గ్రీస్ బెయిలవుట్‌కు ఓకే
- 17 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత యూరోజోన్ ఆమోదం
- 86 బిలియన్ యూరోల విలువైన మూడేళ్ల ప్యాకేజీకి ఒప్పందం
- ప్రతిగా కఠినమైన షరతుల విధింపు...
- 50 బిలియన్ యూరోల ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి గ్రీస్ అంగీకారం
- రేపటికల్లా పార్లమెంటులో సంస్కరణలపై చట్టాలు చేయాలని గ్రీస్‌కు డెడ్‌లైన్...
బ్రసెల్స్: ఎట్టకేలకు గ్రీస్ సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడింది. యూరోజోన్ నుంచి వైదొలగే ప్రమాదం నుంచి గ్రీస్ బయటపడింది. యూరోజోన్ నేతలు బెయిలవుట్ ప్యాకేజీకి సోమవారం అంగీకరించారు. దాదాపు 17 గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం కఠినమైన షరతులకు గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రస్ తలూపడంతో రుణదాతలు డీల్‌కు ఓకే చెప్పారు. మూడేళ్లపాటు అమలయ్యే విధంగా 86 బిలియన్ యూరోల(దాదాపు 96 బిలియన్ డాలర్లు) బెయిలవుట్ ప్యాకేజీని ఇచ్చేందుకు నిర్ణయించారు.
దీంతో ఐదేళ్ల వ్యవధిలో గ్రీస్‌కు ఇది మూడో బెయిలవుట్ కానుంది. 2010 నుంచి ఇప్పటివరకూ అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్), యూరోపియన్ యూనియన్(ఈయూ)లు 240 బిలియన్ యూరోల విలువైన రెండు ప్యాకేజీలను అమలు చేసిన సంగతి తెలిసిందే. యూరోజోన్ సదస్సులో గ్రీస్‌కు ప్యాకేజీపై ఏకాభిప్రాయం కుదిరిందని.. యూరోపియన్ యూనియన్(ఈయూ) ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్ ప్రకటించారు. యూరోపియన్ స్థిరత్వ యంత్రాంగం(ఈఎస్‌ఎం) నుంచి గ్రీస్‌కు నిధులను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. యూరోజోన్ నుంచి గ్రీస్ వైదొలగుతుందన్న భయాలు తొలగినట్టేనని యూరోపియన్ కమిషన్(ఈయూ) ప్రెసిడెంట్ జీన్-క్లాడ్ జంకర్ పేర్కొన్నారు.
బెయిలవుట్ గ్రీస్‌కు మంచిచేస్తుంది..: సిప్రస్
తాజా బెయిలవుట్ ప్యాకేజీతో గ్రీస్‌కు మంచి జరుగుతుందని ఆ దేశ ప్రధాని సిప్రస్ వ్యాఖ్యానించారు. గ్రీస్ ప్రజలు తమ నిర్ణయానికి మద్దతునిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గ్రీస్‌కు ఫైనాన్షియల్ ఆక్సిజన్‌ను తొలగించే స్థితికి రుణదాతలు వచ్చినందున, కఠినమైన షరతులకు అంగీకరించాల్సి వచ్చిందని.. అయితే ఇందుకు ప్రతిగా రుణ పునర్‌వ్యవస్థీకరణ ఊరటను తాము పొందామని గ్రీస్ ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఇదిలాఉండగా.. బెయిలవుట్‌పై ముందునుంచీ వెనక్కిలాగుతూ వచ్చిన జర్మనీ.. ఎట్టకేలకు ఆఖరి నిమిషంలో కొత్త షరతులను తెరపైకి తెచ్చి గ్రీస్‌ను లొంగదీసుకోగలిగింది.
గ్రీస్‌కు అత్యధికంగా రుణాలిచ్చిన దేశాల్లో జర్మనీ మొదటిస్థానంలో ఉంది. ‘గ్రీస్ ఆర్థిక పరిస్థితి ఇంకా భయానకంగానే ఉంది.. బెయిలవుట్ విజయవంతం అవుతుందన్న గ్యారెంటీ లేదు. ఇదోపెద్ద ప్రహసనమే’ అంటూ జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా.. ఈ బెయిలవుట్ ప్యాకేజీకి యూరోజోన్‌లోని చాలా దేశాలు తమ పార్లమెంటు ఆమోదాలను తీసుకోవాల్సి ఉంది. ఇవన్నీ జరిగాకే ప్యాకేజీ అమలు మొదలవుతుంది. అప్పటివరకూ తాత్కాలికంగా గ్రీస్ బ్యాంకులకు నిధులను అందించే(బ్రిడ్జ్ ఫండింగ్) అవకాశం ఉంది.
గ్రీస్.. పెనంమీదనుంచి, పొయ్యిలోకి!
- గత నెల 30న ఐఎంఎఫ్‌కు చెల్లించాల్సిన 1.7 బిలియన్ డాలర్ల రుణ బకాయి చెల్లించకపోవడంతో గ్రీస్ డిఫాల్ట్ అయింది. దీంతో గ్రీస్‌ను యూరోజోన్ నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితుల్లోకి నెట్టాయి.
- సహాయ ప్యాకేజీ కొనసాగాలంటే కఠినమైన షరతులకు అంగీకరించాలన్న రుణదాతలపై గ్రీస్ ప్రధాని సిప్రస్ మొదట ఎదురుతిరిగారు. రిఫరెండంలో ప్రజలే షరతులకు ఒప్పుకోవాలా, వద్దా అనేది నిర్ణయిస్తారని ప్రకటించారు. చివరకు రిఫరెండంలో గ్రీస్ ప్రజలు షరతులకు నో చెప్పడంతో మళ్లీ గ్రీస్ పరిస్థితి మొదటికొచ్చింది.
- ప్యాకేజీలు ఆగిపోవడంతో ప్రభుత్వం ఆర్థిక నియంత్రణలు(క్యాపిటల్ కంట్రోల్స్) అమల్లోకి తీసుకొచ్చింది. బ్యాంకుల మూసివేతతో పాటు ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాయల్స్‌పై పరిమితులు(రోజుకు 60 యూరోలు మాత్రమే) విధించాల్సి వచ్చింది.
- గ్రీస్ బ్యాంకుల్లో డిపాజిట్ నిధులు అడుగంటిపోవడంతో యూరో సింగిల్ కరెన్సీ(యూరోజోన్) నుంచి వైదొలగి.. సొంత కరెన్సీని మళ్లీ చెలామణీలోకి తీసుకురావాల్సిందేనన్న ఆందోళనలు కూడా చెలరేగాయి.
- బెయిలవుట్ ప్యాకేజీకి సంబంధించి రిఫరెండంలో ప్రజలు ఏ కఠిన షరతులనైతే తిరస్కరించారో, దీనికంటే మరింత కఠినమైన షరతులకు ఇప్పుడు సిప్రస్ తలొగ్గడం విశేషం.
- ఏకంగా ప్రభుత్వ ఆస్తులపై అజమాయిషీని బయటి దేశాలకు అప్పగించేందుకు ఓకే చెప్పడంపై గ్రీస్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
- సమీప భవిష్యత్తులోనే సిప్రస్ ప్రభుత్వం కూలిపోయి మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశాలు లేకపోలేదని అక్కడి రాజకీయ వర్గాలు జోస్యం చెబుతున్నాయి కూడా.
- మరోపక్క, ఈ నెల 20కల్లా గ్రీస్ ఈసీబీకి 7 బిలియన్ యూరోలను తిరిగి చెల్లించాల్సి(బాండ్ రిడంప్షన్) ఉంది. వచ్చే నెలలోనూ ఈసీబీకి చెల్లింపుల బకాయితో కలిపితే గ్రీస్‌కు అవసరమైన మొత్తం 12 బిలియన్ యూరోలుగా అంచనా.
షరతులు ఏంటంటే...
- గ్రీస్ కఠినమైన కార్మిక, పెన్షన్ సంస్కరణలు, వ్యయ నియంత్రణ చర్యలకు కట్టుబడి ఉండాలి. దీనికి పార్లమెంటులో బుధవారం(ఈ నెల 15)కల్లా ఆమోదముద్ర పడాలి. తాజాగా కుదిరిన బెయిలవుట్ ప్యాకేజీని ఆమోదించేందుకు కూడా ఇదే డెడ్‌లైన్. ఆ తర్వాతే బెయిలవుట్‌పై తదుపరి సంప్రదింపులు మొదలవుతాయి. అంటే పెన్షన్లలో కోత, పన్నుల (వ్యాట్) పెంపు, ప్రైవేటీకరణ వంటి చర్యలను తక్షణం అమల్లోకి తీసుకురావాలన్నమాట.
- అన్నింటికంటే ముఖ్యంగా జర్మనీ కొత్త షరతుతో ఆ దేశ సార్వభౌమాధికారం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రకారం గ్రీస్ 50 బిలియన్ యూరోల(దాదాపు 56 బిలియన్ డాలర్లు) విలువైన ప్రభుత్వ ఆస్తులను ఒక ప్రత్యేకమైన నిధికి బదలాయించాలి. ఈ ఆస్తులపై పర్యవేక్షణ, మధ్యవర్తిత్వం అంతా రుణదాతల(జర్మనీ నేతృత్వంలోని యూరోజోన్) చేతిలోనే ఉంటుంది.
- ఈ ప్రత్యేక నిధికి చెందిన ఆస్తులను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని గ్రీస్ బ్యాంకులకు మూలధనం సమకూర్చడం, పాత రుణ బకాయిలు తీర్చడానికి వినియోగిస్తారు. ఇందులో 12 బిలియన్ యూరోలను గ్రీస్‌లో కొత్త పెట్టుబడులకు కూడా ఉపయోగించనున్నట్లు జర్మనీ చాన్స్‌లర్ మెర్కెల్ పేర్కొన్నారు.
- కొత్త దివాలా(బ్యాంక్రప్సీ) నిబంధనలు, ఈయూ బ్యాంకింగ్ చట్టాన్ని గ్రీస్ ఆమోదించాలి. దీనిప్రకారం చెల్లింపుల్లో గ్రీస్ చేతులెత్తేస్తే... బడా డిపాజిటర్లు ముందుగా నష్టపోవాల్సి వస్తుంది.