ఫార్మా షేర్లతో మార్కెట్ జోరు
♦ 128 పాయింట్ల లాభంతో 27,916కు సెన్సెక్స్
♦ 37 పాయింట్ల లాభంతో 8,566కు నిఫ్టీ
ఫార్మా షేర్ల జోరుకు, యూరప్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం కావడం కూడా తోడవడంతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. వరుసగా రెండో రోజు కూడా మార్కెట్లు లాభపడి... బీఎస్‌ఈ సెన్సెక్స్ 128 పాయింట్లు ప్లస్‌తో 27,916 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 8,566 పాయింట్ల వద్ద ముగిశాయి. నిఫ్టీ 11 నెలల గరిష్ట స్థాయిలో ముగిసింది.
తక్కువ ధరల్లో బ్లూ చిప్ షేర్లు: వర్షాలు బాగా కురుస్తుండడంతో వ్యవసాయోత్పత్తి పెరుగుతుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతుందని, జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందుతుందనే అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. అయితే భారత వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) స్వల్పంగా తగ్గించడం ఒకింత ప్రతికూల ప్రభావం చూపించింది. కంపెనీలు మంచి ఫలితాలనే ఇస్తాయని అంచనాలుండటం, జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందుతుందన్న అంచనాల వల్ల మార్కెట్‌కు లాభాలు వచ్చాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
సిమెంట్ షేర్లకు లాభాలు: మూడు భారత ఫార్మా కంపెనీలు-సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, గ్లెన్ మార్క్ ఫార్మాలకు కొవ్వు నియంత్రణ సంబంధిత జనరిక్ ఔషధాలను అమెరికాలో విక్రయించడానికి అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది. దీంతో ఫార్మా షేర్లు దూసుకుపోయాయి. సన్ ఫార్మా, గ్లెన్‌మార్క్ ఫార్మా, అరబిందో ఫార్మా కంపెనీలు 2-5 శాతం రేంజ్‌లో పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో సిమెంట్ కంపెనీలు మంచి ఫలితాలనే ప్రకటిస్తాయన్న అంచనాలతో సిమెంట్ రంగ షేర్లు లాభపడ్డాయి. డెక్కన్ సిమెంట్స్, హెడెల్‌బెర్గ్ సిమెంట్ ఇండియా, ఇండియా సిమెంట్స్, సాగర్ సిమెంట్స్ ఏసీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు 1-8 శాతం రేంజ్‌లో పెరిగాయి. ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఐటీ కంపెనీ విప్రో షేర్ 2 శాతం పతనమైంది.