సెన్సెక్స్ ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్‌ఈలో రూ.8.50 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.365 లక్షల కోట్లకు దిగివచ్చింది.
ముంబై: దలాల్ స్ట్రీట్‌లో మంగళవారం అమ్మకాల మోత మోగింది. అధిక వెయిటేజీ షేర్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు(3%), రిలయన్స్ ఇండస్ట్రీస్(2%), ఎస్‌బీఐ(4%) షేర్లు పతనంతో పాటు పశ్చిమాసియాలోని యుద్ధ ఉద్రికత్తలు ఇందుకు ప్రధాన కారణమయ్యాయి. ఇటీవల విడుదలైన కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడమూ సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచింది. విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. గడిచిన 3 నెలల్లో భారీగా ర్యాలీ చేసిన చిన్న, మధ్య తరహా షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్ 3శాతం చొప్పున నష్టపోయాయి.
పెరిగి పడిన మార్కెట్...
మూడు రోజుల వరుస సెలవుల తర్వాత తెరుచుకున్న మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 444 పాయింట్లు పెరిగి 71,868 వద్ద, నిఫ్టీ 145 పాయింట్లు బలపడి 21,717 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. కానీ, కాసేపటికే అమ్మకాల ఒత్తిడి మొదలైంది. ఒక దశలో సెన్సెక్స్ 1,189 పాయింట్లు క్షీణించి 70,235 వద్ద, నిఫ్టీ 397 పాయింట్లు దిగివచ్చి 21,193 వద్ద ఇంట్రాడే కనిష్టాలను దిగివచ్చాయి. చివరికి సెన్సెక్స్ 1,053 పాయింట్లు నష్టపోయి 70,371 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 330 పతనమై 21,242 వద్ద స్థిరపడ్డాయి. జనవరి 17 తర్వాత సూచీలకు ఇది భారీ పతనం.
ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లూ డీలా...!
అమ్మకాల సునామీతో ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లు ఎరుపెక్కాయి. రంగాల వారీగా ఎన్‌ఎస్‌ఈలో మీడియా 13%, రియల్టీ 5%, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 4%, మెటల్, ఆయిల్‌అండ్‌గ్యాస్ 3%, బ్యాంక్ నిఫ్టీ 2%, ప్రైవేట్ రంగ బ్యాంక్ 2%, ఎఫ్‌ఎంసీజీ, ఆటో ఇండెక్సులు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. ఫార్మా సూచీ మాత్రమే 1.5% రాణించింది.
►నష్టాల ట్రేడింగ్‌లోనూ మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ లిస్టింగ్ సక్సెస్ అయ్యింది. ఇష్యూ ధర(రూ.418)తో పోలిస్తే బీఎస్‌ఈలో 11.24% ప్రీమియంతో రూ.465 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో 22% ఎగసి రూ.510 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 11% లాభపడి దాదాపు లిస్టింగ్ ధర రూ.464 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.3,197 కోట్లుగా నమోదైంది.
►ఆర్థిక ఫలితాల ప్రకటన తర్వాత సిప్లా షేరు రాణించింది. డిసెంబర్ క్వార్టర్‌లో నికర లాభం 32% వృద్ధి చెందినట్లు వెల్లడించడం కలసి వచ్చింది. బీఎస్‌ఈలో ఈ షేరు 7% పెరిగి రూ.1,409 వద్ద ముగిసింది.
►సోనీ గ్రూప్ 10 బిలియన్ డాలర్ల విలీన ఒప్పందం రద్దుతో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ షేరు కుప్పకూలింది. బీఎస్‌ఈలో 10% నష్టంతో రూ.209 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో ఏకంగా 34% పతనమై రూ.152 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. చివరికి 33% నష్టంతో రూ.156 వద్ద స్థిరపడింది. ఒక దశలో షేరు ఇరు ఎక్సే్చంజీలో లోయర్ సర్క్యూట్‌ను తాకింది. షేరు భారీ క్షీణతతో కంపెనీకి రూ.7,300 కోట్ల నష్టం వాటిల్లింది.
►హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు పతనం ఆగడం లేదు. బీఎస్‌ఈలో 3.50% నష్టపోయి రూ.1428 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 3.65% పతనమై రూ.1,425 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10.83 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు వరుస అయిదు రోజుల్లో 13% క్షీణించింది.
Comments
Please login to add a commentAdd a comment