
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజల చేతుల్లో ఉన్న రూ.1000, రూ.500 నోట్లన్నింటిన్నీ ఒక్కసారిగా చిత్తు కాగితాలుగా మారుస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ చారిత్రాత్మక నిర్ణయం వెలువడి నేటికి ఏడాది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రజలందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ నోట్లను మార్చుకోవడానికి నానా తంటాలు పడ్డారు. ఈ ప్రకటన అనంతరం దేశీయ ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. ఎనిమిది సెషన్స్‌లో 1800 పాయింట్ల మేర సెక్సెక్స్ పతనమైంది.
ప్రధాని ప్రకటించిన ఈ నిర్ణయంతో దేశీయ ఆర్థిక వృద్ధి కుంటుపడుతుందని, వినియోగత్వం దెబ్బతింటుందని విశ్లేషకులు ఆందోళన చెందారు. కానీ పరిస్థితులన్నీ వెనువెంటనే మారిపోయాయి. పెద్ద నోట్ల రద్దు స్వల్పకాలికంగా దెబ్బతీసినా.. దీర్ఘకాలంలో సానుకూల ప్రభావాన్నే చూపుతుందని పలు సర్వేలు, పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు. దీంతో మెల్లమెల్లగా మార్కెట్లు కూడా కోలుకోవడం ప్రారంభమయ్యాయి. మనీ మార్కెట్లు, ఫైనాన్సిల్ సిస్టమ్ పునరుద్ధరించబడ్డాయి. అప్పటి నుంచి బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ.35 లక్షల కోట్ల మేర పెరిగింది.
గతేడాది నవంబర్ 8న రూ.111.45 లక్షల కోట్ల ఉన్న బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్, ఈ ఏడాది నాటికి రూ.146.23 లక్షల కోట్లకు చేరింది. డిజిటల్ లావాదేవీలు, బ్యాంకు డిపాజిట్లు పెరుగడం మార్కెట్లకు పాజిటివ్‌గా నిలిచినట్టు విశ్లేషకులు చెప్పారు. ఈ కాలంలో పలు ఇన్వెస్టర్ల సంపద బాగా పెరిగినట్టు తెలిసింది. గతేడాది నవంబర్ 8 నుంచి ఈ ఏడాది నవంబర్ 6 వరకు ఇండియాబుల్స్ వెంచర్స్ షేర్లు ఏకంగా 1,147 శాతం మేర పెరిగి, చార్ట్ టాపర్‌గా నిలిచాయి. హెచ్‌ఈజీ 1011 శాతం, గోల్డ్‌స్టోన్ ఇన్‌ఫ్రాటెక్ 720 శాతం, గ్రాఫైట్ ఇండియా 686 శాతం, గోవా కార్బన్ 653 శాతం, రైన్ ఇండస్ట్రీస్ 559 శాతం, జిందాల్ వరల్డ్‌వైడ్ 559 శాతం, కాలిఫోర్నియా సాఫ్ట్ 550 శాతం మేర పైకి ఎగిశాయి.
అంతేకాక 150 పైగా ఇతర స్టాక్స్ కూడా ఎన్‌ఎస్‌ఈలో 100 నుంచి 550 శాతం మేర పెరిగాయి. ఈ కాలంలో కేవలం 50 శాతం స్టాక్స్ మాత్రమే కిందకి పడిపోయాయి. ప్రధాని ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు షాకింగ్ నిర్ణయం అనంతరం ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు రూ.10వేల కోట్లు పైగా భారత్‌లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలిసింది. అదేవిధంగా దేశీయ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు రూ.లక్షల కోట్లకు పైగా సంపదను మార్కెట్‌లోకి చొప్పించినట్టు వెల్లడైంది. ఇవన్నీ పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ నుంచి మార్కెట్లను బయట పడేలా చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment