మార్కెట్ పంచాంగం
ఓల్డ్ ఎకానమీ రంగాలకు చెందిన షేర్లు క్షీణిస్తూ, ఐటీ, ఫార్మా షేర్లే పెరుగుతూ వుంటే స్టాక్ సూచీలు గరిష్టస్థాయిలో స్థిరపడటం కష్టమేనంటూ గత కాలమ్‌లో ప్రస్తావించినట్లే కొత్త ఏడాదిలో ఏ రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు పైస్థాయిలో నిలదొక్కుకోలేకపోయాయి. ఇన్ఫోసిస్ ఫలితాలు వెల్లడించిన శుక్రవారం ఈ ట్రెండ్ మరింత స్పష్టంగా కన్పించింది. నెలరోజుల క్రితం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన ర్యాలీలో పాలుపంచుకున్న ఇన్‌ఫ్రా, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, పీఎస్‌యూ, బ్యాంకింగ్ రంగాల షేర్లు క్రమేపీ క్షీణిస్తున్నాయి. ఆ సమయంలో సెలైంట్‌గా వున్న ఐటీ, ఫార్మా రంగాల షేర్లు మూడు వారాల నుంచి నెమ్మదిగా పెరుగుతూ కొత్త రికార్డుల్ని సృష్టిస్తున్నాయి. పైగా విదేశీ ఇన్వెస్టర్లు గతవారం రెండు రోజులపాటు నికర అమ్మకాలు కూడా జరిపారు. అంటే...వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత సుస్థిర ప్రభుత్వం వచ్చి, ఆర్థిక వ్యవస్థ టర్న్ ఎరౌండ్ కావొచ్చన్న అంచనాలు నెమ్మదిగా ఆవిరవుతున్నట్లు కన్పిస్తున్నది. అమెరికా, యూరప్‌ల ఆర్థిక వ్యవస్థల మీద ఆధారపడి, ఆదాయ, లాభాల వృద్ధిని సాధిస్తున్న ఐటీ, ఫార్మా రంగాల మీదే మళ్లీ దృష్టిపెట్టినట్లు తాజా ట్రెండ్ వెల్లడిస్తోంది. ఈ రంగాలకు తోడు ఎఫ్‌ఎంసీజీ కూడా తోడైతే వచ్చే కొద్దినెలల పాటు గత మూడేళ్లలానే మార్కెట్ ర్యాలీ కొద్ది షేర్లకే పరిమితం కావొచ్చు. ఇక స్వల్పకాలిక సాంకేతికాంశాలకొస్తే....
సెన్సెక్స్‌పై సాంకేతిక అంచనాలు
జనవరి 10తో ముగిసినవారంలో 20,971-20,625 పాయింట్ల మధ్య 350 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 93 పాయింట్ల నష్టంతో 20,758 వద్ద ముగిసింది. గతవారం సెన్సెక్స్ గరిష్ట, కనిష్ట స్థాయిలు రెండూ చివరి ట్రేడింగ్ రోజునే నమోదయ్యాయి. ఈ వారం సెన్సెక్స్‌కు ఆ రెండు స్థాయిలే తక్షణ నిరోధ, మద్దతు స్థాయిలు. వచ్చే మంగళవారం ద్రవ్యోల్బణం డేటా విడుదల సందర్భంగా 20,971 స్థాయిపైన ముగిస్తే తొలుత 21,240 స్థాయికి చేరవచ్చు. ఆపైన మరోదఫా 21,330 స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో ఛేదిస్తే వేగంగా 21,500-21,600 శ్రేణిని చేరవచ్చు. ఈ వారం 20,625 మద్దతు స్థాయిని కోల్పోతే 20,400-20,500 మద్దతుశ్రేణి వద్దకు తగ్గవచ్చు. ఈ శ్రేణిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో వదులుకుంటే 20,090 పాయింట్ల స్థాయికి పతనమయ్యే అవకాశాలు వుంటాయి. సెన్సెక్స్‌కు 150 రోజుల చలన సగటు (150 డీఎంఏ) రేఖ 19,950 వద్ద, 200 డీఎంఏ రేఖ 19,809 పాయింట్ల సమీపంలోనూ కదులుతున్నందున, రానున్న వారాల్లో ఈ స్థాయిలు రెండూ మధ్యకాలిక ట్రెండ్‌కు కీలకం.
నిఫ్టీ మద్దతు శ్రేణి 6,130-6,170
గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 6,130-6,170 పాయింట్ల మద్దతుశ్రేణిలోనే వరుసగా ఐదు రోజులపాటు నిఫ్టీ మద్దతు పొందింది. కానీ 6,239 స్థాయిని మించి పెరగలేకపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 40 పారుుంట్ల నష్టంతో 6,171 పాయింట్ల వద్ద ముగిసింది. వచ్చేవారం సైతం పైన సూచించిన మద్దతు శ్రేణే నిఫ్టీకి కీలకం. ఈ మద్దతును అధిక ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతేనే మార్కెట్ మరింత క్షీణించే ప్రమాదం వుంటుంది. 6,130 పాయింట్ల స్థాయి దిగువన ముగిస్తే తదుపరి మద్దతు స్థాయిలు 6,040, 5,940, 5,925. ఈ చివరి మద్దతు స్థాయివద్దే నిఫ్టీ 200 డీఎంఏ రేఖ కదులుతున్నది. మార్కెట్ మధ్యకాలిక ట్రెండ్‌కు ఈ స్థాయి ముఖ్యమైనది. ఈ వారం కూడా తొలి మద్దతు శ్రేణిని పరిరక్షించుకోగలిగితే 6,264-6,288 పాయింట్ల నిరోధ శ్రేణి వద్దకు పెరగవచ్చు. ఈ శ్రేణిపైన ముగిస్తే క్రమేపీ 6,358 వద్దకు చేరవచ్చు. ఆపైన స్థిరపడితే 6,415 స్థాయికి ర్యాలీ జరపవచ్చు.
- పి. సత్యప్రసాద్