గణాంకాల జోష్‌తో...
వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లోనూ అప్
- 161 లాభంతో 26,587 పాయింట్లకు సెన్సెక్స్
- 30 పాయింట్ల లాభంతో.. 8,014కు నిఫ్టీ
ఏప్రిల్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండడం, మేలో ద్రవ్యోల్బణం నిలకడగా ఉండటంతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. వాహన, ఆరోగ్య సంరక్షణ షేర్ల దన్నుతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 161 పాయింట్ల లాభంతో 26,587 పాయింట్ల వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 8.014 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇటీవల బాగా క్షీణించిన షేర్లలో కొనుగోళ్లు జరగడం, ఇప్పటిదాకా కురిసిన వర్షాల సగటు సాధారణ పరిమితి కంటే 5 శాతం అధికమని వాతావారణ విభాగం వెల్లడించడం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. గ్రీస్ రుణ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉన్నా శుక్రవారానికి కొనసాగింపుగా మన స్టాక్ మార్కెట్ మాత్రం లాభాలు పంచింది. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, వాహన షేర్లతో పాటు కొన్ని ప్రైవేట్ బ్యాంకుల, ఆర్థిక సేవల కంపెనీలు షేర్లు పెరిగాయి.
రిలీఫ్ ర్యాలీ: ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాల కారణంగా స్టాక్ మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుందని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు. దక్షిణాదిన సకాలంలో వచ్చిన రుతుపవనాలు స్టాక్ మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయన్నారు.
లాభ నష్టాల్లో...
30 సెన్సెక్స్ షేర్లలో 17 షేర్లు లాభపడ్డాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,353 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.11,654 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ. 2,12,556 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.605 కోట్ల నికర అమ్మకాలు జరపగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.650 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. 1,440 షేర్లు లాభాల్లో, 1,207 షేర్లు నష్టాల్లో ముగిశాయి.