గ్రీస్ డీల్‌తో ర్యాలీ
- 300 పాయింట్ల లాభంతో 27,961కు సెన్సెక్స్
- 99 పాయింట్ల లాభంతో 8,460కు నిఫ్టీ
గ్రీస్ తాజా బెయిలవుట్ ప్యాకేజీ యూరోజోన్ ఆమోదం పొందడంతో ప్రపంచ మార్కెట్లతో పాటు మన స్టాక్ మార్కెట్ కూడా లాభాల బాట పట్టింది. మే పారిశ్రామికోత్పత్తి గణాంకాలు బలహీనంగా ఉండటంతో కీలక రేట్లను ఆర్‌బీఐ తగ్గిస్తుందన్న అంచనాలు కూడా ర్యాలీకి జతయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడం, చైనా షాంఘై సూచి వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్‌లో కూడా లాభాల బాట పట్టడం... ప్రభావం చూపాయి. ఫలితంగా అన్ని రంగాల షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరగడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 300 పాయింట్ల లాభంతో 27,961 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 8,460 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, ఆయిల్, గ్యాస్ , వాహన, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు లాభపడ్డాయి.
గ్రీస్ మూడవ బెయిలవుట్ ప్యాకేజీకి యూరోజోన్ ఆమోదించడంతో రిలీఫ్ ర్యాలీ చోటు చేసుకుందని, ఈ ప్యాకేజీతో యూరోజోన్ నుంచి గ్రీస్ వైదొలగాల్సి ఉండదని ప్రపంచ మార్కెట్లు ఊపిరిపీల్చుకున్నాయని విశ్లేషకులంటున్నారు.
రెండు సెన్సెక్స్ షేర్లకే నష్టాలు...
30 సెన్సెక్స్ షేర్లలో 28 షేర్లు లాభపడ్డాయి. ఎల్ అండ్ టీ, ఓఎన్‌జీసీ..రెండు మాత్రమే నష్టపోయాయి. గెయిల్ 3.55 శాతం పెరిగి రూ. 373 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అత్యధికంగా లాభపడ్డ షేర్ ఇదే. ఇదే బాటలో హెచ్‌డీఎఫ్‌సీ, మారుతీ, ఎన్‌టీపీసీ, విప్రో, హిందాల్కోలు లాభపడ్డాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,545 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.14,257 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,08,956 కోట్లుగా నమోదైంది. విదేశీ
ఇన్వెస్టర్లు రూ.528 కోట్ల నికర కొనుగోళ్లు, దేశీ ఇన్వెస్టర్లు రూ.172 కోట్ల నికర అమ్మకాలు జరిపారు.