Trading sessions
-
రూపాయి 28 పైసలు డౌన్
ముంబై: గత మూడు ట్రేడింగ్ సెషన్ల రూపాయి లాభాలకు సోమవారం బ్రేక్ పడింది. డాలర్‌తో రూపాయి మారకం 28 పైసలు క్షీణించి 64.56 వద్ద ముగిసింది. మూడు నెలల కాలంలో రూపాయి ఒక్క రోజులో ఈ స్థాయిలో క్షీణించడం ఇదే మొదటిసారి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచుతుందనే అంచనాలు, సిరియాపై అమెరికా క్షిపణుల దాడి నేపథ్యంలో భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగడంతో అంతర్జాతీయ కరెన్సీ అయిన డాలర్... విదేశాల్లో బలపడింది. దీంతో మన దేశంలో కూడా డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయికి నష్టాలొచ్చాయి. ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు, మార్చి నెల ద్రవ్యల్బోణ గణాంకాలు రేపు(బుధవారం) వెలువడనుండడంతో రూపాయిపై ఒత్తిడి పెరిగిందని విశ్లేషణ. రోజంతా నష్టాలే..: డాలర్‌తో రూపాయి మారకం శుక్రవారం నాటి ముగింపు(64.28)తో పోల్చితే 64.30 వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. డాలర్లకు డిమాండ్ పెరగడంతో రూపాయి మరింతగా నష్టపోయింది. రోజంతా నష్టాల్లోనే ట్రేడయింది. ఇంట్రాడేలో 64.58 కనిష్ట స్థాయిని తాకిన రూపాయి చివరకు 28 పైసల నష్టంతో 64.56 వద్ద ముగిసింది. -
కొనసాగుతున్న చైనా భయాలు
- 318 నష్టంతో 25,715కు సెన్సెక్స్ - 89 పాయింట్లు క్షీణించి 7,792కు నిఫ్టీ చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు కొనసాగుతుండటంతో బుధవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఇది నాలుగో పతనం. స్టాక్‌మార్కెట్‌ను గట్టెక్కించడానికి చైనా కేంద్ర బ్యాంక్ (పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా(పీబీఓసీ) మంగళవారం వడ్డీరేట్లు తగ్గించింది, తాజాగా 2,200 కోట్ల డాలర్లు నిధులను మార్కెట్లోకి తేనున్నామని ప్రకటించింది. ట్రేడింగ్ చివరి గంటలో ఈ వార్త తెలిసినప్పటికీ, స్టాక్ మార్కెట్ పతనం ఆగలేదు. సెన్సెక్స్ దాదాపు ఏడాది కనిష్ట స్థాయికి, నిఫ్టీ కీలకమైన 7,800 పాయింట్ల దిగువకు పడిపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం క్షీణించడం, ఆగస్టు డెరివేటివ్స్ కాంట్రాక్ట్‌లు నేడు(గురువారం) ముగియనున్న నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 318 పాయింట్లు నష్టపోయి 25,715 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 89 పాయింట్ల నష్టంతో 7,792 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఆయిల్, గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు పతనమయ్యాయి. లాభ నష్టాలు ఇలా... 30 సెన్సెక్స్ షేర్లలో 18 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 1,345 షేర్లు నష్టాల్లో, 1,321 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,134 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.20,032 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.4,45,445 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,346 కోట్ల నికర అమ్మకాలు, దేశీ ఇన్వెస్టర్లు రూ.1,881 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. చైనా స్టాక్ మార్కెట్ వరుసగా 5 రోజూ పతనమైంది. నికాయ్, కొరియా సూచీలు మినహా మిగిలిన అన్ని ఆసియా దేశాల మార్కెట్లు, అలాగే యూరప్ మార్కెట్లు నష్టపోయాయి. జూలైలో డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్లు అంచనాలు మించి ఉన్నాయన్న గణాంకాల దన్నుతో అమెరికా మార్కెట్లు కడపటి సమాచారం అందే సరికి లాభాల్లో ట్రేడవుతున్నాయి. మూడో వంతు నష్టం ఈ మూడు షేర్లదే గత వారం రోజుల్లో సెన్సెక్స్ 2,200 పాయింట్లకు పైగా పతనమైంది. ఈ పతనంలో హెచ్డీఎఫ్సీ, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్.. ఈ మూడు షేర్ల వాటా 33 శాతం(721 పాయింట్లు)గా ఉంది. సెన్సెక్స్ పతనంలో ఒక్కొక్క షేర్ల పరంగా చూస్తే హెచ్డీఎఫ్సీ 277 పాయింట్లు, ఇన్ఫోసిస్ 241 పాయింట్లు, ఎల్ అండ్ టీ 204 పాయింట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ 186 పాయింట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ 168 పాయింట్లుగా ఉన్నాయి. -
సెన్సెక్స్ సెంచరీ..
- ఫార్మా, ఐటీ షేర్ల దన్నుతో లాభాలు - కలసివచ్చిన షాంఘై రికవరీ - 100 పాయింట్ల ప్లస్‌తో 27,932కు సెన్సెక్స్ గత కొన్ని ట్రేడింగ్ సెషన్లలో క్షీణిస్తూ వస్తున్న రూపాయి కారణంగా ఐటీ, ఫార్మా షేర్లు లాభపడ్డాయి. దీంతో బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. విదేశీ నిధుల ఉపసంహరణను నిరోధించడానికి, యువాన్ విలువ తగ్గింపు కారణంగా లిక్విడిటీతో ఇబ్బందులు పడుతున్న బ్యాంకులకు మరి న్ని నిధులు ఇవ్వనున్నామని చైనా ప్రభుత్వం ప్రకటించడంతో 5 శాతం వరకూ నష్టపోయిన చైనా షాంఘై సూచీ చివరకు 1 శాతం లాభపడింది. దీంతో వరుసగా రెండు రోజుల మన స్టాక్ మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది. బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 100 పాయింట్ల లాభంతో 27,932 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 29 పాయింట్లు లాభపడి 8,495 పాయింట్ల వద్ద ముగిశాయి. అయితే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ మినిట్స్ బుధవారం అర్థరాత్రి వెలువడుతుండటంతో ఇన్వెస్టర్లు ఆచి, తూచి వ్యవహరించారు. గత 4 ట్రేడింగ్ సెషన్లలో 20% వరకూ ఎగసిన బ్యాంక్ షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా సెన్సెక్స్ 28 వేల పాయింట్లు, నిఫ్టీ 8,500 పాయింట్ల దిగువనే ముగిశాయి. -
4 రోజుల లాభాలకు బ్రేక్
- నిరాశ పరిచిన ఆర్బీఐ పాలసీ - లాభాల స్వీకరణతో నష్టాలు - 115 పాయింట్ల నష్టంతో 28,072కు సెన్సెక్స్ - 26 పాయింట్ల నష్టంతో 8,517కు నిఫ్టీ భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లను యథాతథంగా కొనసాగించడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాలపాలయ్యింది. దీంతో వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్ల స్టాక్ మార్కెట్ లాభాలకు బ్రేక్ పడింది. మార్కెట్‌ను నిరాశకు గురిచేసిన ఆర్బీఐ పాలసీ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 28,072 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 26 పాయింట్ల నష్టంతో 8,517 పాయింట్ల వద్ద ముగిశాయి. నైరుతీ రుతు పవనాల వల్ల ఆగస్టు,సెప్టెంబర్ నెలల్లో సాధారణం కంటే తక్కువ స్థాయిల్లోనే వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడం ప్రతికూల ప్రభావం చూపించింది. అయితే కొన్ని బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు, రూపాయి 24 పైసలు బలపడడం స్టాక్ మార్కెట్ మరింతగా నష్టపోకుండా అడ్డుకున్నాయి. ఆర్బీఐ పాలసీ నేపథ్యంలో బ్యాంక్, వాహన, రియల్టీ వంటి వడ్డీరేట్ల ప్రభావిత షేర్లు మిశ్రమంగా ముగిశాయి. ఈ నెలలో ఐపీఓకు నాలుగు కంపెనీలు... న్యూఢిల్లీ: ఈ నెలలో 4 కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. దిలిప్ బిల్డ్‌కాన్(రూ.650 కోట్లు), నవ్కార్ కార్పొ(రూ.510 కోట్లు), పవర్ మెక్ ప్రాజెక్ట్స్(రూ.270 కోట్లు), ప్రభాత్ డైరీ(రూ.300 కోట్లు)..ఈ నాలుగు కంపెనీలు కలిసి దాదాపు రూ.1,820 కోట్ల మేర నిధులు సమీకరించనున్నాయి. పవర్ మెక్ ఐపీఓ ఈ నెల 7న ప్రారంభమై 11న ముగుస్తుంది. మిగిలిన మూడు కంపెనీల ఐపీఓలు ఆ తర్వాత మొదలవుతాయి. కాగా ఓపెన్ ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లకు సెబీ సూచించింది. -
ఇన్వెస్టర్ల జాగ్రత్త
లాభాల స్వీకరణతో స్వల్ప నష్టాలు - 43 పాయింట్లు క్షీణించి 28,420కు సెన్సెక్స్ - 6 పాయింట్ల నష్టంతో 8,603కు నిఫ్టీ స్టాక్ మార్కెట్ గత మూడు ట్రేడింగ్ సెషన్లలో లాభాల్లో ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి(మంగళవారం) నుంచి ప్రారంభం కానుండడం, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలివర్ వంటి దిగ్గజ కంపెనీల ఆర్థిక ఫలితాలు కూడా మంగళవారమే వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 43 పాయింట్ల నష్టంతో 28,420 పాయింట్ల వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 8,603 పాయింట్ల వద్ద ముగిశాయి. బిల్లులపైనే దృష్టంతా...పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎలా జరగనున్నాయోనని ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు. ఈ సమావేశాల్లోనే భూ సేకరణ, జీఎస్టీ బిల్లులను పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. ఈ బిల్లుల భవితవ్యం ఎలా ఉండబోతోందోనన్న ఆందోళనతో కొనుగోళ్లకు దూరంగా ఉన్న ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారని నిపుణులంటున్నారు. అమ్మకాల ఒత్తిడి కారణంగా 28,320 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సెన్సెక్స్ యూరోప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడంతో ఒకింత తేరుకుంది. స్టాక్ మార్కెట్ సూచీలు ఇంట్రాడే నష్టాల నుంచి చివరి గంటలో కొంతమేరకు కోలుకున్నాయి. 224 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 43 పాయింట్ల నష్టంతో 28,420 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 8,624-8,559 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 6 పాయింట్ల నష్టంతో 8,603 పాయింట్ల వద్ద ముగిసింది. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,776 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.13,823 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,00,479 కోట్లుగా నమోదైంది. 20 సెన్సెక్స్ కంపెనీల్లో తగ్గిన ఎఫ్ఐఐల వాటా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు 20 సెన్సెక్స్ షేర్లలో తమ వాటా (ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్లో)తగ్గించుకున్నారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండడం, అంతర్జాతీయ అంశాలు, పన్ను సంబంధిత అంశాల కారణంగా టాటా స్టీల్, ఐటీసీ సహా మొత్తం 20 సెన్సెక్స్ షేర్లలో వాటాను ఎఫ్ఐఐలు తగ్గించుకున్నారని నిపుణులంటున్నారు. కాగా 10 సెన్సెక్స్ షేర్లలో వాటా పెంచుకున్నారు. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందాల్కో ఇండస్ట్రీస్, హీరోమోటొకార్ప్, బజాజ్ ఆటోల్లో కూడా ఎఫ్ఐఐలు వాటా తగ్గించుకున్నారు. ఇన్ఫోసిస్, లుపిన్, సిప్లా తదితర కంపెనీల్లో వాటాను పెంచుకున్నారు. ఈ ఏడాది జనవరి-మార్చి క్వార్టర్‌కు క్యాపిటల్ మార్కెట్లో రూ.79,000 కోట్లు పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు రూ.547 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. -
సెన్సెక్స్ 136 పాయింట్లు అప్
రెండు ట్రేడింగ్ సెషన్ల నష్టాలకు మంగళవారం బ్రేక్ పడింది. యూరోపియన్ కమిషన్ తాజా బెయిల్ అవుట్ ప్రతిపాదనను గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ ఆమోదించనున్నారనే ఆశలతో ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడంతో మన స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, కన్సూమర్ డ్యూరబుల్స్ల్లో తాజా కొనుగోళ్ల కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 136 పాయింట్ల లాభంతో 27,781 పాయింట్లు వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల లాభపడి 8,368 పాయింట్ల వద్ద ముగిశాయి. ట్రేడింగ్ చివర్లో ఫార్మా, ఎఫ్ఎంసీజీ, కొన్ని లోహ షేర్లలో షార్ట్‌కవరింగ్ జరగడం కూడా మార్కెట్ పెరుగుదలకు దోహదపడింది. ఇన్వెస్టర్ల జాగ్రత్త... సెన్సెక్స్ మొత్తం 244 పాయింట్ల రేంజ్లో కదలాడింది. గ్రీస్ రుణ చెల్లింపులకు గడువు తేదీ ముగుస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారని నిపుణులు పేర్కొన్నారు. ట్రేడయిన షేర్లలో 1,730 షేర్లు లాభాల్లో, 960 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,720 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.17,267 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,49,362 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.551 కోట్ల నికర అమ్మకాలు, దేశీ ఇన్వెస్టర్లు రూ.581 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. -
గణాంకాల జోష్‌తో...
వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లోనూ అప్ - 161 లాభంతో 26,587 పాయింట్లకు సెన్సెక్స్ - 30 పాయింట్ల లాభంతో.. 8,014కు నిఫ్టీ ఏప్రిల్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉండడం, మేలో ద్రవ్యోల్బణం నిలకడగా ఉండటంతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. వాహన, ఆరోగ్య సంరక్షణ షేర్ల దన్నుతో బీఎస్ఈ సెన్సెక్స్ 161 పాయింట్ల లాభంతో 26,587 పాయింట్ల వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 8.014 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇటీవల బాగా క్షీణించిన షేర్లలో కొనుగోళ్లు జరగడం, ఇప్పటిదాకా కురిసిన వర్షాల సగటు సాధారణ పరిమితి కంటే 5 శాతం అధికమని వాతావారణ విభాగం వెల్లడించడం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. గ్రీస్ రుణ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉన్నా శుక్రవారానికి కొనసాగింపుగా మన స్టాక్ మార్కెట్ మాత్రం లాభాలు పంచింది. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, వాహన షేర్లతో పాటు కొన్ని ప్రైవేట్ బ్యాంకుల, ఆర్థిక సేవల కంపెనీలు షేర్లు పెరిగాయి. రిలీఫ్ ర్యాలీ: ఐఐపీ, ద్రవ్యోల్బణ గణాంకాల కారణంగా స్టాక్ మార్కెట్లో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుందని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు. దక్షిణాదిన సకాలంలో వచ్చిన రుతుపవనాలు స్టాక్ మార్కెట్‌ను లాభాల బాట పట్టించాయన్నారు. లాభ నష్టాల్లో... 30 సెన్సెక్స్ షేర్లలో 17 షేర్లు లాభపడ్డాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,353 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.11,654 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ. 2,12,556 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.605 కోట్ల నికర అమ్మకాలు జరపగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.650 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. 1,440 షేర్లు లాభాల్లో, 1,207 షేర్లు నష్టాల్లో ముగిశాయి.