ఏథెన్స్: దాదాపు ఎనిమిదేళ్లుగా బెయిలవుట్ ప్యాకేజీలపై నెగ్గుకొస్తున్న గ్రీస్ మొత్తానికి సంక్షోభం నుంచి గట్టెక్కింది. రుణాల చెల్లింపుపై గ్రీస్‌తో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో యూరోజోన్ గ్రూప్ ఈ విషయాన్ని ప్రకటించింది. ఇప్పటికే ఇచ్చిన రుణాల చెల్లింపు గడువును మరో 10 ఏళ్ల పాటు పొడిగించేందుకు, అదనంగా మరో 15 బిలియన్ యూరోలు అందించేందుకు యూరో జోన్ మంత్రులు అంగీకరించినట్లు యూరోపియన్ యూనియన్ ఆర్థిక వ్యవహారాల విభాగం కమిషనర్ పియర్ మాస్కోవిచి తెలిపారు.
ఈ ఒప్పందంతో మూడో బెయిలవుట్ ప్యాకేజీ నుంచి గ్రీస్ బైటపడేందుకు వెసులుబాటు లభిస్తుంది. మరోవైపు, బెయిలవుట్ నుంచి బైటపడినప్పటికీ... గ్రీస్ నిలదొక్కుకోవాలంటే కఠిన సంస్కరణలు అమలు చేయాల్సి ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ఒప్పంద షరతుల కింద 2019లో పింఛనుల్లో మరోసారి కోత విధించేందుకు, ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని తగ్గించేందుకు గ్రీస్ అంగీకరించింది.
దీంతోపాటు 75% రుణాలను తిరిగి చెల్లించేదాకా గ్రీస్‌పై ఆర్థిక పర్యవేక్షణ కొనసాగుతుందని యూరోపియన్ కమిషన్ ఇప్పటికే స్పష్టం చేసింది. 2010 నుంచి గ్రీస్ 273.7 బిలియన్ యూరోల మేర నిధులను బెయిలవుట్ కింద పొందింది. ఈ సంక్షోభం ధాటికి 4 ప్రభుత్వాలు మారాయి. ఎకానమీ 25% క్షీణించింది. నిరుద్యోగిత 20% పైగా ఎగిసింది.
Comments
Please login to add a commentAdd a comment