4 రోజుల లాభాలకు బ్రేక్
- నిరాశ పరిచిన ఆర్‌బీఐ పాలసీ
- లాభాల స్వీకరణతో నష్టాలు
- 115 పాయింట్ల నష్టంతో 28,072కు సెన్సెక్స్
- 26 పాయింట్ల నష్టంతో 8,517కు నిఫ్టీ
భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రేట్లను యథాతథంగా కొనసాగించడంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాలపాలయ్యింది. దీంతో వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్‌ల స్టాక్ మార్కెట్ లాభాలకు బ్రేక్ పడింది. మార్కెట్‌ను నిరాశకు గురిచేసిన ఆర్‌బీఐ పాలసీ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 28,072 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26 పాయింట్ల నష్టంతో 8,517 పాయింట్ల వద్ద ముగిశాయి. నైరుతీ రుతు పవనాల వల్ల ఆగస్టు,సెప్టెంబర్ నెలల్లో సాధారణం కంటే తక్కువ స్థాయిల్లోనే వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడం ప్రతికూల ప్రభావం చూపించింది. అయితే కొన్ని బ్యాంక్ షేర్లలో కొనుగోళ్లు, రూపాయి 24 పైసలు బలపడడం స్టాక్ మార్కెట్ మరింతగా నష్టపోకుండా అడ్డుకున్నాయి. ఆర్‌బీఐ పాలసీ నేపథ్యంలో బ్యాంక్, వాహన, రియల్టీ వంటి వడ్డీరేట్ల ప్రభావిత షేర్లు మిశ్రమంగా ముగిశాయి.
ఈ నెలలో ఐపీఓకు నాలుగు కంపెనీలు...
న్యూఢిల్లీ: ఈ నెలలో 4 కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. దిలిప్ బిల్డ్‌కాన్(రూ.650 కోట్లు), నవ్‌కార్ కార్పొ(రూ.510 కోట్లు), పవర్ మెక్ ప్రాజెక్ట్స్(రూ.270 కోట్లు), ప్రభాత్ డైరీ(రూ.300 కోట్లు)..ఈ నాలుగు కంపెనీలు కలిసి దాదాపు రూ.1,820 కోట్ల మేర నిధులు సమీకరించనున్నాయి. పవర్ మెక్ ఐపీఓ ఈ నెల 7న ప్రారంభమై 11న ముగుస్తుంది. మిగిలిన మూడు కంపెనీల ఐపీఓలు ఆ తర్వాత మొదలవుతాయి. కాగా ఓపెన్ ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లకు సెబీ సూచించింది.