మరువలేఖ
చిల్లకూరు: తోక లేని పిట్ట తొంభై ఆమడల దూరం పోయింది.. అది ఏంటీ అనే సామెత అడిగిన వెంటనే ‘ఉత్తరం’ అని సమాధానం వచ్చేది. అయితే ఇప్పుడు ఆ మాట చెప్పుకునేందుకే తప్ప.. ఉత్తరం రాసేవారే కరువయ్యారు. పోస్టు అని ఇంటి ముంగిట పోస్టు మ్యాన్ కేక వేయగానే.. ఉత్తరం అందుకునేందుకు ఉరుకున వచ్చేవారు. తమ బంధుమిత్రులు అందించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు ఉత్సుకతతో ఉత్తరాల కోసం ఎదురుచూసేవారు. మంచి వార్తను మోసుకొచ్చిన జాబులను భద్రంగా దాచుకునేవారు. ఆ రోజులు మధుర జ్ఞాపకాల్లా మిగిలిపోయాయి.
నేటి సమాజంలో పిల్లలకు పోస్టులో ఉత్తరం వచ్చి దానిని చదువుకుని ఎంతో తృప్తి పడే వారమని పెద్దలు చెబితే.. ఇంకా లేఖలు ఏంటి.. నేరుగా సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటున్నాం కదా అని అంటున్నారు. అయితే ముఖాముఖీగా వాట్సాప్ కాల్స్‌లో మాట్లాడుతున్నా, సంబోధనలో ఎన్నో మార్పులు ఉంటాయి. అయితే ఉత్తరంలో పలకరింపులు సంప్రదాయబద్ధంగా ఉంటూ మనసును ఆకట్టుకుంటాయి.
పెద్దలైతే మహారాజశ్రీ, చిన్న వారైతే చిరంజీవి, మహిళలను లక్ష్మీ సమానురాలైన, వితంతువులైతే గంగా భాగీరథీ సమానులైన అని సంబోధించేవారు. అలాగే ఉత్తరం ముగింపులో కూడా పెద్దలకు నమస్కారంతో అని, చిన్నవారికి ఆశీస్సులతో అని రాసేవారు. ఎవరైనా కాలం చేసిన వార్తను ఉత్తరంలో రాసేప్పుడు ఒక వైపున నలుపు రంగు ఉండేలా చూసేవారు. ఆ ఉత్తరాన్ని ఇంట్లోకి తీసుకెళ్లకుండా బయటనే చించివేసేవారు. అలాగే ముఖ్యమైన సమాచారం ఉండే లేఖరను జాగ్రత్తగా ఒక కమ్మీకి కుట్టి పెట్టే వారు.
స్మార్ట్‌ఫోన్ ప్రభావంతోనే..
ఉత్తరాలు రాసుకునే రోజుల్లో ప్రేమలేఖ, శ్రీవారికి ప్రేమలేఖ, ఇలా ఎన్నో లేఖలపై సినిమాలు తీశారు. అవి ప్రేక్షకులను సైతం విశేషంగా అలరించాయి. అయితే నేటి యువత చేతిలోకి వచ్చిన స్మార్ట్ ఫోన్ ను గంటల తరబడి వాడుతున్నప్పటికీ అవతల వారి పూర్తి యోగ క్షేమాలు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఒకటి రెండు మాటలు మాట్లాడిన తర్వాత టిక్ టాక్‌లు, ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్ ఇలా వేరే వ్యాపకాలకు మొగ్గుచూపుతున్నారు.
క్షేమ సమచారాలను కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులతో పంచుకునేందుకు కూడా ఇష్ట పడడం లేదు. ఉత్తరాలు రాసుకునే సమయంలో మరో ఉత్తరం వచ్చే వరకు ఎదురు చూపులు ఉండేవి. సమయం లేక రాయలేని వారికి ఉత్తరం రాసి చాలా రోజులైందనే దిగులు ఉండేది. కానీ నేడు స్మార్ట్ ఫోన్‌ల రాకతో ఉత్తరాల ఊసే లేకుండా పోయింది. దీంతో యువత అరకొర సందేశాలను పంపుకుని సంతోష పడుతున్నారే కానీ, పాత కాలంలో లాగా పూర్తి సమాచారం చదువుకుని తృప్తి పడలేక పోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment