సెన్సెక్స్ 136 పాయింట్లు అప్
రెండు ట్రేడింగ్ సెషన్ల నష్టాలకు మంగళవారం బ్రేక్ పడింది. యూరోపియన్ కమిషన్ తాజా బెయిల్ అవుట్ ప్రతిపాదనను గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ ఆమోదించనున్నారనే ఆశలతో ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడంతో మన స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, కన్సూమర్ డ్యూరబుల్స్‌ల్లో తాజా కొనుగోళ్ల కారణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 136 పాయింట్ల లాభంతో 27,781 పాయింట్లు వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల లాభపడి 8,368 పాయింట్ల వద్ద ముగిశాయి. ట్రేడింగ్ చివర్లో ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, కొన్ని లోహ షేర్లలో షార్ట్‌కవరింగ్ జరగడం కూడా మార్కెట్ పెరుగుదలకు దోహదపడింది.
ఇన్వెస్టర్ల జాగ్రత్త...
సెన్సెక్స్ మొత్తం 244 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. గ్రీస్ రుణ చెల్లింపులకు గడువు తేదీ ముగుస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారని నిపుణులు పేర్కొన్నారు. ట్రేడయిన షేర్లలో 1,730 షేర్లు లాభాల్లో, 960 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,720 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.17,267 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,49,362 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.551 కోట్ల నికర అమ్మకాలు, దేశీ ఇన్వెస్టర్లు రూ.581 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.