మూడోరోజూ లాభాల్లోనే...
ఫార్మా షేర్ల జోరు... ∙స్వల్పంగా పెరిగిన సెన్సెక్స్, నిఫ్టీ ∙సుప్రీం వివరణతో లిక్కర్ షేర్ల రయ్
ముంబై: అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు వెలువడినప్పటికీ... దేశీ స్టాక్ సూచీలు మాత్రం లాభాల హ్యాట్రిక్‌ను నమోదుచేశాయి. ప్రధానంగా దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా మూడోరోజూ లాభాల్లో ముగిశాయి. గురువారం ట్రేడింగ్‌లో సూచీలు ఆద్యంతం పరిమిత శ్రేణిలోనే కదలాడాయి. చివరకు సెన్సెక్స్ 28 పాయింట్ల పెరుగుదలతో 31,596 పాయింట్ల వద్ద, నిఫ్టీ 4 పాయింట్లు లాభపడి 9,857 వద్ద ముగిశాయి. గడిచిన రెండు రోజుల్లో సెన్సెక్స్ 309 పాయింట్లు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రాథమిక సమాచారం ప్రకారం దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) నికరంగా రూ.1,044 కోట్ల మేర కొనుగోళ్లు జరపగా... విదేశీ మదుపరులు(ఎఫ్‌పీఐ) రూ.696 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.
అమెరికాలో పరిణామాలపై దృష్టి...
మెక్సికో సరిహద్దు వెంబడి గోడను నిర్మించేందుకు తగిన నిధులను కేటాయించేందుకు అవసరమైతే ప్రభుత్వ కార్యకలాపాల నిలిపివేతకు (షట్‌డౌన్) కూడా వెనుకాడబోనని అమెరికా అధ్యక్షుడు చేసిన హెచ్చరికతో ముందురోజు వాల్‌స్ట్రీట్ నష్టాల్లో ముగిసింది. దీని ప్రభావంతో ఆసియాలో కూడా ప్రధాన సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి. మరోపక్క, ప్రపంచంలోని కీలక సెంట్రల్ బ్యాంకర్ల సదస్సు గురువారం అమెరికాలోని జాక్సన్‌హోల్‌లో ప్రారంభం కానున్న నేపథ్యంలో విధానపరంగా ఎలాంటి ప్రకటనలు ఉండొచ్చన్న దానిపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టి సారించినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటెజిస్ట్ ఆనంద్ జేమ్స్ పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల అప్రమత్త ధోరణి కారణంగానే మన మార్కెట్లు కూడా పరిమిత శ్రేణిలో(రేంజ్ బౌండ్)లో కదలాడాయని చెప్పారు. ఇక వినాయక చవితి సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు కావడంతో ట్రేడింగ్ వరుసగా మూడు రోజులు ట్రేడింగ్‌కు విరామం రావడంకూడా ఇన్వెస్టర్ల అప్రమత్త ధోరణికి ఒక కారణమని ఆయన తెలిపారు.
ఫార్మా రయ్...
ఇటీవల కాలంలో భారీగా పడిన ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లకు దిగువస్థాయిల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో దూసుకెళ్లాయి. ఈ రంగం సూచీ 2.53 శాతం ఎగసింది. సెన్సెక్స్ జాబితా ఉన్నవాటిలో లుపిన్ అత్యధికంగా 3.87 శాతం లాభపడగా, సన్ ఫార్మా 3.1 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2.88 శాతం, సిప్లా 2.47 శాతం చొప్పున ఎగబాకాయి. జైడస్ క్యాడిలాకు చెందిన యాంటీ హైపర్‌టెన్షన్ ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి లభించిన వార్తలతో క్యాడిలా హెల్త్‌కేర్ షేరు 7 శాతం రివ్వుమంది. దీంతోపాటు ఐటీ, టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్ సూచీలు కూడా లాభాల్లో నిలిచాయి. నందన్ నీలేకని ఇన్ఫీ చైర్మన్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నారన్న వార్తలతో ఇన్ఫోసిస్ 2 శాతం ఎగసి రూ.913 వద్ద స్థిరపడింది. ఇంకా లాభపడిన షేర్లలో టాటామోటార్స్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, ఎల్‌అండ్‌టీ, పవర్‌గ్రిడ్ ఉన్నాయి. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీ నాల ప్రక్రియ వేగవంతం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముందుజోరు ర్యాలీ జరిపిన బ్యాంకింగ్ షేర్లలో గురువారం మళ్లీ నిస్తేజం ఆవహించింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు స్వల్పంగా పెరగ్గా.. ప్రైవేటు బ్యాంకుల్లో చాలావరకూ మిశ్రమంగా ముగిశాయి.
లిక్కర్ షేర్లకు ‘సుప్రీం’ కిక్...
జాతీయ రహదారుల పక్కన లిక్కర్ షాపులపై విధించిన నిషేధం నగరాలు, మునిసిపాలిటీల పరిధిలోని వాటికి వర్తించబోదని సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వడంతో లిక్కర్ కంపెనీల షేర్లకు జోష్ లభించింది. యునైటెడ్ స్పిరిట్స్, తిలక్‌నగర్ ఇండస్ట్రీస్, గ్లోబస్ స్పిరిట్స్, జీఎం బ్రూవరీస్ తదితర షేర్లు 12 శాతం వరకూ దూసుకెళ్లాయి.
నేడు మార్కెట్లకు సెలవు...
వినాయకచవితి సందర్భంగా నేడు (శుక్రవారం) స్టాక్ మార్కెట్లతోపాటు బులియన్, ఫారెక్స్, ఇతర కమోడిటీ మార్కెట్లన్నింటికీ సెలవు ప్రకటించారు.