
ముంబై: తీవ్ర కష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ విమానయాన సేవల సంస్థ ఎయిర్ ఇండియాకు రూ.11,000 కోట్ల బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనపై కేంద్ర పౌర విమానయాన శాఖ, ఆర్థిక శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని చెప్పాయి.
నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను ప్రైవేటు పరం చేద్దామనుకున్న ప్రయత్నాలు విఫలం కావడంతో ప్యాకేజీ ఇచ్చే ప్రతిపాదన ముందుకు రావడం గమనార్హం. భారంగా మారిన రుణాలను కొంత వరకు తగ్గించుకునేందుకు ఈ నిధులను వినియోగించనుంది. ‘‘ఎయిర్ ఇండియా బ్యాలన్స్ షీటును మెరుగుపరచడం వల్ల వ్యూహాత్మక విక్రయానికి ప్రభుత్వం తిరిగి ప్రయత్నించినప్పుడు అది ఇన్వెస్టర్లకు ఆకర్షణీయంగా మారుతుంది’’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఎయిర్ ఇండియాకు పూర్వపు యూపీఏ హయాంలో 2012లో ఒకసారి బెయిలవుట్ ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. ఈ సంస్థకు 2017 మార్చి నాటికి రూ.48,000 కోట్ల రుణ భారం ఉంది. గత నెలలో రూ.980 కోట్ల మేర సప్లిమెంటరీ గ్రాంట్స్ కింద ఎయిర్ ఇండియాకు ఇచ్చేందుకు కేంద్రం పార్లమెంటు ఆమోదం కోరిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment