Dalal Street
-
Stock Market: బేర్ విశ్వరూపం
ముంబై: అమెరికాలో మాంద్యం భయాలు మార్కెట్లను ముంచేశాయి. జపాన్ కరెన్సీ యెన్ భారీ వృద్ధి బెంబేలెత్తించింది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు వణికించాయి. వెరసి దలాల్ స్ట్రీట్ సోమవారం బేర్ గుప్పిట్లో విలవిలలాడింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయ షేర్ల విలువ భారీగా పెరిగిపోవడంతో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది. ఫలితంగా సెన్సెక్స్ 2,223 పాయింట్లు క్షీణించి 80 వేల స్థాయి దిగువన 78,759 వద్ద ముగిసింది. నిఫ్టీ 662 పాయింట్లు పతనమై 24,055 వద్ద నిలిచింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటన రోజు జూన్ 4న (5.76% పతనం) తర్వాత ఇరు సూచీలకిదే భారీ పతనం. రోజంతా నష్టాల కడలిలో ... అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఏకంగా 3% నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 2,394 పాయింట్ల నష్టంతో 78,588 వద్ద, నిఫ్టీ 415 పాయింట్లు క్షీణించి 24,303 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు సాహసించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో కొట్టిమిట్టాడాయి. ఒకదశలో సెన్సెక్స్ 2,686 పా యింట్లు క్షీణించి 78,296 వద్ద, నిఫ్టీ 824 పాయింట్లు కుప్పకూలి 23,893 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. → బీఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. సరీ్వసెస్ సూచీ 4.6%, యుటిలిటీ 4.3%, రియల్టీ 4.2%, క్యాపిటల్ గూడ్స్ 4.1%, ఇండస్ట్రీయల్ 4%, విద్యుత్ 3.9%, ఆయిల్‌అండ్‌గ్యాస్, మెటల్ 3.75% చొప్పున క్షీణించాయి. → సెన్సెక్స్ సూచీలో హెచ్‌యూఎల్(0.8%,) నెస్లే (0.61%) మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి. ఇందులో టాటా మోటార్స్ 7%, అదానీ పోర్ట్స్ 6%, టాటాస్టీల్ 5%, ఎస్బీఐ 4.50%, పవర్ గ్రిడ్ 4% షేర్లు అత్యధికంగా పడ్డాయి. → చిన్న, మధ్య తరహా షేర్లలో భారీ లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు 4%, 3.6% చొప్పున క్షీణించాయి. → బీఎస్ఈ ఎక్సే్చంజీలో లిస్టయిన మొత్తం 4,189 కంపెనీల షేర్లలో ఏకంగా 3,414 కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి. → రిలయన్స్ 3% పడి రూ. 2,895 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 4.50% పతనమై రూ.2,866 కనిష్టాన్ని తాకింది. మార్కెట్ క్యాప్ రూ. 70,195 కోట్లు ఆవిరై రూ. 19.58 లక్షల కోట్లకు తగ్గింది. → మార్కెట్లో ఒడిదుడుకులు సూచించే వొలటాలిటీ ఇండెక్స్(వీఐఎక్స్) 42.23 శాతం పెరిగి 20.37 స్థాయికి చేరింది. ఇంట్రాడేలో 61% ఎగసి 23.15 స్థాయిని తాకింది. లేమాన్ బ్రదర్స్, కోవిడ్ సంక్షోభాల తర్వాత ఈ సూచీ కిదే ఒక రోజులో అత్యధిక పెరుగుదల.2 రోజుల్లో రూ.19.78 లక్షల కోట్ల ఆవిరి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ సోమవారం ఒక్కరోజే రూ.15.32 లక్షల కోట్లు హరించుకుపోయాయి. శుక్రవారం కోల్పోయిన రూ.4.46 లక్షల కోట్లను కలిపితే గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లో ఇన్వెస్టర్లకు మొత్తం రూ.19.78 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. బీఎస్ఈలో మార్కెట్ విలువ రూ. 441.84 లక్షల కోట్లకు పడింది.84 దిగువకు రూపాయి కొత్త ఆల్‌టైమ్ కనిష్టంఈక్విటీ మార్కెట్ల భారీ పతనంతో రూపాయి విలువ సరికొత్త జీవితకాల కనిష్టానికి పడిపోయింది. డాలర్ మారకంలో 37 పైసలు క్షీణించి 84 స్థాయి దిగువన 84.09 వద్ద స్థిరపడింది. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 83.78 వద్ద మొదలైంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, దలాల్ స్ట్రీట్ భారీ పతన ప్రభావంతో ఇంట్రాడే, జీవితకాల కనిష్టం 84.09 వద్ద స్థిరపడింది. ‘అమ్మో’రికా! ముసిరిన మాంద్యం భయాలు.. ఉద్యోగాల కోత.. హైరింగ్ తగ్గుముఖం.. మూడేళ్ల గరిష్టానికి నిరుద్యోగం.. 4.3%కి అప్ పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల ఎఫెక్ట్... ఫెడ్ రేట్ల కోత సుదీర్ఘ వాయిదా ప్రభావం కూడాఅమెరికాకు జలుబు చేస్తే.. ప్రపంచమంతా తుమ్ముతుందనే నానుడిని నిజం చేస్తూ, ప్రపంచ స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. యూఎస్ తయారీ, నిర్మాణ రంగంలో బలహీనతకు గత వారాంతంలో విడుదలైన జాబ్ మార్కెట్ డేటా ఆజ్యం పోసింది. జూలైలో హైరింగ్ 1,14,000 ఉద్యోగాలకు పరిమితమైంది. అంచనాల కంటే ఏకంగా 1,80,000 జాబ్స్ తగ్గాయి. మరోపక్క, జూన్‌లో 4.1 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. జూలైలో 4.3 శాతానికి ఎగబాకింది. 2021 అక్టోబర్ తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అంతేకాదు, ప్రపంచ చిప్ దిగ్గజం ఇంటెల్‌తో సహా మరికొన్ని కంపెనీలు తాజా కొలువుల కోతను ప్రకటించడం కూడా అగ్గి రాజేసింది. ఈ పరిణామాలన్నీ ఇన్వెస్టర్లలో మాంద్యం ఆందోళనలను మరింత పెంచాయి. వెరసి, గత శక్రవారం అమెరికా మార్కెట్లు కకావికలం అయ్యాయి. నాస్డాక్ 2.4% కుప్పకూలింది. డోజోన్స్ 1.5%, ఎస్అండ్పీ–500 ఇండెక్స్ 1.84 చొప్పున క్షీణించాయి. కాగా, గత నెలలో ఆల్‌టైమ్ రికార్డుకు చేరిన నాస్డాక్ అక్కడి నుంచి 10% పైగా పతనమై కరెక్షన్లోకి జారింది. ఆసియా, యూరప్ బాటలోనే సోమవారం కూడా అమెరికా మార్కెట్లు 3–6% గ్యాప్ డౌన్‌తో మొదలై, భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టెక్ స్టాక్స్.. ట్రిలియన్ డాలర్లు ఆవిరి రెండో త్రైమాసిక ఫలితాల నిరాశతో నాస్డాక్లో టాప్–7 టెక్ టైటాన్స్ (యాపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్, ఎన్వీడియా, టెస్లా, మెటా) షేర్లు అతలాకుతలం అవుతున్నాయి. ఏఐపై భారీగా వెచి్చస్తున్న మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ వంటి కంపెనీలకు ఆశించిన ఫలితాలు రావడం లేదనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇక బలహీన ఆదాయంతో అమెజాన్ షేర్లు 10% క్రాష్ అయ్యాయి. ఫలితాల నిరాశతో ఇంటెల్ షేర్లు ఏకంగా 26% కుప్పకూలాయి. 1985 తర్వాత ఒకే రోజు ఇంతలా పతనమయ్యాయి. కంపెనీ ఏకంగా 15,000 మంది సిబ్బంది కోతను ప్రకటించడంతో జాబ్ మార్కెట్లో గగ్గోలు మొదలైంది. వెరసి, షేర్ల పతనంతో టాప్–7 టెక్ షేర్ల మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్లకు పైగా ఆవిరైంది. కాగా, సోమవారం ఈ షేర్లు మరో 6–10% కుప్పకూలాయి. ఎకానమీ పరిస్థితి బయటికి కనిపిస్తున్న దానికంటే చాలా బలహీనంగా ఉందని సీఈఓలు సిగ్నల్స్ ఇస్తున్నారు. యుద్ధ సైరన్..: పశ్చిమాసియాలో హమాస్ చీఫ్ హనియేను ఇజ్రాయిల్ తుదముట్టించడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించడంతో పూర్తి స్థాయి యుద్ధానికి తెరలేస్తోంది. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు సద్దుమణగక ముందే మరో వార్ మొదలైతే క్రూడ్ ధర భగ్గుమంటుంది. బ్యారల్ 100 డాలర్లను దాటేసి, ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తుంది. వెరసి ఎకానమీలు, మార్కెట్లపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. జపాన్.. సునామీ అమెరికా దెబ్బతో ఆసియా, యూరప్ మార్కెట్లన్నీ సోమవారం కూడా కుప్పకూలాయి. జపాన్ నికాయ్ సూచీ ఏకంగా 13.5 శాతం క్రాష్ అయింది. 1987 అక్టోబర్ 19 బ్లాక్ మండే (14.7% డౌన్) తర్వాత ఇదే అత్యంత ఘోర పతనం. నికాయ్ ఆల్ టైమ్ హై 42,000 పాయింట్ల నుంచి ఏకంగా 31,000 స్థాయికి దిగొచి్చంది. గత శుక్రవారం కూడా నికాయ్ 6% క్షీణించింది. ముఖ్యంగా జపాన్ యెన్ పతనం, ద్రవ్యోల్బణం 2% లక్ష్యంపైకి ఎగబాకడంతో అందరికీ భిన్నంగా బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల పెంపు బాటలో వెళ్తోంది. గత బుధవారం కూడా రేట్ల పెంపు ప్రకటించింది. దీంతో డాలర్‌తో ఇటీవల 160 స్థాయికి చేరిన యెన్ విలువ 142 స్థాయికి బలపడి ఇన్వెస్టర్లకు వణుకు పుట్టించింది. జపాన్, అమెరికా ఎఫెక్ట్ మన మార్కెట్ సహా ఆసియా, యూరప్ సూచీలను కుదిపేస్తోంది.ఫెడ్ రేట్ల కోతపైనే ఆశలు.. కరోనా విలయం తర్వాత రెండేళ్ల పాటు ఫెడ్ ఫండ్స్ రేటు 0–0.25% స్థాయిలోనే కొనసాగింది. అయితే, ద్రవ్యోల్బణం ఎగబాకి, 2022 జూన్‌లో ఏకంగా 9.1 శాతానికి చేరడంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మళ్లీ రేట్ల పెంపును మొదలెట్టింది. 2023 జూలై నాటికి వేగంగా 5.25–5.5% స్థాయికి చేరి, అక్కడే కొనసాగుతోంది. మరోపక్క, ద్రవ్యోల్బణం ఈ ఏడాది గతేడాది జూన్‌లో 3 శాతానికి దిగొచి్చంది. ఈ ఏడాది జూన్ క్వార్టర్లో (క్యూ2) యూఎస్ జీడీపీ వృద్ధి రేటు 2.8 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం దిగొచి్చనప్పటికీ, ఫెడ్ మాత్రం రేట్ల కోతను సుదీర్ఘంగా వాయిదా వేస్తూ వస్తోంది. గత నెలఖర్లో జరిగిన పాలసీ భేటీలోనూ యథాతథ స్థితినే కొనసాగించింది. అయితే, తాజా గణాంకాల ప్రభావంతో సెప్టెంబర్‌లో పావు శాతం కాకుండా అర శాతం కోతను ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం దిగొచి్చనప్పటికీ రేట్ల కోత విషయంలో ఫెడ్ సుదీర్ఘ విరామం తీసుకుందని, దీనివల్ల ఎకానమీపై, జాబ్ మార్కెట్‌పై ప్రభావం పడుతోందనేది వారి అభిప్రాయం. అధిక రేట్ల ప్రభావంతో మాంద్యం వచ్చేందుకు 50% అవకాశాలున్నాయని జేపీ మోర్గాన్ అంటోంది!– సాక్షి, బిజినెస్ డెస్క్ -
8.50 లక్షల కోట్ల సంపద ఆవిరి
సెన్సెక్స్ ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్ఈలో రూ.8.50 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.365 లక్షల కోట్లకు దిగివచ్చింది. ముంబై: దలాల్ స్ట్రీట్‌లో మంగళవారం అమ్మకాల మోత మోగింది. అధిక వెయిటేజీ షేర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకు(3%), రిలయన్స్ ఇండస్ట్రీస్(2%), ఎస్బీఐ(4%) షేర్లు పతనంతో పాటు పశ్చిమాసియాలోని యుద్ధ ఉద్రికత్తలు ఇందుకు ప్రధాన కారణమయ్యాయి. ఇటీవల విడుదలైన కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడమూ సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచింది. విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. గడిచిన 3 నెలల్లో భారీగా ర్యాలీ చేసిన చిన్న, మధ్య తరహా షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ 3శాతం చొప్పున నష్టపోయాయి. పెరిగి పడిన మార్కెట్... మూడు రోజుల వరుస సెలవుల తర్వాత తెరుచుకున్న మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 444 పాయింట్లు పెరిగి 71,868 వద్ద, నిఫ్టీ 145 పాయింట్లు బలపడి 21,717 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. కానీ, కాసేపటికే అమ్మకాల ఒత్తిడి మొదలైంది. ఒక దశలో సెన్సెక్స్ 1,189 పాయింట్లు క్షీణించి 70,235 వద్ద, నిఫ్టీ 397 పాయింట్లు దిగివచ్చి 21,193 వద్ద ఇంట్రాడే కనిష్టాలను దిగివచ్చాయి. చివరికి సెన్సెక్స్ 1,053 పాయింట్లు నష్టపోయి 70,371 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 330 పతనమై 21,242 వద్ద స్థిరపడ్డాయి. జనవరి 17 తర్వాత సూచీలకు ఇది భారీ పతనం. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లూ డీలా...! అమ్మకాల సునామీతో ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లు ఎరుపెక్కాయి. రంగాల వారీగా ఎన్ఎస్ఈలో మీడియా 13%, రియల్టీ 5%, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 4%, మెటల్, ఆయిల్‌అండ్‌గ్యాస్ 3%, బ్యాంక్ నిఫ్టీ 2%, ప్రైవేట్ రంగ బ్యాంక్ 2%, ఎఫ్ఎంసీజీ, ఆటో ఇండెక్సులు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. ఫార్మా సూచీ మాత్రమే 1.5% రాణించింది. ►నష్టాల ట్రేడింగ్‌లోనూ మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ లిస్టింగ్ సక్సెస్ అయ్యింది. ఇష్యూ ధర(రూ.418)తో పోలిస్తే బీఎస్ఈలో 11.24% ప్రీమియంతో రూ.465 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో 22% ఎగసి రూ.510 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 11% లాభపడి దాదాపు లిస్టింగ్ ధర రూ.464 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.3,197 కోట్లుగా నమోదైంది. ►ఆర్థిక ఫలితాల ప్రకటన తర్వాత సిప్లా షేరు రాణించింది. డిసెంబర్ క్వార్టర్లో నికర లాభం 32% వృద్ధి చెందినట్లు వెల్లడించడం కలసి వచ్చింది. బీఎస్ఈలో ఈ షేరు 7% పెరిగి రూ.1,409 వద్ద ముగిసింది. ►సోనీ గ్రూప్ 10 బిలియన్ డాలర్ల విలీన ఒప్పందం రద్దుతో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ షేరు కుప్పకూలింది. బీఎస్ఈలో 10% నష్టంతో రూ.209 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో ఏకంగా 34% పతనమై రూ.152 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. చివరికి 33% నష్టంతో రూ.156 వద్ద స్థిరపడింది. ఒక దశలో షేరు ఇరు ఎక్సే్చంజీలో లోయర్ సర్క్యూట్‌ను తాకింది. షేరు భారీ క్షీణతతో కంపెనీకి రూ.7,300 కోట్ల నష్టం వాటిల్లింది. ►హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు పతనం ఆగడం లేదు. బీఎస్ఈలో 3.50% నష్టపోయి రూ.1428 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 3.65% పతనమై రూ.1,425 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10.83 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు వరుస అయిదు రోజుల్లో 13% క్షీణించింది. -
దలాల్ స్ట్రీట్‌లో శాంటాక్లాజ్ లాభాలు
ముంబై: క్రిస్మస్కు ముందు దలాల్ స్ట్రీట్‌లో శాంటా క్లాజ్ ర్యాలీ కనిపించింది. పతనమైన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు రెండో రోజూ లాభపడ్డాయి. ఐటీ, మెటల్, టెక్, ఆటో, ఫార్మా, రియల్టీ షేర్లు రాణించాయి. ఫలితంగా సెన్సెక్స్ 242 పాయింట్లు పెరిగి 71,107 వద్ద నిలిచింది. నిఫ్టీ 94 పాయింట్లు బలపడి 21,349 వద్ద స్థిరపడింది. ఉదయం స్వల్పలాభాలతో మొదలైన స్టాక్ సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర లాభ, నష్టాల మధ్య కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 395 పాయింట్లు లాభపడి 71,260 వద్ద, నిఫ్టీ 135 పాయింట్లు పెరిగి 21,390 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. బ్యాంకులు, ఫైనాన్షియల్ సరీ్వసెస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ లభించడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు 1.04%, 0.75% చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,829 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,167 కోట్ల షేర్లు కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా(ఎంపీఎస్) కలి్పంచే అంశంలో పదేళ్ల గడువు లభించడంతో ఎల్ఐసీ షేరు 4% పెరిగి రూ.793 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 7% పెరిగి రూ.820 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. షేరు నాలుగు లాభపడంతో కంపెనీ మార్కెట్ విలువ ఒక్క రోజులో రూ.18,057 కోట్లు పెరిగి రూ.5.01 లక్షల కోట్లకు చేరింది. ► ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు రాణించాయి. విప్రో 6.55%, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 4%, ఎంఫసీస్, హెచ్‌సీఎల్ టెక్ 3%, కోఫోర్జ్ 2.50%, ఎల్‌అండ్‌టీఎం, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఒకటిన్నర శాతం, ఎల్టీటీఎస్, టీసీఎస్ షేర్లు ఒకశాతం చొప్పున లాభపడ్డాయి. ► స్టాక్ మార్కెట్ వరుస 3 రోజులు పనిచేయదు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు కాగా, సోమవారం(డిసెంబర్ 25న) క్రిస్మస్ సందర్భంగా ఎక్చే్చంజీలు పనిచేయవు. ట్రేడింగ్ తిరిగి మంగళవారం యథావిధిగా ప్రారంభం అవుతుంది. ► అజాద్ ఇంజనీరింగ్ ఐపీఓకు 80.60 రెట్ల అధిక స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.01 కోట్ల ఈక్విటీలు జారీ చేయగా మొత్తం 81.58 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. ఐబీ కోటా 179.66 రెట్లు, సంస్థాగతేర ఇన్వెస్టర్లు విభాగం 87.55 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 23.71 రెట్లు సబ్స్క్రయిబ్ అయ్యింది. ► కెనిడియన్ బిలియనీర్ ప్రేమ్ వాట్సా గ్రూప్ ఫెయిర్‌ఫాక్స్ గ్రూప్.., ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ సంస్థలో 5.7% వాటాను దక్కించుకుంది. ఓపెన్ మార్కెట్ ద్వారా ఎఫ్ఐహెచ్ మారిషన్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ నుంచి ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్‌కు చెందిన 2.16 కోట్ల ఈక్విటీల(5.7% వాటా)ను రూ.1,198 కోట్లకు కొనుగోలు చేసినట్లు బల్క్‌డీల్ డేటా తెలిపింది. ఈ లావాదేవీ తర్వాత ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ షేరు 4% నష్టపోయి రూ.573 వద్ద స్థిరపడింది. -
దలాల్ స్ట్రీట్‌లో అదానీ మెరుపులు: రూ. 11 లక్షల కోట్లకు ఎంక్యాప్
అదానీ గ్రూప్ అధినేత, బిలియనీర్ గౌతం అదానీకి భారీ ఊరట లభించింది. ఈ ఏడాది జనవరిలో హిండెన్‌బర్గ్ ఆరోపణల తరువాత మార్కెట్ క్యాపిటలైజేషన్ను భారీగా కోల్పోయిన అదానీ గ్రూపు క్రమంగా కోలుకుంటోంది. శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో గౌతమ్ అదానీ నేతృత్వంలోని సమ్మేళనానికి చెందిన లిస్టెడ్ సంస్థలు 12 శాతం ర్యాలీ అయ్యాయి.తాజాగా లాభాలతోసంస్థ ఎం క్యాప్ ఆరు నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. అదానీ మార్కెట్ క్యాప్ రూ.11 లక్షల కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. ఈ ఫిబ్రవరి తర్వాత మొదటిసారిగా గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ను రూ.11 లక్షల కోట్ల మార్కును అధిగమించడం విశేషం. మొత్తం పది అదానీ గ్రూప్ కంపెనీలు - అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ విల్మార్, అదానీ పవర్, ఎసిసి, అంబుజా, ఎన్డిటివి శుక్రవారం ట్రేడ్‌లో భారీ పెరుగుదలను నమోదు చేశాయి. మరోవైపు అబుదాబి నేషనల్ ఎనర్జీ PJSC (TAQA) అదానీలో పెట్టుబడులపై మీడియా నివేదికల మధ్య అదానీ గ్రూప్ స్టాక్‌లు దలాల్ స్ట్రీట్స్‌లో మెరుపులు మెరిపించాయి. అదాని గ్రూప కంపెనీలో పెట్టుబడుల వార్తలపై అబుదాబి కంపెనీ స్పందించింది. ఆ వార్తల్లోవాస్తవం లేదని TAQA కొట్టిపారేసింది.ఈ వారం ప్రారంభంలో, యూఎస్ ఆధారిత బోటిక్ పెట్టుబడి సంస్థ రాజీవ్ జైన్ నేతృత్వంలోని GQG భాగస్వామి అదానీ పవర్ 31.2 కోట్ల ఈక్విటీ షేర్లను రూ. 9,000 కోట్లకు (1.1 బిలియన్ డాలర్ల) కొనుగోలు చేసింది. కాగా ఈ ఏడాది జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు విడుదలైనప్పటి నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ రెండు నెలల్లోపే సమ్మేళనం స్టాక్‌లు 75 శాతానికి పడి పోయాయి. అదానీ గ్రూప్ అవకతవకలు, అక్రమాలకు పాల్పడిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. ఈ ఆరోపణలు సత్యదూరమైనవని గౌతం అదానీ తీవ్రంగా ఖండించారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన మార్కెట్రెగ్యులేటరీ సెబీరిపోర్ట్ను త్వరలోనే దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు ఉంచ నుంది. -
మార్కెట్‌కు బడ్జెట్ బూస్ట్, కానీ ఈ షేర్లు మాత్రం ఢమాల్!
సాక్షి,ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అమృతకాల బడ్జెట్ స్టాక్‌మార్కెట్‌కు ఉత్సాహాన్నిచ్చింది. ఫలితంగా ఆరంభంలోనే 500 పాయింట్లు ఎగిసిన సూచీలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. దాదాపు 1200 పాయింట్లు ఎగిసాయి. టాక్స్ షాక్ తగిలిన రంగాలు తప్ప అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1112 పాయింట్ల లాభంతో 60661 వద్ద, నిఫ్టీ 266 పాయింట్ల లాభంతో17928 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి.ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ అండ్ టి, హెచ్‌డిఎఫ్‌సి ట్విన్స్ లాంటివి టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిగరెట్లపై పన్నులు పెంచుతున్నట్లు ప్రకటించడంతో గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా, ఐటీసీ లిమిటెడ్‌తో సహా సిగరెట్ కంపెనీల షేర్లు బుధవారం 5 శాతం కుప్పకూలాయి. గాడ్ఫ్రే ఫిలిప్స్ 5శాతం, గోల్డెన్ టొబాకో 4 శాతం, అయితే 6 శాతం నష్టపోయిన ఐటీసీ షేర్లు తేరుకొన్నాయి. ఇంకా ఎన్‌టిసి ఇండస్ట్రీస్ 1.4 శాతం, విఎస్టి ఇండస్ట్రీస్ 0.35 శాతం నష్టాలతో కొనాసగుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణ లక్ష్యాన్ని 11 శాతం (YoY) కంటే ఎక్కువ పెంచాలని ప్రతిపాదించారు. వ్యవసాయ రుణ లక్ష్యాన్ని రూ. 18 లక్షల కోట్ల నుండి రూ.20 లక్షల కోట్లకు పెంచాలనే ప్రతిపాదన దాదాపు 11 శాతం ఎక్కువ అని, గోద్రెజ్ ఆగ్రోవెట్, బ్రిటానియా, టాటా కన్స్యూమర్స్ షేర్ స్టాక్‌లకు జోష్‌నిస్తుందని స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం. -
స్టాక్ మార్కెట్: బడ్జెట్ ముందు అప్రమత్తత
ముంబై: ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో స్టాక్ మంగళవారం సూచీలు స్వల్ప లాభాలతో గటెక్కాయి. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో 2022–23 ఆర్థిక సర్వే సమర్పణ, నేడు(బుధవారం)బడ్జెట్, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల నిర్ణయం వెల్లడి తదితర కీలక పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వహించారు. ట్రేడింగ్‌లో 683 పాయింట్ల పరిధిలో సెన్సెక్స్ 49 పాయింట్లు పెరిగి 59,550 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 198 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆఖరికి 13 పాయింట్ల లాభంతో 17,662 వద్ద నిలిచింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఐటీ, ఫార్మా, అయిల్‌అండ్‌గ్యాస్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విస్తృత స్థాయి మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు వరుసగా 1.50%, రెండుశాతానికి పైగా పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,440 కోట్ల షేర్లను విక్రయించగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.4,506 కోట్ల షేర్లను కొన్నారు. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీ వెల్లడి(నేడు) ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఖాతా లోటు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక సర్వే తెలపడంతో రూపాయి 41 పైసలు క్షీణించి 81.93 స్థాయి వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► జనవరి అమ్మక గణాంకాల వెల్లడి(నేడు)కి ముందు ఆటో కంపెనీల షేర్లు రాణించాయి. అశోక్ లేలాండ్, ఎంఅండ్ఎం, భాష్, మదర్శన్, ఐషర్ మోటార్స్ షేర్లు 3.50% నుంచి మూడుశాతం దూసుకెళ్లాయి. హీరోమోటోకార్ప్, ఎంఆర్ఎఫ్, టాటా మోటార్స్ షేర్లు రెండుశాతం పెరిగాయి. భారత్ ఫోర్జ్, మారుతీ సుజుకీ, టీవీఎస్ మోటార్స్ షేర్లు ఒకశాతం లాభపడ్డాయి. ► క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా యాజమాన్య బలహీన అంచనా వ్యాఖ్యలతో టెక్ మహీంద్రా అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో రెండుశాతం నష్టపోయి రూ.1,015 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నాలుగుశాతం క్షీణించి రూ.996 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. -
Union Budget 2023: స్టాక్ మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావం ఎలా ఉంటుంది!
బడ్జెట్.. బడ్జెట్.. బడ్జెట్.. ప్రతి ఏటా జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి 1 వరకు దేశవ్యాప్తంగా ఈ పేరు వినిపిస్తుంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ కోసం సాధారణ ప్రజలు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదార్ల వరకు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తుంటారు. ఆశించిన మేరకు బడ్జెట్ ఉంటే ఆనందాలు వెలువెత్తడం లేదంటే నెట్టింట మీమ్స్‌తో రచ్చ చేయడం ఇటీవల చూస్తూనే ఉన్నాం. మోదీ సర్కార్ ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే, 2024లో సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో రాబోవు బడ్జెట్‌పై ప్రతి రంగంలో, ప్రతి వర్గంలో ఎన్నెన్నో అంచనాలు కనిపిస్తున్నాయి. ఇక స్టాక్ మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావం ఎలా ఉండబోతోందని తెలుసుకుందాం! స్టాక్ మార్కెట్‌పై ప్రభావం గత కొన్ని సంవత్సరాల పరిస్థితులను పరిశీలిస్తే సాధారణ బడ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్లలో నీరసమైన వాతావరణం కనిపిస్తుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వాటి కదిలికలు మొదలవుతున్నాయి. బడ్జెట్ పూర్తిగా ద్రవ్యానికి సంబంధించిన అంశం. కాబట్టి దీని ప్రభావం మిగతా వాటిపై కచ్చితంగా ఉంటుంది. స్టాక్‌మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావం ఎలాంటిదనే విషయం మాత్రం ఆర్థికమంత్రి మీద ఆధారపడి ఉంటుంది. వివిధ రంగాలకు కేటాయించిన మొత్తం ఆధారంగా ఈ ప్రభావాన్ని నిర్ణయించవచ్చు.ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా అభివృద్ధికి పెద్ద పీట వేస్తే ఆ సానుకూల నిర్ణయాలతో స్టాక్ మార్కెట్లు పుంజుకుంటాయి. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టే వారంలో సూచీల్లో ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. చదవండి: ఆ సూపర్ లగ్జరీ కార్ల క్రేజ్.. అబ్బో రికార్డు సేల్స్‌తో దూసుకుపోతోంది! -
స్టాక్ మార్కెట్: 3 నెలల కనిష్టానికి సూచీలు
ముంబై: స్టాక్ మార్కెట్లో రెండోరోజూ అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. టీప్లస్1 సెటిల్మెంట్ ట్రేడింగ్ విధానం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. వచ్చేవారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం కూడా జరగనుంది. ఈ పరిణామాణాలకు తోడు వారాంతపు రోజు కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. బాండ్లపై రాబడుల పెరుగుదల, క్రూడాయిల్ ధరల ఒడిదుడుకులు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. బ్యాంకింగ్, మెటల్, ఫైనాన్స్ రంగ షేర్ల భారీ పతనంతో సెన్సెక్స్ 874 పాయింట్లు నష్టపోయి 59,307 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 287 పాయింట్లు క్షీణించి 17,604 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది మూడు నెలల కనిష్ట ముగింపు. అదానీ గ్రూప్ సంస్థలకు భారీగా రుణాలిచ్చాయన్న హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ రెండుశాతం, మిడ్‌క్యాప్ సూచీ 1.30% నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.5,978 కోట్ల షేర్లను విక్రయించారు. దేశీ ఇన్వెస్టర్లు రూ.4,252 కోట్ల షేర్లను కొన్నారు. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.49 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రెండు శాతం క్రాష్ అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ..., రిపబ్లిక్ డే సెలవు రోజు తర్వాత దేశీయ మార్కెట్ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 38 పాయింట్ల నష్టంతో 60,167 వద్ద, నిప్టీ 15 పాయింట్ల పతనంతో 17,877 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఆ తర్వాత అమ్మకాల వెల్లువతో ఒక దశలో సెన్సెక్స్ 1,231 పాయింట్లకు పైగా నష్టపోయి 58,975 దగ్గర, నిఫ్టీ 398 పాయింట్లు క్షీణించి 17,494 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. అయితే ఎఫ్ఎంసీజీ, ఫార్మా, ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కొంతమేర నష్టాలను భర్తీ చేసుకోగలిగాయి. రెండు రోజుల్లో రూ.10.65 లక్షల కోట్ల నష్టం గత రెండురోజుల్లో సెన్సెక్స్ 1,648 పాయింట్ల పతనంతో బీఎస్ఈలో 10.65 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. దీంతో ఇన్వెస్టర్లు సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.269 లక్షల కోట్లకు దిగివచ్చింది. నిఫ్టీ సైతం 514 పాయింట్లు క్షీణించింది. అదానీ గ్రూప్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇచ్చిన వివరణ, ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగించలేకపోయింది. ఈ గ్రూప్‌నకు చెందిన మొత్తం ఏడు కంపెనీల్లో అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ 20% లోయర్ సర్క్యూట్, అదానీ విల్మార్, అదానీ పవర్ షేర్లు ఐదుశాతం లోయర్ సర్క్యూట్ వద్ద లాకయ్యాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్లు వరుసగా 18%, 16% చొప్పున నష్టపోయాయి. ఇటీవల అదానీ గ్రూప్ విలీనం చేసుకున్న అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్ కంపెనీల షేర్లు సైతం 17%, 13% చొప్పున నష్టపోయాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ నివేదిక నేపథ్యంలో గడిచిన రెండు రోజుల్లో అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.4.17 లక్షల కోట్లు హరించుకుపోయింది. ఎఫ్‌పీవోకు బిడ్స్ అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్‌పీవోకు తొలి రోజు(27న) రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 4.7 లక్షల బిడ్స్ దాఖలయ్యాయి. 4.55 కోట్ల షేర్లను ఆఫర్ చేసింది. ఆఫర్‌కు ధరల శ్రేణి రూ. 3,112–3,276కాగా.. గడువు ఈ నెల 31న(మంగళవారం) ముగియనుంది. బీఎస్ఈలో షేరు 19 శాతం పతనమై రూ. 2,762 వద్ద ముగిసింది. చిన్న ఇన్వెస్టర్లకు కేటాయించిన 2.29 కోట్ల షేర్లకుగాను 4 లక్షల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. క్విబ్ విభాగంలో 1.28 కోట్ల షేర్లు ఆఫర్ చేయగా.. 2,656 షేర్లకు, నాన్‌ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 96.16 లక్షల షేర్లకుగాను 60,456 షేర్ల కోసం బిడ్స్ లభించాయి. బుధవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 5,985 కోట్లు సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. -
స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 774 పాయింట్లు క్రాష్
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు బుధవారం ఒకశాతానికిపైగా నష్టపోయాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 774 పాయింట్లు పతనమై 60,205 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 226 పాయింట్లు క్షీణించి 18వేల దిగువున 17,892 వద్ద నిలిచింది. ఉదయం ప్రతికూలంగా మొదలైన సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 898 పాయింట్లు క్షీణించి 60,081 వద్ద, నిఫ్టీ 272 పాయింట్లు నష్టపోయి 17,846 వద్ద ఇంట్రాడే కనిష్టాను నమోదు చేశాయి. సెన్సెక్స్ సూచీలో ఏడు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.50%, ఒకశాతం నష్టపోయాయి. రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా నేడు ఎక్సే్చంజీలకు సెలవు. డాలర్ మారకంలో రూపాయి విలువ 2 పైసలు క్షీణించి 81.65 స్థాయి వద్ద స్థిరపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2394 కోట్ల షేర్లను విక్రయించగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1378 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. సెన్సెక్స్ ఒకశాతానికి పైగా నష్టపోవడంతో ఇన్వెస్టర్లు రూ.3.66 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. నష్టాలు ఎందుకంటే దేశీయ ప్రధాన ప్రైవేట్ గ్రూప్ అదానీ కంపెనీ షేర్లలో భారీ అమ్మకాలు మార్కెట్ వర్గాలను కలవరపెట్టాయి. రిపబ్లిక్ డే సెలవు నేపథ్యంలో వీక్లీ, వారాంతాపు ఎక్స్పైరీ బుధవారమే జరిగింది. దేశీయ అతిపెద్ద ఎఫ్‌పీఓ(ఆదానీ ఎంటర్‌ప్రైజస్) ప్రారంభం, టీ1 సెటిల్మెంట్ అమల్లోకి రానుండటం, వచ్చేవారం(బుధవారం) కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పరిణామాల నేపథ్యంలో లిక్విడిటీ కోసం ట్రేడర్లు తమ పొజిషన్లను విక్రయించాయి. ఎఫ్ఐఐలు భారత ఈక్విటీల నుంచి ఈ నెలలో ఇప్పటివరకు రూ. 17 వేల కోట్లకు పైగా నిధులను ఉపసంహరించుకున్నారు. బలహీన అంతర్జాతీయ సంకేతాలు, బడ్జెట్ అంచనాలు, ముడి చమురు ధరలు పెరగడం వంటి పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ►నష్టాల మార్కెట్లోనూ టీవీఎస్ కంపెనీ షేరు దూసుకెళ్లింది. డిసెంబర్ త్రైమాసికంలో మెరుగైన ప్రదర్శన కనబరచడంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈలో 5.50 శాతం పెరిగి రూ. 1,038 వద్ద స్థిరపడింది. ►క్యూ3లో ఆకర్షణీయ ఫలితాలను సాధించినప్పటికీ., ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ షేరు విక్రయాల ఒత్తిడికి లోనైంది. నాలుగు శాతం నష్టంతో రూ.715 వద్ద ముగిసింది. ►ఇండస్ టవర్స్ షేరు రెండేళ్ల కనిష్టాన్ని తాకింది. మూడో క్వార్టర్ ఫలితాలు నిరాశపరచడం షేరుకు ప్రతికూలంగా మారింది. బీఎస్ఈలో 7.19% నష్టపోయి రూ. 158.20 వద్ద ముగిసింది. చదవండి: Credit Card Tips: క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఇవి పాటించకపోతే మీ జేబుకు చిల్లు ఖాయం! -
రెండో రోజూ మార్కెట్ల జోరు
ముంబై: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు జోరు చూపాయి. సెన్సెక్స్ 390 పాయింట్లు జంప్‌చేసి 61,046 వద్ద నిలిచింది. వెరసి మళ్లీ 61,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. నిఫ్టీ 112 పాయింట్లు జమ చేసుకుని 18,165 వద్ద ముగిసింది. అయితే తొలుత మార్కెట్లు కొంతమేర డీలా పడ్డాయి. వెనువెంటనే ఊపందుకుని చివరివరకూ పటిష్టంగా కదిలాయి. ఇటీవల అమ్మకాలకే ప్రాధాన్యమిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు మంగళవారం స్వల్ప కొనుగోళ్లు చేపట్టడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు ఆసియా, యూరోపియన్ మార్కెట్ల సానుకూలతలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు తెలియజేశారు. మంగళవారం(17న) సైతం సెన్సెక్స్ 563 పాయింట్లు ఎగసిన విషయం విదితమే. కాగా.. తొలుత సెన్సెక్స్ 60,569 వద్ద కనిష్టాన్ని తాకినప్పటికీ ఆపై 61,110 వరకూ దూసుకెళ్లింది. ఈ బాటలో నిఫ్టీ 18,184– 18,032 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. డాలరుతో మారకంలో రూపాయి బౌన్స్‌బ్యాక్ కావడం మార్కెట్లకు జోష్‌నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. మెటల్స్ జూమ్ ఎన్ఎస్ఈలో మెటల్ ఇండెక్స్ 1.7 శాతం పుంజుకోగా, ఫార్మా, ప్రయివేట్ బ్యాంకింగ్ 0.6 శాతం చొప్పున లాభపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్స్ 1.25 శాతం వెనకడుగు వేశాయి. నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, టాటా స్టీల్, ఎల్అండ్టీ, యూపీఎల్, విప్రో, కోల్ ఇండియా, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఎయిర్టెల్, జేఎస్‌డబ్ల్యూ, దివీస్, గ్రాసిమ్ 3–1 శాతం మధ్య లాభపడ్డాయి. రూపాయి స్పీడ్... డాలరుతో మారకంలో వరుసగా మూడు రోజుల నష్టాలకు దేశీ కరెన్సీ చెక్ పెట్టింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 28 పైసలు లాభపడి 81.41 వద్ద ముగిసింది. అయితే రూపాయి తొలుత 81.80 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తదుపరి డాలరు ఇండెక్స్ వెనకడుగు వేయడం, దేశీ ఈక్విటీలు ఊపందుకోవడంతో 81.25 వరకూ బలపడింది. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 0.5 శాతం క్షీణించి 101.93కు చేరడం రూపాయికి హుషారునిచ్చినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. స్టాక్ హైలైట్స్ ►ఈ ఏడాది తొలి 9 నెలల్లో ఆదాయం 41 శాతం ఎగసి రూ. 3,384 కోట్లను తాకడంతో ల్యాండ్‌మార్క్ కార్స్ షేరు ఎన్ఎస్ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 587 వద్ద ముగిసింది. తొలుత రూ. 599 వరకూ ఎగసింది. 2022 డిసెంబర్ 23న లిస్టయిన తదుపరి ఇదే గరిష్టం! ►క్యూ3 ఫలితాలపై అంచనాలతో ఉషా మార్టిన్ కౌంటర్ జోరందుకుంది. ఎన్ఎస్ఈలో 4 శాతం జంప్‌చేసి రూ. 191 వద్ద ముగిసింది. తొలుత రూ. 199 వద్ద 52 వారాల గరిష్టానికి చేరింది. ► గత మూడు వారాల్లో 20% ర్యాలీ చేసిన యురేకా ఫోర్బ్స్ షేరు బీఎస్ఈలో తొలుత 1.5 శాతం బలపడి రూ. 537 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. చివరికి అమ్మకాలు పెరిగి 1.6% నష్టంతో రూ. 521 వద్ద ముగిసింది. -
మార్కెట్ బౌన్స్‌బ్యాక్
ముంబై: ముందురోజు నష్టాల నుంచి దేశీ స్టాక్ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్ అయ్యాయి. సెన్సెక్స్ 563 పాయింట్లు జంప్‌చేసి 60,656 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 158 పాయింట్లు ఎగసి 18,053 వద్ద ముగిసింది. ప్రధానంగా ఇండెక్స్ హెవీవెయిట్స్‌కు డిమాండ్ పెరగడంతో మార్కెట్లు ప్రస్తావించదగ్గ స్థాయిలో లాభపడ్డాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతలు సైతం సెంటిమెంటుకు బలాన్నిచ్చినట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐటీ, బ్యాంకింగ్ సంస్థలు పటిష్ట ఫలితాలు సాధిస్తుండటంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు విశ్లేషించారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 60,704– 60,072 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. ఈ బాటలో నిఫ్టీ 18,072–17,887 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది. పీఎస్‌యూ బ్యాంక్స్ డీలా ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఎఫ్ఎంసీజీ, రియల్టీ, ఆయిల్, ఐటీ, ఆటో రంగాలు 1.2–0.6 శాతం మధ్య పుంజుకున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు 2 శాతం పతనమయ్యాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎల్అండ్టీ, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ ద్వయం, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఆర్ఐఎల్, బ్రిటానియా, అల్ట్రాటెక్, మారుతీ 3.7–1.2 శాతం మధ్య ఎగశాయి. అయితే ఎస్బీఐ, బజాజ్ ఫిన్, ఇండస్ఇండ్, విప్రో, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ 1.6–0.4 శాతం మధ్య నీరసించాయి. రూపాయి వీక్ డాలరుతో మారకంలో రూపాయి 12 పైసలు క్షీణించింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 81.70 వద్ద ముగిసింది. సోమవారం ముగింపు 81.58కాగా.. మంగళవారం(17న) ట్రేడింగ్‌లో 81.79 వద్ద ప్రారంభమైంది. తదుపరి 81.89 వరకూ నీరసించింది. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.2 శాతం పుంజుకుని 102.4కు బలపడటం దేశీ కరెన్సీని దెబ్బ తీసినట్లు ఫారెక్స్ వర్గాలు తెలియజేశాయి. కాగా.. మంగళవారం ట్రేడింగ్‌లో చిన్న షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. బీఎస్ఈలో ట్రేడైన షేర్లలో 1,890 నష్టపోగా, 1,621 లాభపడ్డాయి. గత రెండు రోజుల్లో రూ. 3,173 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన ఎఫ్‌పీఐలు తాజాగా రూ. 211 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! స్టాక్ హైలైట్స్ ∙హైదరాబాద్‌లో వాణిజ్య నిర్మాణాలకుగాను రూ. 1,000–2,500 కోట్ల విలువైన ఆర్డర్ లభించినట్లు వెల్లడించడంతో ఎల్అండ్టీ కౌంటర్ 4 శాతం జంప్‌చేసింది. రూ. 2217 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 2,218 వద్ద సరికొత్త గరిష్టాన్ని చేరింది. నేడు(18న) వాటాదారుల అత్యవసర సమావేశం(ఈజీఎం) నిర్వహించనున్న నేపథ్యంలో స్పెషాలిటీ రెస్టారెంట్స్ షేరు ఎన్ఎస్ఈలో 9 శాతంపైగా జంప్‌చేసింది. రూ. 273 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సరికొత్త గరిష్టం రూ. 283 వరకూ దూసుకెళ్లింది. చదవండి: Rage Applying: కంపెనీలను కుదిపేస్తున్న'రేజ్ అప్లయింగ్' సునామీ -
మళ్లీ మార్కెట్ల పతనం
ముంబై: షార్ట్ కవరింగ్‌తో ముందురోజు ర్యాలీ చేసిన దేశీ స్టాక్ మార్కెట్లు తిరిగి పతన బాట పట్టాయి. సెన్సెక్స్ 632 పాయింట్లు కోల్పోయి 60,115 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 809 పాయింట్లవరకూ జారి 59,938కు చేరింది. ఇక నిఫ్టీ సైతం 187 పాయింట్లు పడిపోయి 17,914 వద్ద స్థిరపడింది. వెరసి సాంకేతికంగా కీలకమైన 18,000 స్థాయిని కోల్పోయింది. బ్యాంకింగ్ కౌంటర్లతోపాటు ఇతర బ్లూచిప్స్‌లో ఊపందుకున్న అమ్మకాలు మార్కెట్లను దెబ్బతీశాయి. అయితే డాలరుతో మారకంలో వరుసగా రెండో రోజు దేశీ కరెన్సీ పుంజుకోవడం గమనార్హం! యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగించనున్న నేపథ్యంలో మార్కెట్లలో తాజా అమ్మకాలు నమోదైనట్లు మెహతా ఈక్విటీస్ రీసెర్చ్ విశ్లేషకులు ప్రశాంత్ తాప్సీ పేర్కొన్నారు. గత వారం చివర్లో వరుసగా మూడు రోజులు దేశీ స్టాక్ మార్కెట్లు క్షీణ పథంలో సాగిన విషయం విదితమే. విదేశీ ఎఫెక్ట్ నేటి(10న) ట్రేడింగ్‌లో యూరోపియన్ మార్కెట్లు నేలచూపులకే పరిమితంకావడం, అంతకుముందు యూఎస్, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు కొటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ రిటైల్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు విదేశీ అంశాలకు ప్రభావితమైనట్లు తెలియజేశారు. సెన్సెక్స్ దిగ్గజాలలో ఎయిర్టెల్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, ఐటీసీ, ఆర్ఐఎల్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ ప్రధానంగా నష్టపోయాయి. అయితే టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం బలపడ్డాయి. ముందురోజు అక్టోబర్–డిసెంబర్(క్యూ3) ఫలితాలు ప్రకటించిన టీసీఎస్ 1 శాతం వెనకడుగు వేసింది. చిన్న షేర్లు డీలా బీఎస్ఈలో టెలికం, సర్వీసులు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, టెక్నాలజీ, కమోడిటీస్, రియల్టీ రంగాలు 1.6–0.7 శాతం మధ్య క్షీణించాయి. మరోవైపు మెటల్, హెల్త్‌కేర్, ఆటో, ఆయిల్– గ్యాస్ స్వల్పంగా బలపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 0.5 శాతం స్థాయిలో డీలా పడ్డాయి. ట్రేడైన షేర్లలో 2189 నష్టపోగా.. 1329 లాభపడ్డాయి. సోమవారం రూ. 203 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) మరో రూ. 2,109 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దేశీ ఫండ్స్(డీఐఐలు) మాత్రం రూ. 1,807 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. స్టాక్ హైలైట్స్ ► ఈ ఏడాది తొలి అర్ధభాగంలో టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించిన ష్నీడర్ ఎలక్ట్రిక్ ఇన్ఫ్రా షేరు 14 శాతం దూసుకెళ్లి ఏడేళ్ల గరిష్టం రూ. 203కు చేరింది. ► క్యూ3లో జేఎల్ఆర్ హోల్‌సేల్ అమ్మకాలు ఊపందుకోవడంతో టాటా మోటార్స్ షేరుకి డిమాండ్ పెరిగింది. పతన మార్కెట్లోనూ 6 శాతం జంప్‌చేసి రూ. 413 వద్ద ముగిసింది. ►సెర్బియన్ సంస్థ నోవెలిక్‌లో 54 శాతం వాటా కొనుగోలు వార్తలతో సోనా కామ్స్టార్ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 448 వద్ద ముగిసింది. -
అవును.. కొత్త ఏడాది కలిసొచ్చే కాలమే, ఎందుకో తెలుసా?
గతేడాది తీవ్ర ఒడిదుడుకులకు లోనైన భారత స్టాక్ మార్కెట్‌కు కొత్త ఏడాది కలిసొస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ 2023లో ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు తెరపడనుంది. రష్యా–ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు కొలిక్కి రావచ్చు. దేశీయ పరిస్థితులను గమనిస్తే.., ధరలు కొండెక్కి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వినియోగం పుంజుకుంటుంది. ప్రభుత్వ వృద్ధి దోహద చర్యలు, ప్రోత్సాహక విధానాలు, కార్పొరేట్ కంపెనీల ఆదాయాల్లో మెరుగైన వృద్ధి మన మార్కెట్‌ను ముందుకు నడపొచ్చని మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఈ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడితో.. లాభాలు చూస్తే కళ్లుచెదరాల్సిందే -
పరిమిత శ్రేణిలో ట్రేడింగ్
ముంబై: ట్రేడింగ్‌లో లాభ, నష్టాల మధ్య పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. గత రెండు రోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. నెలవారీ ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ(నేడు)కి ముందురోజు ట్రేడర్లు అప్రమత్తత వహించారు. ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఉదయం సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 60,812 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 362 పాయింట్ల పరిధిలో 61,075 వద్ద గరిష్టాన్ని, 60,714 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 18 పాయింట్ల నష్టంతో 60,910 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 47 పాయింట్ల నష్టంతో 18,132 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 18,173 – 18,068 పాయింట్ల శ్రేణిలో కదలాడింది. ఆఖరికి పది పాయింట్లు పతనమై 18,122 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ షేర్లు నష్టాలను చవిచూశాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ షేర్లు రాణించాయి. కాగా, డాలర్ మారకంలో రూపాయి విలువ ఏడు పైసలు పెరిగి 82.80 స్థాయి వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► ఇండియా పెస్టిసైడ్స్ షేరు తొమ్మిదిశాతం లాభపడి రూ.263 వద్ద స్థిరపడింది. తన అనుబంధ షల్విస్ స్పెషాలిటీస్ ఉత్తరప్రదేశ్‌లో తయారీ ప్లాంట్ ఏర్పాటుకు పర్యావరణ అనుమతి లభించడం షేరు ర్యాలీకి కారణమైంది. ట్రేడింగ్‌లో 11% బలపడి రూ.269 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ► మాల్దీవులు దేశంలో యూటీఎఫ్ హార్బర్ ప్రాజెక్ట్ అభివృద్ధి పనులను ఆర్వీఎన్ఎల్ దక్కించుకోవడంతో ఈ కంపెనీ షేరు ఐదు శాతం పెరిగి రూ.67 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. చదవండి: దేశంలో తగ్గని ఐపీవో జోరు..ఐపీవోకి సిద్దంగా దిగ్గజ కంపెనీలు -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. 4 రోజుల్లో రూ.15.78 లక్షల కోట్లు ఆవిరి!
ముంబై: కోవిడ్ భయాలకు తోడు తాజాగా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలు తెరపైకి రావడంతో శుక్రవారం స్టాక్ సూచీలు కుప్పకూలాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీనతలు సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచీ విస్తృత స్థాయిలో మార్కెట్లో అన్ని రంగాలలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 60 వేల స్థాయిని, నిఫ్టీ 18 వేల స్టాయిలను కోల్పోయాయి. మార్కెట్ ముగిసే సెన్సెక్స్ 981 పాయింట్లు క్షీణించి 60 వేల దిగువన 59,845 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 321 పాయింట్లు నష్టపోయి 17,807 వద్ద నిలిచింది. మధ్య, చిన్న తరహా షేర్లలో నెలకొన్న అమ్మకాల సునామీతో బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4.11%, మిడ్‌క్యాప్ సూచీ 3.40 చొప్పున క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.706 కోట్లు షేర్లను విక్రయించగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.3,399 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో థాయ్‌లాండ్ తప్ప అన్ని దేశాల సూచీలు నష్టాల రెండున్నర శాతం వరకు క్షీణించాయి. యూరప్ మార్కెట్లు ఒకటిన్నర శాతం పతనమయ్యాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు ఒకశాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. గడిచిన ఆరు నెలల్లో ఈ వారం సూచీలు భారీగా నష్టపోయాయి. ఈ ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,493 పాయింట్లు, నిఫ్టీ 462 పాయింట్లు కోల్పోయాయి. 4 రోజుల్లో రూ.15.78 లక్షల కోట్లు ఆవిరి సెన్సెక్స్ నాలుగు ట్రేడింగ్ సెషన్లలో 1961 పాయింట్ల(మూడుశాతానికి పైగా) పతనంతో స్టాక్ మార్కెట్లో భారీగా సంపద హరించుకుపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.15.78 లక్షల కోట్లు తగ్గి రూ. 272.12 లక్షల కోట్లకు చేరింది. ప్రభుత్వరంగ బ్యాంక్స్ షేర్ల భారీ పతనం ప్రభుత్వరంగ షేర్లలో భారీగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 14%, యూనియన్ బ్యాంక్ 10.57%, సెంట్రల్ బ్యాంక్, యూకో బ్యాంక్ షేర్లు పదిశాతం, మహారాష్ట్ర బ్యాంక్, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు 8–7% చొప్పున నష్టపోయాయి. కెనరా బ్యాంక్. పీఎస్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ షేర్లు 5 నుంచి మూడుశాతం పతనమయ్యాయి. ఫలితంగా నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 6.5% నష్టపోయింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► లిస్టింగ్ తొలిరోజే ల్యాండ్‌మార్క్ కార్స్ షేరు డీలాపడింది. ఇష్యూ ధర (రూ.506)తో పోలిస్తే 7% డిస్కౌంట్‌తో రూ.471 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 12% క్షీణించి రూ.446 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. చివరికి పదిశాతం నష్టంతో రూ.456 వద్ద స్థిరపడింది. ► అబాన్స్ హోల్డింగ్స్ కూడా ఇష్యూ ధర (రూ.270)తో పోలిస్తే 1% నష్టంతో ఫ్లాట్‌గా రూ.273 వద్ద లిస్టయ్యింది. మార్కెట్ పతనంలో భాగంగా ట్రేడింగ్‌లో 20% క్షీణించి రూ.216 అప్పర్ సర్క్యూట్ తాకి ముగిసింది. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్! -
మూడు వారాల్లో అతిపెద్ద లాభం
ముంబై: బ్యాంకింగ్, ఇంధన, ఎఫ్ఎంసీజీ షేర్లు పరుగులు తీయడంతో స్టాక్ సూచీలు మూడు వారాల్లోనే అతిపెద్ద ఒకరోజు లాభాన్ని సోమవారం నమోదు చేశాయి. యూరప్ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు ర్యాలీకి దన్నుగా నిలిచాయి. గతవారంలో నష్టాలను చవిచూసిన సూచీలు ఈ వారం అతి స్వల్ప ఫ్లాట్‌గా ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆసియా మార్కెట్ల రికవరీ, యూరప్ మార్కెట్ల సానుకూల వార్తలతో సూచీలు రోజంతా పటిష్టమైన లాభాలతో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఉదయం 61,405 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 507 పాయింట్లు బలపడి 61,845 గరిష్టాన్ని తాకింది. చివరికి 468 పాయింట్ల పెరిగి 61,806 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 151 పాయింట్లు ర్యాలీ చేసి 18,420 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 163 పాయింట్లు పెరిగి 18432 వద్ద గరిష్ట స్థాయిని తాకింది. వచ్చే ఏడాది(2023)లో అమెరికా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) వృద్ధి నెమ్మదించే అవకాశాలు ఉండొచ్చనే అంచనాలతో ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అలాగే ప్రభుత్వరంగ బ్యాంక్స్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ అరశాతం, స్మాల్ సూచీ 0.30% చొప్పున లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.538 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.687 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► కెఫిన్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకు తొలిరోజు 55 శాతం స్పందన లభించింది. ఐపీఓలో భాగంగా కంపెనీ 2.27 కోట్ల షేర్లను జారీ చేయగా, 1.29 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. ► గడిచిన నెలరోజుల్లో నైకా విక్రయాలు భారీగా తగ్గిపోవడం ఈ కంపెనీ షేరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. బీఎస్ఈ ఇంట్రాడేలో నాలుగు శాతానికి పైగా పతనమై రూ.158 వద్ద జీవితకాల కనిష్టానికి దిగివచి్చంది. ఆఖరికి మూడుశాతం నష్టంతో రూ.163 వద్ద స్థిరపడింది. -
12 కోట్లకు బీఎస్ఈ ఇన్వెస్టర్లు
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం బీఎస్ఈలో రిజిస్టరైన ఇన్వెస్టర్ల ఖాతాలు గత 148 రోజుల్లో కోటి జత కలిశాయి. దీంతో ఎక్సే్ఛంజీలో రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ల సంఖ్య తాజాగా 12 కోట్ల మైలురాయిని తాకింది. జులై 18 నుంచి డిసెంబర్ 13 మధ్య కాలంలో కోటి ఖాతాలు కొత్తగా జ త కలసినట్లు బీఎస్ఈ వెల్లడించింది. కాగా.. ఇంతక్రితం 11 కోట్ల ఇన్వెస్టర్ల సంఖ్య చేరేందుకు 124 రోజులు తీసుకోగా.. 10 కోట్లకు 91 రోజులు, 9 కోట్లకు 85 రోజులు, 8 కోట్లకు 107 రోజులు పట్టడం గమనించదగ్గ అంశం! యూనిట్ క్లయింట్ కోడ్(యూసీసీ) ఆధారంగా 2022 డిసెంబర్ 13కల్లా రిజిస్టరైన ఇన్వెస్టర్లు 12 కోట్లకు చేరినట్లు బీఎస్ఈ తెలియజేసింది. వీరిలో 42 శాతంమంది 30–40 వయ సువారుకాగా.. 23 శాతంమంది 20–30 వయసును కలిగి ఉన్నట్లు పేర్కొంది. ఇక 40–50 వయసు వ్యక్తుల వాటా 11 శాతంగా వెల్లడించింది. ఇన్వెస్టర్ల సంఖ్యలో 20 శాతం మహారాష్ట్రకు చెందగా.. 10 శాతంతో గుజరాత్, 9 శాతంతో యూపీ, 6 శాతంతో రాజస్తాన్, తమిళనాడు తదుపరి ర్యాంకులలో నిలుస్తున్నాయి. చదవండి: లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు! -
స్టాక్ మార్కెట్: ప్రారంభంలో హుషారు.. చివర్లో నీరసం
ముంబై: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ రోజంతా నష్టాలలోనే కదిలాయి. చివరికి సెన్సెక్స్ 87 పాయింట్లు క్షీణించి 61,663 వద్ద ముగిసింది. నిఫ్టీ 36 పాయింట్లు తక్కువగా 18,308 వద్ద స్థిరపడింది. తొలుత హుషారు చూపిన మార్కెట్లు వెనువెంటనే నీరసించాయి. అమ్మకాలు ఊపందుకోవడంతో మిడ్ సెషన్‌కల్లా సెన్సెక్స్ 61,337కు, నిఫ్టీ 18,210 దిగువకు చేరాయి. ఈ వారం ఆటుపోట్ల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి స్వల్ప నష్టాలతో నిలిచాయి. నికరంగా సెన్సెక్స్ 132 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్లు కోల్పోయాయి. ఆటో బ్లూచిప్స్ వీక్: ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా రంగాలు 1.2–0.6 శాతం మధ్య క్షీణించాయి. అయితే పీఎస్‌యూ బ్యాంక్స్ 1.5 శాతం ఎగసింది. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్, ఐషర్, మారుతీ, సిప్లా, కోల్ ఇండియా, టాటా కన్జూమర్, ఎయిర్టెల్, యూపీఎల్ 2.5–1 శాతం మధ్య నష్టపోయాయి. మరోవైపు హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, కొటక్ బ్యాంక్ 1.2–0.4 శాతం మధ్య బలపడ్డాయి. చిన్న షేర్లూ: మార్కెట్లను మించుతూ మిడ్, స్మాల్ క్యాప్స్ వెనకడుగు వేశాయి. బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.5 శాతం డీలా పడ్డాయి. ట్రేడైన షేర్లలో 2,137 నష్టపోగా.. 1,360 లాభపడ్డాయి. చదవండి: QR Code On Cylinders: కేంద్రం సంచలన నిర్ణయం, గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త -
కొత్త గరిష్టాల వద్ద ముగింపు
ముంబై: ట్రేడింగ్‌లో పరిమితి శ్రేణిలో కదలాడిన సూచీలు బుధవారం కొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్స్ షేర్లు రాణించడంతో ఇంట్రాడేలోనూ తాజా ఏడాది గరిష్టాలను నమోదుచేశాయి. సెన్సెక్స్ ఉదయం 164 నష్టంతో 61,709 వద్ద మొదలైంది. ట్రేడింగ్‌లో 180 పాయింట్లు బలపడి 62,053 వద్ద కొత్త ఏడాది గరిష్టాన్ని తాకింది. అలాగే 61,709 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 108 పాయింట్ల పెరిగి కొత్త జీవితకాల గరిష్టం 61,981 వద్ద స్థిరపడింది. నిఫ్టీ రోజంతా 98 పాయింట్ల పరిధిలో కదలాడి 18,442 వద్ద 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసింది. చివరికి 6 పాయింట్ల అతి స్వల్ప లాభంతో 18,410 వద్ద ముగిసింది. ఆటో, మీడియా, మెటల్, ఫార్మా, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.386 కోట్లను షేర్లను అమ్మేశా రు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1437 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు, యూఎస్ స్టాక్ ఫ్యూచర్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 35 పైసలు బలహీనపడి 81.26 స్థాయి వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► మేదాంతా బ్రాండ్ పేరుతో హాస్పిటల్స్ చైన్ నిర్వహిస్తున్న గ్లోబల్ హెల్త్ ఐపీవో లిస్టింగ్ మెప్పించింది. బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.336తో పోలిస్తే 18% ప్రీమియంతో రూ.398 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 26% ర్యాలీ చేసి రూ.425 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మార్కెట్ ముగిసేసరికి 23 శాతం బలపడి రూ.416 వద్ద స్థిరపడింది. ► బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ ఐపీవో సైతం విజయవంతమైంది. ఇష్యూ ధర రూ.300తో పోలిస్తే 7% ప్రీమియంతో రూ.321 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 12% రూ.335 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 6% పెరిగి రూ.317 వద్ద స్థిరపడింది. యాక్సిస్ వాటాకు రూ. 3,839 కోట్లు ఎస్‌యూయూటీఐ ద్వారా ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్‌లోగల 1.5 శాతం వాటాను ప్రభుత్వం విక్రయించింది. షేరుకి రూ. 830.63 ఫ్లోర్ ధరలో గత వారం ప్రభుత్వం 4.65 కోట్లకుపైగా యాక్సిస్ షేర్లను విక్రయించింది. వెరసి రూ. 3,839 కోట్లు అందుకున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే తాజాగా ట్వీట్ చేశారు. దీంతో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ. 28,383 కోట్లను సమకూర్చుకున్నట్లు వెల్లడించారు. చదవండి: IT Layoffs 2022: ‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు! -
స్టాక్ మార్కెట్: ఏడు రోజుల ర్యాలీకి బ్రేక్
ముంబై: ఫైనాన్షియల్, ఎఫ్ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణతో స్టాక్ సూచీల ఏడురోజుల వరుస ర్యాలీకి మంగళవారం బ్రేక్ పడింది. ఆసియా మార్కెట్లలోని బలహీన సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఒకటిన్నర శాతం పతనమూ సూచీల నష్టాలకు కారణమైంది. సెన్సెక్స్ 288 పాయింట్ల నష్టంతో 59,544 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 75 పాయింట్లు పతనమై 17,656 వద్ద నిలిచింది. ప్రైవేట్ రంగ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఫార్మా, మెటల్, ఐటీ, ఆటో రంగాల షేర్లు రాణించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ అర శాతం లాభపడగా, స్మాల్‌క్యాప్ సూచీ 0.35% చొప్పున నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.247 కోట్ల షేర్లను అమ్మారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.872 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో హాంగ్‌కాంగ్, తైవాన్, కొరియా, ఇండోనేషియా, చైనా దేశాల మార్కెట్లు నష్టపోయాయి. యూరప్ సూచీలు అరశాతం లాభపడ్డాయి. అమెరికా స్టాక్ ఫ్యూచర్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. 60వేల స్థాయి నుంచి వెనక్కి సెన్సెక్స్ ఉదయం 171 పాయింట్ల లాభంతో 60,003 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు పెరిగి 17,808 వద్ద మొదలయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 60,081 గరిష్టాన్ని తాకింది. లాభాల స్వీకరణతో నష్టాల్లోకి జారుకుంది. ఒక దశలో 59,489 పాయింట్ల వద్ద కనిష్టానికి దిగివచ్చింది. నిఫ్టీ 17,637–17,812 పాయింట్ల మధ్య కదలాడింది. మార్కెట్లకు సెలవు బలిప్రతిపద సందర్భంగా (నేడు)బుధవారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీలు పనిచేయవు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కెట్లు్ల ఉదయం సెషన్లో మాత్రమే సెలవును పాటిస్తాయి. సాయంత్రం సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది. ‘మూరత్ ట్రేడింగ్’లో లాభాలు దీపావళి(హిందూ సంవత్ 2079 ఏడాది)సందర్భంగా సోమవారం జరిగిన ‘మూరత్ ట్రేడింగ్’లో దేశీ స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. సాయంత్రం 6.15 నుంచి రాత్రి 7.15 నిమిషాల మధ్య జరిగిన ఈ ప్రత్యేక ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఫలితంగా సెన్సెక్స్ 525 పాయింట్ల లాభంతో 59,831 వద్ద ముగిసింది. నిఫ్టీ 154 పాయింట్లు పెరిగి 17,731 వద్ద స్థిరపడింది. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
సెన్సెక్స్.. బౌన్స్ బ్యాక్!
ముంబై: ఆర్బీఐ రెపో రేటును పెంచినప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపాయి. తొలుత నష్టాలతో ప్రారంభమైన ప్రధాన ఇండెక్సులు తదుపరి ఆర్బీఐ ప్రకటించిన జీడీపీ, ద్రవ్యోల్బణ అంచనాలతో దూసుకెళ్లాయి. సమయం గడిచేకొద్దీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకే ఆసక్తి చూపడంతో సాంకేతికంగా కీలకమైన స్థాయిలను అధిగమించాయి. సెన్సెక్స్ 1,017 పాయింట్లు జమ చేసుకుని 57,427 వద్ద ముగిసింది. నిఫ్టీ 276 పాయింట్లు ఎగసి 17,094 వద్ద స్థిరపడింది. కొత్త సిరీస్(అక్టోబర్) తొలి రోజు ట్రేడర్లు లాంగ్ పొజిషన్లకు ప్రాధాన్యత ఇచ్చినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అంచనాలకు తగ్గట్లే 0.5 శాతం రెపో పెంపు, రూపాయి పుంజుకోవడం వంటి అంశాలు సెంటిమెంటుకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. బ్యాంకింగ్, మెటల్ జోరు..: ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, రియల్టీ, ఆటో, వినియోగ వస్తువులు 3–1.5% మధ్య ఎగశాయి. హిందాల్కో, ఎయిర్టెల్, ఇండస్ఇండ్, బజాజ్ ఫిన్ ద్వయం, కొటక్ బ్యాంక్, టైటన్, హెచ్డీఎఫ్సీ ద్వయం, టాటా స్టీల్, ఐసీఐసీఐ, యూపీఎల్, మారుతీ, యాక్సిస్ 5.6–2.3% మధ్య జంప్‌చేశాయి. ►5జీ సేవలు ప్రారంభంకానుండటంతో ఎయిర్టెల్ షేరు సరికొత్త గరిష్టం రూ. 809ను తాకింది. చివరికి 4.6% జంప్‌చేసి రూ. 800 వద్ద ముగిసింది. ►ప్రమోటర్ సంస్థ స్పిట్జీ ట్రేడ్ 40 లక్షల షేర్లను కొనుగోలు చేసిన వార్తలతో అదానీ గ్రీన్ ఎనర్జీ 12.5 శాతం దూసుకెళ్లింది. రూ. 2,253 వద్ద నిలిచింది. తొలుత రూ. 2,405కు ఎగసింది. ►పవర్‌గ్రిడ్ నుంచి రూ. 333 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందిన వార్తలతో బజాజ్ ఎలక్ట్రికల్స్ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 1,192 వద్ద ముగిసింది. చదవండి: ఒకటికి మించి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్! -
గ్లోబల్ మాంద్యం భయాలు: 5 లక్షల కోట్లు ఢమాల్
సాక్షి,ముంబై: బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, గ్లోబల్‌మాంద్యం, ముఖ్యంగా ఫెడ్ రిజర్వ్ వడ్డింపుతో దేశీయ స్టాక్‌మార్కెట్ భారీ పతనాన్ని నమోదు చేసింది. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రికార్డు కనిష్టానికి చేరింది. సెన్సెక్స్ 1020 పాయింట్ల నష్టంతో 58,098 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 1.72 శాతం క్షీణించి 17,327 వద్ద ముగిసింది. ఒక దశలో సెన్సెక్స్ 57,981కి పడిపోయింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్. ఆటో, ఐటీ రంగ షేర్లు నష్టపోయాయి. వరుసగా మూడో సెషన్లో పతనాన్ని నమోదు చేయడమే కాదు, వరుసగా నాల్గవ వారాంతంలోనూ క్షీణించాయి. అన్ని బిఎస్ఇ-లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 276.6 లక్షల కోట్లకు పడిపోయింది. ఈ ఒక్కరోజు ట్రేడర్లు రూ.4.9 లక్షల కోట్ల మేర నష్ట పోయారు. టెక్నికల్‌గా సెన్సెక్స్ 59500 స్థాయిని నిఫ్టీ 17500 స్థాయికి చేరింది. దీంతో ఇన్వెస్టర్లు టెక్నికల్ లెవల్స్‌ను జాగ్రత్తగా పరిశీలిస్తారని, ఈ స్థాయిలు బ్రేక్ అయితే అమ్మకాల వెల్లువ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఫెడ్ వడ్డింపు, డాలర్ ఇండెక్స్ 20ఏళ్ల గరిష్టానికి చేరడంతో, రూపాయి పతనం,అమెరికా బాండ్ ఈల్డ్స్ పతనం,ఎఫ్ఐఐల అమ్మకాలు బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీలో పతనం తదితర కారణాలు మార్కెట్ ఔట్‌లుక్‌ను బేరిష్‌గా మార్చాయి. దీనికి తోడుఫెడ్‌బాటలోనే ఆర్బీఐ కూడా రానున్న సమీక్షలో కీలక వడ్డీరేట్లను పెంచనుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే బ్రిటన్, స్వీడన్, స్విట్జర్లాండ్, నార్వే సెంట్రల్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. -
స్టాక్ మార్కెట్: 3 రోజుల నష్టాలకు చెక్
ముంబై: స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల వరుస నష్టాలకు చెక్ పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో రోజంతా లాభాలతో కదిలాయి. సెన్సెక్స్ ట్రిపుల్ సెంచరీ సాధించి 59,141 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 92 పాయింట్లు ఎగసి 17,622 వద్ద స్థిరపడింది. వెరసి ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కు విరుద్ధమైన రీతిలో నిలిచాయి. ప్రారంభంలో వెనకడుగు వేసినప్పటికీ వెనువెంటనే పుంజుకున్నాయి. ఎన్ఎస్ఈలో ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా, ఎఫ్ఎంసీజీ, ఆటో రంగాలు 2–1 శాతం మధ్య లాభపడి మార్కెట్లకు దన్నునిచ్చాయి. రియల్టీ 1 శాతం, మెటల్ 0.5 శాతం చొప్పున నీరసించాయి. బ్లూచిప్స్ తీరిలా.. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్‌యూఎల్, ఎస్బీఐ, నెస్లే, బజాజ్ ఫిన్, హెచ్డీఎఫ్సీ, దివీస్, ఐటీసీ, యాక్సిస్, యూపీఎల్, ఐషర్, మారుతీ, ఇన్ఫోసిస్ 3.4–1 శాతం మధ్య లాభపడ్డాయి. మరోపక్క టాటా స్టీల్, టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, బ్రిటానియా, పవర్‌గ్రిడ్, సిప్లా, ఐసీఐసీఐ 2.4–0.8 శాతం మధ్య నష్టపోయాయి. చిన్న షేర్లు వీక్ మార్కెట్లు బలపడినప్పటికీ చిన్న షేర్లలో అమ్మకాలదే పైచేయిగా నిలిచింది. దీంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ ఇండెక్సులు 0.16 శాతం చొప్పున డీలాపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,973 నష్టపోగా.. 1,655 లాభపడ్డాయి. నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 312 కోట్లు ఇన్వెస్ట్ చేయగా దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 95 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. తాత్కాలికమే.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్ష నేపథ్యంలో ఇకపై మార్కెట్లు ఊగిసలాటకు లోనుకావచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్ధ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. బుధవారం ప్రకటించనున్న సమీక్షలో ఫెడ్ 0.75% వడ్డీ రేటును పెంచే అంచనాలున్నట్లు తెలియజేశారు. స్టాక్ హైలైట్స్ ► హెర్క్యులెస్ హోయిస్ట్స్ షేరు బిజినెస్‌ల విడదీత వార్తలతో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకి రూ. 218 వద్ద ఫ్రీజయ్యింది. ► షుగర్, ఇంజనీరింగ్ విభాగాలుగల త్రివేణీ ఇంజనీరింగ్ షేరు 17% జంప్‌చేసి 288 వద్ద ముగిసింది. ► వందే భారత్ సెమీ హైస్పీడ్ రైళ్ల కోసం మాడ్యులర్ ఇంటీరియర్స్‌కు రూ. 113 కోట్ల విలువైన ఆర్డర్లు లభించడంతో ఇండోనేషనల్ షేరు 20% అప్పర్ సర్క్యూట్ రూ. 404 వద్ద ముగిసింది. ► అదానీ గ్రూప్ తాజాగా రూ. 20,000 కోట్ల పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించడంతో అంబుజా సిమెంట్స్ 9% దూసుకెళ్లి 565 వద్ద ముగిసింది. చదవండి: బీఎస్ఎన్ఎల్ చవకైన ప్లాన్.. రూ.275 ప్లాన్‌తో 3300జీబీ.. ఆఫర్ లాస్ట్ డేట్ ఇదే! -
మార్కెట్లో మాంద్యం భయాలు
ముంబై: ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చనే భయాలతో శుక్రవారం దలాల్ స్ట్రీట్‌లో అమ్మకాలు పోటెత్తాయి. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలు సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచాయి. ట్రేడింగ్ ఆద్యంతం అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రెండుశాతం క్షీణించాయి. సెన్సెక్స్ 1,093 పాయింట్లు క్షీణించి 58,840 వద్ద ముగిసింది. ఈ సూచీలో మొత్తం నాలుగు మాత్రమే లాభపడ్డాయి. నిఫ్టీ 347 పాయింట్లను కోల్పోయి 17,531 వద్ద నిలిచింది. నిఫ్టీ 50 షేర్లలో సిప్లా, ఇండస్ ఇండ్ షేర్లు మాత్రమే లాభంతో గట్టెక్కాయి. ఐటీ, ఆటో, రియల్టీ షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ మూడు శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ రెండుశాతం చొప్పున క్షీణించాయి. ట్రెజరీ బాండ్లపై రాబడులు, డాలర్ ఇండెక్స్ పెరగడంతో పెరుగుదలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గడిచిన మూడు నెలల్లో సూచీలు ఒకవారంలో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 952 పాయింట్లు, నిఫ్టీ 303 పాయింట్లను కోల్పోయాయి. ట్రేడింగ్ ఆద్యంత అమ్మకాలే... ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 349 పాయింట్లు పతనమై 59,585 వద్ద, నిఫ్టీ 80 పాయింట్లు క్షీణించి 17,797 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటంతో ఇన్వెస్టర్లు ట్రేడింగ్ ఆద్యంతం అమ్మకాలకే మొగ్గుచూపారు. ఒక దశలో సెన్సెక్స్ 1247 పాయింట్లను కోల్పోయి 58,687 వద్ద, నిఫ్టీ 380 పాయింట్ల నష్టాన్ని చవిచూసి 17,497 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. కాగా, సెన్సెక్స్ భారీ నష్టంతో శుక్రవారం ఒక్క రోజే ఇన్వెస్టర్లకు రూ.6.18 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. ఇదే సూచీ గడిచిన మూడు రోజుల్లో 1,730 పాయింట్లను కోల్పోవడంతో మొత్తం రూ.7 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. వెరసి బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.285.90 లక్షల కోట్ల నుంచి రూ.279.80 లక్షల కోట్లకు దిగివచ్చింది. నష్టాలు ఎందుకంటే అంతర్జాతీయంగా మాంద్యం వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ హెచ్చరించడంతో భారత్‌తో సహా ప్రపంచ మార్కెట్లన్నీ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ద్రవ్యోల్బణ కట్టడికి కేంద్ర బ్యాంకులు కఠిన ద్రవ్య విధాన అమలుకు సిద్ధమతున్న వేళ.., వడ్డీరేట్ల పెంపుతో ఆర్థిక మాంద్యం ముంచుకురావచ్చనే ఆందోళనలు ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. దేశీయంగా ఆగస్టులో ద్రవ్యోల్బణం మళ్లీ ఎగువబాట పట్టడం ఆందోళన కలిగించింది -
పావెల్ ప్రకటనతో భారీ పతనం.. రూ.2.39 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: ద్రవ్యోల్బణ కట్టడికి వడ్డీరేట్ల పెంపు తప్పదని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రకటనతో సోమవారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. ఉదయం భారీ నష్టాలతో మొదలైన సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల ప్రభావంతో రోజంతా బలహీనంగానే ట్రేడయ్యాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆర్థిక షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 861 పాయింట్లు క్షీణించి 57,973 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 246 పాయింట్ల పతనంతో 17,313 వద్ద నిలిచింది. ఆసియాలో ఒక్క చైనా అన్ని దేశాల స్టాక్ సూచీలు రెండుశాతం నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు 0.50% నుంచి ఒకశాతం పతనమయ్యాయి. అమెరికా సూచీలు పావుశాతం నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ ఒకటిన్నర నష్టంతో బీఎస్ఈలో రూ.2.39 లక్షల కోట్ల సంపద మాయమైంది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ నమోదిత కంపెనీల మొ త్తం విలువ రూ.274 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఆరంభ నష్టాల నుంచి రికవరీ అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఉదయం స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ 1467 పాయింట్ల పతనంతో 57,367 వద్ద, నిఫ్టీ 370 పాయింట్ల పతనంతో 370 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 57,367 వద్ద కనిష్టాన్ని, 58,208 గరిష్టాన్ని చూసింది. నిఫ్టీ 17,380 – 17,166 పరిధిలో ట్రేడైంది. రిలయన్స్ షేరు ఒడిదుడుకులకు లోనై, చివరికి ఒకశాతం నష్టంతో రూ.2,597 వద్ద ముగిసింది.