హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వినియోగంతో పోలిస్తే ఉత్పత్తి మించిపోవటంతో దేశంలో చక్కెర నిల్వలు పేరుకుపోతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి భారత్‌లో 140 లక్షల టన్నుల చక్కెర నిల్వలున్నాయి. 2019 అక్టోబర్–2020 సెప్టెంబరులో (ప్రస్తుత సీజన్లో) 268.5 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి కానుంది. వినియోగం ప్రస్తుతం ఏటా 250 లక్షల టన్నులే ఉంటోంది. వాస్తవానికి ప్రస్తుత సీజన్లో 282 లక్షల టన్నులు వస్తు ందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ గతంలో అంచనా వేసింది. వర్షాలు అతిగా పడడంతో చెరకు పంట పాడైంది. దీంతో అంచనాల కంటే దిగుబడి తగ్గింది. అయినప్పటికీ చక్కెర నిల్వలు మాత్రం తగ్గే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. మరోవైపు భారత్ నుంచి పంచదార ఎగుమతులు గత సీజన్లో 40–44 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. కాకపోతే ఎగుమతి ప్రోత్సాహకాల తాలూకు బకాయిలు ఏడాదిగా నిలిచిపోయాయి. దీంతో ఈ ఏడాది ఎగుమతులపై కంపెనీలు ఆసక్తి చూప డం లేదు. 2018–19 సీజన్లో భారత్‌లో రికార్డు స్థాయిలో 332 లక్షల టన్నుల పంచదార ఉత్పత్తి అయింది.
బస్తాకు రూ.700–900 నష్టం..
పంచదార ఉత్పత్తి వ్యయం కిలోకు ఉత్తరాదిన రూ.36, దక్షిణాదిన రూ.38–40 అవుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో మిల్లు వద్ద విక్రయ ధర ప్రస్తుతం కిలోకు రూ.31– 32 ఉంది. తయారీ వ్యయం కంటే అమ్మకం ధర తక్కువ. ఉత్తరాదితో పోలిస్తే కూలీలకు అయ్యే వ్యయం ఇక్కడ మూడు రెట్లు ఎక్కువ. కంపెనీలకు 100 కిలోల బస్తాపై రూ.700–900 నష్టం వాటిల్లుతోందని కేసీపీ షుగర్, ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చీఫ్ ఆçపరేటింగ్ ఆఫీసర్ జి.వెంకటేశ్వర రావు సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒకటిరెండు మిల్లులు మినహా దేశంలోని అన్ని కంపెనీలూ నష్టాలతో నడుస్తున్నాయని వెల్లడించారు. అప్పులు కట్టడానికి కంపెనీలకున్న ఆస్తులు సరిపోవని ఆవేదన వ్యక్తం చేశారు. ఎగుమతి ప్రోత్సాహకాలు తెలుగు రాష్ట్రాల్లోని కంపెనీలకు రూ.150 కోట్లకు పైగా రావాలని ఆయన గుర్తు చేశారు.
మూతపడుతున్న కంపెనీలు..
నష్టాలు మూటగట్టుకోవడంతో తెలుగు రాష్ట్రాల్లోని కంపెనీలు తమ ఫ్యాక్టరీలను ఒకదాని వెంట ఒకటి మూ సివేస్తున్నాయి. గతేడాది కృష్ణా జిల్లాలో డెల్టా షుగర్స్ యూనిట్, నెల్లూరులో ఎంపీ షుగర్స్, చిత్తూరులో వాణి షుగర్స్ మూతపడ్డాయి. ఈ ఏడాది గోదావరి జిల్లాలో సర్వరాయ షుగర్ గేట్లు కూడా మూసుకున్నాయి. ఇదే గోదావరి జిల్లాలో నవభారత్ గ్రూప్ ఫ్యాక్టరీలో 2020–21 సీజన్లో ఉత్పత్తిని నిలిపివేయనున్నట్టు ప్రకటించింది. ఇక కృష్ణా జిల్లా లక్ష్మీపురం యూనిట్లో కేసీపీ షుగర్, ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కొద్ది రోజుల క్రితం లే ఆఫ్ ప్రకటించింది. మరిన్ని ఫ్యాక్టరీలు మూసివేతకు సిద్ధంగా ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అటు రైతులకు కంపెనీలు చెల్లించాల్సిన బకాయిలు ఈ ఏడాది మార్చిలో రూ.85,000 కోట్లుండగా ప్రస్తుతం రూ. 15,000 కోట్లకు పరిమితమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ బకాయిలు రూ.150 కోట్లు ఉంటాయని తెలిసింది.
మిల్లుకు షుగరొచ్చింది!!
Published Tue, Dec 10 2019 5:19 AM | Last Updated on Tue, Dec 10 2019 9:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment