Bailout package
-
లుఫ్తాన్సాకు కొత్త రెక్కలు!!
బెర్లిన్: కరోనా వైరస్ పరిణామాలతో విమాన సేవలు నిల్చిపోయి, సంక్షోభంలో కూరుకుపోయిన విమానయాన సంస్థ లుఫ్తాన్సాకు కొంత ఊరట లభించింది. కష్టకాలంలో నిలదొక్కుకునేందుకు కంపెనీకి 9.8 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ ప్రతిపాదనకు జర్మనీ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వేల కొద్దీ ఉద్యోగాలను కాపాడేందుకు, బలవంతపు టేకోవర్ ముప్పు తప్పించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఈ డీల్‌తో లుఫ్తాన్సాలో ప్రభుత్వానికి 20% వాటాలు దక్కుతాయి. దీన్ని 25% దాకా పెంచుకోవచ్చు. లుఫ్తాన్సా సాధారణంగా లాభాల్లోనే ఉందని, కరోనా మహమ్మారి పరిణామాల కారణంగా సమస్యల్లో చిక్కుకుందని జర్మనీ ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ తోడ్పాటు పరిమిత కాలానికి మాత్రమేనని, లుఫ్తాన్సాలో వాటాలను 2023 ఆఖరు నాటికి విక్రయించాలని భావిస్తున్నట్లు వివరించింది. ‘కంపెనీ మళ్లీ నిలదొక్కుకున్నాక ప్రభుత్వం వాటాలను విక్రయించేస్తుంది. ఆ నిధులతో సమస్యల్లో ఉన్న ఇతర కంపెనీలకు తోడ్పాటు అందించేందుకు వీలవుతుంది‘ అని ఆర్థిక మంత్రి ఒలాఫ్ షోల్జ్ తెలిపారు. షరతులు వర్తిస్తాయి..: బెయిలవుట్ ప్యాకేజీ ఇచ్చేందుకు జర్మనీ ప్రభుత్వం పలు షరతులు విధించింది. భవిష్యత్‌లో డివిడెండ్ చెల్లింపులను తొలగించడం, మేనేజ్మెంట్ జీతభత్యాలపై పరిమితులు వంటివి వీటిలో ఉన్నాయి. అలాగే సంస్థ పర్యవేక్షణ బోర్డులో ప్రభుత్వం తరఫు నుంచి ఇద్దరు సభ్యులు ఉంటారు. సాధారణ షేర్‌హోల్డర్ల సమావేశంలో ఓటింగ్ హక్కులేవీ ప్రభుత్వం వినియోగించుకోబోదు. కరోనా వైరస్ కష్టాల బారిన పడిన కంపెనీలను గట్టెక్కించేందుకు జర్మనీ ప్రభుత్వం 100 బిలియన్ యూరోలతో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసింది. దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి జర్మనీ కేంద్ర ప్రభుత్వం క్రమంగా వాటాలు విక్రయించేస్తూ వస్తోంది. ప్రస్తుతం డాయిష్ పోస్ట్, డాయిష్ టెలికం వంటి కొన్ని దిగ్గజ సంస్థల్లో మాత్రమే ప్రభుత్వానికి భారీ వాటా ఉంది. మాకూ ప్యాకేజీ ఇవ్వరూ.. కొలంబియాకు చెందిన ఏవియాంకా హోల్డింగ్స్, ఆస్ట్రేలియన్ సంస్థ వర్జిన్ ఆస్ట్రేలియా హోల్డింగ్స్ మొదలైనవి దివాలా చట్టాల కింద రక్షణ కోరుతూ దరఖాస్తులు చేసుకున్నాయి. మరికొన్ని సంస్థలు ప్రస్తుతం తమ తమ దేశాల ప్రభుత్వాల నుంచి బెయిలవుట్ ప్యాకేజీలు కోరుతున్నాయి. ఫ్రాన్స్–నెదర్లాండ్స్ విమానయాన సంస్థ ఎయిర్ ఫ్రాన్స్–కేఎల్ఎం, అమెరికాకు చెందిన అమెరికన్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్ తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. లాటామ్ దివాలా.. అమెరికాలో అతి పెద్ద ఎయిర్‌లైన్స్‌లో ఒకటైన లాటామ్ తాజాగా కరోనా దెబ్బతో దివాలా తీసింది. రుణ పునర్వ్యవస్థీకరణ ప్రయత్నాల్లో ఉన్న లాటామ్.. దివాలా చట్టం కింద రక్షణ కోరుతూ కోర్టులో దరఖాస్తు చేసుకుంది. అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వేలోని అనుబంధ సంస్థలను మాత్రం ఇందులో చేర్చలేదు. దివాలా చట్టం కింద పిటీషన్ వేసినప్పటికీ యథాప్రకారం కార్యకలాపాలు కొనసాగుతాయని, త్వరలో రుణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తి కాగలదని సంస్థ సీఈవో రాబర్టో అల్వో ఆశాభావం వ్యక్తం చేశారు. చిలీకి చెందిన ఎల్ఏఎన్, బ్రెజిల్‌కి చెందిన టీఏఎం సంస్థల విలీనంతో 2012లో లాటామ్ ఏర్పడింది. ఇందులో అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్ అతి పెద్ద వాటాదారుగా ఉంది. ప్రస్తుతం లాటామ్ ఆస్తులు 10 బిలియన్ డాలర్లుగా, బాకీలు 50 బిలియన్ డాలర్ల దాకా ఉన్నాయి. -
ఆ టెల్కోలకు ప్యాకేజీలు అక్కర్లేదు
న్యూఢిల్లీ: కేంద్రానికి భారీ స్థాయిలో లైసెన్సు ఫీజులు బాకీలు కట్టాల్సి రానున్న పాత తరం టెల్కోలు .. ప్రభుత్వాన్ని బెయిలవుట్ ప్యాకేజీ కోరుతుండటంపై రిలయన్స్ జియో మండిపడింది. ఆ రెండు సంస్థలు (ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా) ఆర్థికంగా పటిష్టంగానే ఉన్నాయని, ప్రజల సొమ్ముతో వాటికి ప్యాకేజీలేమీ ఇవ్వాల్సిన అవసరమేమీ లేదని వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు తీర్పునకు అనుగుణంగా మూడు నెలల్లోగా బాకీలు కట్టేలా వాటిని ఆదేశించాలంటూ కేంద్రాన్ని కోరింది. టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌కు జియో ఈ మేరకు లేఖ రాసింది. ఒకవేళ ఆ రెండు సంస్థలకు ఏం జరిగినా(మూతబడినా).. ప్రభుత్వ రంగ టెల్కోలు కూడా కార్యకలాపాలు సాగిస్తున్నందున టెలికం రంగానికి నష్టమేమీ లేదని పేర్కొంది. సీవోఏఐ బ్లాక్మెయిల్... ‘రెండు సంస్థల స్వార్థ ప్రయోజనాల కోసం వాటి తరఫున వకాల్తా పుచ్చుకుని సీవోఏఐ కేంద్రానికి లేఖ రాసింది’ అని ఆక్షేపించింది. జియోపై సీవోఏఐ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. ‘ఉద్యోగాలు పోతాయని, సేవల నాణ్యత తగ్గిపోతుందని, టెలికం రంగంలో పెట్టుబడులు ఆగిపోతాయని ప్రభుత్వానికి పంపిన లేఖలో సీవోఏఐ బెదిరింపు, బ్లాక్‌మెయిలింగ్ ధోరణి కనిపిస్తోంది. బాకీలు డిపాజిట్ చేయాలంటూ సుప్రీం కోర్టు మూడు నెలలు గడువిస్తే.. ఇలాంటివన్నీ చేయడం కోర్టు ధిక్కారానికి పాల్పడటమే అవుతుంది’ అని జియో పేర్కొంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ‘సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్)’ లెక్కల్ని బట్టి ప్రభుత్వానికి టెలికం సంస్థలు లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద దాదాపు రూ. 1.4 లక్షల కోట్లు కట్టాల్సి రావొచ్చని అంచనా. పాత తరం టెల్కోలైన భారతి ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 42,000 కోట్లు, వొడాఫోన్ ఐడియా సుమారు రూ. 40,000 కోట్లు, రిలయన్స్ జియో స్వల్పంగా రూ. 14 కోట్లు కట్టాల్సి రానుంది. భారత మార్కెట్ నుంచి తప్పుకోవడం లేదు: వొడాఫోన్ భారీ చెల్లింపులు జరపాల్సిన నేపథ్యంలో భారత మార్కెట్ నుంచి తప్పుకోబోతోందంటూ వచ్చిన వార్తలను బ్రిటన్ టెలికం దిగ్గజం వొడాఫోన్ కొట్టిపారేసింది. ఇవన్నీ నిరాధార వదంతులేనని పేర్కొంది. అలాంటి యోచనేదీ తమకు లేదని, స్థానిక మేనేజ్మెంట్కు పూర్తి మద్దతు ఇస్తామని వొడాఫోన్ తెలిపింది. ఇప్పుడున్న గడ్డుకాలం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వ సహకారం కోరుతున్నామని వివరించింది. -
టెల్కోలకు భారీ ఊరట లభించనుందా?
సాక్షి, న్యూఢిల్లీ: టెల్కోల నుంచి భారీగా రూ. 92,000 కోట్లు రాబట్టుకోవడానికి సుప్రీంకోర్డు డాట్ (టెలకమ్యూనిషన్ల శాఖ)కు అనుమతించిన నేపథ్యంలో- ఆయా కంపెనీల ఆర్థిక స్థితిగతులపై సమీక్షించి, తగిన సలహాలు ఇవ్వడానికి కేంద్రం మంగళవారం ఒక సెక్రటరీల కమిటీ (సీఓఎస్)ని ఏర్పాటు చేసింది. సుప్రీం రూలింగ్ నేపథ్యంలో- టెలికం రంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారే అవకాశం ఉందన్నజారే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. టెలికంకు భారీ బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వడానికి కేంద్రం మొగ్గు చూపుతోందని, ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై సెక్రటరీల కమిటీ దృష్టి సారిస్తుందని వార్తలు వస్తున్నాయి. కమిటీకి క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తారు. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియాల వంటి సర్వీస్ ప్రొవైడర్లు ఎదుర్కొంటున్న ‘‘ఆర్థిక ఒత్తిడి’’ని ‘‘అన్ని కోణాల్లో’’ పరిశీలించి, తీవ్రతను తగ్గించడానికి సూచనలు ఇవ్వడానికి కమిటీ ఏర్పాటయినట్లు టెలికం వర్గాలు తెలిపాయి. ఆర్థిక, న్యాయ, టెలికం కార్యదర్శులు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటీ త్వరలో సమావేశమై, ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో తన సిఫారసులను కేంద్రానికి సమర్పిస్తుందని సమాచారం. ప్యాకేజ్‌లో ఏముంటాయ్? స్పెక్ర్టమ్ చార్జీల తగ్గింపు ఉచిత మొబైల్ ఫోన్ కాల్స్‌కు ముగింపు చౌక డేటా టారిఫ్‌లకు సెలవు చెప్పడం నగదు లభ్యతలో ఇబ్బందులు తలెత్తకుండా 2020-21, 2021-22కు సంబంధించి స్పెక్ర్టమ్ వేలం చెల్లింపుల వాయిదా వేయడం. యూఎస్ఓఎఫ్ (యూనివర్షల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్) చార్జ్ని 3 శాతానికి తగ్గించడం. నేపథ్యం ఇదీ... కొత్త టెలికం విధానం ప్రకారం.. టెల్కోలు తమ సవరించిన స్థూల రాబడి (ఏజీఆర్)లో నిర్దిష్ట వాటాను ప్రభుత్వానికి వార్షిక లైసెన్సు ఫీజుగా కట్టాల్సి ఉంటుంది. దీనితో పాటు స్పెక్ట్రం వినియోగానికి గాను నిర్దిష్ట చార్జీలు (ఎస్‌యూసీ) చెల్లించాలి. అయితే ఈ ఏజీఆర్ లెక్కింపు విషయంలో వివాదం నెలకొంది. అద్దెలు, స్థిరాస్తుల విక్రయంపై లాభాలు, డివిడెండు మొదలైన టెలికంయేతర ఆదాయాలు కూడా ఏజీఆర్ కిందే వస్తాయని, దానిపైనే లైసెన్సు ఫీజు కట్టాల్సి ఉంటుందని టెలికం వివాదాల పరిష్కార, అపీలేట్ ట్రిబ్యునల్ (టీడీశాట్) గతంలో ఆదేశాలు ఇచ్చింది. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన లైసెన్సు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల భారం భారీగా పెరిగిపోనుండటంతో టీడీశాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ టెల్కోలు .. సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై జూలైలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం తమ వాదనలు వినిపించింది. అప్పటిదాకా టెల్కోలు రూ. 92,000 కోట్ల మేర లైసెన్సు ఫీజులు బకాయి పడ్డాయని తెలిపింది. తాజాగా ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ ఏడాది జూలై నాటికి డాట్ లెక్కల ప్రకారం ఎయిర్టెల్ అత్యధికంగా రూ. 21,682.13 కోట్లు, వొడాఫోన్ రూ. 19,823.71 కోట్లు లైసెన్సు ఫీజు కింద బకాయి పడ్డాయి. చదవండి : టెలికంలో భారీగా ఉద్యోగాల కోత -
మా బిడ్డలు ఆకలితో చచ్చిపోతే..బాధ్యులెవరు?
జెట్ ఎయిర్వేస్ సంక్షోభం ఉద్యోగుల పాలిట అశనిపాతంలా తాకింది. సంస్థలోని ఒక్కో ఉద్యోగిది ఒక్కో గాథ. అర్థాంతరంగా ఉపాధి కోల్పోయిన ఉద్యోగి పరిస్థితికి అద్దం పడుతున్న వారి ఆవేదన వర్ణనాతీతం. తమ భవిష్యత్తును తలుచుకొని కన్నీరుమున్నీరవుతున్న వైనం కలవర పరుస్తోంది. రుణ వితరణకు సంబంధించి ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతోబుధవారం రాత్రి నుంచి అన్ని సర్వీసులనూ తాత్కాలికంగా రద్దు చేసినట్లు సంస్థ ప్రకటించింది. దీంతో దాదాపు 22వేలమందికి పైగా ఉద్యోగులు రోడ్డున పడ్డారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ ను ఆదుకునేందుకు ఫౌండర్ నరేష్ గోయల్ సంస్థనుంచి తప్పుకుంటే.. రూ.1,500 కోట్ల మేర నిధులను సమకూరుస్తామని ఎస్బీఐ కన్సార్షియం చెప్పింది. దీని ప్రకారం ఆయన కంపెనీని వీడారు. కానీ ఇపుడు కనీసం 400కోట్ల రూపాయలు ఇవ్వడానికి కూడా బ్యాంకులు అంగీకరించడంలేదు. ఇందులో తప్పెవరిది? ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోవడంలేదని ఉద్యోగులు మండిపడ్డారు. తమ ఉద్యోగాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? మాజీ ఫౌండర్ నరేష్ గోయాల్? లేక ఎస్బీఐ యాజమాన్యమా అని ప్రశ్నిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. తమ బిడ్డలు ఆకలితో చచ్చిపోతోంటే ఎవరూ పట్టించుకోవడంలేదు. వారికి ఓట్లు మాత్రమే కావాంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకొని... తమ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తమ కష్టాల్ని గుర్తించి జెట్ ఎయిర్వేస్ను ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు రెండునెలలుగా వేతనాలు లభించకపోవడంతో తమ పిల్లల స్కూలు ఫీజులు, లోన్ల ఈఎంఐలు, ఇలా చాలా బకాయిలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థలో ఐదేళ్లుగా పనిచేస్తున్న ప్రథమేష్ (27)ది కూడా ఇదే ఆవేదన. సంస్థమీద తనకు పూర్తి విశ్వాసం ఉందని సీనియర్ ఉద్యోగి అనిల్ సాహు(50) ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత సునామీ ఉపద్రవంముంచుకొచ్చిందని, దీన్నుంచి కోలుకుని త్వరలోనే మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్నారు. కానీ 50 ఏళ్ల వయసులో మరో ఎయిర్‌లైన్స్ సంస్థలో జాబ్ సంపాదించుకోవడం తేలిక కాదన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా సగం శాలరీకే చేరాల్సి వస్తుందని మరికొందరు ఉద్యోగులు పేర్కొన్నారు. ఏడేళ్లుగా పనిచేస్తున్న మరో ఉద్యోగి అమీనా, ఇప్పటికు తనకు తనకు లాంటి ఇబ్బంది లేదని, తిరిగి తమ సంస్థ పుంజుకుంటుందని భావిస్తున్నానన్నారు. జీతాల్లేవు.. అందుకే ప్రాఫిడ్ ఫండ్ విత్ డ్రా చేసి మరీ పిల్లల ఫీజులు కట్టాను. మా అమ్మ (70) వైద్య ఖర్చులు భరించడం ఇపుడొక సవాల్ - శంకర్ చక్రవర్తి (50) సీనియర్ అస్టిస్టెంట్ ఇంజనీర్. 1993నుంచి సంస్థలో పనిచేస్తున్న ఈయన జీతం నెలకు రూ.80వేలు. జెట్ ఎయిర్వేస్లో చేరినపుడు ఎన్నో కలలు కన్నాను. అందంతా మూణ్ణాళ్ల ముచ్చటగా మారిపోయింది - రమన్ రాజపుత్ (26) క్యాబిన్ క్రూ నేను సింగిల్ పేరెంట్‌ని. 12 ఏళ్ల కొడుకుని ఎలా పోషించాలి. భవిష్యత్తు అగ్యమగోచరంగా ఉంది -మోనికా బక్షి (42) కస్టమర్ సర్వీస్ అసిస్టెంట్ మరోవైపు సంస్థ సంక్షోభం గురించి ఎవరూ మీడియాతో మాట్లాడరాదంటూ జెట్ ఎయిర్వేస్ తమ సిబ్బందికి సూచించింది. జెట్ కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. -
జనం సొమ్ముతో ఆ కంపెనీని ఆదుకుంటారా..?
సాక్షి, న్యూఢిల్లీ : జెట్ ఎయిర్వేస్కు ఇచ్చిన రుణాలను వాటాలుగా మార్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ బ్యాంకులకు సూచిస్తూ ప్రజల సొమ్మును ప్రైవేట్ ఎయిర్‌లైన్‌కు మళ్లించాలని ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ను ఆదుకునేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలని కేంద్రం కోరుతున్న సంగతి తెలిసిందే. దివాళా తీసిన జెట్ ఎయిర్వేస్ను కాపాడేందుకు ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం బెయిలవుట్ ప్రతిపాదనన పట్ల కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్బీఐ, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు జెట్ ఎయిర్వేస్కు ఇచ్చిన రూ 8500 కోట్ల రుణాన్ని వాటాలుగా మలుచుకోవాలని ప్రధాని సూచించడంతో సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్లో ఆయా బ్యాంకులకు 50 శాతం వాటా దక్కుతుందని సుర్జీవాలా పేర్కొన్నారు. దివాళా తీసిన జెట్ ఎయిర్వేస్ వంటి కార్పొరేట్ సంస్థకు బెయిలవుట్ ప్యాకేజ్ ఇచ్చేందుకు మోదీ సర్కార్ ఎందుకు తొందరపడుతోందని ఆయన ప్రశ్నించారు. రుణభారంతో సతమతమవుతున్న రైతులను విస్మరించి విదేశీ ఇన్వెస్టర్ల నియంత్రణలో ఉన్న ఈ కంపెనీని ప్రజల సొమ్ముతో ఆదుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులు ప్రజల ధనానికి రక్షకులు మాత్రమేనని, ఇలాంటి నిర్ణయాలు వాటంతటవే తీసుకోలేవని సుర్జీవాలా చెప్పారు. -
ఎయిర్ ఇండియాకు రూ.11,000 కోట్ల ప్యాకేజీ!
ముంబై: తీవ్ర కష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ విమానయాన సేవల సంస్థ ఎయిర్ ఇండియాకు రూ.11,000 కోట్ల బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై కేంద్ర పౌర విమానయాన శాఖ, ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని చెప్పాయి. నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ప్రైవేటు పరం చేద్దామనుకున్న ప్రయత్నాలు విఫలం కావడంతో ప్యాకేజీ ఇచ్చే ప్రతిపాదన ముందుకు రావడం గమనార్హం. భారంగా మారిన రుణాలను కొంత వరకు తగ్గించుకునేందుకు ఈ నిధులను వినియోగించనుంది. ‘‘ఎయిర్ ఇండియా బ్యాలన్స్ షీటును మెరుగుపరచడం వల్ల వ్యూహాత్మక విక్రయానికి ప్రభుత్వం తిరిగి ప్రయత్నించినప్పుడు అది ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా మారుతుంది’’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఎయిర్ ఇండియాకు పూర్వపు యూపీఏ హయాంలో 2012లో ఒకసారి బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. ఈ సంస్థకు 2017 మార్చి నాటికి రూ.48,000 కోట్ల రుణ భారం ఉంది. గత నెలలో రూ.980 కోట్ల మేర సప్లిమెంటరీ గ్రాంట్స్ కింద ఎయిర్ ఇండియాకు ఇచ్చేందుకు కేంద్రం పార్లమెంటు ఆమోదం కోరిన విషయం తెలిసిందే. -
బ్యాంకులకు బెయిలవుట్ జోష్
న్యూఢిల్లీ: మొండిబాకీల(ఎన్పీఏ) దెబ్బకి మూలధన సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్బీ) ఆదుకునేందుకు ఉద్దేశించిన బెయిలవుట్ ప్యాకేజీ కింద కేంద్రం మరికొన్ని నిధులను సమకూర్చనుంది. ఇందులో భాగంగా అయిదు పీఎస్బీలకు రూ.11,336 కోట్లు అందించే ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసింది. ఆంధ్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), కార్పొరేషన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ), అలహాబాద్ బ్యాంకులు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018–19)లో అదనపు మూలధనాన్ని సమకూర్చడానికి సంబంధించి ఇదే తొలి విడత కానుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరో రూ. 53,664 కోట్లు కూడా పీఎస్బీలకు కేంద్రం అందించనుంది. తాజా ప్రణాళిక ప్రకారం.. నీరవ్ మోదీ స్కామ్ బాధిత పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు అత్యధికంగా రూ. 2,816 కోట్లు లభించనున్నాయి. ఆంధ్రా బ్యాంక్‌కు రూ. 2,019 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌కు రూ. 2,157 కోట్లు, కార్పొరేషన్ బ్యాంక్‌కు రూ. 2,555 కోట్లు, అలహాబాద్ బ్యాంక్‌కు రూ. 1,790 కోట్లు లభించవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. బాండ్లపై వడ్డీల చెల్లింపులకు తోడ్పాటు.. అదనపు టయర్ 1 (ఏటీ–1) బాండ్‌హోల్డర్లకు వడ్డీ చెల్లింపులు జరపాల్సి ఉండటంతో... ఈ జాబితాలోని కొన్ని బ్యాంకులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. తాజా పరిణామం వీటికి కొంత ఉపశమనం ఇవ్వనుంది. సాధారణంగా శాశ్వత ప్రాతిపదికన ఉండే ఏటీ1 బాండ్ల ద్వారా కూడా బ్యాంకులు తమకు కావాల్సిన మూలధనాన్ని సమీకరిస్తుంటాయి. అయితే, కొన్నాళ్లుగా మొండిబాకీలు పెరిగిపోతుండటంతో పాటు భారీ నష్టాలు చవిచూస్తున్న పీఎస్బీలకు.. తమ సొంత ఆదాయం నుంచి ఈ బాండ్లపై వడ్డీలు చెల్లించడం కష్టంగా మారింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయమే తీసుకుంటే.. గతేడాది జూలైలో ఏటీ1 బాండ్ల విక్రయం ద్వారా సమీకరించిన రూ.1,500 కోట్ల మొత్తంపై వడ్డీ చెల్లించేందుకు తక్షణం రూ.135 కోట్లు అవసరముంది. 8.98 శాతం వార్షిక వడ్డీ రేటుతో ఈ నెల 25లోగా వడ్డీలు చెల్లించాల్సి ఉంది. అయితే, నీరవ్ మోదీ స్కామ్ దెబ్బకి లాభాలు తుడిచిపెట్టుకుపోగా భారీ నష్టాలు, మొండిబాకీలతో సతమతమవుతున్న పీఎన్బీకి ఈ చెల్లింపులు జరపడం కష్ట సాధ్యంగా మారింది. మార్చి 31 నాటి గణాంకాల ప్రకారం పీఎన్బీ టయర్ 1 మూలధనం 5.96 శాతం స్థాయిలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 7.375 శాతం కన్నా ఇది చాలా తక్కువ. జూలై 25 గడువులోగా నిర్దేశిత స్థాయికి మూలధనం పెంచుకుంటేనే పీఎన్బీ ఈ చెల్లింపులు చేయగలుగుతుంది. ఒకవేళ ప్రభుత్వ రంగ బ్యాంకులు బాండ్లకు సకాలంలో చెల్లింపులు జరపలేకపోతే.. దేశ ఆర్థిక వ్యవస్థపై, ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశాలున్నాయని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ ఇటీవలే ఒక నివేదికలో హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం అదనపు మూలధన నిధులు సమకూర్చనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. రెండేళ్లలో రూ. 2.11 లక్షల కోట్లు.. రెండు ఆర్థిక సంవత్సరాల్లో పీఎన్బీలకు రూ. 2.11 లక్షల కోట్ల మేర అదనపు మూలధనం సమకూర్చే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం రూ.1.35 లక్షల కోట్లు రీక్యాపిటలైజేషన్ బాండ్ల రూపంలో పీఎస్బీలకు లభించనున్నాయి. మిగతా రూ. 58,000 కోట్లను బ్యాంకులు మార్కెట్ నుంచి సమీకరించుకోవచ్చు. రూ.1.35 లక్షల కోట్లలో కేంద్రం ఇప్పటికే రూ.71,000 కోట్లు అందించింది. మిగతా మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో సమకూర్చనుంది. పీఎస్‌బీలు కూడా సొంతంగా రూ. 50,000 కోట్లను సమకూర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. మొత్తం 21 పీఎస్బీల్లో ఇప్పటికే 13 బ్యాంకులు ఇందుకోసం బోర్డులు, షేర్‌హోల్డర్ల అనుమతులు కూడా పొందాయి. పీఎస్‌బీల షేర్లు రయ్.. కేంద్రం అదనపు మూలధనం సమకూర్చనున్న వార్తలతో మంగళవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు దూసుకుపోయాయి. 11 శాతం దాకా పెరిగాయి. కార్పొరేషన్ బ్యాంక్ షేరు సుమారు 10.88%, అలహాబాద్ బ్యాంక్ 7.23%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 6.57%, బ్యాంక్ ఆఫ్ బరోడా 6.38%, బ్యాంక్ ఆఫ్ ఇండియా 5.87%, కెనరా బ్యాంక్ 5.71%, ఇండియన్ బ్యాంక్ 5.04% పెరిగాయి. అటు ఆంధ్రా బ్యాంక్ 4.91%, దేనా బ్యాంక్ 3.58%, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.10%, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 2.27%, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 1.35% పెరిగాయి. కేంద్ర రీక్యాపిటలైజేషన్ ప్రతిపాదన వీటికి ఊతమిచ్చినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ‘కనీస బ్యాలెన్స్’ పెనాల్టీలతో పీఎన్బీకి రూ.152 కోట్లు న్యూఢిల్లీ: మినిమం బ్యాలెన్స్ పాటించని పొదుపు ఖాతాలపై జరిమానాల ద్వారా పీఎన్బీ గత ఆర్థిక సంవత్సరంలో ఖాతా దారుల నుంచి రూ.151.66 కోట్లు వసూలు చేసింది. 1.23 కోట్ల సేవింగ్స్ ఖాతాలపై పీఎన్బీ ఈ మేరకు పెనాల్టీలు విధించింది. మినిమం బ్యాలెన్స్ పెనాల్టీల ద్వారా వసూలు చేసిన మొత్తం గురించిన వివరాలు వెల్లడించాలంటూ దరఖాస్తు చేసిన సమాచార హక్కు చట్టం కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్‌కు పీఎన్బీ ఈ విషయాలు తెలియజేసింది. ‘2017–18లో మినిమం బ్యాలెన్స్ పాటించని 1,22,98,748 సేవింగ్స్ అకౌంట్స్ నుంచి రూ.151.66 కోట్ల మేర పెనాల్టీని వసూలు చేయడం జరిగింది’ అని పేర్కొంది. ప్రభుత్వం మరింత మందిని బ్యాంకింగ్ వ్యవస్థ పరిధిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంటే.. బ్యాంకులు ఇలా మినిమం బ్యాలెన్స్ నిబంధనల పేరుతో పెనాల్టీలు విధించడం సరికాదని, ఈ విషయంలో ఆర్బీఐ తక్షణం జోక్యం చేసుకోవాలని ఆర్థికవేత్త జయంతిలాల్ భండారీ వ్యాఖ్యానించారు. -
గ్రీస్ సంక్షోభానికి తెర...
ఏథెన్స్: దాదాపు ఎనిమిదేళ్లుగా బెయిలవుట్ ప్యాకేజీలపై నెగ్గుకొస్తున్న గ్రీస్ మొత్తానికి సంక్షోభం నుంచి గట్టెక్కింది. రుణాల చెల్లింపుపై గ్రీస్‌తో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో యూరోజోన్ గ్రూప్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇప్పటికే ఇచ్చిన రుణాల చెల్లింపు గడువును మరో 10 ఏళ్ల పాటు పొడిగించేందుకు, అదనంగా మరో 15 బిలియన్ యూరోలు అందించేందుకు యూరో జోన్ మంత్రులు అంగీకరించినట్లు యూరోపియన్ యూనియన్ ఆర్థిక వ్యవహారాల విభాగం కమిషనర్ పియర్ మాస్కోవిచి తెలిపారు. ఈ ఒప్పందంతో మూడో బెయిలవుట్ ప్యాకేజీ నుంచి గ్రీస్ బైటపడేందుకు వెసులుబాటు లభిస్తుంది. మరోవైపు, బెయిలవుట్ నుంచి బైటపడినప్పటికీ... గ్రీస్ నిలదొక్కుకోవాలంటే కఠిన సంస్కరణలు అమలు చేయాల్సి ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఒప్పంద షరతుల కింద 2019లో పింఛనుల్లో మరోసారి కోత విధించేందుకు, ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని తగ్గించేందుకు గ్రీస్ అంగీకరించింది. దీంతోపాటు 75% రుణాలను తిరిగి చెల్లించేదాకా గ్రీస్‌పై ఆర్థిక పర్యవేక్షణ కొనసాగుతుందని యూరోపియన్ కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది. 2010 నుంచి గ్రీస్ 273.7 బిలియన్ యూరోల మేర నిధులను బెయిలవుట్ కింద పొందింది. ఈ సంక్షోభం ధాటికి 4 ప్రభుత్వాలు మారాయి. ఎకానమీ 25% క్షీణించింది. నిరుద్యోగిత 20% పైగా ఎగిసింది. -
గ్రామీణ పోస్టుమ్యాన్‌కు పండగే!
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్ సేవక్ (పోస్టుమ్యాన్)ల వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం మూడురెట్లు పెంచింది. దీంతో వీరు గరిష్టంగా రూ.14,500 వేతనాన్ని అందుకోనున్నారు. 2016 జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుంది. బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. బకాయిలను ఒకే వాయిదాలో చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. ‘ప్రస్తుతం నెలకు రూ.2,295ల వేతనం అందుకుంటున్న గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్)లు ఇకపై రూ. 10వేల వేతనాన్ని అందుకుంటారు. రూ. 2,745 ఉన్నవారు.. రూ. 10వేలు, రూ. 4,115 ఉన్న వారు గరిష్టంగా రూ.14,500 వేతనాన్ని పొందుతారు. దేశ పోస్టల్ శాఖ ముఖచిత్రం మారుతోంది. పోస్టల్ పార్శిల్ డైరెక్టరేట్‌ను ప్రారంభించాం. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులు ప్రారంభం కానున్నాయి. రానున్న రోజుల్లో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఇన్సూరెన్స్ కంపెనీ కూడా రాబోతుంది. జీడీఎస్‌లు ఇందులో కీలకం కానున్నారు’ అని కేబినెట్ నిర్ణయాలను కేంద్రం టెలికం మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. ఈ వేతనంతో పాటుగా 7వ వేతన సవరణ సంఘం సిఫారసుల ప్రకారం జీడీఎస్‌లకు 7% కరవు భత్యం కూడా చెల్లించనున్నట్లు మంత్రి చెప్పారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా దేశంలోని 1.3 లక్షల గ్రామీణ పోస్టాఫీసుల్లో పనిచేస్తున్న దాదాపు. 2.6లక్షల మంది జీడీఎస్‌లకు లబ్ధి చేకూరనుంది. ఈ పెంపు ద్వారా కేంద్ర ఖజానాపై ఏటా రూ.1,257.75 కోట్ల భారం పడనుంది. జీడీఎస్‌ల పనివేళల్లో ఏ మాత్రం మార్పు లేదని కేంద్రం స్పష్టం చేసింది. డిమాండ్లను అంగీకరిస్తూ.. వేతనాలు పెంచాలంటూ జీడీఎస్‌లు కొంతకాలంగా ధర్నా చేస్తున్నారు. వీరి డిమాండ్లను పరిశీలించేందుకు కేంద్రం పోస్టల్ బోర్డు సభ్యు డు కమలేశ్ చంద్ర నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేసింది. దీని ఆధారంగానే కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. జీడీఎస్‌లు డిమాండ్ చేసినట్లుగా ప్రతి ఏటా 3శాతం పెంచేందుకు కూడా కేంద్రం అంగీకరించింది. జీడీఎస్‌ల డిమాండ్లకు అంగీకరించినందున వీరంతా తిరి గి విధులకు హాజరవ్వాలని మంత్రి కోరారు. ‘గతంలో ఎన్నడూ లేనట్లుగా రిస్క్, హార్డ్‌షిప్ అలవెన్సు (నెలకు రూ.500)ను కేంద్రం ప్రవేశపెట్టింది. దీంతోపాటుగా ఆఫీసు నిర్వహణ అలవెన్సు, ఉమ్మడి విధుల అలవెన్సు, క్యాష్ కన్వేయెన్స్ చార్జీలు, సైకిల్/బోట్ మెయింటెనెన్స్ అలవెన్సు (గతంలో రూ.50–ప్రస్తుతం రూ.115), ఫిక్స్డ్ స్టేషనరీ చార్జీలను కూడా పెంచాం’ అని ఆయన పేర్కొన్నారు. మరిన్ని కేబినెట్ నిర్ణయాలు ► సంక్షోభంలో చిక్కుకున్న చక్కెర మిల్లులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.8,500 కోట్ల బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటించింది. తద్వారా చెరుకు రైతుల ఆదాయాన్ని, ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మిల్లులను నష్టాల్లోనుంచి బయటకు తీసుకొచ్చేందుకు వీలుంటుందని కేంద్రం భావిస్తోంది. మిల్లుల వద్ద కేజీ చక్కెర కనీస అమ్మకపు ధరను రూ.29గా నిర్ణయించింది. పంట మొదలైనప్పటినుంచి మిల్లులకు చేర్చేంతవరకు అయ్యే ఖర్చు మొత్తాన్ని మూడునెలలకోసారి నేరుగా రైతుల అకౌంట్లలో జమచేయనున్నారు. ► అలహాబాద్‌లో గంగానదిపై 10కి.మీ. వంతె నను నిర్మించేందుకు రూ.1,948 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపింది. ఎన్‌హెచ్ 96పై 6లేన్లతో నిర్మించే ఈ వంతెన 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ► డెన్మార్క్, బ్రిటన్, ఫ్రాన్స్, ఒమన్ సహా పలు దేశాలతో సుస్థిర అభివృద్ధి, స్మార్ట్ అర్బన్ డెవలప్మెంట్, అంతరిక్ష రంగంలో అభివృద్ధి తదితర అంశాలపై కుదిరిన ఒప్పందాలపై సమావేశం హర్షం వ్యక్తం చేసింది. ► పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగాల కొనసాగింపు కోసం రూ.10వేల కోట్ల విడుదలకూ ఆమోదం. -
రూ 50,000 కోట్ల ఉద్దీపన ప్యాకేజీ!
సాక్షి, న్యూఢిల్లీ : నిస్తేజంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలో జవసత్వాలు నింపేందుకు భారీ ప్యాకేజీని ప్రకటించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ద్రవ్య లోటును పూడ్చి మందగమనాన్ని అధిగమించేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 కోట్లతో ఉద్దీపన ప్యాకేజీకి ప్రభుత్వం తుదిమెరుగులు దిద్దుతోందని సమాచారం. ప్రైవేట్ పెట్టుబడులు ఆశించిన మేర లేకపోవడంతో ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపేందుకు ప్రభుత్వం సరైన సమయంలో తగిన చర్యలతో ముందుకు వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటికే స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన జేపీ మోర్గాన్ సంస్థ ఏర్పాటు చేసిన ఇండియా ఇన్వెస్టర్ సదస్సులోనూ జైట్లీ ఉద్దీపన ప్యాకేజ్‌పై సంకేతాలు పంపారు. ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్యాకేజీపై సంప్రదింపులు జరిగినట్టు సమాచారం. -
గ్రీస్‌లో పన్నుల మోత
- మళ్లీ తెరుచుకున్న బ్యాంకులు... - ఏటీఎం పరిమితుల సడలింపు... ఏథెన్స్: తాజాగా తీసుకుంటున్న బెయిలవుట్ ప్యాకేజీకి ప్రతిగా రుణదాతల షరతుల ప్రకారం గ్రీస్ కఠిన సంస్కరణల అమలు, పన్నుల మోత మోగింపు మొదలుపెట్టింది. చక్కెర మొదలుకుని కండోమ్స్, ట్యాక్సీలు, దహన సంస్కారాల దాకా అన్ని రకాల వస్తువులు, సేవలపైనా పన్నులను 13% నుంచి ఏకంగా 23%కి పెంచేసింది. అయితే, ఔషధాలు, పుస్తకాలు, పత్రికలు వంటి కొన్నింటిపై మాత్రం 6.5% నుంచి 6%కి తగ్గించింది. మరోవైపు, 3 వారాలుగా మూతబడిఉన్న గ్రీస్ బ్యాంకులు మళ్లీ తెరుచుకున్నాయి. 60 యూరోల రోజువారీ విత్‌డ్రాయల్ పరిమితిని కాస్త సడలించి శుక్రవారం దాకా రోజుకు గరిష్టంగా 300 యూరోల దాకా తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు గ్రీస్ బ్యాంకుల అసోసియేషన్ హెడ్ లూకా కట్సెలీ తెలిపారు. ఆ తర్వాత నుంచి దీన్ని 420 యూరోలకు పెంచనున్నట్లు వివరించారు. విదేశీ బ్యాంకులకు నగదు బదలాయింపు, కొత్త అకౌంట్లను తెరవడంపై నిషేధం మొదలైనవి కొనసాగనున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కొరత నేపథ్యంలో ప్రజలు భారీ ఎత్తున విత్‌డ్రాయల్స్ చేయకుండా జూన్ 29 నుంచి బ్యాంకులను మూసివేసిన సంగతి తెలిసిందే. మూసివేత కారణంగా ఇప్పటికే సంక్షోభంలో ఉన్న గ్రీస్ ఆర్థిక వ్యవస్థకి సుమారు 3 బిలియన్ యూరోల మేర నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. అటు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు(ఈసీబీ), అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)లకు రుణాల చెల్లింపును గ్రీస్ ప్రారంభించింది. తమకు రావాల్సిన 2 బిలియన్ యూరోలను గ్రీస్ చెల్లించినట్లు ఐఎంఎఫ్ తెలిపింది. యూరోపియన్ యూనియన్ నుంచి 7.16 బిలియన్ డాలర్ల తాత్కాలిక రుణం లభించడంతో పాత బకాయిల చెల్లింపులకు గ్రీస్‌కు వెసులుబాటు లభిస్తోంది. -
గ్రీస్ బెయిలవుట్‌కు ఓకే
- 17 గంటల సుదీర్ఘ చర్చల తర్వాత యూరోజోన్ ఆమోదం - 86 బిలియన్ యూరోల విలువైన మూడేళ్ల ప్యాకేజీకి ఒప్పందం - ప్రతిగా కఠినమైన షరతుల విధింపు... - 50 బిలియన్ యూరోల ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి గ్రీస్ అంగీకారం - రేపటికల్లా పార్లమెంటులో సంస్కరణలపై చట్టాలు చేయాలని గ్రీస్‌కు డెడ్‌లైన్... బ్రసెల్స్: ఎట్టకేలకు గ్రీస్ సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడింది. యూరోజోన్ నుంచి వైదొలగే ప్రమాదం నుంచి గ్రీస్ బయటపడింది. యూరోజోన్ నేతలు బెయిలవుట్ ప్యాకేజీకి సోమవారం అంగీకరించారు. దాదాపు 17 గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం కఠినమైన షరతులకు గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రస్ తలూపడంతో రుణదాతలు డీల్‌కు ఓకే చెప్పారు. మూడేళ్లపాటు అమలయ్యే విధంగా 86 బిలియన్ యూరోల(దాదాపు 96 బిలియన్ డాలర్లు) బెయిలవుట్ ప్యాకేజీని ఇచ్చేందుకు నిర్ణయించారు. దీంతో ఐదేళ్ల వ్యవధిలో గ్రీస్‌కు ఇది మూడో బెయిలవుట్ కానుంది. 2010 నుంచి ఇప్పటివరకూ అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్), యూరోపియన్ యూనియన్(ఈయూ)లు 240 బిలియన్ యూరోల విలువైన రెండు ప్యాకేజీలను అమలు చేసిన సంగతి తెలిసిందే. యూరోజోన్ సదస్సులో గ్రీస్‌కు ప్యాకేజీపై ఏకాభిప్రాయం కుదిరిందని.. యూరోపియన్ యూనియన్(ఈయూ) ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్ ప్రకటించారు. యూరోపియన్ స్థిరత్వ యంత్రాంగం(ఈఎస్ఎం) నుంచి గ్రీస్‌కు నిధులను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. యూరోజోన్ నుంచి గ్రీస్ వైదొలగుతుందన్న భయాలు తొలగినట్టేనని యూరోపియన్ కమిషన్(ఈయూ) ప్రెసిడెంట్ జీన్-క్లాడ్ జంకర్ పేర్కొన్నారు. బెయిలవుట్ గ్రీస్‌కు మంచిచేస్తుంది..: సిప్రస్ తాజా బెయిలవుట్ ప్యాకేజీతో గ్రీస్‌కు మంచి జరుగుతుందని ఆ దేశ ప్రధాని సిప్రస్ వ్యాఖ్యానించారు. గ్రీస్ ప్రజలు తమ నిర్ణయానికి మద్దతునిస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గ్రీస్‌కు ఫైనాన్షియల్ ఆక్సిజన్‌ను తొలగించే స్థితికి రుణదాతలు వచ్చినందున, కఠినమైన షరతులకు అంగీకరించాల్సి వచ్చిందని.. అయితే ఇందుకు ప్రతిగా రుణ పునర్వ్యవస్థీకరణ ఊరటను తాము పొందామని గ్రీస్ ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఇదిలాఉండగా.. బెయిలవుట్‌పై ముందునుంచీ వెనక్కిలాగుతూ వచ్చిన జర్మనీ.. ఎట్టకేలకు ఆఖరి నిమిషంలో కొత్త షరతులను తెరపైకి తెచ్చి గ్రీస్‌ను లొంగదీసుకోగలిగింది. గ్రీస్‌కు అత్యధికంగా రుణాలిచ్చిన దేశాల్లో జర్మనీ మొదటిస్థానంలో ఉంది. ‘గ్రీస్ ఆర్థిక పరిస్థితి ఇంకా భయానకంగానే ఉంది.. బెయిలవుట్ విజయవంతం అవుతుందన్న గ్యారెంటీ లేదు. ఇదోపెద్ద ప్రహసనమే’ అంటూ జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా.. ఈ బెయిలవుట్ ప్యాకేజీకి యూరోజోన్‌లోని చాలా దేశాలు తమ పార్లమెంటు ఆమోదాలను తీసుకోవాల్సి ఉంది. ఇవన్నీ జరిగాకే ప్యాకేజీ అమలు మొదలవుతుంది. అప్పటివరకూ తాత్కాలికంగా గ్రీస్ బ్యాంకులకు నిధులను అందించే(బ్రిడ్జ్ ఫండింగ్) అవకాశం ఉంది. గ్రీస్.. పెనంమీదనుంచి, పొయ్యిలోకి! - గత నెల 30న ఐఎంఎఫ్‌కు చెల్లించాల్సిన 1.7 బిలియన్ డాలర్ల రుణ బకాయి చెల్లించకపోవడంతో గ్రీస్ డిఫాల్ట్ అయింది. దీంతో గ్రీస్‌ను యూరోజోన్ నుంచి బయటికి వెళ్లాల్సిన పరిస్థితుల్లోకి నెట్టాయి. - సహాయ ప్యాకేజీ కొనసాగాలంటే కఠినమైన షరతులకు అంగీకరించాలన్న రుణదాతలపై గ్రీస్ ప్రధాని సిప్రస్ మొదట ఎదురుతిరిగారు. రిఫరెండంలో ప్రజలే షరతులకు ఒప్పుకోవాలా, వద్దా అనేది నిర్ణయిస్తారని ప్రకటించారు. చివరకు రిఫరెండంలో గ్రీస్ ప్రజలు షరతులకు నో చెప్పడంతో మళ్లీ గ్రీస్ పరిస్థితి మొదటికొచ్చింది. - ప్యాకేజీలు ఆగిపోవడంతో ప్రభుత్వం ఆర్థిక నియంత్రణలు(క్యాపిటల్ కంట్రోల్స్) అమల్లోకి తీసుకొచ్చింది. బ్యాంకుల మూసివేతతో పాటు ఏటీఎంల నుంచి నగదు విత్డ్రాయల్స్పై పరిమితులు(రోజుకు 60 యూరోలు మాత్రమే) విధించాల్సి వచ్చింది. - గ్రీస్ బ్యాంకుల్లో డిపాజిట్ నిధులు అడుగంటిపోవడంతో యూరో సింగిల్ కరెన్సీ(యూరోజోన్) నుంచి వైదొలగి.. సొంత కరెన్సీని మళ్లీ చెలామణీలోకి తీసుకురావాల్సిందేనన్న ఆందోళనలు కూడా చెలరేగాయి. - బెయిలవుట్ ప్యాకేజీకి సంబంధించి రిఫరెండంలో ప్రజలు ఏ కఠిన షరతులనైతే తిరస్కరించారో, దీనికంటే మరింత కఠినమైన షరతులకు ఇప్పుడు సిప్రస్ తలొగ్గడం విశేషం. - ఏకంగా ప్రభుత్వ ఆస్తులపై అజమాయిషీని బయటి దేశాలకు అప్పగించేందుకు ఓకే చెప్పడంపై గ్రీస్ ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. - సమీప భవిష్యత్తులోనే సిప్రస్ ప్రభుత్వం కూలిపోయి మళ్లీ ఎన్నికలు వచ్చే అవకాశాలు లేకపోలేదని అక్కడి రాజకీయ వర్గాలు జోస్యం చెబుతున్నాయి కూడా. - మరోపక్క, ఈ నెల 20కల్లా గ్రీస్ ఈసీబీకి 7 బిలియన్ యూరోలను తిరిగి చెల్లించాల్సి(బాండ్ రిడంప్షన్) ఉంది. వచ్చే నెలలోనూ ఈసీబీకి చెల్లింపుల బకాయితో కలిపితే గ్రీస్‌కు అవసరమైన మొత్తం 12 బిలియన్ యూరోలుగా అంచనా. షరతులు ఏంటంటే... - గ్రీస్ కఠినమైన కార్మిక, పెన్షన్ సంస్కరణలు, వ్యయ నియంత్రణ చర్యలకు కట్టుబడి ఉండాలి. దీనికి పార్లమెంటులో బుధవారం(ఈ నెల 15)కల్లా ఆమోదముద్ర పడాలి. తాజాగా కుదిరిన బెయిలవుట్ ప్యాకేజీని ఆమోదించేందుకు కూడా ఇదే డెడ్‌లైన్. ఆ తర్వాతే బెయిలవుట్‌పై తదుపరి సంప్రదింపులు మొదలవుతాయి. అంటే పెన్షన్లలో కోత, పన్నుల (వ్యాట్) పెంపు, ప్రైవేటీకరణ వంటి చర్యలను తక్షణం అమల్లోకి తీసుకురావాలన్నమాట. - అన్నింటికంటే ముఖ్యంగా జర్మనీ కొత్త షరతుతో ఆ దేశ సార్వభౌమాధికారం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రకారం గ్రీస్ 50 బిలియన్ యూరోల(దాదాపు 56 బిలియన్ డాలర్లు) విలువైన ప్రభుత్వ ఆస్తులను ఒక ప్రత్యేకమైన నిధికి బదలాయించాలి. ఈ ఆస్తులపై పర్యవేక్షణ, మధ్యవర్తిత్వం అంతా రుణదాతల(జర్మనీ నేతృత్వంలోని యూరోజోన్) చేతిలోనే ఉంటుంది. - ఈ ప్రత్యేక నిధికి చెందిన ఆస్తులను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని గ్రీస్ బ్యాంకులకు మూలధనం సమకూర్చడం, పాత రుణ బకాయిలు తీర్చడానికి వినియోగిస్తారు. ఇందులో 12 బిలియన్ యూరోలను గ్రీస్‌లో కొత్త పెట్టుబడులకు కూడా ఉపయోగించనున్నట్లు జర్మనీ చాన్స్‌లర్ మెర్కెల్ పేర్కొన్నారు. - కొత్త దివాలా(బ్యాంక్రప్సీ) నిబంధనలు, ఈయూ బ్యాంకింగ్ చట్టాన్ని గ్రీస్ ఆమోదించాలి. దీనిప్రకారం చెల్లింపుల్లో గ్రీస్ చేతులెత్తేస్తే... బడా డిపాజిటర్లు ముందుగా నష్టపోవాల్సి వస్తుంది. -
గ్రీస్ డీల్‌తో ర్యాలీ
- 300 పాయింట్ల లాభంతో 27,961కు సెన్సెక్స్ - 99 పాయింట్ల లాభంతో 8,460కు నిఫ్టీ గ్రీస్ తాజా బెయిలవుట్ ప్యాకేజీ యూరోజోన్ ఆమోదం పొందడంతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన స్టాక్ మార్కెట్ కూడా లాభాల బాట పట్టింది. మే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు బలహీనంగా ఉండటంతో కీలక రేట్లను ఆర్బీఐ తగ్గిస్తుందన్న అంచనాలు కూడా ర్యాలీకి జతయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, చైనా షాంఘై సూచి వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్లో కూడా లాభాల బాట పట్టడం... ప్రభావం చూపాయి. ఫలితంగా అన్ని రంగాల షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 300 పాయింట్ల లాభంతో 27,961 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 8,460 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, ఆయిల్, గ్యాస్ , వాహన, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లు లాభపడ్డాయి. గ్రీస్ మూడవ బెయిలవుట్ ప్యాకేజీకి యూరోజోన్ ఆమోదించడంతో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుందని, ఈ ప్యాకేజీతో యూరోజోన్ నుంచి గ్రీస్ వైదొలగాల్సి ఉండదని ప్రపంచ మార్కెట్లు ఊపిరిపీల్చుకున్నాయని విశ్లేషకులంటున్నారు. రెండు సెన్సెక్స్ షేర్లకే నష్టాలు... 30 సెన్సెక్స్ షేర్లలో 28 షేర్లు లాభపడ్డాయి. ఎల్ అండ్ టీ, ఓఎన్జీసీ..రెండు మాత్రమే నష్టపోయాయి. గెయిల్ 3.55 శాతం పెరిగి రూ. 373 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా లాభపడ్డ షేర్ ఇదే. ఇదే బాటలో హెచ్డీఎఫ్సీ, మారుతీ, ఎన్టీపీసీ, విప్రో, హిందాల్కోలు లాభపడ్డాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.2,545 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.14,257 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,08,956 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.528 కోట్ల నికర కొనుగోళ్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.172 కోట్ల నికర అమ్మకాలు జరిపారు. -
గ్రీస్ బెయిలవుట్.. డైలమా!
రెండోరోజూ యూరోజోన్ ఆర్థిక మంత్రుల భేటీ - ఈయూ సదస్సు రద్దు... - యూరో నేతల మధ్య అభిప్రాయభేదాలే కారణం.. బ్రసెల్స్: పతనం అంచున వేళాడుతున్న గ్రీస్‌కు మరో విడత బెయిలవుట్ ప్యాకేజీ డైలమాలో పడింది. కొత్త బెయిలవుట్ కోసం గ్రీస్ చేసిన విజ్ఞప్తి, సంస్కరణల ప్రతిపాదనలపై యూరోజోన్ నేతల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడమే దీనికి కారణం. శనివారం అర్ధరాత్రిదాకా కొనసాగిన యూరోజోన్(19 దేశాలు) ఆర్థిక మంత్రుల సమావేశంలో బెయిలవుట్‌పై ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయారు. ఆదివారం రెండో రోజు కూడా కొనసాగిన ఈ భేటీలో కూడా ఎలాంటి తుది నిర్ణయం వెలువడలేదు. అయితే, ఈ నెల 15కల్లా పన్నుల పెంపు, పెన్షన్లకోతకు సంబంధించిన గ్రీస్ చట్టాలను తీసుకురావాలని యూరో ఆర్థిక మంత్రుల గ్రూప్ డెడ్‌లైన్ విధించినట్లు తెలుస్తోంది. మరోపక్క, ఆదివారం జరగాల్సిన యూరోపియన్ యూనియన్(ఈయూ-28 దేశాలు) కీలక సదస్సు రద్దయినట్లు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్ ప్రకటించారు. పెన్షన్లలో కోత, పన్నుల పెంపు వంటి కఠిన వ్యయ నియంత్రణ చర్యలు తీసుకుంటామని, తమకు 80 బిలియన్ యూరోలకుపైగా విలువైన మూడో బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వాల్సిందిగా గ్రీస్ ప్రధాని అలెక్సిస్ సిప్రస్ ప్రతిపాదనలు సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే, గ్రీస్ ప్రణాళిక యూరోజోన్ నేతల్లో నమ్మకం కలిగించలేకపోయింది. ప్రధానంగా గ్రీస్‌కు అత్యధికంగా రుణాలిచ్చిన జర్మనీ కొత్త షరతులను తెరపైకి తెచ్చింది. తాత్కాలికంగా ఐదేళ్లపాటు గ్రీస్‌ను యూరో(సింగిల్ కరెన్సీ) నుంచి బయటికి పంపాలనేది జర్మనీ వాదన. ఫిన్లాండ్ కూడా గ్రీస్‌కు కొత్త ప్యాకేజీ ఏదీ ఇవ్వాల్సిన అవసరం లేదని కరాఖండీగా పేర్నొన్నట్లు సమాచారం. అయితే, గ్రీస్‌కు రుణాలిచ్చిన అంతర్జాతీయ రుణదాతలు(ఐఎంఎఫ్, ఈసీబీ) మాత్రం ఆ దేశం తాజాగా సమర్పించిన సంస్కరణ ప్రతిపాదనలపై సానుకూలత వ్యక్తం చేయడం గమనార్హం. రిఫరెండంలో గ్రీస్ ప్రజలు తిరస్కరించిన కఠిన షరతులనే ఆ దేశ ప్రభత్వం తాజాగా బెయిలవుట్ ప్యాకేజీ కోసం సమర్పించిన ప్రణాళికలో పొందుపరిచిన సంగతి తెలిసిందే. ఈ ప్రణాళికకు గ్రీస్ పార్లమెంటు శనివారమే ఆమోదముద్ర వేసింది. మరోపక్క, గ్రీస్‌లో ఆర్థిక నియంత్రణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏటీఎంలలో నగదు విత్‌డ్రా పరిమితుల(రోజుకు 60 యూరోలు)తో పాటు బ్యాంకులు కూడా మళ్లీ ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి. దాదాపు రెండు వారాలుగా ఇదే తంతు. దేశంలో ఆహార, ఔషధాల నిల్వలు త్వరలోనే ఖాళీ అయ్యే ప్రమాదం కూడా పొంచిఉండటంతో ప్రజలు బిక్కుబిక్ముమంటూ గడుపుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్లు అడుగంటిపోయాయని, త్వరలోనే బ్యాంకులు కుప్పకూలడం ఖాయమనే వార్తలు వినబడుతున్నాయి. -
కఠిన షరతులకు గ్రీసు ఓకే?
ఏథెన్స్ : బెయిలవుట్ ప్యాకేజీ ప్రతిపాదనలకు గురువారం రాత్రి గ్రీసు కేబినెట్ ఆమోదముద్రవేసింది. ఈ అర్థరాత్రికల్లా యూరోపియన్ సెం ట్రల్ బ్యాంక్, ఐఎంఎఫ్ తదితర రుణదాతలకు ఆ ప్రతిపాదనల్ని గ్రీసు పంపవచ్చని భావిస్తున్నారు. గత ఆదివారం రిఫరెండం నిర్వహణకు కారణమైన కఠిన షరతులకే గ్రీసు ప్రభుత్వం ఓకే చెపుతూ ప్రతిపాదనల్ని తయారుచేసిందన్న వార్త లు వెలువడుతున్నాయి. 50 బిలియన్ యూరోల బెయిలవుట్ ప్యాకేజీని కోరుతూ 13 బిలియన్ యూరోల మేర పెన్షన్ సంస్కరణలు, వ్యయాల కోత, పన్నుల పెంపు వంటివి అమలుచేయడానికి సంసిద్ధత వ్యక్తంచేస్తూ గ్రీసు ప్రతిపాదనల్ని రూపొందించిందని అనధికార వార్తలు వెలువడుతున్నాయి.