
అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ భారత్ కాస్త పటిష్టమైన స్థితిలోనే ఉందని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. మార్కెట్ ఒడిదుడుకులపై ఆందోళన చెందకుండా, ఇన్వెస్టర్లు దీర్ఘకాలంపాటు తమ పెట్టుబడులను కొనసాగించడం శ్రేయస్కరమని ఆయన సూచించారు.
టారిఫ్‌ల యుద్ధం మార్కెట్లపై ప్రభావాలు చూపడం మొదలైనప్పటి నుంచి కూడా భారత్ దీటుగా ఎదురు నిలుస్తోందని పాండే చెప్పారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి, తక్కువ స్థాయిలో ద్రవ్య లోటు, సముచిత స్థాయిలో విదేశీ రుణభారం, కరెంటు అకౌంటు లోటు అదుపులోనే ఉండటం మొదలైనవి దేశానికి సానుకూల అంశాలని ఆయన పేర్కొన్నారు. భారత్ పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై కూడా చర్చలు జరుపుతోందని వివరించారు. ఇటీవల పెట్టుబడులు పెట్టిన చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లకు మార్కెట్ల పతనం గురించి పెద్దగా తెలియదు కాబట్టి, ప్రస్తుత పరిస్థితులను ఒక పాఠంగా భావించి, పెట్టుబడులను కొనసాగిస్తే దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుందని పాండే చెప్పారు.
ఇదీ చదవండి: తక్కువ ధరకే బంగారం కావాలా!
రిటైల్ ఇన్వెస్టర్లు అన్ని వివరాలను తెలుసుకుని, పూర్తి అవగాహనతోనే ఇన్వెస్ట్ చేయాలని పాండే సూచించారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌లో భారీ నష్టాలను ఉటంకిస్తూ.. మార్కెట్‌ను కేసినోగా భావించరాదని చెప్పారు. అధిక రాబడులు వస్తాయనే తప్పుడు హామీల వైపు ఆకర్షితులు కాకుండా వివేకవంతంగా వ్యవహరించాలని సూచించారు.