Pharma shares
-
8.50 లక్షల కోట్ల సంపద ఆవిరి
సెన్సెక్స్ ఒకటిన్నర శాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్ఈలో రూ.8.50 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.365 లక్షల కోట్లకు దిగివచ్చింది. ముంబై: దలాల్ స్ట్రీట్‌లో మంగళవారం అమ్మకాల మోత మోగింది. అధిక వెయిటేజీ షేర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంకు(3%), రిలయన్స్ ఇండస్ట్రీస్(2%), ఎస్బీఐ(4%) షేర్లు పతనంతో పాటు పశ్చిమాసియాలోని యుద్ధ ఉద్రికత్తలు ఇందుకు ప్రధాన కారణమయ్యాయి. ఇటీవల విడుదలైన కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడమూ సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచింది. విదేశీ ఇన్వెస్టర్లు వరుస విక్రయాలు ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. గడిచిన 3 నెలల్లో భారీగా ర్యాలీ చేసిన చిన్న, మధ్య తరహా షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ 3శాతం చొప్పున నష్టపోయాయి. పెరిగి పడిన మార్కెట్... మూడు రోజుల వరుస సెలవుల తర్వాత తెరుచుకున్న మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 444 పాయింట్లు పెరిగి 71,868 వద్ద, నిఫ్టీ 145 పాయింట్లు బలపడి 21,717 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. కానీ, కాసేపటికే అమ్మకాల ఒత్తిడి మొదలైంది. ఒక దశలో సెన్సెక్స్ 1,189 పాయింట్లు క్షీణించి 70,235 వద్ద, నిఫ్టీ 397 పాయింట్లు దిగివచ్చి 21,193 వద్ద ఇంట్రాడే కనిష్టాలను దిగివచ్చాయి. చివరికి సెన్సెక్స్ 1,053 పాయింట్లు నష్టపోయి 70,371 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 330 పతనమై 21,242 వద్ద స్థిరపడ్డాయి. జనవరి 17 తర్వాత సూచీలకు ఇది భారీ పతనం. ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లూ డీలా...! అమ్మకాల సునామీతో ఫార్మా మినహా అన్ని రంగాల షేర్లు ఎరుపెక్కాయి. రంగాల వారీగా ఎన్ఎస్ఈలో మీడియా 13%, రియల్టీ 5%, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 4%, మెటల్, ఆయిల్‌అండ్‌గ్యాస్ 3%, బ్యాంక్ నిఫ్టీ 2%, ప్రైవేట్ రంగ బ్యాంక్ 2%, ఎఫ్ఎంసీజీ, ఆటో ఇండెక్సులు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. ఫార్మా సూచీ మాత్రమే 1.5% రాణించింది. ►నష్టాల ట్రేడింగ్‌లోనూ మెడి అసిస్ట్ హెల్త్‌కేర్ లిస్టింగ్ సక్సెస్ అయ్యింది. ఇష్యూ ధర(రూ.418)తో పోలిస్తే బీఎస్ఈలో 11.24% ప్రీమియంతో రూ.465 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో 22% ఎగసి రూ.510 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 11% లాభపడి దాదాపు లిస్టింగ్ ధర రూ.464 వద్ద ముగిసింది. మార్కెట్ విలువ రూ.3,197 కోట్లుగా నమోదైంది. ►ఆర్థిక ఫలితాల ప్రకటన తర్వాత సిప్లా షేరు రాణించింది. డిసెంబర్ క్వార్టర్లో నికర లాభం 32% వృద్ధి చెందినట్లు వెల్లడించడం కలసి వచ్చింది. బీఎస్ఈలో ఈ షేరు 7% పెరిగి రూ.1,409 వద్ద ముగిసింది. ►సోనీ గ్రూప్ 10 బిలియన్ డాలర్ల విలీన ఒప్పందం రద్దుతో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ షేరు కుప్పకూలింది. బీఎస్ఈలో 10% నష్టంతో రూ.209 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఇంట్రాడేలో ఏకంగా 34% పతనమై రూ.152 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. చివరికి 33% నష్టంతో రూ.156 వద్ద స్థిరపడింది. ఒక దశలో షేరు ఇరు ఎక్సే్చంజీలో లోయర్ సర్క్యూట్‌ను తాకింది. షేరు భారీ క్షీణతతో కంపెనీకి రూ.7,300 కోట్ల నష్టం వాటిల్లింది. ►హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు పతనం ఆగడం లేదు. బీఎస్ఈలో 3.50% నష్టపోయి రూ.1428 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 3.65% పతనమై రూ.1,425 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10.83 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరచడంతో ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు వరుస అయిదు రోజుల్లో 13% క్షీణించింది. -
లక్ష పెట్టుబడి..ఐదేళ్లలో రూ.40 లక్షల లాభం!
స్టాక్ మార్కెట్.. కోరికలకు రెక్కలు తొడిగే లెక్కల ప్రపంచం. చేతులు కాల్చుకోవాలన్నా.. రాతలు మార్చుకోవాలన్న అన్నీ అక్కడే సాధ్యం. కోట్లమంది తలరాతలు మార్చే ఇన్వెస్టర్ల ప్రపంచం. సరైన అవగాహన ఉంటే అలాంటి కేపిటల్ మార్కెట్లో మెగస్టార్లు అవ్వొచ్చు. ముఖ్యంగా తక్కువ ధరకే షేర్లను కొనుగోలు చేసి.. కొద్ది కాలం ఎదురు చూస్తే చాలు మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ ఓ స్వర్గంలా కనిపిస్తుంది. అలాంటి స్టాక్ మార్కెట్లో మదుపర్లు ఐదేళ్ల క్రితం'క్వాలిటీ ఫార్మా'షేర్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టారు.ఆ లక్షే ఇవాళ రూ.40 లక్షల లాభం తెచ్చిపెట్టింది. ఇటీవల మల్టీబ్యాగర్ స్టాక్‌గా పాపులరైన ఎనేషనల్ స్టాండర్డ్ ఇండియా (ఎన్ఎస్ఐ) తక్కువ సమయంలో 100 శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడులు ఇచ్చిన మల్టీ బ్యాగర్ స్టాక్ క్వాలిటీ ఫార్మా గురించి ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. షేర్ వ్యాల్యూ ఎంత పెరిగింది.. బీఎస్ఈలో ఐదేళ్ల క్రితం అంటే 2016, సెప్టెంబర్ 28న ఈ కంపెనీ షేర్ వ్యాల్యూ రూ.21.75గా ఉంది. ఆదే షేర్ వ్యాల్యూ ఐదేళ్ల తరువాత 40 రేట్లు పెరిగి 2021, అక్టోబర్ 1కి రూ.878కి చేరింది. ►వాస్తవానికి ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ షేర్ ధర 110శాతంతో రూ.419.90 నుంచి రూ.878కి పెరిగింది. ► ఆరునెలల క్రితం రూ.54ఉన్న షేర్ ధర 1530శాతం పెరిగి రూ.878.90 కి చేరింది. ► ఒక ఏడాదిలో రూ.61 ఉన్న షేర్ ధర రూ.878.90కి చేరింది. ►మొత్తంగా ఐదేళ్ల కాలంలో 3,940 శాతం పెరుగుదలతో రూ.21 నుంచి రూ.878 స్థాయికి చేరుకుంది. నెలక్రితం ఇన్వెస్ట్ చేసినా.. ► నెల రోజుల క్రితం ఇదే క్వాలిటీ ఫార్మా షేర్లో రూ.1లక్ష పెట్టుబడి పెడితే.. రూ.2.10లక్షల లాభం వచ్చేది. ► 6 నెలల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.16.30లక్షల లాభం వచ్చేది. ► ఏడాది క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు రూ.14.40లక్షల లాభం వచ్చేది. ► అదే స్టాక్‌లో 5 ఏళ్ల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని ధర రూ.40.40 లక్షల లాభం వచ్చేది. చదవండి:కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్‌దేవ్.. సెబీ సీరియస్ -
మార్కెట్ల పతనం- ఫార్మా షేర్ల జోరు
ముంబై, సాక్షి: మళ్లీ యూరోపియన్ దేశాలను కరోనా వైరస్ వణికిస్తుండటంతో తాజాగా హెల్త్‌కేర్ రంగం వెలుగులోకి వచ్చింది. సెకండ్‌వేవ్‌లో భాగంగా ఇప్పటికే యూస్, యూరోపియన్ దేశాలలో కోవిడ్-19 కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బ్రిటన్‌లో వైరస్ కొత్త రూపంలో విస్తరిస్తున్నట్లు వెలువడిన వార్తలు ఓవైపు మార్కెట్లను దెబ్బతీస్తుంటే.. మరోపక్క ఔషధ కంపెనీలకు డిమాండ్‌ను పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఓవైపు కోవిడ్-19 కట్టడికి కొత్త ఏడాది(2021)లో పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నప్పటికీ మరికొంత కాలం వైరస్ సంక్షోభం కొనసాగనున్నట్లు ఫార్మా వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా హెల్త్‌కేర్, ఫార్మా కౌంటర్లు జోరందుకున్నాయి. వెరసి బీఎస్ఈలో హెల్త్‌కేర్ ఇండెక్స్ 21,644 వద్ద, ఎన్ఎస్ఈలో ఫార్మా రంగం 12,870 సమీపంలోనూ సరికొత్త గరిష్టాలు చేరాయి. అయితే ప్రస్తుతం సెన్సెక్స్ 300 పాయింట్లు పతనమై 46,660కు చేరగా.. నిఫ్టీ 98 పాయింట్లు క్షీణించి 13,662 వద్ద ట్రేడవుతోంది. (మెడ్‌ప్లస్‌పై వార్బర్గ్ పింకస్ కన్ను!) షేర్ల జోరిలా ఎన్ఎస్ఈలో ప్రస్తుతం సిప్లా 2 శాతం బలపడి రూ. 810 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 817కు ఎగసింది. తొలుత రూ. 905ను తాకిన అరబిందో ప్రస్తుతం 1.2 శాతం పుంజుకుని రూ. 896 వద్ద కదులుతోంది. ఈ బాటలో లుపిన్ 1 శాతం పెరిగి రూ. 983 వద్ద, సన్ ఫార్మా 1 శాతం బలపడి రూ. 580 వద్ద ట్రేడవుతున్నాయి. ఇంట్రాడేలో లుపిన్ రూ. 992 వద్ద, సన్ ఫార్మా రూ. 586 వద్ద గరిష్టాలకు చేరాయి. కాగా.. ఎక్స్‌బోనస్ నేపథ్యంలో వేలియంట్ ఆర్గానిక్స్ 3 శాతం పురోగమించి రూ. 3400 వద్ద కదులుతోంది. తొలుత రూ. 3,488 వరకూ బలపడింది. ఇక బీఎస్ఈలో నెక్టార్లైఫ్, సువెన్ ఫార్మా, జూబిలెంట్, మెట్రోపోలిస్, మార్క్సాన్స్, ఇండొకో, గ్లెన్‌మార్క్, లాల్‌పాథ్, ఆస్ట్రాజెనెకా, లారస్ ల్యాబ్స్ 10-1 శాతం మధ్య జంప్‌చేశాయి. -
ఫార్మా డే..300 పాయింట్లు జంప్
సాక్షి,ముంబై: దేశీయస్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. అనంతరం మరింత ఎగిసి కీలక మద్దతు స్థాయిలను అధిగమించాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 310 పాయింట్లు ఎగిసి 38347 వద్ద, నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 11306 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా సెన్సెక్స్ 38300 ఎగువన ట్రేడ్ అవుతుండగా, నిఫ్టీ 11300 స్థాయిని అదిగమించింది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రధానంగా బ్యాంక్, ఫార్మ రంగ షేర్లు ఉత్సాహంగా ఉన్నాయి. మరోవైపు ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ క నిపిస్తోంది. బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టి, ఎంఅండ్ఎం , ఇండస్ఇండ్ బ్యాంక్ , ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సిప్లా టాప్ గెయినర్ గా ఉంది. దివీస్, సన్ ఫార్మాలాభాలతో నిఫ్టీ ఫార్మా 400పాయింట్లకు పైగా లాభాలతో ఉంది. -
మూడోరోజూ లాభాల్లోనే...
ఫార్మా షేర్ల జోరు... ∙స్వల్పంగా పెరిగిన సెన్సెక్స్, నిఫ్టీ ∙సుప్రీం వివరణతో లిక్కర్ షేర్ల రయ్ ముంబై: అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు వెలువడినప్పటికీ... దేశీ స్టాక్ సూచీలు మాత్రం లాభాల హ్యాట్రిక్‌ను నమోదుచేశాయి. ప్రధానంగా దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడోరోజూ లాభాల్లో ముగిశాయి. గురువారం ట్రేడింగ్‌లో సూచీలు ఆద్యంతం పరిమిత శ్రేణిలోనే కదలాడాయి. చివరకు సెన్సెక్స్ 28 పాయింట్ల పెరుగుదలతో 31,596 పాయింట్ల వద్ద, నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 9,857 వద్ద ముగిశాయి. గడిచిన రెండు రోజుల్లో సెన్సెక్స్ 309 పాయింట్లు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రాథమిక సమాచారం ప్రకారం దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) నికరంగా రూ.1,044 కోట్ల మేర కొనుగోళ్లు జరపగా... విదేశీ మదుపరులు(ఎఫ్‌పీఐ) రూ.696 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. అమెరికాలో పరిణామాలపై దృష్టి... మెక్సికో సరిహద్దు వెంబడి గోడను నిర్మించేందుకు తగిన నిధులను కేటాయించేందుకు అవసరమైతే ప్రభుత్వ కార్యకలాపాల నిలిపివేతకు (షట్‌డౌన్) కూడా వెనుకాడబోనని అమెరికా అధ్యక్షుడు చేసిన హెచ్చరికతో ముందురోజు వాల్‌స్ట్రీట్ నష్టాల్లో ముగిసింది. దీని ప్రభావంతో ఆసియాలో కూడా ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి. మరోపక్క, ప్రపంచంలోని కీలక సెంట్రల్ బ్యాంకర్ల సదస్సు గురువారం అమెరికాలోని జాక్సన్హోల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో విధానపరంగా ఎలాంటి ప్రకటనలు ఉండొచ్చన్న దానిపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారించినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటెజిస్ట్ ఆనంద్ జేమ్స్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల అప్రమత్త ధోరణి కారణంగానే మన మార్కెట్లు కూడా పరిమిత శ్రేణిలో(రేంజ్ బౌండ్)లో కదలాడాయని చెప్పారు. ఇక వినాయక చవితి సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు కావడంతో ట్రేడింగ్ వరుసగా మూడు రోజులు ట్రేడింగ్‌కు విరామం రావడంకూడా ఇన్వెస్టర్ల అప్రమత్త ధోరణికి ఒక కారణమని ఆయన తెలిపారు. ఫార్మా రయ్... ఇటీవల కాలంలో భారీగా పడిన ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లకు దిగువస్థాయిల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో దూసుకెళ్లాయి. ఈ రంగం సూచీ 2.53 శాతం ఎగసింది. సెన్సెక్స్ జాబితా ఉన్నవాటిలో లుపిన్ అత్యధికంగా 3.87 శాతం లాభపడగా, సన్ ఫార్మా 3.1 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2.88 శాతం, సిప్లా 2.47 శాతం చొప్పున ఎగబాకాయి. జైడస్ క్యాడిలాకు చెందిన యాంటీ హైపర్‌టెన్షన్ ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి లభించిన వార్తలతో క్యాడిలా హెల్త్‌కేర్ షేరు 7 శాతం రివ్వుమంది. దీంతోపాటు ఐటీ, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్ సూచీలు కూడా లాభాల్లో నిలిచాయి. నందన్ నీలేకని ఇన్ఫీ చైర్మన్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నారన్న వార్తలతో ఇన్ఫోసిస్ 2 శాతం ఎగసి రూ.913 వద్ద స్థిరపడింది. ఇంకా లాభపడిన షేర్లలో టాటామోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, ఎల్అండ్టీ, పవర్‌గ్రిడ్ ఉన్నాయి. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీ నాల ప్రక్రియ వేగవంతం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముందుజోరు ర్యాలీ జరిపిన బ్యాంకింగ్ షేర్లలో గురువారం మళ్లీ నిస్తేజం ఆవహించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు స్వల్పంగా పెరగ్గా.. ప్రైవేటు బ్యాంకుల్లో చాలావరకూ మిశ్రమంగా ముగిశాయి. లిక్కర్ షేర్లకు ‘సుప్రీం’ కిక్... జాతీయ రహదారుల పక్కన లిక్కర్ షాపులపై విధించిన నిషేధం నగరాలు, మునిసిపాలిటీల పరిధిలోని వాటికి వర్తించబోదని సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వడంతో లిక్కర్ కంపెనీల షేర్లకు జోష్ లభించింది. యునైటెడ్ స్పిరిట్స్, తిలక్‌నగర్ ఇండస్ట్రీస్, గ్లోబస్ స్పిరిట్స్, జీఎం బ్రూవరీస్ తదితర షేర్లు 12 శాతం వరకూ దూసుకెళ్లాయి. నేడు మార్కెట్లకు సెలవు... వినాయకచవితి సందర్భంగా నేడు (శుక్రవారం) స్టాక్ మార్కెట్లతోపాటు బులియన్, ఫారెక్స్, ఇతర కమోడిటీ మార్కెట్లన్నింటికీ సెలవు ప్రకటించారు. -
ఫార్మా షేర్లతో మార్కెట్ జోరు
♦ 128 పాయింట్ల లాభంతో 27,916కు సెన్సెక్స్ ♦ 37 పాయింట్ల లాభంతో 8,566కు నిఫ్టీ ఫార్మా షేర్ల జోరుకు, యూరప్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం కావడం కూడా తోడవడంతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. వరుసగా రెండో రోజు కూడా మార్కెట్లు లాభపడి... బీఎస్ఈ సెన్సెక్స్ 128 పాయింట్లు ప్లస్‌తో 27,916 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 8,566 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ 11 నెలల గరిష్ట స్థాయిలో ముగిసింది. తక్కువ ధరల్లో బ్లూ చిప్ షేర్లు: వర్షాలు బాగా కురుస్తుండడంతో వ్యవసాయోత్పత్తి పెరుగుతుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుందని, జీఎస్టీ బిల్లు ఆమోదం పొందుతుందనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. అయితే భారత వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) స్వల్పంగా తగ్గించడం ఒకింత ప్రతికూల ప్రభావం చూపించింది. కంపెనీలు మంచి ఫలితాలనే ఇస్తాయని అంచనాలుండటం, జీఎస్టీ బిల్లు ఆమోదం పొందుతుందన్న అంచనాల వల్ల మార్కెట్‌కు లాభాలు వచ్చాయని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. సిమెంట్ షేర్లకు లాభాలు: మూడు భారత ఫార్మా కంపెనీలు-సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, గ్లెన్ మార్క్ ఫార్మాలకు కొవ్వు నియంత్రణ సంబంధిత జనరిక్ ఔషధాలను అమెరికాలో విక్రయించడానికి అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది. దీంతో ఫార్మా షేర్లు దూసుకుపోయాయి. సన్ ఫార్మా, గ్లెన్‌మార్క్ ఫార్మా, అరబిందో ఫార్మా కంపెనీలు 2-5 శాతం రేంజ్లో పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో సిమెంట్ కంపెనీలు మంచి ఫలితాలనే ప్రకటిస్తాయన్న అంచనాలతో సిమెంట్ రంగ షేర్లు లాభపడ్డాయి. డెక్కన్ సిమెంట్స్, హెడెల్‌బెర్గ్ సిమెంట్ ఇండియా, ఇండియా సిమెంట్స్, సాగర్ సిమెంట్స్ ఏసీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు 1-8 శాతం రేంజ్లో పెరిగాయి. ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఐటీ కంపెనీ విప్రో షేర్ 2 శాతం పతనమైంది. -
సెన్సెక్స్ సెంచరీ..
- ఫార్మా, ఐటీ షేర్ల దన్నుతో లాభాలు - కలసివచ్చిన షాంఘై రికవరీ - 100 పాయింట్ల ప్లస్‌తో 27,932కు సెన్సెక్స్ గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో క్షీణిస్తూ వస్తున్న రూపాయి కారణంగా ఐటీ, ఫార్మా షేర్లు లాభపడ్డాయి. దీంతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. విదేశీ నిధుల ఉపసంహరణను నిరోధించడానికి, యువాన్ విలువ తగ్గింపు కారణంగా లిక్విడిటీతో ఇబ్బందులు పడుతున్న బ్యాంకులకు మరి న్ని నిధులు ఇవ్వనున్నామని చైనా ప్రభుత్వం ప్రకటించడంతో 5 శాతం వరకూ నష్టపోయిన చైనా షాంఘై సూచీ చివరకు 1 శాతం లాభపడింది. దీంతో వరుసగా రెండు రోజుల మన స్టాక్ మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది. బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంతో 27,932 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 29 పాయింట్లు లాభపడి 8,495 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ మినిట్స్ బుధవారం అర్థరాత్రి వెలువడుతుండటంతో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు. గత 4 ట్రేడింగ్ సెషన్లలో 20% వరకూ ఎగసిన బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా సెన్సెక్స్ 28 వేల పాయింట్లు, నిఫ్టీ 8,500 పాయింట్ల దిగువనే ముగిశాయి. -
ఆర్థిక సంవత్సరంలో 25 శాతం ర్యాలీ
2009-10 తర్వాత ఇదే పెద్ద అప్‌ట్రెండ్ ఫార్మా షేర్ల జోరు పెరిగిన వాహన, బ్యాంకింగ్ షేర్లు తగ్గిన మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు ఈ మార్చి31తో ముగిసిన 2014-15 ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఈ సెన్సెక్స్ 25 శాతం వృద్ధి సాధించింది. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఇదే అత్యుత్తమ వృద్ధి. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక విదేశీ నిధులు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సర కాలానికి 5,571 పాయింట్లు పెరిగింది. గత ఏడాది మార్చి 31న 22,386గా ఉన్న సెన్సెక్స్ ఈ ఏడాది మార్చి 31 నాటికి 27,957 పాయింట్లకు ఎగసింది. ఇక నిఫ్టీ 1,787 పాయింట్లు(27 శాతం) లాభపడింది. 2014-15లోనేసెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిలను చేరాయి. మార్చి 4న సెన్సెక్స్ 30,025 పాయింట్లను, నిఫ్టీ 9,119 పాయింట్ల(ఇవి రెండూ ఆల్‌టైమ్ హై)ను తాకాయి. అన్ని రంగాల సూచీల్లో బీఎస్ఈ హెల్త్‌కేర్ సూచీ అత్యధికంగా లాభపడింది. ఈ సూచీ 70 శాతం ఎగసింది. 25 ఫార్మా షేర్లలో 12కు పైగా వంద శాతం పెరగడం విశేషం. వాహన, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ సూచీలు 30-44 శాతం రేంజ్లో పెరిగాయి. మెటల్ అండ్ ఆయిల్, గ్యాస్ ఇండెక్స్‌లు 3-6 శాతం రేంజ్లో పడిపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలను మించి 50 శాతానికి పైగా పెరిగాయి. కాగా గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ మార్కెట్లు నుంచి భారత కంపెనీలు రూ.58,801 కోట్లు సమీకరించాయి. 2010-11లో ఇది రూ.72,143 కోట్లు. 2010-11 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే నిధుల సమీకరణకు 2014-15 ఉత్తమ సంవత్సరమని ప్రైమ్ డేటా సంస్థ తెలిపింది. అయితే 2015 మార్చి నెలలో సెన్సెక్స్ 4.8 శాతం తగ్గింది. 