సింది.. మంచి క్రెడిట్ స్కోర్. అలాగే క్రమానుగత సక్రమ చెల్లింపులు, ఆదాయంలో పెరుగుదల వంటి అంశాలు కూడా క్రెడిట్ లిమిట్ పెంపులో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని గుర్తించుకోండి తొందరపడొద్దు: క్రెడిట్ కార్డు తీసుకున్న రెండు, మూడు నెలలకే క్రెడిట్ లిమిట్ కోసం కార్డు జారీ సంస్థలకు విజ్ఞప్తులు పంపించొద్దు. కనీసం ఆరు నెలల సమయం వరకు వేచి ఉండండి. సాధారణంగా కార్డు జారీ సంస్థలే క్రెడిట్ కార్డు లిమిట్‌ను ఆటోమేటిక్‌గా పెంచుతాయి. పెంచే వరకు ఎదురు చూడటం ఉత్తమం. మరీ ఎక్కువ అడగొద్దు: సంస్థలు ఆరు నెలలు దాటినా కూడా మీ లిమిట్‌ను పెంచకపోతే అప్పుడు వాటికి లిమిట్‌ను పెంచమని విజ్ఞప్తి పెట్టండి. ఇక్కడ లిమిట్‌ను రెట్టింపు చేయండని అడగొద్దు. 15-20 శాతం పెంచమని కోరండి. మరీ ఎక్కువ పెంచమని అడిగితే అది మీకు ఇబ్బందులు తేవొచ్చు. కార్డును విరివిగా వాడండి: క్రెడిట్ కార్డును విరివిగా ఉపయోగిం చండి. అంటే క్యాష్ ఇచ్చే ప్రతి చోటా కార్డు ఇవ్వడానికి ప్రయత్నించండి. అలాగే వచ్చే నెలవారీ బిల్లులను సక్రమంగా చెల్లించండి. ఇలా చేస్తే కార్డు జారీ సంస్థలు లిమిట్ పెంచే అవకాశముంది. జాగ్రత్త సుమీ... క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉంది కదా.. అని ఇస్టానుసారంగా కొనుగోలు జరపడం మంచిది కాదు. శక్తికి మించి వస్తువులను కొం టే.. ఆ తర్వాత బిల్లు చెల్లింపు కష్టమౌతుంది. బిల్లులు సక్రమంగా చెల్లించకపోతే చాలా సమస్యలను ఎదుర్కోవాలి. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. క్రెడిట్ లిమిట్ అనేది మన చెల్లింపుల శక్తికి సమానంగా ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ ఎక్కువ ఖర్చు చేయడానికి క్రెడిట్ లిమిట్‌ను పెంచుకోకూడదు. ఇలాచేస్తే అసలుకే ముప్పు రావొచ్చు.