గ్రీస్‌లో పన్నుల మోత
- మళ్లీ తెరుచుకున్న బ్యాంకులు...
- ఏటీఎం పరిమితుల సడలింపు...
ఏథెన్స్: తాజాగా తీసుకుంటున్న బెయిలవుట్ ప్యాకేజీకి ప్రతిగా రుణదాతల షరతుల ప్రకారం గ్రీస్ కఠిన సంస్కరణల అమలు, పన్నుల మోత మోగింపు మొదలుపెట్టింది. చక్కెర మొదలుకుని కండోమ్స్, ట్యాక్సీలు, దహన సంస్కారాల దాకా అన్ని రకాల వస్తువులు, సేవలపైనా పన్నులను 13% నుంచి ఏకంగా 23%కి పెంచేసింది. అయితే, ఔషధాలు, పుస్తకాలు, పత్రికలు వంటి కొన్నింటిపై మాత్రం 6.5% నుంచి 6%కి తగ్గించింది.
మరోవైపు, 3 వారాలుగా మూతబడిఉన్న గ్రీస్ బ్యాంకులు మళ్లీ తెరుచుకున్నాయి. 60 యూరోల రోజువారీ విత్‌డ్రాయల్ పరిమితిని కాస్త సడలించి శుక్రవారం దాకా రోజుకు గరిష్టంగా 300 యూరోల దాకా తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు గ్రీస్ బ్యాంకుల అసోసియేషన్ హెడ్ లూకా కట్సెలీ తెలిపారు. ఆ తర్వాత నుంచి దీన్ని 420 యూరోలకు పెంచనున్నట్లు వివరించారు. విదేశీ బ్యాంకులకు నగదు బదలాయింపు, కొత్త అకౌంట్లను తెరవడంపై నిషేధం మొదలైనవి కొనసాగనున్నాయి.
బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు కొరత నేపథ్యంలో ప్రజలు భారీ ఎత్తున విత్‌డ్రాయల్స్ చేయకుండా జూన్ 29 నుంచి బ్యాంకులను మూసివేసిన సంగతి తెలిసిందే. మూసివేత కారణంగా ఇప్పటికే సంక్షోభంలో ఉన్న గ్రీస్ ఆర్థిక వ్యవస్థకి సుమారు 3 బిలియన్ యూరోల మేర నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా. అటు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు(ఈసీబీ), అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్)లకు రుణాల చెల్లింపును గ్రీస్ ప్రారంభించింది. తమకు రావాల్సిన 2 బిలియన్ యూరోలను గ్రీస్ చెల్లించినట్లు ఐఎంఎఫ్ తెలిపింది. యూరోపియన్ యూనియన్ నుంచి 7.16 బిలియన్ డాలర్ల తాత్కాలిక రుణం లభించడంతో పాత బకాయిల చెల్లింపులకు గ్రీస్‌కు వెసులుబాటు లభిస్తోంది.