2013 ఫిబ్రవరి నుంచి చూస్తే ఇదే అధ్వాన క్షీణత. సెషన్‌కు రూ.11,000 కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద గత ఆర్థిక సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద రూ.27 లక్షల కోట్లు పెరిగింది. ఒక్కో ట్రేడింగ్ సెషన్ పరంగా చూస్తే రూ.11,000 కోట్లు వృద్ధి చెందింది. విదేశీ నిధులు వెల్లువెత్తడంతో షేర్ల ధరలు దూసుకుపోయాయి. దీంతో కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్, ఇన్వెస్టర్ల సంపద పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో 240 ట్రేడింగ్ సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.27.34 లక్షల కోట్లు పెరిగి గత నెల 31 నాటికి రూ.101.49 లక్షల కోట్లకు చేరింది. సుస్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడం, ద్రవ్యోల్బణం తగ్గుతుండడం వంటి కారణాల వల్ల స్టాక్ మార్కెట్ భారీ వృద్ధి సాధించిందని నిపుణులంటున్నారు. -
మద్దతు 20, 625-నిరోధం 20,971
మార్కెట్ పంచాంగం ఓల్డ్ ఎకానమీ రంగాలకు చెందిన షేర్లు క్షీణిస్తూ, ఐటీ, ఫార్మా షేర్లే పెరుగుతూ వుంటే స్టాక్ సూచీలు గరిష్టస్థాయిలో స్థిరపడటం కష్టమేనంటూ గత కాలమ్‌లో ప్రస్తావించినట్లే కొత్త ఏడాదిలో ఏ రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు పైస్థాయిలో నిలదొక్కుకోలేకపోయాయి. ఇన్ఫోసిస్ ఫలితాలు వెల్లడించిన శుక్రవారం ఈ ట్రెండ్ మరింత స్పష్టంగా కన్పించింది. నెలరోజుల క్రితం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన ర్యాలీలో పాలుపంచుకున్న ఇన్ఫ్రా, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, పీఎస్‌యూ, బ్యాంకింగ్ రంగాల షేర్లు క్రమేపీ క్షీణిస్తున్నాయి. ఆ సమయంలో సెలైంట్‌గా వున్న ఐటీ, ఫార్మా రంగాల షేర్లు మూడు వారాల నుంచి నెమ్మదిగా పెరుగుతూ కొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. పైగా విదేశీ ఇన్వెస్టర్లు గతవారం రెండు రోజులపాటు నికర అమ్మకాలు కూడా జరిపారు. అంటే...వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత సుస్థిర ప్రభుత్వం వచ్చి, ఆర్థిక వ్యవస్థ టర్న్ ఎరౌండ్ కావొచ్చన్న అంచనాలు నెమ్మదిగా ఆవిరవుతున్నట్లు కన్పిస్తున్నది. అమెరికా, యూరప్‌ల ఆర్థిక వ్యవస్థల మీద ఆధారపడి, ఆదాయ, లాభాల వృద్ధిని సాధిస్తున్న ఐటీ, ఫార్మా రంగాల మీదే మళ్లీ దృష్టిపెట్టినట్లు తాజా ట్రెండ్ వెల్లడిస్తోంది. ఈ రంగాలకు తోడు ఎఫ్ఎంసీజీ కూడా తోడైతే వచ్చే కొద్దినెలల పాటు గత మూడేళ్లలానే మార్కెట్ ర్యాలీ కొద్ది షేర్లకే పరిమితం కావొచ్చు. ఇక స్వల్పకాలిక సాంకేతికాంశాలకొస్తే.... సెన్సెక్స్‌పై సాంకేతిక అంచనాలు జనవరి 10తో ముగిసినవారంలో 20,971-20,625 పాయింట్ల మధ్య 350 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 93 పాయింట్ల నష్టంతో 20,758 వద్ద ముగిసింది. గతవారం సెన్సెక్స్ గరిష్ట, కనిష్ట స్థాయిలు రెండూ చివరి ట్రేడింగ్ రోజునే నమోదయ్యాయి. ఈ వారం సెన్సెక్స్‌కు ఆ రెండు స్థాయిలే తక్షణ నిరోధ, మద్దతు స్థాయిలు. వచ్చే మంగళవారం ద్రవ్యోల్బణం డేటా విడుదల సందర్భంగా 20,971 స్థాయిపైన ముగిస్తే తొలుత 21,240 స్థాయికి చేరవచ్చు. ఆపైన మరోదఫా 21,330 స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఛేదిస్తే వేగంగా 21,500-21,600 శ్రేణిని చేరవచ్చు. ఈ వారం 20,625 మద్దతు స్థాయిని కోల్పోతే 20,400-20,500 మద్దతుశ్రేణి వద్దకు తగ్గవచ్చు. ఈ శ్రేణిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో వదులుకుంటే 20,090 పాయింట్ల స్థాయికి పతనమయ్యే అవకాశాలు వుంటాయి. సెన్సెక్స్‌కు 150 రోజుల చలన సగటు (150 డీఎంఏ) రేఖ 19,950 వద్ద, 200 డీఎంఏ రేఖ 19,809 పాయింట్ల సమీపంలోనూ కదులుతున్నందున, రానున్న వారాల్లో ఈ స్థాయిలు రెండూ మధ్యకాలిక ట్రెండ్‌కు కీలకం. నిఫ్టీ మద్దతు శ్రేణి 6,130-6,170 గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 6,130-6,170 పాయింట్ల మద్దతుశ్రేణిలోనే వరుసగా ఐదు రోజులపాటు నిఫ్టీ మద్దతు పొందింది. కానీ 6,239 స్థాయిని మించి పెరగలేకపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 40 పారుుంట్ల నష్టంతో 6,171 పాయింట్ల వద్ద ముగిసింది. వచ్చేవారం సైతం పైన సూచించిన మద్దతు శ్రేణే నిఫ్టీకి కీలకం. ఈ మద్దతును అధిక ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతేనే మార్కెట్ మరింత క్షీణించే ప్రమాదం వుంటుంది. 6,130 పాయింట్ల స్థాయి దిగువన ముగిస్తే తదుపరి మద్దతు స్థాయిలు 6,040, 5,940, 5,925. ఈ చివరి మద్దతు స్థాయివద్దే నిఫ్టీ 200 డీఎంఏ రేఖ కదులుతున్నది. మార్కెట్ మధ్యకాలిక ట్రెండ్‌కు ఈ స్థాయి ముఖ్యమైనది. ఈ వారం కూడా తొలి మద్దతు శ్రేణిని పరిరక్షించుకోగలిగితే 6,264-6,288 పాయింట్ల నిరోధ శ్రేణి వద్దకు పెరగవచ్చు. ఈ శ్రేణిపైన ముగిస్తే క్రమేపీ 6,358 వద్దకు చేరవచ్చు. ఆపైన స్థిరపడితే 6,415 స్థాయికి ర్యాలీ జరపవచ్చు. - పి. సత్యప్రసాద్ -
మదుపర్లకు తీపి‘మాత్ర’!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రానికి చెందిన ఫార్మా షేర్లు ఇన్వెస్టర్లకు సిరుల వర్షం కురిపించాయి. గడచిన నాలుగేళ్ళలో స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు గురైనప్పటికీ రాష్ట్రానికి చెందిన దాదాపు అన్ని ఫార్మా కంపెనీలు ఇండెక్స్‌లను మించి లాభాలను అందించాయి. ఈ సమయంలో కొన్ని కంపెనీల షేర్లు 12 నుంచి 19 రెట్లకు పైగా పెరిగాయి. అత్యధిక లాభాలను అందించిన షేర్లలో నాట్కో ఫార్మా అన్నిటికన్నా ముందుంది. 2008లో రూ.38 కనిష్ట స్థాయి నుంచి ఆగకుండా పెరుగుతూ ఇప్పుడు రూ.774 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే కనిష్ట స్థాయి నుంచి ఈ షేరు 19.36 రెట్లు పెరిగింది. ఆ తర్వాత అరబిందో ఫార్మా 12.43 రెట్లు, సువెన్ లైఫ్ 6.76 రెట్లు, డాక్టర్ రెడ్డీస్ 5.79 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 2008 గరిష్ట స్థాయి వద్ద కదులుతుంటే రాష్ట్రానికి చెందిన ఫార్మా కంపెనీల షేర్లు 2008 స్థాయికి అందనంత ఎత్తులో ట్రేడవుతున్నాయి. ఉదాహరణకు 2008లో మార్కెట్ పతనం కాకముందు రూ.700 (1:1 బోనస్ తర్వాత)గా ఉన్న డాక్టర్ రెడ్డీస్ షేరు ఇప్పుడు రూ.2,500 స్థాయికి చేరింది. కలిసొచ్చిన అంశాలనేకం ఈ నాలుగేళ్లలో ఫార్మా షేర్ల దూకుడుకు అనేక అంశాలు కలిసొచ్చాయంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. సాధారణంగా మార్కెట్లు పడుతున్నప్పుడు ఇన్వెస్టర్లు డిఫెన్సివ్ సెక్టార్లయిన ఫార్మా, ఎఫ్ఎంసీజీలకేసి చూస్తారని, అయితే ఇదే సమయంలో రూపాయి పతనం ఈ రంగానికి మరింత కలిసొచ్చిందంటున్నారు. గత నాలుగేళ్లుగా దేశీయ ఫార్మా కంపెనీల ఆదాయాల్లో సగటున 20 శాతానికిపైగా వృద్ధి నమోదయ్యింది. అంతే కాకుండా మన ఫార్మా కంపెనీలు విదేశీ వ్యాపారంపై అధికంగా దృష్టిసారించడం, అనేక పేటెంట్ కేసుల్లో విజయం సాధించాయి. ఈ నాలుగేళ్ళలో నాట్కో ఫార్మా సాధించిన విజయాలే ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించేటట్లు చేసిందంటున్నారు మార్కెట్ నిపుణులు ఈ నాలుగేళ్లలో నాట్కో ఫార్మా రిజాట్రిప్టాన్ బెంజోయేట్ తదితర ఔషధాలను ప్రవేశపెట్టడం, స్లెరోసిస్ చికిత్సలో ఉపయోగపడే కొపాగ్జోన్ ఔషధం పేటెంటు వివాదంలో టెవా ఫార్మాపై విజయం, క్యాన్సర్ ఔషధం నెక్సావర్ జనరిక్ వెర్షన్ విషయంలో కంపల్సరీ లెసైన్సు దక్కించుకోవడం వంటి అంశాలు షేరు పెరుగుదలకు కారణమయ్యయి. ఇక డాక్టర్ రెడ్డీస్ విషయానికి వస్తే ఈ కాలంలో అధిక మార్జిన్లు ఉన్న కొత్త ఔషధాలను ప్రవేశపెట్టడం కలిసొచ్చింది. డోన్పెజిల్, డివాల్‌ప్రొయెక్స్ ఈఆర్ వంటి ఔషధాల్లో ఏకైక జనరిక్ సంస్థగా నిలబడటమే కాకుండా పోటీ తక్కువగా ఉండి మార్జిన్లు అధికంగా ఉండే ఔషధాలపై సంస్థ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. దీంతో ఈ షేరు ధర కొత్త రికార్డులను సృష్టిస్తోంది. చిన్న ఫార్మా షేర్లే ముద్దు ఇప్పటికే ఫార్మా షేర్లు బాగా పెరగడంతో వచ్చే రోజుల్లో కూడా ఇదే స్థాయి లాభాలను ఆశించడం కష్టమేనని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడి స్టాక్ మార్కెట్లలో ర్యాలీ మొదలైతే డిఫెన్సివ్ సెక్టార్ అయిన ఫార్మా నుంచి ఇన్వెస్టర్లు వైదొలగుతారని, కానీ ఇప్పటికీ కొన్ని చిన్న ఫార్మా షేర్లు ఆకర్షణీయంగా ఉన్నాయంటున్నారు. రూపాయి విలువ క్షీణత, ఎగుమతులు వంటి అంశాలు ఫార్మా కంపెనీలకు కలిసొచ్చే అంశాలు కావడంతో ఈ రంగంలో పెట్టుబడులను కొనసాగించనున్నట్లు ఇండియా ఇన్ఫోలైన్ తెలిపింది. ఈ సమయంలో పెద్ద ఫార్మా షేర్లలో కంటే చిన్న వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం బెటరని, ఎంపిక చేసిన చిన్న ఫార్మా కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించమని జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి సూచిస్తున్నారు. -
ఐటీ, ఫార్మా షేర్లు బెటర్: అశ్వనీ గుజ్రాల్
ట్రేడర్లు జాగరూకతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని అశ్వనీ గుజ్రాల్ డాట్ కామ్ ఫండ్ మేనేజర్ అశ్వనీ గుజ్రాల్ అభిప్రాయపడ్డారు. కొనుగోళ్లకు అవకాశమున్న స్థాయిలో మార్కెట్లు ఉన్నప్పటికీ, ట్రేడర్లు రక్షణాత్మక విధానాలను అవలంబించాలని సూచించారు. రూపాయి బలహీనత వల్ల ప్రయోజనం పొందే ఐటీ, ఫార్మా వంటి ఎగుమతుల ఆధారిత పరిశ్రమల షేర్లను ఎంచుకోవడం వల్ల ఫలితం ఉంటుందన్నారు. సమీప కాలంలో ఇబ్బందే: రాయ్‌చౌధురి రానున్న నెల లేదా ఒక త్రైమాసికం వరకూ భారత్ మార్కెట్ల పనితీరు బాగుండే అవకాశం లేదని పీఎన్బీ పారిబా సెక్యూరిటీస్ ఎండీ మనీష్ రాయ్‌చౌధురి తాజా మార్కెట్ల పతనంపై అభిప్రాయపడ్డారు. భయంతో వైదొలగవద్దు నిఫ్టీకి 5,500-5,525 స్థాయిలో మద్దతు ఉందని అంబరీష్ బాలిగ (ఎడిల్వీస్), జిగ్నేష్ మల్కానీ (బీఎస్ఈ అండ్ ఎన్ఎస్ఈ సభ్యుడు) అమిత్ దలాల్ (టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్) వంటి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్థాయిలో ఉన్న మార్కెట్ నుంచి భయంతో వైదొలగవద్దని వారు ఇన్వెస్టర్లకు సలహాఇస్తున్నారు.