రి‘కార్డ్‌’ స్థాయిలో క్రెడిట్‌!.. జాగ్రత్తగా ఉండకపోతే జేబుకు చిల్లే | Banks-Finance Agencies Issued Customers 17 Lakhs Credit Cards May Month | Sakshi
Sakshi News home page

రి‘కార్డ్‌’ స్థాయిలో క్రెడిట్‌!.. జాగ్రత్తగా ఉండకపోతే జేబుకు చిల్లే

Published Thu, Jul 7 2022 1:25 AM | Last Updated on Thu, Jul 7 2022 7:14 AM

Banks-Finance Agencies Issued Customers 17 Lakhs Credit Cards May Month - Sakshi

‘రండి బాబూ రండి.’ అంటూ క్రెడిట్‌ కార్డులిస్తున్న బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఏ అవసరానికైనా అప్పటికప్పుడే డబ్బు సర్దుబాటు అవుతుందంటూ గాలం ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌.. ఏది చూసినా ఇవే ప్రకటనలు ఒక్క మే నెలలోనే 17 లక్షల క్రెడిట్‌ కార్డులు జారీ చేసిన సంస్థలు జూన్‌లో క్రెడిట్‌ కార్డుల లావాదేవీలు ఏకంగా రూ.1.14 లక్షల కోట్లు సులువుగా అందుతుండటంతో భారీగా పెరిగిన వినియోగం అడ్డగోలుగా క్రెడిట్‌ లిమిట్‌ వాడేస్తూ.. కట్టలేక చార్జీలు, వడ్డీలతో ఇబ్బందులు

ఒకప్పుడు అప్పు చేయాలంటే ఒకటిCrకి రెండు సార్లు ఆలోచించేవారు. ఇప్పుడు తమ ఆదాయానికి తగ్గట్టు కొందరు..  ఆదాయానికి మించి ఇంకొందరు ఎడాపెడా అప్పులు చేస్తూనే ఉన్నారు. బ్యాంకులూ ఈ పరిస్థితిని అనుకూలంగా ఉపయోగించుకుని ప్రాసెసింగ్‌ ఫీజులు, సర్వీసు చార్జీలు, అపరాధ రుసుముల పేరిట వినియోగదారుల జేబులు ఖాళీ చేస్తున్నాయి. ఫీజులు, జరిమానాలు కొండంత అని తెలిసినా వినియోగదారుల్లో క్రెడిట్‌ కార్డులపై మోజు తగ్గకపోగా అంతకంతకూ పెరిగిపోతోంది.

అదే సమయంలో బ్యాంకులు కూడా ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయా, లేదా? అన్నది కూడా చూసుకోవడం లేదన్నంతగా అప్పులు ఇచ్చేస్తున్నాయి! పది మందిలో ఇద్దరు లేదా ముగ్గురు అప్పు ఎగవేసినా ఇబ్బంది లేని రీతిలో బ్యాంక్‌లు ఉన్నాయి. ఎందుకంటే బాగా చెల్లించగలిగిన ఆ ఏడెనిమిది మంది నుంచే క్రెడిట్‌ కార్డు ద్వారా బ్యాంక్‌లు వసూలు చేస్తున్న వడ్డీ 45 శాతం (నెలవారీగా). బ్యాంకింగ్‌ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఓ బ్యాంకర్‌ చెప్పిన మాట ఇది. 

సక్రమ చెల్లింపులతో బ్యాంకులకు నష్టమే! 
వినియోగదారులు నిబంధనల ప్రకారం సకాలంలో సొమ్ము చెల్లిస్తే తమకు నష్టమేనని ప్రైవేట్‌ క్రెడిట్‌ కార్డు సంస్థలు, బ్యాంకులు అంటున్నాయి. ‘‘ఇచ్చిన వంద రూపాయల అప్పును వినియోగదారుడు నిర్దిష్ట వ్యవధిలోగా తిరిగి చెల్లిస్తే మాకు ఏమీ గిట్టుబాటు కాదు. ఒకవేళ ఆ తేదీ నాటికి వినియోగదారుడు పూర్తి మొత్తం కాకుండా, కనీస మొత్తంగా పది రూపాయలు చెల్లించాడనుకుంటే.. మిగతా రూ.90పై 43% దాకా వడ్డీ పడుతుంది. దీనినే రివాల్వింగ్‌ క్రెడిట్‌ అంటారు. ఇలాంటి జరిమానాలు, వడ్డీలతోనే బ్యాంకులకు లాభాలొస్తాయి’’ అని ఓ బ్యాంకింగ్‌ నిపుణుడు విశ్లేషించారు.

కొన్ని బ్యాంకులు తమ షరతులను వినియోగదారులకు వివరించకుండానే కార్డులు జారీ చేస్తున్నాయి. ఇలాంటి బ్యాంకులకు ముకుతాడు వేసేందుకు రిజర్వ్‌ బ్యాంకు తాజాగా కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. వీటి ప్రకారం క్రెడిట్‌ కార్డు సంస్థలు వినియోగదారుడికి తగినంత సమయం, సమాచారం ఇవ్వకుండా కార్డుల జారీ చేయరాదు. ఉన్నవాటి స్థాయి పెంచరాదు. వినియోగదారుడు కార్డును రద్దు చేసుకుంటానంటే ఆ విజ్ఞప్తిని పోస్ట్‌ ద్వారానే పంపాలని చెప్పకూడదు. ఈ–మెయిల్, వాట్సాప్‌ వంటి సోషల్‌ మీడియా ద్వారా కూడా వినియోగదారులకు సమాచారం అందించాలి. 

కొంచెం జాగ్రత్త..
క్రెడిట్‌ కార్డుల వినియోగం, బిల్లుల చెల్లింపులో అజాగ్రత్తగా వ్యవహరిస్తే జేబుకు చిల్లు పడటం ఖాయం. ఆ పరిస్థితి రాకుండా కొన్ని సూచనలివీ.. 
అన్నిరకాల క్రెడిట్‌ కార్డులను పరిశీలించి తక్కువ వడ్డీ రేట్లు ఉన్న వాటిని ఎంచుకోవాలి. చాలా ఆర్థిక సంస్థలు ఇప్పుడు వార్షిక రుసుము వసూలు చేయడం లేదు. దీనిపైనా ఓ కన్నేసి ఉంచాలి. క్యాష్‌ అడ్వాన్స్‌ ఫీజు, లేట్‌ పేమెంట్‌ చార్జీలు, చెక్‌ బౌన్స్‌ చార్జీలు, స్టేట్‌మెంట్‌ కోసం చెల్లించాల్సిన డబ్బులు.. ఇలా రకరకాల పేర్లతో డబ్బు వసూలు చేస్తుంటాయి. వీటి గురించి ముందే తెలుసుకుని, వీలైనంత వరకూ ఆ లావాదేవీలకు దూరంగా ఉంటే సొమ్ము ఆదా అవుతుంది. 
అత్యవసర పరిస్థితుల్లో లేదా నెలవారీ చెల్లింపుల కోసం మాత్రమే క్రెడిట్‌ కార్డులు వాడటం మేలు. ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు నాలుగు నుంచి ఐదు వారాల సమయం ఉంటుంది కాబట్టి.. అంత సమయం వడ్డీ లేకుండా అప్పు దొరుకుతుందన్నమాట. సకాలంలో చెల్లించకపోతే పెనాల్టీలు తడిసి మోపెడవుతాయి. చెల్లింపు గడువునాటికి సరిపడా డబ్బు లేకుంటే.. కనీస మొత్తానికంటే ఎక్కువ కట్టడం ద్వారా వడ్డీ, పెనాల్టీ బాధ తగ్గించుకోవచ్చు. లేకుంటే నెలవారీ కిస్తీలుగా మార్చుకుని ఎప్పటికప్పుడు చెల్లించడం మేలు. 
బిల్లులు గడువులోగా చెల్లించకుంటే సిబిల్‌ రేటింగ్‌ పడిపోతుందని, ఇతర ఆర్థిక సంస్థలు రుణాలు ఇవ్వడాన్ని నిలిపివేస్తాయని గుర్తుంచుకోవాలి.

మార్చిలో లక్ష కోట్లు
ఈ ఏడాది మార్చి నెలలో కేవలం క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసిన కొనుగోళ్ల విలువ ఏకంగా రూ.లక్ష కోట్లు. రెండు నెలలు గడిచి జూన్‌ వచ్చేసరికి రికార్డు స్థాయిలో లక్షా 14 వేల కోట్ల రూపాయలకు చేరింది. అంటే నెలకు ఎనిమిది శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 118 శాతం ఎక్కువ. మరో విషయం ఏమిటంటే మేలో దేశంలోని మొత్తం అన్ని బ్యాంకులు కలిసి దాదాపు 17 లక్షల క్రెడిట్‌ కార్డులు జారీ చేశాయి. గత రెండేళ్లలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ వంటి బ్యాంకులు అత్యధికంగా కార్డులిచ్చాయి. అంతేకాదు ఇచ్చిన అప్పులు తిరిగి వసూలైన విషయంలోనూ మేలో ఒక రికార్డు నమోదైంది. గత మూడేళ్లతో పోలిస్తే అతి తక్కువ బౌన్స్‌ రేటు ఈ నెలలోనే ఉంది. 

కారణాలు ఏమిటి?
స్థూలంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి కోవిడ్‌ తరువాతి పరిస్థితులైతే, రెండోది డిజిటల్‌ వ్యవహారాలు పెరిగిపోవడం. కోవిడ్‌ కారణంగా రెండేళ్ల పాటు ఇళ్లకే పరిమితమైనవారు ఇప్పుడిప్పుడే వినోద, విహారాలకూ సిద్ధమవుతున్నారు. కోవిడ్‌ సమయంలో జేబులు ఖాళీ అయిన వారే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తక్షణావసరాలకు క్రెడిట్‌కార్డులు ఉపయోగిస్తే తప్పేమిటన్న భావన ఏర్పడింది. దీనికితోడు కోవిడ్‌ సమయంలో డిజిటల్‌ లావాదేవీలకు ప్రజలు అలవాటు పడటం కూడా కార్డుల వాడకం పెరిగేందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.

‘‘మేం ఎప్పటికీ క్రెడిట్‌ కార్డులు తీసుకోం. మాకు ఆ పరిస్థితి రాదని 2016–2019 మధ్య మేం సర్వే చేసిన వారిలో 23 శాతం మంది చెప్పారు. కానీ కరోనా తదనంతర పరిస్థితుల్లో వారిలో 17 శాతం మంది క్రెడిట్‌కార్డులు తీసుకున్నారు’’ అని మనీ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దేవేంద్ర ద్వివేది చెప్పారు. డిజిటల్‌ లావాదేవీల వల్ల ప్రతి వ్యక్తి ఆర్థిక స్థితిగతులపై బ్యాంకులకు అవగాహన ఏర్పడిందని, దీంతో కార్డుల జారీ మరింత వేగిరం చేశాయని హైదరాబాద్‌కు చెందిన ఆర్‌బీఐ జనరల్‌ మేనేజర్‌ ఒకరు చెప్పారు. అయితే పాక్షికంగా ఆర్థిక సంక్షోభం వచ్చినా బ్యాంక్‌లు నష్టపోయే ప్రమాదం ఉందని ఆర్‌బీఐ హెచ్చరించిందని కూడా వివరించారు.  
- కంచర్ల యాదగిరిరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement