న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్ సేవక్ (పోస్టుమ్యాన్)ల వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం మూడురెట్లు పెంచింది. దీంతో వీరు గరిష్టంగా రూ.14,500 వేతనాన్ని అందుకోనున్నారు. 2016 జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుంది. బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. బకాయిలను ఒకే వాయిదాలో చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. ‘ప్రస్తుతం నెలకు రూ.2,295ల వేతనం అందుకుంటున్న గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్)లు ఇకపై రూ. 10వేల వేతనాన్ని అందుకుంటారు. రూ. 2,745 ఉన్నవారు.. రూ. 10వేలు, రూ. 4,115 ఉన్న వారు గరిష్టంగా రూ.14,500 వేతనాన్ని పొందుతారు. దేశ పోస్టల్ శాఖ ముఖచిత్రం మారుతోంది. పోస్టల్ పార్శిల్ డైరెక్టరేట్‌ను ప్రారంభించాం. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులు ప్రారంభం కానున్నాయి.
రానున్న రోజుల్లో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఇన్సూరెన్స్ కంపెనీ కూడా రాబోతుంది. జీడీఎస్‌లు ఇందులో కీలకం కానున్నారు’ అని కేబినెట్ నిర్ణయాలను కేంద్రం టెలికం మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. ఈ వేతనంతో పాటుగా 7వ వేతన సవరణ సంఘం సిఫారసుల ప్రకారం జీడీఎస్‌లకు 7% కరవు భత్యం కూడా చెల్లించనున్నట్లు మంత్రి చెప్పారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా దేశంలోని 1.3 లక్షల గ్రామీణ పోస్టాఫీసుల్లో పనిచేస్తున్న దాదాపు. 2.6లక్షల మంది జీడీఎస్‌లకు లబ్ధి చేకూరనుంది. ఈ పెంపు ద్వారా కేంద్ర ఖజానాపై ఏటా రూ.1,257.75 కోట్ల భారం పడనుంది. జీడీఎస్‌ల పనివేళల్లో ఏ మాత్రం మార్పు లేదని కేంద్రం స్పష్టం చేసింది.
డిమాండ్లను అంగీకరిస్తూ..
వేతనాలు పెంచాలంటూ జీడీఎస్‌లు కొంతకాలంగా ధర్నా చేస్తున్నారు. వీరి డిమాండ్లను పరిశీలించేందుకు కేంద్రం పోస్టల్ బోర్డు సభ్యు డు కమలేశ్ చంద్ర నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేసింది. దీని ఆధారంగానే కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. జీడీఎస్‌లు డిమాండ్ చేసినట్లుగా ప్రతి ఏటా 3శాతం పెంచేందుకు కూడా కేంద్రం అంగీకరించింది. జీడీఎస్‌ల డిమాండ్లకు అంగీకరించినందున వీరంతా తిరి గి విధులకు హాజరవ్వాలని మంత్రి కోరారు. ‘గతంలో ఎన్నడూ లేనట్లుగా రిస్క్, హార్డ్‌షిప్ అలవెన్సు (నెలకు రూ.500)ను కేంద్రం ప్రవేశపెట్టింది. దీంతోపాటుగా ఆఫీసు నిర్వహణ అలవెన్సు, ఉమ్మడి విధుల అలవెన్సు, క్యాష్ కన్వేయెన్స్ చార్జీలు, సైకిల్/బోట్ మెయింటెనెన్స్ అలవెన్సు (గతంలో రూ.50–ప్రస్తుతం రూ.115), ఫిక్స్‌డ్ స్టేషనరీ చార్జీలను కూడా పెంచాం’ అని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని కేబినెట్ నిర్ణయాలు
► సంక్షోభంలో చిక్కుకున్న చక్కెర మిల్లులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.8,500 కోట్ల బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటించింది. తద్వారా చెరుకు రైతుల ఆదాయాన్ని, ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మిల్లులను నష్టాల్లోనుంచి బయటకు తీసుకొచ్చేందుకు వీలుంటుందని కేంద్రం భావిస్తోంది. మిల్లుల వద్ద కేజీ చక్కెర కనీస అమ్మకపు ధరను రూ.29గా నిర్ణయించింది. పంట మొదలైనప్పటినుంచి మిల్లులకు చేర్చేంతవరకు అయ్యే ఖర్చు మొత్తాన్ని మూడునెలలకోసారి నేరుగా రైతుల అకౌంట్లలో జమచేయనున్నారు.
► అలహాబాద్‌లో గంగానదిపై 10కి.మీ. వంతె నను నిర్మించేందుకు రూ.1,948 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపింది. ఎన్‌హెచ్ 96పై 6లేన్లతో నిర్మించే ఈ వంతెన 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు.
► డెన్మార్క్, బ్రిటన్, ఫ్రాన్స్, ఒమన్ సహా పలు దేశాలతో సుస్థిర అభివృద్ధి, స్మార్ట్ అర్బన్ డెవలప్‌మెంట్, అంతరిక్ష రంగంలో అభివృద్ధి తదితర అంశాలపై కుదిరిన ఒప్పందాలపై సమావేశం హర్షం వ్యక్తం చేసింది.
► పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్–3 ప్రయోగాల కొనసాగింపు కోసం రూ.10వేల కోట్ల విడుదలకూ ఆమోదం.
Comments
Please login to add a commentAdd a comment