బెర్లిన్: కరోనా వైరస్ పరిణామాలతో విమాన సేవలు నిల్చిపోయి, సంక్షోభంలో కూరుకుపోయిన విమానయాన సంస్థ లుఫ్తాన్సాకు కొంత ఊరట లభించింది. కష్టకాలంలో నిలదొక్కుకునేందుకు కంపెనీకి 9.8 బిలియన్ డాలర్ల బెయిలవుట్ ప్యాకేజీ ప్రతిపాదనకు జర్మనీ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. వేల కొద్దీ ఉద్యోగాలను కాపాడేందుకు, బలవంతపు టేకోవర్ ముప్పు తప్పించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఈ డీల్‌తో లుఫ్తాన్సాలో ప్రభుత్వానికి 20% వాటాలు దక్కుతాయి. దీన్ని 25% దాకా పెంచుకోవచ్చు.
లుఫ్తాన్సా సాధారణంగా లాభాల్లోనే ఉందని, కరోనా మహమ్మారి పరిణామాల కారణంగా సమస్యల్లో చిక్కుకుందని జర్మనీ ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ తోడ్పాటు పరిమిత కాలానికి మాత్రమేనని, లుఫ్తాన్సాలో వాటాలను 2023 ఆఖరు నాటికి విక్రయించాలని భావిస్తున్నట్లు వివరించింది. ‘కంపెనీ మళ్లీ నిలదొక్కుకున్నాక ప్రభుత్వం వాటాలను విక్రయించేస్తుంది. ఆ నిధులతో సమస్యల్లో ఉన్న ఇతర కంపెనీలకు తోడ్పాటు అందించేందుకు వీలవుతుంది‘ అని ఆర్థిక మంత్రి ఒలాఫ్ షోల్జ్ తెలిపారు.
షరతులు వర్తిస్తాయి..: బెయిలవుట్ ప్యాకేజీ ఇచ్చేందుకు జర్మనీ ప్రభుత్వం పలు షరతులు విధించింది. భవిష్యత్‌లో డివిడెండ్ చెల్లింపులను తొలగించడం, మేనేజ్‌మెంట్ జీతభత్యాలపై పరిమితులు వంటివి వీటిలో ఉన్నాయి. అలాగే సంస్థ పర్యవేక్షణ బోర్డులో ప్రభుత్వం తరఫు నుంచి ఇద్దరు సభ్యులు ఉంటారు. సాధారణ షేర్‌హోల్డర్ల సమావేశంలో ఓటింగ్ హక్కులేవీ ప్రభుత్వం వినియోగించుకోబోదు. కరోనా వైరస్ కష్టాల బారిన పడిన కంపెనీలను గట్టెక్కించేందుకు జర్మనీ ప్రభుత్వం 100 బిలియన్ యూరోలతో ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసింది. దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి జర్మనీ కేంద్ర ప్రభుత్వం క్రమంగా వాటాలు విక్రయించేస్తూ వస్తోంది. ప్రస్తుతం డాయిష్ పోస్ట్, డాయిష్ టెలికం వంటి కొన్ని దిగ్గజ సంస్థల్లో మాత్రమే ప్రభుత్వానికి భారీ వాటా ఉంది.
మాకూ ప్యాకేజీ ఇవ్వరూ..
కొలంబియాకు చెందిన ఏవియాంకా హోల్డింగ్స్, ఆస్ట్రేలియన్ సంస్థ వర్జిన్ ఆస్ట్రేలియా హోల్డింగ్స్ మొదలైనవి దివాలా చట్టాల కింద రక్షణ కోరుతూ దరఖాస్తులు చేసుకున్నాయి. మరికొన్ని సంస్థలు ప్రస్తుతం తమ తమ దేశాల ప్రభుత్వాల నుంచి బెయిలవుట్ ప్యాకేజీలు కోరుతున్నాయి. ఫ్రాన్స్–నెదర్లాండ్స్ విమానయాన సంస్థ ఎయిర్ ఫ్రాన్స్–కేఎల్‌ఎం, అమెరికాకు చెందిన అమెరికన్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్ తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.
లాటామ్ దివాలా..
అమెరికాలో అతి పెద్ద ఎయిర్‌లైన్స్‌లో ఒకటైన లాటామ్ తాజాగా కరోనా దెబ్బతో దివాలా తీసింది. రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రయత్నాల్లో ఉన్న లాటామ్.. దివాలా చట్టం కింద రక్షణ కోరుతూ కోర్టులో దరఖాస్తు చేసుకుంది. అర్జెంటీనా, బ్రెజిల్, పరాగ్వేలోని అనుబంధ సంస్థలను మాత్రం ఇందులో చేర్చలేదు. దివాలా చట్టం కింద పిటీషన్ వేసినప్పటికీ యథాప్రకారం కార్యకలాపాలు కొనసాగుతాయని, త్వరలో రుణ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తి కాగలదని సంస్థ సీఈవో రాబర్టో అల్వో ఆశాభావం వ్యక్తం చేశారు. చిలీకి చెందిన ఎల్‌ఏఎన్, బ్రెజిల్‌కి చెందిన టీఏఎం సంస్థల విలీనంతో 2012లో లాటామ్ ఏర్పడింది. ఇందులో అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్ అతి పెద్ద వాటాదారుగా ఉంది. ప్రస్తుతం లాటామ్ ఆస్తులు 10 బిలియన్ డాలర్లుగా, బాకీలు 50 బిలియన్ డాలర్ల దాకా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment