
కలిసొచ్చిన అమెరికా–చైనా వాణిజ్య ఒప్పందం
సెన్సెక్స్ 2,975 పాయింట్లు జూమ్
82,000 పాయింట్ల పైకి...
917 పాయింట్లు దూసుకెళ్లిన నిఫ్టీ
నాలుగేళ్లలో సూచీలకు ఒకేరోజు అతిపెద్ద లాభం
రూ.16.15 లక్షల కోట్ల సంపద సృష్టి
ముంబై: భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో దలాల్ స్ట్రీట్‌లో బుల్ పరుగులు తీసింది. అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడం కూడా బుల్‌కు జోష్‌నిచ్చాయి. ఫలితంగా సూచీలు గడిచిన నాలుగేళ్లలో (2021) తర్వాత ఒకరోజులో అతిపెద్ద లాభాన్ని గడించాయి.
సెన్సెక్స్ 2,975 పాయింట్లు లాభపడి 82,430 వద్ద, నిఫ్టీ 917 పాయింట్లు బలపడి 24,925 వద్ద నిలిచింది. ఈ ముగింపు ఇరు సూచీలకు ఏడు నెలల గరిష్టం ముగింపు. సూచీల 4% ర్యాలీతో స్టాక్ మార్కెట్లో ఒక్కరోజే రూ.16.15 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే, బీఎస్‌ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.432.56 లక్షల కోట్ల(5.05 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది.
రోజంతా లాభాలే: గత వారాంతాన భారత్, పాక్‌ల మధ్య సీజ్‌ఫైర్, అమెరికా చైనాల మధ్య ట్రేడ్ ఒప్పందాల పరిణామాల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 1,350 పాయింట్లు బలపడి 80,804 వద్ద, నిఫ్టీ 412 పాయింట్లు ఎగసి 24,420 వద్ద మొదలయ్యాయి. ఇంట్రాడేలో అన్ని రంగాల్లో కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సూచీలు మరిన్ని లాభాలు ఆర్జించగలిగాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 3,041 పాయింట్లు దూసుకెళ్లి 82,496 వద్ద, నిఫ్టీ 937 పాయింట్లు ఎగసి 24,945 వద్ద గరిష్టాన్ని తాకాయి.
→ సెన్సెక్స్ సూచీలో ఇండస్‌ఇండ్ (–3.57%), సన్‌ఫార్మా(–3.36%) మినహా 28 షేర్లూ లాభపడ్డాయి. సూచీల్లో ఐటీ 6.75%, రియల్టీ 6%, మెటల్, టెక్, యుటిలిటీ, పవర్ ఇండెక్సులు 5% రాణించాయి. ఇండస్ట్రీయల్, బ్యాంకెక్స్ సూచీలు 4–3% లాభపడ్డాయి.
→ మార్కెట్ అనూహ్య ర్యాలీలో రక్షణ రంగ, డ్రోన్ల తయారీ కంపెనీల షేర్లకు డిమాండ్ కొనసాగింది. యాక్సిస్‌కేడ్స్ టెక్నాలజీస్ 5%, డేటా ప్యాటర్న్స్ 4%, మిశ్ర ధాతు నిగమ్ 3.50%, భారత్ ఎల్రక్టానిక్స్ 2%, పెరిగాయి. ఐడియాఫోర్జ్ టెక్నాలజీ 6%, డ్రోణాచార్య ఏరియల్ 5% పెరిగాయి.
లాభాలు ఎందుకంటే:
→ పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, సరిహద్దుల్లో కాల్పులు పరిణామాలతో భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే అమెరికా మధ్యవర్తిత్వంలో, అనేక దౌత్యప్రయత్నాల తర్వాత ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో ఒక్కసారిగా దలాల్ స్ట్రీట్‌లో ఒక్కసారిగా ఊపువచ్చింది.
→ అమెరికా–చైనాల మధ్య ‘టారిఫ్ వార్’ సైతం ఒక కొలిక్కి వచ్చింది. స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన చర్చలు సఫలమై ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ టారిఫ్‌లను 115% మేర తగ్గించుకోవడంతో పాటు కొత్త సుంకాలకు 90 రోజులపాటు విరామం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. అగ్రదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరడంతో ప్రపంచ మార్కెట్లకు ఫుల్ జోష్ వచ్చింది.
→ ఈక్విటీ ఫండ్లలోకి సిప్‌ల ద్వారా ఏప్రిల్‌లో రికార్డు స్థాయి రూ.26,632 కోట్లు పెట్టుబడులు రావడం, అంతర్జాతీయ క్రిడెట్ రేటింగ్ ఏజెన్సీ మారి్నంగ్‌స్టార్ డీబీఆర్‌ఎస్ భారత సావరిన్ క్రిడెట్ రేటింగ్‌ను దీర్ఘకాలానికి బీబీబీ(కనిష్టం) నుంచి బీబీబీ(స్థిరత్వం)కి అప్‌గ్రేడ్ చేయడం తదితర అంశాలు మార్కెట్ల ర్యాలీకి దన్నుగా నిలిచాయి.
భారీ లాభాల్లో అమెరికా
చైనాతో వాణిజ్య ఒప్పందంలో భాగంగా వాణిజ్య యుద్ధానికి 90 రోజుల విరామం ప్రకటించడంతో అమెరికా ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్సు 2.70%, డోజోన్స్ సూచీ 2%, నాస్‌డాక్ ఇండెక్సు 4% లాభాల్లో ట్రేడవుతున్నాయి. ట్రెజరీ ఈల్డ్స్, డాలర్ ఇండెక్సులూ పెరిగాయి.