Greece Prime Minister Alexis sipras
-
గ్రీస్ బెయిలవుట్‌కు ఓకే
- 17 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత యూరోజోన్ ఆమోదం - 86 బిలియన్ యూరోల విలువైన మూడేళ్ల ప్యాకేజీకి ఒప్పందం - ప్రతిగా కఠినమైన షరతుల విధింపు... - 50 బిలియన్ యూరోల ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి గ్రీస్ అంగీకారం - రేపటికల్లా పార్లమెంటులో సంస్కరణలపై చట్టాలు చేయాలని గ్రీస్‌కు డెడ్‌లైన్... బ్రసెల్స్: ఎట్టకేలకు గ్రీస్ సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడింది. యూరోజోన్ నుంచి వైదొలగే ప్రమాదం నుంచి గ్రీస్ బయటపడింది. యూరోజోన్ నేతలు బెయిలవుట్ ప్యాకేజీకి సోమవారం అంగీకరించారు. దాదాపు 17 గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం కఠినమైన షరతులకు గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రస్ తలూపడంతో రుణదాతలు డీల్‌కు ఓకే చెప్పారు. మూడేళ్లపాటు అమలయ్యే విధంగా 86 బిలియన్ యూరోల(దాదాపు 96 బిలియన్ డాలర్లు) బెయిలవుట్ ప్యాకేజీని ఇచ్చేందుకు నిర్ణయించారు. దీంతో ఐదేళ్ల వ్యవధిలో గ్రీస్‌కు ఇది మూడో బెయిలవుట్ కానుంది. 2010 నుంచి ఇప్పటివరకూ అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్), యూరోపియన్ యూనియన్(ఈయూ)లు 240 బిలియన్ యూరోల విలువైన రెండు ప్యాకేజీలను అమలు చేసిన సంగతి తెలిసిందే. యూరోజోన్ సదస్సులో గ్రీస్‌కు ప్యాకేజీపై ఏకాభిప్రాయం కుదిరిందని.. యూరోపియన్ యూనియన్(ఈయూ) ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్ ప్రకటించారు. యూరోపియన్ స్థిరత్వ యంత్రాంగం(ఈఎస్ఎం) నుంచి గ్రీస్‌కు నిధులను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. యూరోజోన్ నుంచి గ్రీస్ వైదొలగుతుందన్న భయాలు తొలగినట్టేనని యూరోపియన్ కమిషన్(ఈయూ) ప్రెసిడెంట్ జీన్-క్లాడ్ జంకర్ పేర్కొన్నారు. బెయిలవుట్ గ్రీస్‌కు మంచిచేస్తుంది..: సిప్రస్ తాజా బెయిలవుట్ ప్యాకేజీతో గ్రీస్‌కు మంచి జరుగుతుందని ఆ దేశ ప్రధాని సిప్రస్ వ్యాఖ్యానించారు. గ్రీస్ ప్రజలు తమ నిర్ణయానికి మద్దతునిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గ్రీస్‌కు ఫైనాన్షియల్ ఆక్సిజన్‌ను తొలగించే స్థితికి రుణదాతలు వచ్చినందున, కఠినమైన షరతులకు అంగీకరించాల్సి వచ్చిందని.. అయితే ఇందుకు ప్రతిగా రుణ పునర్వ్యవస్థీకరణ ఊరటను తాము పొందామని గ్రీస్ ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఇదిలాఉండగా.. బెయిలవుట్‌పై ముందునుంచీ వెనక్కిలాగుతూ వచ్చిన జర్మనీ.. ఎట్టకేలకు ఆఖరి నిమిషంలో కొత్త షరతులను తెరపైకి తెచ్చి గ్రీస్‌ను లొంగదీసుకోగలిగింది. గ్రీస్‌కు అత్యధికంగా రుణాలిచ్చిన దేశాల్లో జర్మనీ మొదటిస్థానంలో ఉంది. ‘గ్రీస్ ఆర్థిక పరిస్థితి ఇంకా భయానకంగానే ఉంది.. బెయిలవుట్ విజయవంతం అవుతుందన్న గ్యారెంటీ లేదు. ఇదోపెద్ద ప్రహసనమే’ అంటూ జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా.. ఈ బెయిలవుట్ ప్యాకేజీకి యూరోజోన్‌లోని చాలా దేశాలు తమ పార్లమెంటు ఆమోదాలను తీసుకోవాల్సి ఉంది. ఇవన్నీ జరిగాకే ప్యాకేజీ అమలు మొదలవుతుంది. అప్పటివరకూ తాత్కాలికంగా గ్రీస్ బ్యాంకులకు నిధులను అందించే(బ్రిడ్జ్ ఫండింగ్) అవకాశం ఉంది. గ్రీస్.. పెనంమీదనుంచి, పొయ్యిలోకి! - గత నెల 30న ఐఎంఎఫ్‌కు చెల్లించాల్సిన 1.7 బిలియన్ డాలర్ల రుణ బకాయి చెల్లించకపోవడంతో గ్రీస్ డిఫాల్ట్ అయింది. దీంతో గ్రీస్‌ను యూరోజోన్ నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితుల్లోకి నెట్టాయి. - సహాయ ప్యాకేజీ కొనసాగాలంటే కఠినమైన షరతులకు అంగీకరించాలన్న రుణదాతలపై గ్రీస్ ప్రధాని సిప్రస్ మొదట ఎదురుతిరిగారు. రిఫరెండంలో ప్రజలే షరతులకు ఒప్పుకోవాలా, వద్దా అనేది నిర్ణయిస్తారని ప్రకటించారు. చివరకు రిఫరెండంలో గ్రీస్ ప్రజలు షరతులకు నో చెప్పడంతో మళ్లీ గ్రీస్ పరిస్థితి మొదటికొచ్చింది. - ప్యాకేజీలు ఆగిపోవడంతో ప్రభుత్వం ఆర్థిక నియంత్రణలు(క్యాపిటల్ కంట్రోల్స్) అమల్లోకి తీసుకొచ్చింది. బ్యాంకుల మూసివేతతో పాటు ఏటీఎంల నుంచి నగదు విత్డ్రాయల్స్పై పరిమితులు(రోజుకు 60 యూరోలు మాత్రమే) విధించాల్సి వచ్చింది. - గ్రీస్ బ్యాంకుల్లో డిపాజిట్ నిధులు అడుగంటిపోవడంతో యూరో సింగిల్ కరెన్సీ(యూరోజోన్) నుంచి వైదొలగి.. సొంత కరెన్సీని మళ్లీ చెలామణీలోకి తీసుకురావాల్సిందేనన్న ఆందోళనలు కూడా చెలరేగాయి. - బెయిలవుట్ ప్యాకేజీకి సంబంధించి రిఫరెండంలో ప్రజలు ఏ కఠిన షరతులనైతే తిరస్కరించారో, దీనికంటే మరింత కఠినమైన షరతులకు ఇప్పుడు సిప్రస్ తలొగ్గడం విశేషం. - ఏకంగా ప్రభుత్వ ఆస్తులపై అజమాయిషీని బయటి దేశాలకు అప్పగించేందుకు ఓకే చెప్పడంపై గ్రీస్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. - సమీప భవిష్యత్తులోనే సిప్రస్ ప్రభుత్వం కూలిపోయి మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశాలు లేకపోలేదని అక్కడి రాజకీయ వర్గాలు జోస్యం చెబుతున్నాయి కూడా. - మరోపక్క, ఈ నెల 20కల్లా గ్రీస్ ఈసీబీకి 7 బిలియన్ యూరోలను తిరిగి చెల్లించాల్సి(బాండ్ రిడంప్షన్) ఉంది. వచ్చే నెలలోనూ ఈసీబీకి చెల్లింపుల బకాయితో కలిపితే గ్రీస్‌కు అవసరమైన మొత్తం 12 బిలియన్ యూరోలుగా అంచనా. షరతులు ఏంటంటే... - గ్రీస్ కఠినమైన కార్మిక, పెన్షన్ సంస్కరణలు, వ్యయ నియంత్రణ చర్యలకు కట్టుబడి ఉండాలి. దీనికి పార్లమెంటులో బుధవారం(ఈ నెల 15)కల్లా ఆమోదముద్ర పడాలి. తాజాగా కుదిరిన బెయిలవుట్ ప్యాకేజీని ఆమోదించేందుకు కూడా ఇదే డెడ్‌లైన్. ఆ తర్వాతే బెయిలవుట్‌పై తదుపరి సంప్రదింపులు మొదలవుతాయి. అంటే పెన్షన్లలో కోత, పన్నుల (వ్యాట్) పెంపు, ప్రైవేటీకరణ వంటి చర్యలను తక్షణం అమల్లోకి తీసుకురావాలన్నమాట. - అన్నింటికంటే ముఖ్యంగా జర్మనీ కొత్త షరతుతో ఆ దేశ సార్వభౌమాధికారం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రకారం గ్రీస్ 50 బిలియన్ యూరోల(దాదాపు 56 బిలియన్ డాలర్లు) విలువైన ప్రభుత్వ ఆస్తులను ఒక ప్రత్యేకమైన నిధికి బదలాయించాలి. ఈ ఆస్తులపై పర్యవేక్షణ, మధ్యవర్తిత్వం అంతా రుణదాతల(జర్మనీ నేతృత్వంలోని యూరోజోన్) చేతిలోనే ఉంటుంది. - ఈ ప్రత్యేక నిధికి చెందిన ఆస్తులను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని గ్రీస్ బ్యాంకులకు మూలధనం సమకూర్చడం, పాత రుణ బకాయిలు తీర్చడానికి వినియోగిస్తారు. ఇందులో 12 బిలియన్ యూరోలను గ్రీస్‌లో కొత్త పెట్టుబడులకు కూడా ఉపయోగించనున్నట్లు జర్మనీ చాన్స్‌లర్ మెర్కెల్ పేర్కొన్నారు. - కొత్త దివాలా(బ్యాంక్రప్సీ) నిబంధనలు, ఈయూ బ్యాంకింగ్ చట్టాన్ని గ్రీస్ ఆమోదించాలి. దీనిప్రకారం చెల్లింపుల్లో గ్రీస్ చేతులెత్తేస్తే... బడా డిపాజిటర్లు ముందుగా నష్టపోవాల్సి వస్తుంది. -
గ్రీస్ డిఫాల్ట్..
ఐఎంఎఫ్‌కు రుణ చెల్లింపుల్లో - యూరోజోన్, రుణదాతలకు తాజా సంస్కరణల ప్రతిపాదన - కొత్త బెయిలవుట్కోసం గ్రీస్ ప్రధాని విజ్ఞప్తి.. బ్రసెల్స్: అనుకున్నంతా అయింది. ఆఖరినిమిషం వరకూ జరిగిన చర్చలు విఫలమయ్యాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రీస్ చివరకు ఐఎంఎఫ్‌కు చెల్లించాల్సి ఉన్న 1.7 బిలియన్ డాలర్ల బకాయి విషయంలో చేతులెత్తేయడంతో అనధికారికంగా డిఫాల్ట్ జరిగిపోయింది. తమకు బకాయిలు అందలేదని ఐఎంఎఫ్ అధికార ప్రతినిధి కూడా వాషింగ్టన్లో ధ్రువీకరించారు. దీంతో ఐఎంఎఫ్ చెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన తొలి అభివృద్ధి చెందిన దేశంగా గ్రీస్ నిలిచింది. అంతేకాకుండా 2001లో జింబాబ్వే తర్వాత ఐఎంఎఫ్ రుణచెల్లింపుల్లో డిఫాల్ట్ అయిన మొట్టమొదటి దేశం కూడా ఇప్పుడు గ్రీస్ కావడం గమనార్హం. అయితే నిర్ణీత తేదీనాటికి రుణ వాయిదా చెల్లింపు విఫలమైన తర్వాత నెలరోజులవరకూ ఆ మొత్తం అందకపోతే, అధికారికంగా ఆ దేశం దివాలా తీసినట్లు ఐఎంఎఫ్ ప్రకటిస్తుంది. మరోపక్క, ఈయూతో తాజాగా చర్చలు జరిపేందుకు వీలుగా చెల్లింపుల డెడ్‌లైన్ గడువు పెంచే అంశాన్ని కూడా ఐఎంఎఫ్ పరిశీలిస్తోంది. పాత బకాయి చెల్లిస్తే మళ్లీ తమ రుణాలు కొనసాగుతాయని ఐఎంఎఫ్ ప్రతినిధి గెర్రీ రైస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రస్ తమకు మరో కొత్త బెయిలవుట్ ప్యాకేజీని ఇవ్వాల్సిందిగా మరోసారి రుణదాతలకు విజ్ఞప్తి చేశారు. అయితే, గతంలో తాము ప్రతిపాదించిన బెయిలవుట్ షరతులపై ఆదివారం గ్రీస్‌లో జరగనున్న రిఫరెండం పూర్తయ్యేదాకా ఎలాంటి సంప్రదింపులూ సాధ్యంకాదని జర్మనీ ఆర్థిక మంత్రి ఉల్ఫ్‌గాంగ్ షాబుల్ తేల్చిచెప్పారు కూడా. అయితే, గ్రీస్ ప్రధాని తాజా విజ్ఞప్తిపై యూరోజోన్ ఆర్థిక మంత్రులు బుధవారం పొద్దుపోయాక చర్చలుజరిపారు. ఆదివారం వరకూ ఇక ఎలాంటి సంప్రదింపులూ జరపకూడదని వారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గ్రీస్ తమ షరతులకు అంగీకరించకపోవడంతో యూరోపియన్ యూనియన్(ఈయూ)-అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) అందిస్తూవస్తున్న బెయిలవుట్ ప్యాకేజీని మంగళవారం(జూన్ 30) అర్ధరాత్రితో నిలిపివేశాయి. దీంతో ఐఎంఎఫ్‌కు బకాయి చెల్లించలేక గ్రీస్ డిఫాల్ట్కావాల్సి వచ్చింది. ఐదేళ్ల తర్వాత మళ్లీ గ్రీస్ ఎలాంటి అంతర్జాతీయ ఆర్థిక సాయం లేకుండా ఒంటరైంది. మరింత దిగజారిన పరిస్థితులు... గ్రీస్ అధికారికంగా డిఫాల్ట్ కావడంతో అక్కడ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు మరింత తీవ్రం అవుతున్నాయి. ఈ నెల 6 వరకూ బ్యాంకులను మూసేయడంతో ప్రజలు రోడ్లమీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఏటీఎంల ముందు క్యూ కడుతున్నారు. అయితే, పెన్షనర్లకు మాత్రం తమ సొమ్ము తీసుకోవడానికి వీలుగా బుధవారం సుమారు 1,000 బ్యాంక్ బ్రాంచ్‌లు తెరిచినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కాగా, గ్రీస్ ప్రధాని తాజాగా రుణదాతలకు రాసిన తాజా విజ్ఞప్తి లేఖలో బెయిలవుట్ షరత్తుల్లో కొన్ని సడలింపులు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా తమ దీవుల్లో ఇప్పుడున్న 30 శాతం వ్యాట్ రాయితీని యథాతథంగా కొనసాగనివ్వాలని.. అదేవిధంగా 2012 నాటి పెన్షన్ సంస్కరణలను ఈ ఏడాది అక్టోబర్‌దాకా వాయిదా వేయాలని సిప్రస్ ప్రతిపాదించారు. దీనికి ఓకే అంటే రుణదాతలు గతంలో ప్రతిపాదించిన డీల్‌కు తాము ఆమోదం తెలుపుతామని పేర్కొన్నారు. కాగా, యూరోజోన్ నుంచి వైదొలిగే ప్రమాదాన్ని నివారించాలంటే తమకు యూరోపియన్ స్థిరత్వ యంత్రాంగం(ఈఎస్ఎం) నుంచి మరో 30 బిలియన్ యూరోల విలువైన బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వాలని గ్రీస్ కోరుతోంది. అంతేకాకుండా రెండేళ్లపాటు తమ రుణాలన్నింటినీ పునర్వ్యవస్థీకరించాలని కూడా విజ్ఞప్తి చేసింది. దీనికి అంగీకరిస్తే గ్రీస్‌కు ఇది మూడో బెయిలవుట్ ప్యాకేజీ అవుతుంది. 2010 నుంచి ఇప్పటివరకూ ఈయూ-ఐఎంఎఫ్‌లు రెండు ప్యాకేజీలు(240 బిలియన్ యూరోలు)ను అందిస్తూవచ్చాయి. అయితే, గ్రీస్‌కు ఇస్తున్న సహాయ ప్యాకేజీ మంగళవారం అర్ధరాత్రితోనే ముగిసిపోయిందని.. అంతేకాకుండా ఈయూ ఆఫర్‌ను గతవారంలోనే గ్రీస్ ప్రభుత్వం తిరస్కరించిన నేపథ్యంలో ఇప్పుడు గత ప్రతిపాదనలకు తావులేదని జర్మనీ ఆర్థిక మంత్రి స్పష్టంచేశారు. రిఫరెండం నిలిపివేత సంకేతాలు... కాగా, బెయిలవుట్ షరతులకు వ్యతిరేకంగా ఓటు వేయాలన్న వాదనలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఆదివారం జరగనున్న రెఫరెండంను విరమించుకోవాలని కూడా గ్రీస్ ప్రధాని సిప్రస్పై యూరోపియన్ నేతలు ఒత్తిడితీసుకొస్తున్నారు. అయితే తమ కొత్త బెయిలవుట్ విజ్ఞప్తికి యూరోజోన్ మంత్రులు అంగీకరిస్తే.. రిఫరెండంను సస్పెండ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు గ్రీస్ అధికారిక వర్గాలు సంకేతాలిచ్చాయి. -
సెన్సెక్స్ 136 పాయింట్లు అప్
రెండు ట్రేడింగ్ సెషన్ల నష్టాలకు మంగళవారం బ్రేక్ పడింది. యూరోపియన్ కమిషన్ తాజా బెయిల్ అవుట్ ప్రతిపాదనను గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రాస్ ఆమోదించనున్నారనే ఆశలతో ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడంతో మన స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, కన్సూమర్ డ్యూరబుల్స్ల్లో తాజా కొనుగోళ్ల కారణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 136 పాయింట్ల లాభంతో 27,781 పాయింట్లు వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల లాభపడి 8,368 పాయింట్ల వద్ద ముగిశాయి. ట్రేడింగ్ చివర్లో ఫార్మా, ఎఫ్ఎంసీజీ, కొన్ని లోహ షేర్లలో షార్ట్‌కవరింగ్ జరగడం కూడా మార్కెట్ పెరుగుదలకు దోహదపడింది. ఇన్వెస్టర్ల జాగ్రత్త... సెన్సెక్స్ మొత్తం 244 పాయింట్ల రేంజ్లో కదలాడింది. గ్రీస్ రుణ చెల్లింపులకు గడువు తేదీ ముగుస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారని నిపుణులు పేర్కొన్నారు. ట్రేడయిన షేర్లలో 1,730 షేర్లు లాభాల్లో, 960 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,720 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.17,267 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,49,362 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.551 కోట్ల నికర అమ్మకాలు, దేశీ ఇన్వెస్టర్లు రూ.581 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.