కొనసాగుతున్న చైనా భయాలు
- 318 నష్టంతో 25,715కు సెన్సెక్స్
- 89 పాయింట్లు క్షీణించి 7,792కు నిఫ్టీ
చైనా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు కొనసాగుతుండటంతో బుధవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఇది నాలుగో పతనం. స్టాక్‌మార్కెట్‌ను గట్టెక్కించడానికి చైనా కేంద్ర బ్యాంక్ (పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా(పీబీఓసీ) మంగళవారం వడ్డీరేట్లు తగ్గించింది, తాజాగా 2,200 కోట్ల డాలర్లు నిధులను మార్కెట్లోకి తేనున్నామని ప్రకటించింది. ట్రేడింగ్ చివరి గంటలో ఈ వార్త తెలిసినప్పటికీ, స్టాక్ మార్కెట్ పతనం ఆగలేదు. సెన్సెక్స్ దాదాపు ఏడాది కనిష్ట స్థాయికి, నిఫ్టీ కీలకమైన 7,800 పాయింట్ల దిగువకు పడిపోయాయి.
డాలర్‌తో రూపాయి మారకం క్షీణించడం, ఆగస్టు డెరివేటివ్స్ కాంట్రాక్ట్‌లు నేడు(గురువారం) ముగియనున్న నేపథ్యంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 318 పాయింట్లు నష్టపోయి 25,715 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 89 పాయింట్ల నష్టంతో 7,792 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఆయిల్, గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు పతనమయ్యాయి.
లాభ నష్టాలు ఇలా...
30 సెన్సెక్స్ షేర్లలో 18 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 1,345 షేర్లు నష్టాల్లో, 1,321 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,134 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.20,032 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.4,45,445 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,346 కోట్ల నికర అమ్మకాలు, దేశీ ఇన్వెస్టర్లు రూ.1,881 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. చైనా స్టాక్ మార్కెట్ వరుసగా 5 రోజూ పతనమైంది. నికాయ్, కొరియా సూచీలు మినహా మిగిలిన అన్ని ఆసియా దేశాల మార్కెట్లు, అలాగే యూరప్ మార్కెట్లు నష్టపోయాయి. జూలైలో డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్లు అంచనాలు మించి ఉన్నాయన్న గణాంకాల దన్నుతో అమెరికా మార్కెట్లు కడపటి సమాచారం అందే సరికి లాభాల్లో ట్రేడవుతున్నాయి.
మూడో వంతు నష్టం ఈ మూడు షేర్లదే
గత వారం రోజుల్లో సెన్సెక్స్ 2,200 పాయింట్లకు పైగా పతనమైంది. ఈ పతనంలో హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్.. ఈ మూడు షేర్ల వాటా 33 శాతం(721 పాయింట్లు)గా ఉంది. సెన్సెక్స్ పతనంలో ఒక్కొక్క షేర్ల పరంగా చూస్తే హెచ్‌డీఎఫ్‌సీ 277 పాయింట్లు, ఇన్ఫోసిస్ 241 పాయింట్లు, ఎల్ అండ్ టీ 204 పాయింట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ 186 పాయింట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ 168 పాయింట్లుగా ఉన్నాయి.