రూపాయి 28 పైసలు డౌన్
ముంబై: గత మూడు ట్రేడింగ్ సెషన్ల రూపాయి లాభాలకు సోమవారం బ్రేక్ పడింది. డాలర్‌తో రూపాయి మారకం 28 పైసలు క్షీణించి 64.56 వద్ద ముగిసింది. మూడు నెలల కాలంలో రూపాయి ఒక్క రోజులో ఈ స్థాయిలో క్షీణించడం ఇదే మొదటిసారి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచుతుందనే అంచనాలు, సిరియాపై అమెరికా క్షిపణుల దాడి నేపథ్యంలో భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగడంతో అంతర్జాతీయ కరెన్సీ అయిన డాలర్... విదేశాల్లో బలపడింది.
దీంతో మన దేశంలో కూడా డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయికి నష్టాలొచ్చాయి. ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, మార్చి నెల ద్రవ్యల్బోణ గణాంకాలు రేపు(బుధవారం) వెలువడనుండడంతో రూపాయిపై ఒత్తిడి పెరిగిందని విశ్లేషణ. రోజంతా నష్టాలే..: డాలర్‌తో రూపాయి మారకం శుక్రవారం నాటి ముగింపు(64.28)తో పోల్చితే 64.30 వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయి మరింతగా నష్టపోయింది. రోజంతా నష్టాల్లోనే ట్రేడయింది. ఇంట్రాడేలో 64.58 కనిష్ట స్థాయిని తాకిన రూపాయి చివరకు 28 పైసల నష్టంతో 64.56 వద్ద ముగిసింది.