ఇన్వెస్టర్ల జాగ్రత్త | Slight losses with profit-booking | Sakshi
Sakshi News home page

ఇన్వెస్టర్ల జాగ్రత్త

Published Tue, Jul 21 2015 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 5:51 AM

ఇన్వెస్టర్ల జాగ్రత్త

ఇన్వెస్టర్ల జాగ్రత్త

లాభాల స్వీకరణతో స్వల్ప నష్టాలు
- 43 పాయింట్లు క్షీణించి 28,420కు సెన్సెక్స్
- 6 పాయింట్ల నష్టంతో 8,603కు నిఫ్టీ

స్టాక్ మార్కెట్ గత మూడు ట్రేడింగ్ సెషన్లలో లాభాల్లో ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి(మంగళవారం) నుంచి ప్రారంభం కానుండడం, ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,  హిందూస్తాన్ యూనిలివర్ వంటి దిగ్గజ కంపెనీల ఆర్థిక ఫలితాలు కూడా మంగళవారమే వెలువడనున్న  నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరించారు. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది.  బీఎస్‌ఈ సెన్సెక్స్ 43 పాయింట్ల నష్టంతో 28,420 పాయింట్ల వద్ద, నిఫ్టీ 6 పాయింట్ల నష్టంతో 8,603 పాయింట్ల వద్ద ముగిశాయి.
 
బిల్లులపైనే దృష్టంతా...పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఎలా జరగనున్నాయోనని ఇన్వెస్టర్లు వేచి చూస్తున్నారని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ చెప్పారు. ఈ సమావేశాల్లోనే భూ సేకరణ, జీఎస్‌టీ బిల్లులను పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. ఈ బిల్లుల భవితవ్యం ఎలా ఉండబోతోందోనన్న ఆందోళనతో కొనుగోళ్లకు దూరంగా ఉన్న ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ చేశారని నిపుణులంటున్నారు. అమ్మకాల ఒత్తిడి కారణంగా 28,320 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సెన్సెక్స్ యూరోప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడంతో ఒకింత తేరుకుంది.

స్టాక్ మార్కెట్ సూచీలు ఇంట్రాడే నష్టాల నుంచి చివరి గంటలో కొంతమేరకు కోలుకున్నాయి. 224 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్ చివరకు  43 పాయింట్ల నష్టంతో 28,420 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 8,624-8,559 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిల మధ్య కదలాడి చివరకు 6 పాయింట్ల నష్టంతో 8,603 పాయింట్ల వద్ద ముగిసింది. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,776 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.13,823 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,00,479 కోట్లుగా నమోదైంది.

 
 20 సెన్సెక్స్ కంపెనీల్లో తగ్గిన ఎఫ్‌ఐఐల వాటా
 విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు 20 సెన్సెక్స్ షేర్లలో తమ వాటా (ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో)తగ్గించుకున్నారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండడం, అంతర్జాతీయ అంశాలు, పన్ను సంబంధిత అంశాల కారణంగా టాటా స్టీల్, ఐటీసీ సహా మొత్తం 20 సెన్సెక్స్ షేర్లలో వాటాను ఎఫ్‌ఐఐలు తగ్గించుకున్నారని నిపుణులంటున్నారు.

కాగా 10 సెన్సెక్స్ షేర్లలో వాటా పెంచుకున్నారు.   టాటా మోటార్స్,  మహీంద్రా అండ్ మహీంద్రా,  హిందాల్కో ఇండస్ట్రీస్, హీరోమోటొకార్ప్, బజాజ్ ఆటోల్లో కూడా ఎఫ్‌ఐఐలు వాటా తగ్గించుకున్నారు. ఇన్ఫోసిస్, లుపిన్, సిప్లా తదితర కంపెనీల్లో  వాటాను పెంచుకున్నారు. ఈ ఏడాది జనవరి-మార్చి క్వార్టర్‌కు క్యాపిటల్ మార్కెట్లో రూ.79,000 కోట్లు పెట్టుబడులు పెట్టిన విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు  రూ.547 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement