సెన్సెక్స్ సెంచరీ..
- ఫార్మా, ఐటీ షేర్ల దన్నుతో లాభాలు
- కలసివచ్చిన షాంఘై రికవరీ
- 100 పాయింట్ల ప్లస్‌తో 27,932కు సెన్సెక్స్
గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో క్షీణిస్తూ వస్తున్న రూపాయి కారణంగా ఐటీ, ఫార్మా షేర్లు లాభపడ్డాయి. దీంతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. విదేశీ నిధుల ఉపసంహరణను నిరోధించడానికి, యువాన్ విలువ తగ్గింపు కారణంగా లిక్విడిటీతో ఇబ్బందులు పడుతున్న బ్యాంకులకు మరి న్ని నిధులు ఇవ్వనున్నామని చైనా ప్రభుత్వం ప్రకటించడంతో 5 శాతం వరకూ నష్టపోయిన చైనా షాంఘై సూచీ చివరకు 1 శాతం లాభపడింది. దీంతో వరుసగా రెండు రోజుల మన స్టాక్ మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది.
బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంతో 27,932 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 29 పాయింట్లు లాభపడి 8,495 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ మినిట్స్ బుధవారం అర్థరాత్రి వెలువడుతుండటంతో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు. గత 4 ట్రేడింగ్ సెషన్లలో 20% వరకూ ఎగసిన బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా సెన్సెక్స్ 28 వేల పాయింట్లు, నిఫ్టీ 8,500 పాయింట్ల దిగువనే ముగిశాయి.