
కొత్త టారిఫ్‌లు విధిస్తున్నట్లు ప్రకటన
బ్రస్సెల్స్: అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ) మధ్య టారిఫ్‌ల యుద్ధం జరుగుతోంది. ఈయూకు సంబంధించిన స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పెంచిన 25 శాతం టారిఫ్‌లు బుధవారం నుంచే అమల్లోకి వచ్చాయి. అందుకు ప్రతీకారంగా ఈయూ సైతం గంటల వ్యవధిలోనే అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు ప్రకటించింది. అమెరికా నుంచి వచ్చే పారిశ్రామిక, పాడి ఉత్పత్తులపై కొత్త సుంకాలు వసూలు చేయనున్నట్లు బుధవారం ఈయూ తేల్చిచెప్పింది. 28 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై సుంకాలు అతిత్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఒత్తిడి పెంచడంలో భాగంగానే ఈయూ సైతం టారిఫ్‌లు విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రంప్ వెనక్కి తగ్గితే ఈయూ దేశాలు సైతం వెనక్కి తగ్గే అవకాశం ఉంది. టారిఫ్‌ల విషయంలో అమెరికాతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెవెన్ చెప్పారు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికవ్యవస్థలపై టారిఫ్‌ల పేరిట పెనుభారం మోపడం తమకు ఇష్టం లేదన్నారు. అయితే, అమెరికా చర్యలకు ప్రతిచర్యగా తాము సైతం టారిఫ్‌లు విధించాలని నిర్ణయించినట్లు తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment