sugar mills
-
షుగర్ మిల్ ఓనర్లతో ముఖేష్ అంబానీ చర్చలు - ఎందుకో తెలుసా?
భారతదేశంలో అత్యంత సంపన్నుడు, ప్రముఖ వ్యాపారవేత్త 'ముఖేష్ అంబానీ' (Mukesh Ambani) తన కొత్త వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయడానికి కొన్ని సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత? ఆ వ్యాపారం ఏంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ.. కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ఉత్పత్తికి కీలకమైన ముడిసరుకు చెరుకు వ్యర్దాలు సేకరించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే చక్కెర మిల్లు నిర్వాహకులతో చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. అనుకున్నవన్నీ సజావుగా జరిగితే.. రిలయన్స్ బయోగ్యాస్ ఉత్పత్తి ప్లాంట్స్ మరిన్ని త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. బయోగ్యాస్ ఉత్పత్తి కోసం కంపెనీ టన్నుల కొద్దీ చెరకు వ్యర్థాలు కొనుగోలు చేయనుంది. రానున్న ఐదేళ్లలో 100 బయోగ్యాస్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు.. ఒక్కో ప్లాంట్ 5.5 మిలియన్ టన్నుల వ్యవసాయ వ్యర్థాలు, సేంద్రియ వ్యర్థాలను ప్రాసెస్ చేసి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం. రిలయన్స్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్‌ను నిర్వహిస్తోంది, ఈ మధ్య కాలంలో ప్రారంభమైన ఈ ప్లాంట్ నిర్వహణకు టన్నుల కొద్దీ చెరుకు వ్యర్దాలు అవసరమని స్పష్టమైంది. బయోగ్యాస్ ప్లాంట్లలో ఉపయోగించే వ్యర్దాల వల్ల సంవత్సరానికి 2 మిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని, 2.5 టన్నుల సేంద్రియ ఎరువును తయారు చేయవచ్చని చెబుతున్నారు. ఇదీ చదవండి: రతన్ టాటా పేరిట మోసం.. వైరల్ అవుతున్న పోస్ట్ గత నెలలో కోల్‌కతాలో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 7వ ఎడిషన్‌లో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. స్వదేశంలో అభివృద్ధి చెందిన సాంకేతికల ఆధారంగా అతి పెద్ద బయో ఎనర్జీ ఉత్పత్తిదారుగా భారత్ అవతరిస్తుందని వెల్లడించారు. బయోగ్యాస్ ఉత్పత్తికి రిలయన్స్ కంపెనీ మాత్రమే కాకుండా అదానీ కంపెనీ కూడా ప్రయత్నాలు చేస్తోంది. -
నెమ్మదించిన చక్కెర మిల్లుల ఎగుమతి ఒప్పందాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చక్కెర ధరల పతనం నేపథ్యంలో దేశంలో చక్కెర మిల్లుల తాజా ఎగుమతి ఒప్పందాలు నెమ్మదించాయిని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) పేర్కొంది. అయితే ఒప్పందాలకు సమయం మించిపోలేదని, ఇందుకు సంబంధించి సమయం ఇంకా మిగిలే ఉందని కూడా స్పష్టం చేసింది. చక్కెర మిల్లుల సంఘం చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► 2021 అక్టోబర్ నుంచి 2022 సెప్టెంబర్ వరకూ సీజన్‌కాగా, ఇందులో తొలి రెండు నెలల్లో (అక్టోబర్, నవంబర్) చక్కెర మిల్లుల నుంచి 6.5 లక్షల టన్నుల ఎగుమతులు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంలో జరిగిన ఎగుమతులు 3 లక్షల టన్నులు. ► ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకూ 37 లక్షల టన్నుల ఎగుమతులకు చక్కెర మిల్లులు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే, ఈ ఒప్పందాలు చాలా వరకు అంతర్జాతీయంగా ముడి చక్కెర ధరలు పౌండ్‌కు (0.453 గ్రాములు) 20–21 సెంట్ల శ్రేణిలో (100 సెంట్లు ఒక డాలర్) ఉన్నప్పుడు జరిగాయి. కనిష్టంగా ఈ ధర 19 సెంట్స్‌కు పడిపోయింది. ప్రస్తుతం 19.6 సెంట్స్ స్థాయిలో ఉంది. అయితే ఈ ధర వద్ద భారత్ చక్కెర ఎగుమతులకు తగిన ధర లభించని పరిస్థితి ఉంది. ► ప్రస్తుత సీజన్లో ఇంకా తొమ్మిది నెలలకు పైగా సమయం మిగిలి ఉంది. ఈ పరిస్థితుల్లో చక్కెర మిల్లులు ఎగుమతి ఒప్పందాలను కుదుర్చుకోవడానికి అనుకూలమైన క్షణం కోసం వేచి ఉండటానికి తగినంత సమయం ఉందని సాధారణ అభిప్రాయం నెలకొంది. ► భారత చక్కెర మిల్లులు రాబోయే 7–8 నెలల్లో మరో రెండు మిలియన్ టన్నుల చక్కెరను ఎగుమతి చేయాలని ప్రపంచం కోరుకుంటే, ప్రపంచ (చక్కెర) ధరలు ప్రస్తుత స్థాయిల నుండి పెరగాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు కూడా అభిప్రాయపడుతున్నాయి. ► ప్రస్తుతం కొనసాగుతున్న 2021–22 సీజన్లో డిసెంబర్ 15 వరకు దేశంలో చక్కెర ఉత్పత్తి 77.91 లక్షల టన్నులకు చేరుకుంది. ఇది గత సీజన్ ఇదే కాలంలో పోల్చితే (73.34 లక్షల టన్నులు) ఎక్కువ. దేశంలోని పశ్చిమ ప్రాంతంలో చెరకు క్రషింగ్‌ను ముందుగా ప్రారంభించినందున ఈ సీజన్లో ఉత్పత్తి కొంచెం ఎక్కువగా ఉంది. ► అయితే దేశంలో చక్కెర ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుత సీజన్లో డిసెంబర్ 15 వరకు 19.83 లక్షల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరిగింది. గత సీజన్లో ఇదే కాలంతో పోల్చిచూస్తే (22.60 లక్షల టన్నులు) ఇది తక్కువ. ► దేశంలో రెండో అతిపెద్ద చక్కెర ఉత్పత్తి రాష్ట్రమైన మహారాష్ట్రలో ఉత్పత్తి 26.96 లక్షల టన్నుల నుంచి 31.92 లక్షల టన్నులకు పెరిగింది. క్రషింగ్ కార్యకలాపాలు ముందుగా ప్రారంభం కావడం, ప్రస్తుత సీజన్లో చెరకు ఎక్కువగా లభ్యం కావడం వంటి అంశాలు మహారాష్ట్రలో ఉత్పత్తి పెరుగుదలకు కారణం. ► దేశంలోని మూడో అతిపెద్ద చక్కెర ఉత్పత్తి రాష్ట్రమైన కర్ణాటకలో ఈ సీజన్లో డిసెంబర్ 15 వరకు ఉత్పత్తి 18.41 లక్షల టన్నులకు చేరుకుంది. క్రితం ఇదే సీజన్‌తో పోలిస్తే ఇది (16.65 లక్షల టన్నులు) ఇది ఎక్కువ. లక్ష్యం దిశగా ఇథనాల్ సరఫరా.... ఐఎస్ఎంఏ ప్రకటన ప్రకారం, ఇథనాల్ ఉత్పత్తి లక్ష్యం దిశగా వెళుతోంది. నవంబర్‌తో ముగిసిన 2020–21 సీజన్లో 302.30 కోట్ల లీటర్ల ఇథనాల్ సరఫరా జరిగిందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ తెలిపింది. దీనితో పెట్రోల్‌లో దీని మిశ్రమం అఖిల భారత స్థాయిలో 8.1 శాతానికి చేరింది. 2019–20లో ఈ మిశ్రమం కేవలం 5 శాతం కావడం గమనార్హం. ప్రస్తుత సీజన్లో (2021 డిసెంబర్–2022 నవంబర్) 10 శాతం మిశ్రమం లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇందుకు 459 కోట్ల లీటర్ల ఇథనాల్ అవసరం. మొదటి రెండు ఆసక్తి వ్యక్తీకరణ ప్రక్రియల (ఈఓఐ) అనంతరం చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఇప్పటివరకు మొత్తం 366 కోట్ల లీటర్లను కేటాయించడం జరిగింది. తదుపరి ఈఓఐల ద్వారా మిగిలిన లీటర్ల కేటాయింపులు జరుగుతాయని భావిస్తున్నట్లు ఐఎస్ఎంఏ పేర్కొంది. -
ఇథనాల్ తయారీకి ప్రోత్సాహకాలు
న్యూఢిల్లీ: చక్కెర మిల్లులకు ప్రోత్సాహకాలతో కూడిన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రానున్న సీజన్ 2021–22కు సంబంధించి అదనపు దేశీయ విక్రయకోటాను ప్రకటించింది. ఇందులో భాగంగా చెరకును ఇథనాల్ తయారీకి వినియోగించే మిల్లులకు ప్రోత్సాహకాలు లభించనున్నాయి. అంతర్జాతీయంగా ఉన్న గరిష్ట ధరలను సానుకూలంగా మలుచుకుని అక్టోబర్ నుంచి మొదలయ్యే కొత్త సీజన్ తొలినాళ్లలోనే ఎగుమతులకు ప్రణాళిక రూపొందించుకోవాలని మిల్లులకు సూచించింది. దీంతో ఎగుమతులకు సబ్సిడీలను కొనసాగించకపోవచ్చని తెలుస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద చక్కెర ఉత్పత్తి దేశంగా ఉన్న భారత్.. గత రెండేళ్ల నుంచి చక్కెర ఎగుమతులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది. దేశీయంగా వినియోగం కంటే ఉత్పత్తి అధికంగా ఉండడమే దీనికి కారణం. ఖరీదైన చమురు ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా దేశీయంగా ఇథనాల్ వినియోగాన్ని ప్రోత్సహించాలని కేంద్రం పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగానే ఇథనాల్ తయారీకి చెరకును మళ్లించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. రెండు విధాలుగా ప్రయోజనం చక్కెరను ఎగుమతి చేసే మిల్లులు.. ఇథనాల్ తయారీకి మళ్లించడం ద్వారా ‘అదనపు నెలవారీ దేశీయ కోటా’ కింద ప్రోత్సాహకాలు అందుకోవచ్చంటూ ఆహార శాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతానికి దేశీయ మార్కెట్లో చక్కెర విక్రయాలకు నెలవారీ కోటాను (సుమారు 21 లక్షల టన్నులు) కేంద్రం నిర్ణయిస్తోంది. ‘గత నెలరోజుల్లో అంతర్జాతీయంగా చక్కెర ధరలు గణనీయంగా పెరిగాయి. భారత ముడి చక్కెరకు ఎంతో డిమాండ్ ఉంది. కనుక రానున్న సీజన్లో ఎగుమతులకు సంబంధించి మిల్లులు ముందే ప్రణాళిక రూపొందించుకోవాలి. చక్కెర ఎగుమతితోపాటు.. ఇథనాల్ తయారీకి మళ్లించడం వల్ల మిల్లులకు నిధుల ప్రవాహం పెరిగి చెరకు రైతులకు సకాలంలో చెల్లింపులు చేయగలుగుతాయి. ఇది దేశీయంగా ధరల స్థిరత్వానికి, మిల్లులకు ఆదాయం పెరిగేందుకు తోడ్పడుతుంది’ అని ఆహార శాఖ పేర్కొంది. మూడు సీజన్లలో రూ.22,000 కోట్లు గడిచిన మూడు చెరకు సీజన్లలో ఇథనాల్ తయారీ వల్ల మిల్లులు రూ.22,000 కోట్ల ఆదాయన్ని పొందినట్టు కేంద్ర ఆహార శాఖ తెలిపింది. ప్రస్తుత సీజన్లో ఇథనాల్ విక్రయం ద్వారా మిల్లులకు రూ.15,000 కోట్ల ఆదాయం లభించినట్టు వివరించింది. 2019–20 సీజన్లో 9,26,000 టన్నుల చక్కెరను ఇథనాల్ తయారీకి మిల్లులు వినియోగించాయి. 2018–19లో 3,37,000 టన్ను లతో పోలిస్తే మూడింతలు పెరగడం గమనార్హం. -
‘తీపి’ తగ్గింది!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నష్టాల ఊబిలో ఉన్న చక్కెర కంపెనీలకు లాక్డౌన్ మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. డిమాండ్ లేకపోవడం, సరఫరా సమస్యలు పరిశ్రమకు కొత్తగా తోడయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా 50 శాతం మేర అమ్మకాలు పడిపోయాయని పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు. ఫ్యాక్టరీల వద్ద షుగర్ నిల్వలు పేరుకుపోయాయి. ఆదాయం తగ్గడం, కార్మికుల వేతనాలు, వడ్డీలు.. వెరసి చేతిలో ఉన్న మూలధనం కాస్తా ఆవిరైందని కంపెనీలు అంటున్నాయి. ఇప్పట్లో ఈ రంగం కోలుకోవడం కష్టమేనని కంపెనీల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. దేశవ్యాప్తంగా నెలకు సుమారు 22 లక్షల టన్నుల చక్కెర అమ్ముడవుతోంది. ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం గత సీజన్లో భారత్‌లో 172 మిల్లులు చక్కెర ఉత్పత్తి చేయగా.. ప్రస్తుత సీజన్లో ఈ సంఖ్య 139కి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నష్టాల్లోనే కంపెనీలు.. బస్తా (100 కిలోలు) చక్కెర ఉత్పత్తి వ్యయం ప్రస్తుతం రూ.4,000 పైమాటే. మిల్లుల వద్ద విక్రయ ధర రూ.3,400 ఉంది. అంటే ఒక్కో బస్తాపై కంపెనీలు రూ.600 నష్టం మూటగట్టుకుంటున్నాయి. చిన్న కంపెనీలకైతే∙రూ.700 వరకు నష్టం వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో 100 కిలోల బస్తాకు మిల్లు వద్ద అమ్మకం ధర రూ.4,200 ఉంటేనే కంపెనీలు మనగలవని కేసీపీ షుగర్, ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జి.వెంకటేశ్వర రావు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఒకట్రెండు కంపెనీలు మినహా మిగిలినవన్నీ భారీ నష్టాల్లో ఉన్నాయని చెప్పారు. శానిటైజర్ల తయారీని కొన్ని కంపెనీలు చేస్తున్నప్పటికీ, వీటి ద్వారా వచ్చే ఆదాయం తాత్కాలికమేన న్నారు. రికవరీ ఇప్పట్లో కష్టమే..: కౌలు ధర అధికంగా ఉండడం, కూలీ ఖర్చులు తడిసిమోపెడు అవడం, ఉత్పత్తికి ధర లేకపోవడంతో చెరకు పంట వేయడానికి రైతులు ముందుకు రావడం లేదని వెంకటేశ్వరరావు తెలిపారు. ‘రైతులకు మిల్లులు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోతున్నాయి. దేశంలో అప్పులు లేని కంపెనీలు ఒకట్రెండు మాత్రమే ఉంటాయి. వైరస్ భయానికి ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి కార్మికులు రావడం లేదు. లాక్డౌన్ తదనంతరం తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఆరు నెలలకుపైగా సమయం పడుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్యోగుల కోత, వేతనాల కుదింపు తప్పదు. మిల్లు వద్ద విక్రయ ధర పెరిగితే తప్ప ఈ పరిశ్రమ రికవరీ ఇప్పట్లో కనపడడం లేదు’ అని చెప్పారు. అక్టోబర్ నాటికి..: దేశంలో 2019 అక్టోబరు 1 నాటికి 110 లక్షల టన్నుల చక్కెర నిల్వలు ఉన్నాయి. 2019–20 (అక్టోబర్–సెప్టెంబర్) క్రషింగ్ కాలంలో దేశవ్యాప్తంగా 270 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అవుతుందని సమాచారం. ఈ ఏడాది 50–60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి కావచ్చని పరిశ్రమ భావించగా, ఇప్పటికి సుమారు 30 లక్షల టన్నులే ఎగుమతైంది. అంతర్జాతీయంగా తక్కువ ధర, సరఫరా సమస్యల కారణంగా 10 లక్షల టన్నుల చక్కెర ఎగుమతి ఆగిపోనుందని ఓ కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. దీంతో ఈ ఏడాది అక్టోబరు 1 నాటికి చక్కెర నిల్వలు దేశంలో సుమారు 75 లక్షల టన్నులు ఉంటాయని ఆయన చెప్పారు. -
మిల్లుకు షుగరొచ్చింది!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వినియోగంతో పోలిస్తే ఉత్పత్తి మించిపోవటంతో దేశంలో చక్కెర నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి భారత్‌లో 140 లక్షల టన్నుల చక్కెర నిల్వలున్నాయి. 2019 అక్టోబర్–2020 సెప్టెంబరులో (ప్రస్తుత సీజన్లో) 268.5 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి కానుంది. వినియోగం ప్రస్తుతం ఏటా 250 లక్షల టన్నులే ఉంటోంది. వాస్తవానికి ప్రస్తుత సీజన్లో 282 లక్షల టన్నులు వస్తు ందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ గతంలో అంచనా వేసింది. వర్షాలు అతిగా పడడంతో చెరకు పంట పాడైంది. దీంతో అంచనాల కంటే దిగుబడి తగ్గింది. అయినప్పటికీ చక్కెర నిల్వలు మాత్రం తగ్గే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. మరోవైపు భారత్ నుంచి పంచదార ఎగుమతులు గత సీజన్లో 40–44 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. కాకపోతే ఎగుమతి ప్రోత్సాహకాల తాలూకు బకాయిలు ఏడాదిగా నిలిచిపోయాయి. దీంతో ఈ ఏడాది ఎగుమతులపై కంపెనీలు ఆసక్తి చూప డం లేదు. 2018–19 సీజన్లో భారత్‌లో రికార్డు స్థాయిలో 332 లక్షల టన్నుల పంచదార ఉత్పత్తి అయింది. బస్తాకు రూ.700–900 నష్టం.. పంచదార ఉత్పత్తి వ్యయం కిలోకు ఉత్తరాదిన రూ.36, దక్షిణాదిన రూ.38–40 అవుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో మిల్లు వద్ద విక్రయ ధర ప్రస్తుతం కిలోకు రూ.31– 32 ఉంది. తయారీ వ్యయం కంటే అమ్మకం ధర తక్కువ. ఉత్తరాదితో పోలిస్తే కూలీలకు అయ్యే వ్యయం ఇక్కడ మూడు రెట్లు ఎక్కువ. కంపెనీలకు 100 కిలోల బస్తాపై రూ.700–900 నష్టం వాటిల్లుతోందని కేసీపీ షుగర్, ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చీఫ్ ఆçపరేటింగ్ ఆఫీసర్ జి.వెంకటేశ్వర రావు సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒకటిరెండు మిల్లులు మినహా దేశంలోని అన్ని కంపెనీలూ నష్టాలతో నడుస్తున్నాయని వెల్లడించారు. అప్పులు కట్టడానికి కంపెనీలకున్న ఆస్తులు సరిపోవని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగుమతి ప్రోత్సాహకాలు తెలుగు రాష్ట్రాల్లోని కంపెనీలకు రూ.150 కోట్లకు పైగా రావాలని ఆయన గుర్తు చేశారు. మూతపడుతున్న కంపెనీలు.. నష్టాలు మూటగట్టుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని కంపెనీలు తమ ఫ్యాక్టరీలను ఒకదాని వెంట ఒకటి మూ సివేస్తున్నాయి. గతేడాది కృష్ణా జిల్లాలో డెల్టా షుగర్స్ యూనిట్, నెల్లూరులో ఎంపీ షుగర్స్, చిత్తూరులో వాణి షుగర్స్ మూతపడ్డాయి. ఈ ఏడాది గోదావరి జిల్లాలో సర్వరాయ షుగర్ గేట్లు కూడా మూసుకున్నాయి. ఇదే గోదావరి జిల్లాలో నవభారత్ గ్రూప్ ఫ్యాక్టరీలో 2020–21 సీజన్లో ఉత్పత్తిని నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. ఇక కృష్ణా జిల్లా లక్ష్మీపురం యూనిట్లో కేసీపీ షుగర్, ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కొద్ది రోజుల క్రితం లే ఆఫ్ ప్రకటించింది. మరిన్ని ఫ్యాక్టరీలు మూసివేతకు సిద్ధంగా ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అటు రైతులకు కంపెనీలు చెల్లించాల్సిన బకాయిలు ఈ ఏడాది మార్చిలో రూ.85,000 కోట్లుండగా ప్రస్తుతం రూ. 15,000 కోట్లకు పరిమితమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ బకాయిలు రూ.150 కోట్లు ఉంటాయని తెలిసింది. -
గ్రామీణ పోస్టుమ్యాన్‌కు పండగే!
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే డాక్ సేవక్ (పోస్టుమ్యాన్)ల వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం మూడురెట్లు పెంచింది. దీంతో వీరు గరిష్టంగా రూ.14,500 వేతనాన్ని అందుకోనున్నారు. 2016 జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుంది. బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. బకాయిలను ఒకే వాయిదాలో చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. ‘ప్రస్తుతం నెలకు రూ.2,295ల వేతనం అందుకుంటున్న గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్)లు ఇకపై రూ. 10వేల వేతనాన్ని అందుకుంటారు. రూ. 2,745 ఉన్నవారు.. రూ. 10వేలు, రూ. 4,115 ఉన్న వారు గరిష్టంగా రూ.14,500 వేతనాన్ని పొందుతారు. దేశ పోస్టల్ శాఖ ముఖచిత్రం మారుతోంది. పోస్టల్ పార్శిల్ డైరెక్టరేట్‌ను ప్రారంభించాం. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులు ప్రారంభం కానున్నాయి. రానున్న రోజుల్లో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఇన్సూరెన్స్ కంపెనీ కూడా రాబోతుంది. జీడీఎస్‌లు ఇందులో కీలకం కానున్నారు’ అని కేబినెట్ నిర్ణయాలను కేంద్రం టెలికం మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. ఈ వేతనంతో పాటుగా 7వ వేతన సవరణ సంఘం సిఫారసుల ప్రకారం జీడీఎస్‌లకు 7% కరవు భత్యం కూడా చెల్లించనున్నట్లు మంత్రి చెప్పారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా దేశంలోని 1.3 లక్షల గ్రామీణ పోస్టాఫీసుల్లో పనిచేస్తున్న దాదాపు. 2.6లక్షల మంది జీడీఎస్‌లకు లబ్ధి చేకూరనుంది. ఈ పెంపు ద్వారా కేంద్ర ఖజానాపై ఏటా రూ.1,257.75 కోట్ల భారం పడనుంది. జీడీఎస్‌ల పనివేళల్లో ఏ మాత్రం మార్పు లేదని కేంద్రం స్పష్టం చేసింది. డిమాండ్లను అంగీకరిస్తూ.. వేతనాలు పెంచాలంటూ జీడీఎస్‌లు కొంతకాలంగా ధర్నా చేస్తున్నారు. వీరి డిమాండ్లను పరిశీలించేందుకు కేంద్రం పోస్టల్ బోర్డు సభ్యు డు కమలేశ్ చంద్ర నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేసింది. దీని ఆధారంగానే కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. జీడీఎస్‌లు డిమాండ్ చేసినట్లుగా ప్రతి ఏటా 3శాతం పెంచేందుకు కూడా కేంద్రం అంగీకరించింది. జీడీఎస్‌ల డిమాండ్లకు అంగీకరించినందున వీరంతా తిరి గి విధులకు హాజరవ్వాలని మంత్రి కోరారు. ‘గతంలో ఎన్నడూ లేనట్లుగా రిస్క్, హార్డ్‌షిప్ అలవెన్సు (నెలకు రూ.500)ను కేంద్రం ప్రవేశపెట్టింది. దీంతోపాటుగా ఆఫీసు నిర్వహణ అలవెన్సు, ఉమ్మడి విధుల అలవెన్సు, క్యాష్ కన్వేయెన్స్ చార్జీలు, సైకిల్/బోట్ మెయింటెనెన్స్ అలవెన్సు (గతంలో రూ.50–ప్రస్తుతం రూ.115), ఫిక్స్డ్ స్టేషనరీ చార్జీలను కూడా పెంచాం’ అని ఆయన పేర్కొన్నారు. మరిన్ని కేబినెట్ నిర్ణయాలు ► సంక్షోభంలో చిక్కుకున్న చక్కెర మిల్లులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.8,500 కోట్ల బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటించింది. తద్వారా చెరుకు రైతుల ఆదాయాన్ని, ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మిల్లులను నష్టాల్లోనుంచి బయటకు తీసుకొచ్చేందుకు వీలుంటుందని కేంద్రం భావిస్తోంది. మిల్లుల వద్ద కేజీ చక్కెర కనీస అమ్మకపు ధరను రూ.29గా నిర్ణయించింది. పంట మొదలైనప్పటినుంచి మిల్లులకు చేర్చేంతవరకు అయ్యే ఖర్చు మొత్తాన్ని మూడునెలలకోసారి నేరుగా రైతుల అకౌంట్లలో జమచేయనున్నారు. ► అలహాబాద్‌లో గంగానదిపై 10కి.మీ. వంతె నను నిర్మించేందుకు రూ.1,948 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపింది. ఎన్‌హెచ్ 96పై 6లేన్లతో నిర్మించే ఈ వంతెన 2021 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. ► డెన్మార్క్, బ్రిటన్, ఫ్రాన్స్, ఒమన్ సహా పలు దేశాలతో సుస్థిర అభివృద్ధి, స్మార్ట్ అర్బన్ డెవలప్మెంట్, అంతరిక్ష రంగంలో అభివృద్ధి తదితర అంశాలపై కుదిరిన ఒప్పందాలపై సమావేశం హర్షం వ్యక్తం చేసింది. ► పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగాల కొనసాగింపు కోసం రూ.10వేల కోట్ల విడుదలకూ ఆమోదం. -
సుగర్స్ చేదుగీతం
చెరకు నీటమునగడంతో రికవరీ తగ్గిపోయే ప్రమాదం క్రషింగ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం తుఫాన్ దెబ్బనుంచి తేరుకోని మిల్లు యాజమాన్యాలు జిల్లాలోని సహకార చక్కెర మిల్లులు చేదుగీతం ఆలపిస్తున్నాయి. చెరకు గానుగాట అయోమయంలో పడింది. ముందుగానే చేపట్టి లక్ష్యానికి మించి క్రషింగ్ జరపాలన్న వారి ఆశలు గల్లంతయ్యాయి. రికవరీ తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉంది. హుదూద్ ధాటికి కర్మాగారాల్లోని గోడౌన్లు, మిల్లు హౌస్‌లు ధ్వంసమయ్యాయి. ఆ నష్టం నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాయి. నీట మునిగిన చెరకును మరో రెండు నెలల వరకు క్రషింగ్ జరపలేని పరిస్థితి. ఇవన్నీ యాజమాన్యాలకు పెనుభారం కానున్నాయి. చోడవరం: సహకార చక్కెర ఫ్యాక్టరీల క్రషింగ్ పరిస్థితి అయోమయంలోపడింది. గడిచిన పదేళ్లతో పోల్చుకుంటే ఈ ఏడాది జిల్లాలో చెరకు విస్తీర్ణం భాగా పెరిగిందని మురిసిపోయినప్పటికీ.. అంతలోనే తీవ్ర నిరాశ మిగిలింది.పెరిగిన పంట విస్తీర్ణంతో ఈ సారి ఇటు పంచదార, అటు బెల్లం దిగుబడి బాగా పెరుగుతుందని అంతా ఆశించారు. జిల్లాలోని చోడవరం, ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీలు ఈసీజన్లో 11ల క్షల టన్నులకు మించి క్రషింగ్ చేయగలమని ధీమా వ్యక్తం చేశాయి. ఒక్క గోవాడ ఫ్యాక్టరీయే గతేడాది 5.48లక్షల టన్నుల క్రషింగ్ చేపట్టింది. ఈ ఏడాది పెరిగిన చెరకు విస్తీర్ణం దృష్ట్యా 6లక్షల టన్నుల వరకు క్రషింగ్ చేయగలమని ధీమాను వ్యక్తం చేసింది. ఇందు కోసం ముందుగానే క్రషింగ్ ప్రా రంభించాలని నిర్ణయించింది. గోవాడ ఈ నేల 15వ తేదీ నుంచి మిగతా ఫ్యాక్టరీలు కూడా డిసెంబరు ఆరంభంలోనే గానుగాటకు సిద్ధమయ్యాయి. ఇందుకు ఎంతో ఉత్సాహంగా ఏర్పాట్లు చేసుకున్నాయి. ఇంతలో హుదూద్ ఫ్యాక్టరీలకు పెద్ద నష్టాన్ని చేకూర్చింది. తుఫాన్ తాకిడి ఇటు ఫ్యాక్టరీల్లో ఉన్న గోడౌన్లు, మిల్లు హౌస్‌లు ధ్వంసమయ్యాయి. అటు చెరకు పంట ఘోరంగా దెబ్బతింది. ఇది మిల్లుల యాజమాన్యాలకు కోలుకోలేని పరిణామం. అత్యధికంగా చెరకు పండించే చోడవరం, మాడుగుల, యలమంచిలి, అనకాపల్లి, పాయకరావుపేట నియోజకవర్గాల్లోనే తుపాన్ తీవ్రతో చెరకు తోటలు పెద్ద విస్తీర్ణంలో నేలమట్టమయ్యాయి. గోవాడ ఫ్యాక్టరీ వాస్తవానికి మరో 13రోజులుల్లో గానుగాట ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం పక్వానికి వచ్చిన 2లక్షల టన్నుల చెరకు కటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. తుఫాన్‌కు ఆయా తోటలన్నీ నేలకొరిగి నీరుపట్టాయి. దీంతో రికవరీ పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉంది. జడచుట్టు దశలో ఉన్న వేలాది ఎకరాల్లో తోటలు నీటమునిగి, నేలమట్టమవ్వడంతో చెరకు గెడ ఎదుగుదల తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే పరిస్థితి జిల్లాలోని మిగతా మూడు ఫ్యాక్టరీల పరిధిలోనూ నెలకొంది. తాండవకు కొంతమేర ఫర్వాలేకపోయినా ఏటికొప్పాకకు కూడా దెబ్బతిన్న చెరకు పంటతో తీవ్ర నష్టమే పొంచివుంది. మరో పక్క తుఫాన్‌కు దెబ్బతిన్న మిల్లుహౌస్. గోడౌన్లను మునుపటి స్థితికి తెచ్చుకోవడం యాజమాన్యాలకు తలకు మించిన భారమవుతుంది. దెబ్బతిన్న మిషనరీ, పంచదారకు ఇన్సూరెన్సు కోసం ఆయా కర్మాగారాల అధికారులు నానా తంటాలు పడుతున్నారు. వీలైనంత తొందరగా మరమ్మతులు చేపట్టేందుకు యత్నిస్తున్నారు. ఆగమేఘాలమీద వీటన్నింటిని చేపట్టినా పూర్తికావడానికి కనీసం రెండు నెలలైనా పడుతుంది. ప్రస్తుతం చెరకు తోటల్లో నీరున్నందున క్రషింగ్‌ను కొంత ఆలస్యం చేస్తే తప్పా రికవరీ వచ్చే అవకాశం లేదని కూడా యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో డిసెంబరు 20 తర్వాతే గోవాడ, మిగతా ఫ్యాక్టరీల క్రషింగ్ ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక వేళ క్రషింగ్ మరింత ఆలస్యమైతే పక్వానికి వచ్చి నేలకొరిగిన చెరకు తోటల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇన్ని అవాంతరాల మధ్య ఈ ఏడాది క్రషింగ్ ఫ్యాక్టరీలకు పెనుభారం కానుంది. -
చక్కెర మిల్లులకు తీపి కబురు..
న్యూఢిల్లీ: నిధుల కొరతతో అల్లాడుతున్న చక్కెర కర్మాగారాలకు తీపి కబురు ఇది. చెరకు రైతులకు చెల్లింపులు చేసేందుకు మిల్లులకు రూ.6,600 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రుణాలపై వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.2,750 కోట్ల మేరకు ఉండే వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించనుంది. గురువారం నిర్వహించిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఆహార శాఖ మంత్రి కేవీ థామస్ తెలిపారు. ద్రవ్య సంక్షోభం నుంచి చక్కెర మిల్లులు గట్టెక్కడానికి కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ సారథ్యంలో ఏర్పాటైన మంత్రుల బృందం చేసిన సిఫార్సుల మేరకు సీసీఈఏ ఈ నిర్ణయం తీసుకుంది. షుగర్ మిల్లులకు ఈ రుణాలను బ్యాంకులు సమకూరుస్తాయి. చెరకు రైతులకు చెల్లించడానికి మాత్రమే ఈ సొమ్మును వినియోగించాలి. రైతుల పాత బకాయిలనూ తీర్చవచ్చు. గత మూడేళ్లలో చక్కెర మిల్లులు చెల్లించిన ఎక్సైజ్ సుంకానికి సమాన స్థాయిలో రుణాలలిస్తారు. వీటిని ఐదేళ్లలో తిరిగి చెల్లించాలి. రుణ చెల్లింపుపై తొలి రెండేళ్లు మారటోరియం సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. అంటే మూడో ఏట నుంచి రుణ చెల్లింపు ప్రారంభించవచ్చు. పరిమాణపరంగా ఎలాంటి ఆంక్షల్లేకుండా పంచదార ఎగుమతులను కొనసాగించాలన్న ప్రతిపాదనను సీసీఈఏ ఆమోదించింది. దేశీయ మార్కెట్లో అవసరానికి మించి చక్కెర నిల్వలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖల మంత్రి మనీష్ తివారీ చెప్పారు. బొగ్గు గనుల నుంచి గ్యాస్ ఉత్పత్తికి అనుమతి తమ అధీనంలోని బొగ్గు గనుల సహజ వాయువు ఉత్పత్తి చేసేందుకు కోల్ ఇండియా లిమిటెడ్‌కు లెసైన్స్ ఇవ్వాలని సీసీఈఏ నిర్ణయించింది. కోల్ ఇండియాకు చెందిన బొగ్గు గనుల్లో కోల్ బెడ్ మీథేన్ (సీబీఎం) అన్వేషణ, ఉత్పత్తికి అనుమతించినట్లు బొగ్గు శాఖ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ తెలిపారు. ఆహార భద్రతా ప్రణాళిక, వాణిజ్య సహకార ఒప్పందాలపై ఇటీవలి డబ్ల్యుటీఓ సదస్సులో భారత ప్రభుత్వం అనుసరించిన వైఖరిని సీసీఈఏ సమర్థించింది. భారత్‌తో సహా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయ సబ్సిడీలపై శాశ్వత పరిష్కారం కనుగొనే వరకు ఈ అంశాన్ని సవాలు చేయరాదని బాలిలో జరిగిన డబ్ల్యుటిఓ సదస్సులో నిర్ణయించారు. -
అక్రమ విక్రయం
సాక్షి, ముంబై: నష్టాల్లో నడుస్తున్నాయని కుంటిసాకులు చూపుతూ రాష్ట్రంలోని సహకార చక్కెర కర్మాగారాలను చౌకగా అమ్మేస్తున్నారని ప్రముఖ సామాజిక కార్యకర్తలు అన్నా హజారే, మేధా పాట్కర్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టాలను కారణంగా చూపుతూ అయినవారికి తక్కువ ధరకే చక్కెర కర్మాగారాలను కట్టబెడుతున్నారని, ఈ వ్యవహారం మొత్తంలో పదివేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని వారు ఆరోపించారు. సహకార రంగంలోని చక్కెర కర్మాగారాల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ నగరంలోని ఆజాద్ మైదాన్ నుంచి మంత్రాలయ వరకు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అన్నాహజారే, మేధా పాట్కర్‌లు అధికార, ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. కర్మాగారాలను కొనుగోలు చేసిన వారితో రాజకీయ నాయకులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలున్నాయని ఆరోపించారు. న్యాయవిచారణ జరిపించాలి.. చక్కెర పరిశ్రమల విక్రయాల్లో జరిగిన కుంభకోణానికి సంబంధించిన న్యాయవిచారణ జరిపించాలని అన్నా హజారే, మేధా పాట్కర్‌లు డిమాండ్ చేశారు. దీంతోపాటు ఇతర పరిశ్రమల నిర్వహణపై కూడా విచారణ జరపాలన్నారు. ఈ కుంభకోణంలో అధికార, ప్రతిపక్షాలు బాధ్యులేనని చెప్పారు. న్యాయవిచారణ జరిపించినట్టయితే బీహార్‌లో లాలూప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లినట్టు అనేక మంది మహారాష్టల్రోని నాయకులు కూడా కుంభకోణం కేసుల్లో జైలుకు వెళ్తారన్నారు. ఈ సభలో ఎంపీ రాజు శెట్టి, మాజీ ఎమ్మెల్యే మాణిక్ జాధవ్లతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన రైతులు, చక్కెర పరిశ్రమలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్న అనేక మంది రైతులు, కార్మికులు పాల్గొన్నారు. వీరంతా ప్రభుత్వ, ప్రతిపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు. జైలుభరో చేపడతాం.. న్యాయవిచారణ జరిపి, జరుగుతున్న విక్రయాలను నిలిపివేయనట్టయితే జైలుభరోకు పిలుపునిస్తామని హజారే, పాట్కర్‌లు హెచ్చరించారు. చక్కెర పరిశ్రమలన్నింటిపై యాజమాన్య హక్కులు రైతులకే కల్పించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్టవ్య్రాప్తంగా జైలుభరో చేపడతామని హెచ్చరించారు. ఈ సభ అనంతరం సహ్యాద్రి గెస్టహౌస్కు వెళ్లిన వీరందరు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో భేటీ అయ్యారు. కుంభకోణానికి సంబంధించిన విషయాలను ఆయనకు వివరించారు. వెంటనే విక్రయాలను ఆపివేయాలని కోరారు.