డాలర్, యూఎస్ బాండ్ ఈల్డ్ కీలకం
చమురు ధరలు, విదేశీ అంశాల ఎఫెక్ట్
ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులే
మార్కెట్ల ట్రెండ్‌పై నిపుణుల అంచనాలు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ముగింపునకు వస్తోంది. ఈ బాటలో ఈ వారం మరికొన్ని కార్పొరేట్ దిగ్గజాలు జులై–సెప్టెంబర్(క్యూ2) పనితీరును వెల్లడించనున్నాయి. వీటితోపాటు దేశీ స్టాక్ మార్కెట్లను దేశీ ఆర్థిక గణాంకాలు సైతం ఈ వారం ప్రధానంగా ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ వారం ఓఎన్‌జీసీ, అపోలో టైర్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్, బీఈఎంఎల్, బీఏఎస్‌ఎఫ్, బాష్, అల్ఫాజియో, జూబిలెంట్ ఫుడ్, ఎన్‌ఎండీసీ, బ్లూడార్ట్, బ్రిటానియా, ఫినొలెక్స్ కేబుల్స్, హ్యుందాయ్, ఈఐహెచ్, బటర్‌ఫ్లై గంధిమతి, బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్(ఫస్ట్‌క్రై మాతృ సంస్థ), గ్రాఫైట్, ఎల్జీ ఎక్విప్‌మెంట్స్, శ్రీ సిమెంట్, జైడస్ వెల్‌నెస్ తదితర పలు కంపెనీలు క్యూ2 ఫలితాలు ప్రకటించనున్నాయి.
పావెల్ ప్రసంగం
అక్టోబర్ నెలకు యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు 13న వెలువడనున్నాయి. సెప్టెంబర్‌లో 2.4 శాతంగా నమోదైంది. ఇక కీలకమైన వినియోగ ధరల సూచీ సెప్టెంబర్‌లో 3.3 శాతాన్ని తాకింది. శుక్రవారం కీలక అంశాలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగించనున్నారు. గత వారం చేపట్టిన పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించిన విషయం విదితమే. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు తాజాగా 4.5–4.75 శాతానికి చేరాయి. ఇక మరోపక్క జులై–సెప్టెంబర్‌కు జపాన్ జీడీపీ గణాంకాలు ఇదే రోజు వెల్లడికానున్నాయి. ఏప్రిల్–జూన్‌లో జపాన్ జీడీపీ 0.7 శాతం పుంజుకుంది. అక్టోబర్‌కు చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం తెలియనున్నాయి. సెప్టెంబర్‌లో 5.4 శాతం పురోగతి నమోదైంది.
ఇతర అంశాలు
యూఎస్ ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనుండటంతో డాలరు ఇండెక్స్‌సహా యూఎస్ బాండ్ల ఈల్డ్స్ ఇటీవల బలపడుతూ వస్తున్నాయి. దీంతో డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి సరికొత్త కనిష్టాలను తాకుతోంది. 84.38వరకూ పతనమైంది. మరోవైపు రాజకీయ, భౌగోళిక అనిశ్చతుల కారణంగా ముడిచమురు ధరలు ఆటుపోట్లకు లోనవుతున్నాయి. కాగా.. ఈ వారం దేశ, విదేశీ గణాంకాలు సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. వీటికితోడు దేశీ కార్పొరేట్ల క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పల్కా ఆరోరా చోప్రా తెలియజేశారు.
గత వారమిలా
విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం డీలా పడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు. ఈ నెలలోనూ అమ్మకాలు కొనసాగే వీలున్నట్లు అంచనా వేశారు. అంతంతమాత్ర క్యూ2 ఫలితాలు, ప్రపంచ అనిశి్చతుల కారణంగా ఈ వారం మార్కెట్లు సైడ్‌వేస్‌లో కదలవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్‌మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. అయితే ఫలితాల ఆధారంగా కొన్ని స్టాక్స్‌లో యాక్టివిటీకి వీలున్నట్లు తెలియజేశారు. గత వారం సెన్సెక్స్ 238 పాయింట్లు క్షీణించి 79,486వద్ద నిలవగా.. నిఫ్టీ 156 పాయింట్లు కోల్పోయి 24,148 వద్ద ముగిసింది.
ఎఫ్‌పీఐలు5 రోజుల్లో రూ. 20,000 కోట్లు
ఈ నెలలోనూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో విక్రయాలకే మొగ్గు చూపుతున్నారు. దీంతో తొలి ఐదు ట్రేడింగ్ సెషన్లలో నికరంగా దాదాపు రూ. 20,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీయడం, దేశీయంగా మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరి ఖరీదుగా మారడం తదితర కారణాలతో కొద్ది రోజులుగా ఎఫ్‌పీఐలు నిరవధిక అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా గత నెలలో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 94,017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. అయితే అంతకుముందు సెప్టెంబర్‌లో గత 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! కాగా.. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఒకే నెలలో అత్యధికంగా రూ. 61,973 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
శుక్రవారం సెలవు గురునానక్ జయంతి
సందర్భంగా వారాంతాన(15) ఈక్విటీ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. అక్టోబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు మంగళవారం(12న) వెలువడనున్నాయి. సెప్టెంబర్‌లో సీపీఐ 5.49 శాతంగా నమోదైంది. టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు గురువారం(14న) వెల్లడికానున్నాయి. సెప్టెంబర్‌లో డబ్ల్యూపీఐ 1.84 శాతానికి చేరింది. ఈ బాటలో ప్రభుత్వం శుక్రవారం(15న) అక్టోబర్ నెలకు వాణిజ్య గణాంకాలు విడుదల చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment