Inflation Statistics
-
గణాంకాలు, ఫలితాలపై దృష్టి
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ముగింపునకు వస్తోంది. ఈ బాటలో ఈ వారం మరికొన్ని కార్పొరేట్ దిగ్గజాలు జులై–సెప్టెంబర్(క్యూ2) పనితీరును వెల్లడించనున్నాయి. వీటితోపాటు దేశీ స్టాక్ మార్కెట్లను దేశీ ఆర్థిక గణాంకాలు సైతం ఈ వారం ప్రధానంగా ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ వారం ఓఎన్జీసీ, అపోలో టైర్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్, బీఈఎంఎల్, బీఏఎస్ఎఫ్, బాష్, అల్ఫాజియో, జూబిలెంట్ ఫుడ్, ఎన్ఎండీసీ, బ్లూడార్ట్, బ్రిటానియా, ఫినొలెక్స్ కేబుల్స్, హ్యుందాయ్, ఈఐహెచ్, బటర్‌ఫ్లై గంధిమతి, బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్(ఫస్ట్‌క్రై మాతృ సంస్థ), గ్రాఫైట్, ఎల్జీ ఎక్విప్మెంట్స్, శ్రీ సిమెంట్, జైడస్ వెల్నెస్ తదితర పలు కంపెనీలు క్యూ2 ఫలితాలు ప్రకటించనున్నాయి. పావెల్ ప్రసంగం అక్టోబర్ నెలకు యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు 13న వెలువడనున్నాయి. సెప్టెంబర్‌లో 2.4 శాతంగా నమోదైంది. ఇక కీలకమైన వినియోగ ధరల సూచీ సెప్టెంబర్‌లో 3.3 శాతాన్ని తాకింది. శుక్రవారం కీలక అంశాలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగించనున్నారు. గత వారం చేపట్టిన పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించిన విషయం విదితమే. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు తాజాగా 4.5–4.75 శాతానికి చేరాయి. ఇక మరోపక్క జులై–సెప్టెంబర్‌కు జపాన్ జీడీపీ గణాంకాలు ఇదే రోజు వెల్లడికానున్నాయి. ఏప్రిల్–జూన్‌లో జపాన్ జీడీపీ 0.7 శాతం పుంజుకుంది. అక్టోబర్‌కు చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం తెలియనున్నాయి. సెప్టెంబర్‌లో 5.4 శాతం పురోగతి నమోదైంది. ఇతర అంశాలు యూఎస్ ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనుండటంతో డాలరు ఇండెక్స్సహా యూఎస్ బాండ్ల ఈల్డ్స్ ఇటీవల బలపడుతూ వస్తున్నాయి. దీంతో డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి సరికొత్త కనిష్టాలను తాకుతోంది. 84.38వరకూ పతనమైంది. మరోవైపు రాజకీయ, భౌగోళిక అనిశ్చతుల కారణంగా ముడిచమురు ధరలు ఆటుపోట్లకు లోనవుతున్నాయి. కాగా.. ఈ వారం దేశ, విదేశీ గణాంకాలు సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. వీటికితోడు దేశీ కార్పొరేట్ల క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పల్కా ఆరోరా చోప్రా తెలియజేశారు. గత వారమిలా విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం డీలా పడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు. ఈ నెలలోనూ అమ్మకాలు కొనసాగే వీలున్నట్లు అంచనా వేశారు. అంతంతమాత్ర క్యూ2 ఫలితాలు, ప్రపంచ అనిశి్చతుల కారణంగా ఈ వారం మార్కెట్లు సైడ్‌వేస్‌లో కదలవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. అయితే ఫలితాల ఆధారంగా కొన్ని స్టాక్స్‌లో యాక్టివిటీకి వీలున్నట్లు తెలియజేశారు. గత వారం సెన్సెక్స్ 238 పాయింట్లు క్షీణించి 79,486వద్ద నిలవగా.. నిఫ్టీ 156 పాయింట్లు కోల్పోయి 24,148 వద్ద ముగిసింది.ఎఫ్‌పీఐలు5 రోజుల్లో రూ. 20,000 కోట్లు ఈ నెలలోనూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో విక్రయాలకే మొగ్గు చూపుతున్నారు. దీంతో తొలి ఐదు ట్రేడింగ్ సెషన్లలో నికరంగా దాదాపు రూ. 20,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీయడం, దేశీయంగా మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరి ఖరీదుగా మారడం తదితర కారణాలతో కొద్ది రోజులుగా ఎఫ్‌పీఐలు నిరవధిక అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా గత నెలలో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 94,017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. అయితే అంతకుముందు సెప్టెంబర్‌లో గత 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! కాగా.. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఒకే నెలలో అత్యధికంగా రూ. 61,973 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. శుక్రవారం సెలవు గురునానక్ జయంతి సందర్భంగా వారాంతాన(15) ఈక్విటీ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. అక్టోబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు మంగళవారం(12న) వెలువడనున్నాయి. సెప్టెంబర్‌లో సీపీఐ 5.49 శాతంగా నమోదైంది. టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు గురువారం(14న) వెల్లడికానున్నాయి. సెప్టెంబర్‌లో డబ్ల్యూపీఐ 1.84 శాతానికి చేరింది. ఈ బాటలో ప్రభుత్వం శుక్రవారం(15న) అక్టోబర్ నెలకు వాణిజ్య గణాంకాలు విడుదల చేయనుంది. -
ద్రవ్యోల్బణ డేటా.., ఫెడ్ నిర్ణయాలు కీలకం
ముంబై: ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల తీరుతెన్నులు ఈ వారం సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. రుతుపవనాల పురోగతికి సంబంధించిన వార్తలను పరిగణలోకి తీసుకోవచ్చంటున్నారు. ఇదేవారంలో ఫెడ్‌తో సహా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ జపాన్‌లు తమ ద్రవ్య విధానాలపై చేసే ప్రకటనలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. అలాగే విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. వీటితో పాటు డాలర్ మారకంలో రూపాయి, క్రూడాయిల్ ధరల కదలికల అంశాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించొచ్చంటున్నారు నిపుణులు. ‘‘ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వెల్లడించే ద్రవ్య విధాన వైఖరి అనుగుణంగా ఈక్విటీ మార్కెట్లు కదలాడొచ్చు. స్థూల ఆర్థిక గణాంకాలూ ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చు. సాంకేతికంగా నిఫ్టీ ఎగువన 18,680 – 18,780 స్థాయిని చేధించాల్సి ఉంటుంది. అమ్మకాలు కొనసాగితే దిగువ స్థాయిలో 18,500 – 18,450 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణ అవుట్‌లుక్‌ను(5.2% నుంచి 5.1 శాతానికి)ను ఆశించిన స్థాయిలో తగ్గించకపోవడం మార్కెట్ వర్గాలను నిరాశపరిచింది. ఫలితంగా మార్కెట్ గతవారం చివరి రెండు ట్రేడింగ్ సెషన్లో అమ్మకాల ఒత్తిడికి లోనైంది. అయినప్పటికీ.., వారం మొత్తంగా సెన్సెక్స్ 79 పాయింట్లు, నిఫ్టీ 29 పాయింట్లు చొప్పున బలపడ్డాయి. ఎఫ్ఐఐలు.., డీఐఐలు కొనుగోళ్లే.. గడచిన వారంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు).., సంస్థాగత ఇన్వెస్టర్లు ఇరువురూ కొనుగోళ్లు చేపట్టారు. జూన్ 5–9 తేదీల మధ్య ఎఫ్ఐఐలు నికరంగా రూ.979 కోట్లు, డీఐఐలు రూ. 1938 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసినట్లు ఎన్‌సీడీఎల్ గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ఎఫ్ఐఐలకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించే విధంగా సెబీ ఇటీవల నిబంధనలను కఠినతరం చేసింది. సులభతర వ్యాపార నిర్వహణ విషయంలో భారత్ ధృడవైఖరిపై ఇది మరోసారి చర్చకు దారీ తీసింది’’ బీడీఓ ఇండియా ఫైనాన్సియల్ సర్వీసెస్ టాక్స్ చైర్మన్ మనోజ్ పురోహిత్ తెలిపారు. దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు ఈ ఏడాది మే రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు(సోమవారం) విడుదల కానున్నాయి. ఏప్రిల్ నమోదైన 4.79% కంటే తక్కువగానే మేలో 4.34శాతంగా నమోదవచ్చొని ఆర్థిక అంచనా వేస్తున్నారు. మరుసటి రోజు(జూన్ 13) డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం జూన్ రెండోవారంతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, జూన్రెండో తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడికి ముందు అప్రమత్తత చోటు చేసుకొనే వీలుంది. ఎఫ్ఓఎంసీ నిర్ణయాలపై దృష్టి అమెరికా సెంట్రల్ రిజర్వ్ బ్యాంక్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) సమావేశం మంగళవారం(జూన్ 13న) మొదలై బుధవారం ముగిస్తుంది. ఈసారి కీలక వడ్డీరేట్ల పెంపు ఉండకపోవచ్చనేది మార్కెట్ వర్గాల అంచనా. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల వైపు నుంచి చూస్తే ఎఫ్ఓఎంసీ కమిటీ తీసుకునే నిర్ణయాలు ఎంతో కీలకమైనవి. పాలసీ వెల్లడి సందర్భంగా ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ చేసే వ్యాఖ్యలు ఈక్వి టీ మార్కెట్ల స్థితిగతులను మార్చగలవు. ప్రపంచ పరిణామాలు... అమెరికా మే సీపీఐ ద్రవ్యల్బణ డేటా మంగళవారం, ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన వెల్లడి బుధవారం వెల్లడి కానున్నాయి. గురువారం అమెరికా మే రిటైల్ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెల్లడి కానున్నాయి. అదేరోజున యూరోపియన్ జోన్ ఏప్రిల్ వాణిజ్య లోటు డేటా యూరోపియన్ యూనియన్ బ్యాంక్ ద్రవ్య విధాన వైఖరి విడుదల అవుతుంది. చైనా మే పారిశ్రామికోత్పత్తి, రిటైల్ అమ్మకాలు, నిరుద్యోగ రేటు డేటా వెల్లడి కానుంది. మరుసటి రోజు బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల డేటా, యూరోజోన్ ద్రవ్యోల్బణ డేటా, అమెరికా కన్జూమర్ సెంటిమెంట్ గణాంకాలు విడుదల అవుతాయి. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావం చూపగలవు. -
ముందే రిటైర్మెంటా.. 20 ప్లస్‌లో ఆరంభిస్తే సాధ్యమే
నేటి తరం యువత 60 ఏళ్లు వచ్చే వరకు కష్టపడాలని అనుకోవడం లేదు. కెరీర్‌ను ముందుగానే ముగించాలని కోరుకుంటోంది. ముందస్తు రిటైర్మెంట్ ఆకాంక్ష క్రమంగా విస్తరిస్తోంది. ముందుగా రిటైర్ అయితే, అప్పటి నుంచి తమ అభిరుచులకు అనుగుణంగా స్వేచ్ఛగా జీవించొచ్చనే కాన్సెప్ట్ ఆదరణకు నోచుకుంటోంది. తోటి వారిని చూసి దీనికి ఆకర్షితులయ్యే వారూ ఉంటున్నారు. కానీ, ఇది ఎలా సాధ్యం? ఇదే ఎక్కువ మందికి ఎదురయ్యే ప్రశ్న. దీనిపై స్పష్టత తెచ్చుకోలేక, తర్వాత చూద్దాంలే.. అని అనుకుని కెరీర్లో సాగిపోయేవారూ ఉన్నారు. ఉద్యోగ, వృత్తి బాధ్యతలకు ముందస్తుగా విరమణ పలికి, నచ్చినట్టు జీవించడం అంటే వినడానికి ఎంతో ఆకర్షణీయంగా అనిపించొచ్చు. కానీ, దీన్ని చేరుకోవాలంటే సరైన లెక్కలు, ప్రణాళికలు కావాలి. వాటిని ఆచరణలో పెట్టినప్పుడు లక్ష్యం సఫలమవుతుంది. ఇందుకు ఏం చేయవచ్చన్నది అవగాహన కల్పించే కథనం ఇది. రిటైర్మెంట్ అన్నది అన్నింటిలోకి చివరి లక్ష్యం అవుతుంది. దీనికంటే ముందు జీవితంలో నెరవేర్చాల్సిన, సాధించాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉంటాయి. ఉదాహరణకు పిల్లల విద్య, వివాహాలు, సొంతిల్లు తదితరాలు. వీటిని సాధించేందుకు సరైన దిశలోనే అడుగులు వేస్తున్నారా? రిటైర్మెంట్ కంటే ముందుగా ఎదురయ్యే లక్ష్యాలకు సంబంధించి కచ్చితమైన ప్రణాళిక అవసరం. వీటిని చేరుకునేందుకు కావాల్సినంత, సరైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఒక్కసారి పరిశీలించుకోవాలి. లేకపోతే జీవితంలో అత్యంత ముఖ్యమైన లక్ష్యాల విషయంలో ఏ మాత్రం లెక్కలు తప్పినా, రిటైర్మెంట్ లక్ష్యం విషయంలో రాజీ పడాల్సి రావచ్చు. ఎవరైనా కానీ, ముందుగా ఎదురుపడే అవసరం గురించే ఆలోచిస్తారు. అందుకే ముందే రిటైర్మెంట్ తీసుకోవాలంటే, దానికంటే ముందు ఎదురయ్యే వాటి గురించి కూడా ప్రణాళిక వేసుకోవాలి. జీవితంలో కీలకమైన లక్ష్యాలు సాధించలేకపోతే రిటైర్మెంట్ సాధ్యం కాదన్న సూక్ష్మాన్ని గుర్తించాలి. ‘‘సురక్షితమైన భవిష్యత్తుకు కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత మీ జీవన శైలి పదవీ విరమణ తర్వాత దిగజారిపోకూడదు. వైద్య చికిత్సలకు అవసరమైనంత నిధి ఉండాలి. పిల్లల విద్య, వారి వివాహాలు, కారు కొనుగోలు, సెలవుల్లో పర్యటనలు వీటన్నింటికీ ఏర్పాట్లు ఉండాలి’’అని హమ్ ఫౌజీ సీఈవో సంజీవ్ గోవిలా సూచించారు. ఎంత కావాలి..? విశ్రాంత జీవనం కోసం సమకూర్చుకోవాల్సిన నిధి విషయంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే సమకూర్చుకున్న నిధి ఏ మూలకూ చాలకపోవచ్చు. అదే జరిగితే పేరుకే రిటైర్మెంట్ అవుతుంది. ఆ తర్వాత ఖర్చులకు చాలక మళ్లీ ఏదో ఒక ఉపాధి వెతుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నట్టు అవుతుంది. అందుకుని రిటైర్మెంట్ కోసం కావాల్సిన నిధిని పక్కా అంచనా వేయాలి. ఈ విషయంలో నిపుణుల సాయం ఎంతో అవసరం పడుతుంది. రిటైర్మెంట్కు సంబంధించి కావాల్సిన నిధిని అంచనా వేయడం అత్యంత ముఖ్యమైనదని రైట్ హారిజాన్స్ ఫండ్ మేనేజర్ అనిల్ రెగో పేర్కొన్నారు. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం నెలవారీ ఖర్చులు రూ.25,000 ఉన్నాయని అనుకుందాం. అతడు ఏ వయసులో రిటైర్ అయితే ఆ తర్వాత జీవనానికి ఎంత మొత్తం కావాలన్నది ఇక్కడి పట్టికలో చూడొచ్చు. ప్రస్తుత నెలవారీ వ్యయాలకు ఏటా సగటున 5 శాతం ద్రవ్యోల్బణం ప్రభావం పరిగణనలోకి తీసుకుని రిటైరయ్యే నాటికి ఎంత కావాలో వేసిన అంచనాలు ఇవి. పట్టికలోని నెలవారీ పెట్టుబడిని ఏడాదికోసారి 8 శాతం పెంచుతూ వెళ్లాలి. పెట్టుబడిపై ఏటా 10 శాతం రాబడి వస్తుందన్న అంచనా. రిటైర్మెంట్ నాటికి సమకూరిన ఫండ్‌పై ఆ తర్వాత ఏటా 7 శాతం రాబడి వస్తుందని అనుకుంటే, ఇంత మొత్తం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అవసరాలు వేర్వేరు.. రిటైర్మెంట్కు తక్కువ వ్యవధి ఉన్నప్పుడు నెలవారీ పెట్టుబడికి ఎక్కువ మొత్తం అవసరపడుతుంది. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన జీవనశైలి, అవసరాలు, ఖర్చులు ఉంటుంటాయి. కనుక నెలవారీ ఎంత మొత్తం, ఏడాదికి ఎంత చొప్పున కావాలన్నది ఎవరికి వారు అంచనాకు రావాలి. ఏడాదికి తమ ఖర్చులు, తమ ఆరోగ్య అవసరాలు, ఆరోగ్య బీమా, జీవిత బీమా ఉన్నాయా? పిల్లలు ఎంత మంది? వారికి ఏ స్థాయి ఖర్చులో విద్య చెప్పించాలని అనుకుంటున్నారు? సొంతింటి ప్రణాళిక, వాహనం ఇత్యాది అవసరాలన్నింటినీ ఒక జాబితాగా రాసుకోవాలి. ఆ తర్వాత ఆర్థిక సలహాదారు లేదంటే పెట్టుబడి సలహాదారును సంప్రదించాలి. వారు అన్నింటినీ సమగ్రంగా పరిశీలించి, నెలవారీగా దేనికి ఎంత మొత్తం పొదుపు, మదుపు చేయాలి, ఏ సాధనాలను ఎంపిక చేసుకోవాలి? అనేది ఒక ప్రణాళిక రూపొందించి ఇస్తారు. దీనికోసం ద్రవ్యోల్బణం, జీవిత కాలం తదితర అంశాలను వారు విశ్లేషిస్తారు. వారిచ్చిన ప్రణాళిక ప్రకారం సాగిపోవాలి. 30 ఏళ్ల వ్యక్తి నెలవారీ ఖర్చులు రూ.30,000 ఉన్నాయని అనుకుంటే ఏ వయసులో రిటైర్మెంట్ అయితే ఎంత మొత్తం కావాలో ఇక్కడి టేబుల్లో చూడొచ్చు. పైన టేబుల్ మాదిరే జీవిత కాలం 90 ఏళ్లకు అనుకుని, ఏటా పెట్టుబడిపై 10 శాతం రాబడి అంచనా ప్రకారం, ఏటా పెట్టుబడి 8 శాతం పెంచుతూ వెళ్లే విధంగా, రిటైర్మెంట్ తర్వాత 7 శాతం రాబడి కోసం సమకూర్చుకోవాల్సిన నిధి అంచనాలు ఇవి. అప్రమత్తత రిటైర్మెంట్కు మరో ఐదేళ్లు ఉందనగా పెట్టుబడుల విషయంలో అప్రమత్తం కావాలి. ఈక్విటీలకు అధిక కేటాయింపులు చేసుకునే వారు మార్కెట్ సైకిల్‌ను పరిగణనలోకి తీసుకుని, అందుకు అనుగుణమైన వ్యూహాన్ని అమల్లో పెట్టాలి. ఉదాహరణకు 2008 మార్కెట్ పతనం, 2020 మార్కెట్ పతనం గుర్తుండే ఉంటాయి. 2020 మార్కెట్ పతనం తర్వాత స్టాక్స్ రికవరీకి ఏడాది సమయం పట్టింది. కొన్ని స్టాక్స్ పూర్తిగా కోలుకుని కొత్త గరిష్టాలకు చేరుకుంటే, కొన్ని ఆలస్యంగా రికవరీ అయ్యాయి. అందుకుని రిటైర్మెంట్కు మరో మూడు–ఐదేళ్లు ఉందనగా, మార్కెట్ సైకిల్‌ను అర్థం చేసుకోవాలి. భారీ దిద్దుబాటు వచ్చి దిద్దుబాటు వచ్చి చాలా ఏళ్లు అయ్యిందా? మార్కెట్ల వ్యాల్యూషన్లు జీవిత కాల గరిష్ట స్థాయిల్లో చలిస్తున్నాయా? ఇలాంటి అంశాలపై నిపుణుల సాయంతో అంచనాకు రావాలి. మూడు ఐదేళ్ల ముందు నుంచి ఏటా నిర్ణీత శాతం చొప్పున ఈక్విటీ పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ డెట్ సాధనాల్లోకి మళ్లించుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత కూడా ఈక్విటీల్లో కొంత మేర పెట్టుబడులు అవసరంపడతాయి. ఎందుకంటే ముందుగా రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత కనీసం 25 ఏళ్ల నుంచి 35–40 ఏళ్ల పాటు జీవించి ఉండే వారికి ఈక్విటీలు తప్పనిసరి. అప్పుడే కార్పస్ కరిగిపోకుండా ఉంటుంది. అందుకుని నిపుణులు సూచించిన మేర ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించి, మిగిలిన మొత్తాన్ని క్రమంగా వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ ఊహించని విధంగా రిటైర్మెంట్ నాటికి మార్కెట్లు భారీ దిద్దుబాటుకు గురైతే అప్పుడు రిటైర్మెంట్ లక్ష్యాన్ని ఏడాది నుంచి మూడేళ్ల పాటు వాయిదా వేసుకోవాల్సి రావచ్చు. అందుకుని సాధ్యమైన మేర లక్ష్యం వాయిదా పడకూడదంటే ముందస్తు జాగ్రత్తలు తప్పదు. అవరోధాలు.. ముందుగా పదవీ విమరణ తీసుకునే వారికి సంపాదించే కాలం ఇతరులతో పోలిస్తే తక్కువ ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల కాలంలో సమకూర్చుకోవాల్సినంత 20–25 ఏళ్లకే సాధించాలి. రిటైర్మెంట్ తర్వాత ఇతరులపై ఆధారపడకూడదు. పైగా ముందస్తు రిటైర్మెంట్ అంటే ఉదాహరణకు 55 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుంటారని అనుకుందాం. అక్కడి నుంచి కనీసం 80 ఏళ్ల వరకు జీవించి ఉంటారని అనుకుంటే, 35 ఏళ్ల కాలానికి అవసరాలు తీర్చేంత ఫండ్ కావాలి. 25–30 ఏళ్లకు కెరీర్ ఆరంభిస్తే.. అక్కడి నుంచి ముందస్తు రిటైర్మెంట్కు 30–25 ఏళ్లే మిగిలి ఉంటుంది. తక్కువ కాలంలో ఎక్కువ కాలానికి ఫండింగ్ ఏర్పాటు చేసుకోవడం అంటే సాధారణ విషయం కాదన్నది గుర్తుంచుకోవాలి. క్రమశిక్షణతో, ఎటువంటి దుబారాకు చోటు ఇవ్వకుండా సంపాదనలో అధిక భాగం భవిష్యత్తుకు పొదుపు చేసుకున్నప్పుడు లక్ష్యం సాకారం అవుతుంది. ఉదాహరణకు పిల్లల విద్య కోసం బడ్జెట్ వేసుకుంటే, ఆ బడ్జెట్ మించకుండా దాన్ని అధిగమించాలి. లేదంటే వేరే లక్ష్యం కోసం ఉద్దేశించిన మొత్తం నుంచి దానికి సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు గొలుసుకట్టు మాదిరి ఒకదాని కోసం మరో లక్ష్యం విషయంలో రాజీపడాల్సి వస్తుంది. లేదంటే రుణం తప్పదు. రాబడి రేటు కీలకం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో (సిప్) ఇన్వెస్ట్ చేసినప్పుడు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు అందుకోవచ్చని చారిత్రక గణాంకాలు తెలియజేస్తున్నాయి. అలాగే, పెట్టుబడుల విధానంలో చిన్న మార్పుతోనూ మెరుగైన నిధిని సమకూర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మనకు ఏటా ఆదాయం ఎంతో కొంత పెరుగుతూనే ఉంటుంది. ఇలా పెరిగే మొత్తానికి అనుగుణంగా సిప్ పెట్టుబడినీ పెంచుకుంటూ వెళ్లాలి. ఏడాదికోసారి ఆర్జన పెరిగినప్పుడు పెట్టుబడిని పెంచుకోవడం ఏమంత పెద్ద కష్టం కాదు. ఖర్చులు కూడా ద్రవ్యోల్బణ ప్రభావంతో ఏటా పెరుగుతూ ఉంటాయి. ఖర్చులు పెరిగాయని పెట్టుబడుల విషయంలో రాజీ పడితే లక్ష్యం సాకారం కాదు. అనవసర ఖర్చులను తగ్గించుకుని అయినా అనుకున్న మేర, ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. ఏటా ఆదాయం అనుకున్న మేర పెరగకపోతే ఎలా? దీనికి సంబంధించి కూడా ప్లాన్–బి రెడీ చేసుకుని పెట్టుకోవాలి. భవిష్యత్తు పెట్టుబడుల కోసం ప్రస్తుత జీవనశైలిలో పూర్తి రాజీ పడకూడదన్నది ఆర్థిక సలహాదారుల సూచన. రెండింటినీ సమన్వయం చేసుకునే విధంగా ఆచరణ ఉండాలి. అలాగే, ఏటా పెట్టుబడిని పెంచడం ఒక్కటి కాకుండా, పెట్టుబడి సాధనాల మధ్య సమతూకం కూడా ఉండాలి. అధిక రాబడులను ఇచ్చే ఈక్విటీలకు తప్పకుండా చోటు ఉండాల్సిందే. పెట్టుబడులకు కనీసం 20 ఏళ్లు అంతకుమించి కాలం ఉంటే అగ్రెస్సివ్ ప్రణాళిక వేసుకోవచ్చు. ఈక్విటీలకు 75 శాతం నుంచి 100 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. ఎన్పీఎస్ ప్లాన్‌లోనూ 75 శాతం ఈక్విటీ పెట్టుబడులకు ఆప్షన్ ఉంది. ఎంత ఎక్కువ కాలం ఉంటే కాంపౌండింగ్ వల్ల అంత పెద్ద మొత్తం సమకూరుతుంది. రిటైర్మెంట్కు సంబంధించి అధిక రిస్క్ తీసుకునే వారికి సాధారణంగా 70–80 శాతం ఈక్విటీలు, మిగిలిన 20 శాతం మేర స్థిరాదాయ (డెట్) పథకాలను నిపుణులు సూచిస్తుంటారు. నిజానికి చాలా మంది విషయంలో గమనిస్తే అన్నింటికంటే ఆలస్యంగా మొదలు పెట్టేది రిటైర్మెంట్ కోసమే అవుతోంది. ఎక్కువ మంది చేసే పెద్ద తప్పిదం ఇదే. ఆర్జన మొదలైన మొదటి నెల నుంచే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ ఆరంభించిన వారు చాలా సులభంగా కావాల్సిన నిధిని సమకూర్చుకోగలరు. అంతేకాదు, కాంపౌండింగ్ పవర్‌తో ముందస్తు రిటైర్మెంట్ వీరికి చాలా సులభం అవుతుంది. ఆలస్యం చేసే కొద్దీ ఈ లక్ష్యం భారంగా మారుతుంది. రిస్క్‌లు–రక్షణ ముందస్తు రిటైర్మెంట్ లక్ష్యం పెట్టుకున్న వారు రుణాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. రుణాలు తీసుకున్నా, రిటైర్మెంట్ పెట్టుబడుల ప్రణాళికకు అవరోధంగా లేకుండా ఉండాలి. రిటైర్మెంట్ నాటికి తీర్చేలా ఉండాలి. మరీ ముఖ్యంగా ముందస్తు రిటైర్మెంట్ తీసుకునే వారు ఉద్యోగం భద్రత అంశాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. కరోనా సంక్షోభ సమయంలో ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. రుణాలపై మారటోరియం ఆప్షన్ తీసుకున్న వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి ఊహించని పరిణామాలు ఎదురైతే ప్రణాళిక వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ విధమైన రిస్క్‌లను ఎదుర్కొనే ప్రణాళిక కూడా కావాలి. అలాగే, రోడ్డు ప్రమాదంలో గాయపడి వైకల్యం పాలై ఆర్జన ఆగిపోయే పరిస్థితి వస్తే..? అనుకున్నదంతా తలకిందులైపోతుంది. దీనికి సంబంధించి బీమా కవరేజీ తప్పకుండా తీసుకోవాలి. అలాగే, మనకు ఏదైనా అనుకోనిది జరిగితే కుటుంబాన్ని ఆదుకునే జీవిత బీమా, ఆస్పత్రిలో వైద్యం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తప్పకుండా తీసుకోవాలి. వృద్ధాప్యంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకుని చాలా ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. ----------------------------------------------------------------------------------------------------------------------------- గమనిక: ఇక్కడ పట్టికల్లో ఇచ్చిన అంచనాలు అన్నీ కూడా పెట్టుబడిపై ఏటా 10 శాతం రాబడి ప్రకారం వేసిన అంచనాలు. కానీ, ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాలంలో 12 శాతం వార్షిక రాబడి సాధ్యమే. కనుక ఆ ప్రకారం చూస్తే చేయాల్సిన నెలావారీ పెట్టుబడి 10 శాతం తక్కువైనా అనుకున్న కార్పస్‌ను సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది. -
ఫెడ్ పాలసీ, ద్రవ్యోల్బణం దారి చూపొచ్చు!
ముంబై: ద్రవ్యోల్బణ గణాంకాలు, ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పరపతి సమావేశ నిర్ణయాలు ఈ వారం మార్కెట్లకు దారి చూపొచ్చని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ఇదే వారంలో మూడు కంపెనీల ఐపీఓ లతో పాటు ఇటీవల పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకున్న యూనిపార్ట్స్ ఇండియా ఎక్సే్చంజీల్లో లిస్టింగ్ కానుంది. అంతర్జాతీయంగా బ్యారెల్ బ్రెంట్ క్రూ డాయిల్ ధర 80 డాలర్లకు చేరింది. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, డాలర్ మారకంలో రూపాయి విలువ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ట్రేడర్లు తమ పొజిషన్లను సమతూకం చేసుకోవాలి. పతనాన్ని కొనుగోలుకు అవకాశంగా మలుచుకోవాలి అని నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు, ఆర్థిక మందగమన భయాలు, ఫెడ్ రిజర్వ్ సమావేశానికి ముందు అప్రమత్తత తదితర పరిణామాల నేపథ్యంలో గతవారంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా సెన్సెక్స్ 687 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లు నష్టపోయాయి. ‘ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ అధిక విలువ వద్ద ట్రేడవుతోంది. ఆదాయాల వృద్ధి మందగించ వచ్చనే అంచనాలు సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపొచ్చు. స్టాక్ సూచీలు ఈ వారంలో పరిమితి శ్రేణిలో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ స్థిరీకరణ దిశగా సాగొచ్చు. ఆర్థిక మాంద్య భయాల తో ఐటీ షేర్లలో అత్యధిక లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఆర్బీఐ కఠిన ద్రవ్య విధానానికే మొగ్గుచూపినప్పట్టికీ.., బ్యాంక్ నిఫ్టీ స్థిరంగా రాణించడం కలిసొచ్చే అంశంగా ఉంది. అయితే గతవారం నిఫ్టీ కీలకమైన 18,500 స్థాయిని కోల్పోయింది. అమ్మకాల ఒత్తిడి కొనసాగితే 18,400– 18,300 శ్రేణిలో తక్షణ మద్దతు లభించవచ్చు. ఎగువ స్థాయిలో 18,650–18,700 పరిధిలో నిరోధం ఎదురుకావచ్చు’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ప్రపంచ పరిణామాలు బ్రిటన్ జీడీపీ, పారిశ్రామికోత్పత్తి, నవంబర్ వాణిజ్య లోటు డేటా నేడు(సోమవారం)విడుదల అవుతుంది. రేపు(మంగళవారం) అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రకటిస్తుంది. ఎల్లుండి(బుధవారం) ఫెడ్ రిజర్వ్ కమిటీ సమావేశ నిర్ణయాలు, యూరోజోన్ నవంబర్ పారిశ్రామికోత్పత్తి డేటా, చైనా నవంబర్ వాహన విక్రయాలు, బ్రిటన్ ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానున్నాయి. గురువారం అమెరికా నవంబర్ రిటైల్ అమ్మకాలతో పాటు పారిశ్రామికోత్పత్తి డేటా విడుదల అవుతుంది. అదే రోజున యూరోపియన్ కేంద్ర బ్యాంక్(ఈసీబీ) వడ్డీరేట్ల ప్రకటనతో పాటు జపాన్ వాణిజ్య లోటు గణాంకాలు.., చైనా పారిశ్రామికోత్పత్తి, నిరుద్యోగ రేటు, రిటైల్ అమ్మకాల డేటా..., బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్ నిర్ణయాలు వెల్లడి కానున్నాయి. వారాంతపు రోజైన శుక్రవారం అమెరికా, యూరోజోన్, బ్రిటన్ తయారీ రంగ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదల అవుతాయి. అదేరోజున యూరోజోన్ అక్టోబర్ వాణిజ్య లోటు, నవంబర్ ద్రవ్యోల్బణ డేటాతో పాటు విడుదల కానుంది. స్థూల ఆర్థిక గణాంకాలు నేడు నవంబర్ దేశీయ వినియోగదారుల సూచీ ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం, అక్టోబర్ పారిశ్రామికోత్పత్తి గణాంకాలు వెల్లడి కానున్నాయి. డబ్ల్యూపీ ద్రవ్యోల్బణ డేటా ఎల్లుండి(బుధవారం), వాణిజ్య లోటు గణాంకాలు(గురువారం) విడుదల అవుతుంది. అలాగే శుక్రవారం ఆర్బీఐ డిసెంబర్ తొమ్మిదో తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల రెండో తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ఇదే వారంలో వాహన పరిశ్రమ సమాఖ్య సియామ్ నవంబర్ వాహన విక్రయ డేటా, ఐఆర్డీఏఐ ఈ ఏడాది ప్రధమార్థం తొలి ప్రీమియం గణాంకాలు వెల్లడికానున్నాయి. ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబిపజేసే ఈ స్థూల గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది. ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశం మంగళవారం(నవంబర్ 13న) ప్రారంభం కానుంది. మరుసటి రోజు(బుధవారం) ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య కమిటీ నిర్ణయాలను వెల్లడించనున్నారు. వరుసగా నాలుగుసార్లు వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్లు చొప్పున ఫెడ్ ఈసారి మాత్రం 50 బేసిస్ పాయింట్లకు పరిమితం కావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ మరుసటి రోజే(గురువారం) బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌లు తమ ద్రవ్య విధాన వైఖరిని వెల్లడించనున్నాయి. ఏడు రోజుల్లో రూ.4,500 కోట్ల అమ్మకాలు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ డిసెంబర్ (1–11 తేదీల మధ్య)లో ఇప్పటి వరకు రూ.4500 కోట్ల ఈక్విటీలను విక్రయించారు. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ విలువ దిగిరావడం ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరి(బుధవారం)కి ముందు ఎఫ్ఐఐలు అప్రమత్తత వహిస్తూ చివరి మూడు రోజుల్లో నికరంగా రూ.3,300 కోట్లను ఉపసహరించుకున్నారు. ‘‘భారత ఈక్విటీ మార్కెట్ సగటు కంటే అధిక విలువ వద్ద ట్రేడవుతుంది. కావున ఎఫ్ఐఐలు చౌక వాల్యూయేషన్లతో ట్రేడవుతున్న చైనా, కొరియా వంటి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఎఫ్ఐఐలు ఆసక్తి చూపుతున్నారు. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరి వరకు భారత ఈక్విటీలపై విదేశీ ఇన్వెస్టర్లు బేరీష్ వైఖరినే కలిగి ఉండొచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. కాగా గడిచిన నవంబర్‌లో రూ. 36,329 కోట్లను కొన్నారు. -
బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు
ముంబై: రిటైల్ ద్రవ్యోల్బణం అయిదు నెలల గరిష్టానికి ఎగబాకడంతో వడ్డీరేట్ల పెంపు భయాలు మరోసారి మార్కెట్ వర్గాలను కలవరపెట్టాయి. పారిశ్రామికోత్పత్తి ఆగస్టులో తీవ్ర పతన స్థాయికి చేరుకోవడం సైతం నిరాశపరిచింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ అనూహ్య రికవరీ, రూపాయి బలహీనతలు సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచాయి. అలాగే ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీని నిర్ణయించే అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడి(గురువారం)కి ముందు అప్రమత్తత వహించారు. ధరల కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల మరో దఫా వడ్డీరేట్ల పెంపు అంచనాలు దేశీయ మార్కెట్లపైనా ప్రతికూల ప్రభావం చూపాయి. ఫలితంగా ఫైనాన్స్, ఆటో, రియల్టీ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో గురువారం సెన్సెక్స్ 391 పాయింట్లు పతనమై 57,235 వద్ద ముగిసింది. నిఫ్టీ 109 పాయింట్లు నష్టపోయి 17,014 వద్ద నిలిచింది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా షేర్ల అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు అరశాతానికి పైగా క్షీణించాయి. మెటల్, ఫార్మా, మీడియా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,636 కోట్ల షేర్లను అమ్మేయగా.., సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.753 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఆసియా, యూరప్ మార్కెట్లు గరిష్టంగా 3% వరకు క్షీణించాయి. యూఎస్ ద్రవ్యోల్బణ వెల్లడి తర్వాత అమెరికా స్టాక్ ఫ్యూచర్లు రెండుశాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ అరశాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్ఈలో నమోదిత కంపెనీలకు 1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ.269.88 లక్షల కోట్ల దిగువకు చేరింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► సెప్టెంబర్ త్రైమాసికంలో నికరలాభం క్షీణించడంతో ఐటీ కంపెనీ విప్రో షేరు 7% నష్టపోయి రూ 379 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో ఏడుశాతానికి పైగా పతనమై రూ.381 వద్ద ఏడాది కనిష్టాన్ని తాకింది. ► ఇదే క్యూ2 క్వార్టర్లో మెరుగైన ఆర్థిక ఫలితాలను వెల్లడించిన హెచ్‌సీఎల్ షేరు మూడు శాతం బలపడి రూ.982 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో నాలుగు శాతం ర్యాలీ చేసి రూ.986 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. -
ధరల మంట.. పరిశ్రమలకు సెగ!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి బుధవారం వెలువడిన అధికారిక గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా తొమ్మిదవ నెల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతం వద్ద కట్టడి పరిధి దాటి నమోదయ్యింది. పైగా ఆగస్టులో 7% ఉంటే, సెప్టెంబర్‌లో 7.41%కి (2021 ఇదే నెల ధరలతో పోల్చి) పెరిగింది. గత ఏడాది సెప్టెంబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.35 శాతమే. ఇక ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో వృద్ధిలేకపోగా 0.8 శాతం క్షీణించింది. సామాన్యునిపై ధరల భారం రిటైల్ ద్రవ్యోల్బణ బాస్కెట్లో కీలక ఆహార విభాగం ధరలు సెప్టెంబర్‌లో తీవ్రంగా పెరిగాయి. మొత్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల గరిష్టం... 7.41 శాతం పెరగ్గా, ఒక్క ఫుడ్ బాస్కెట్ ఇన్ఫ్లెషన్ 8.60 ( ఆగస్టులో 7.62 శాతం) శాతానికి చేరింది. కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగుసార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ఈ నాలుగు దఫాల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగి, ఏకంగా 5.9 శాతానికి (2019 ఏప్రిల్ తర్వాత) చేరింది. మరింత పెరగవచ్చనీ ఆర్బీఐ సంకేతాలు ఇచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5%, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనావేసింది. అక్టోబర్, నవంబర్‌ల్లోనూ ద్రవ్యోల్బణం ఎగువబాటనే పయనిస్తే, తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 సమయంలో ఆర్బీఐ రెపో రేటును మరో అరశాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన తొమ్మిది నెలలుగా ద్రవ్యోల్బణం కట్టడిలో ఎందుకు లేదన్న అంశంపై కేంద్రానికి ఆర్బీఐ త్వరలో ఒక నివేదిక సమర్పిస్తుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. 18 నెలల కనిష్టానికి పారిశ్రామిక రంగం ఇక ఆగస్టులో పారిశ్రామిక ఉత్పత్తి గడచిన 18 నెలల్లో ఎన్నడూ లేని తీవ్ర పతన స్థాయి 0.8 శాతం క్షీణతను చూసింది. 2021 ఫిబ్రవరిలో ఐఐపీలో 3.2 శాతం క్షీణత నమోదయ్యింది. తాజా సమీక్షా నెల్లో సూచీలో దాదాపు 60 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ రంగం కూడా 0.7% క్షీణతను (2021 ఇదే నెలతో పోల్చి) చూసింది. గత ఏడాది ఇదే కాలంలో తయారీ ఉత్పత్తి వృద్ధి రేటు 11.1%. మైనింగ్ ఉత్పాదకత 23.3 శాతం వృద్ధి నుంచి 3.9% క్షీణతలోకి జారింది. విద్యుత్ రంగం ఉత్పత్తి వృద్ధి రేటు 16% నుంచి 1.4 శాతానికి పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి రేటు 20% నుంచి 5%కి పడిపోయింది. -
ఈ చర్యలతో ధరల స్పీడ్ తగ్గుతుంది
న్యూఢిల్లీ: బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకున్న నిర్ణయం దీనితోపాటు మంచి రుతుపవన పరిస్థితి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సహాయపడతాయని పరిశ్రమల సంఘం– సీఐఐ కొత్త ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు. సీఐఐ– కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్‌గా ఫిన్సర్వ్ సీఎండీ కూడా అయిన సంజీవ్ బజాజ్ గత వారం బాధ్యతలు స్వీకరించారు. 2022–23 కాలానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. 2019–20లో సీఐఐ పశ్చిమ ప్రాంత చైర్మన్‌గా వ్యవహరించారు. యూఎస్‌లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో విద్యనభ్యసించారు. బోర్డ్ ఆఫ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), అలియాంజ్ ఎస్ఈ ఇంటర్నేషనల్ అడ్వైజరీ బోర్డ్‌లో సభ్యుడిగా ఉన్నారు. సీఐఐ చీఫ్‌గా బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన తన మొట్టమొదటి విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► మనం అధిక వడ్డీ రేట్ల వ్యవస్థలోకి మారామని నేను నమ్ముతున్నాను. ఇది ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో మనకు సహాయపడుతుంది. మొత్తంగా కాకపోయిన, కనీసం దానిలో కొంత భాగమైనా కట్టడి జరుగుతుందని భావిస్తున్నాను. ► ద్రవ్యోల్బణం కట్టడి, అవసరమైనమేరకు వడ్డీ రేట్ల కదలికలపై విధాన రూపకర్తల నిర్ణయాలు, దీనికితోడు బలమైన రుతుపవనాలపై ఆశల వంటి పలు అంశాలు ఈ సంవత్సరం ద్వితీయార్థం నాటికి మనల్ని మంచి స్థానంలో ఉంచుతాయని భావిస్తున్నాను. ► ద్రవ్యోల్బణం పెరుగుదల రెండు అంశాలపై ప్రస్తుతం ఆధారపడి ఉంది. అందులో ఒకటి డిమాండ్. మరొకటి సరఫరా వైపు సవాళ్లు. ► సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే వడ్డీ రేట్లను పెంపు ప్రక్రియను ప్రారంభించింది. రాబోయే సంవత్సరంలో వడ్డీ రేట్లు పెరుగుతాయని మనం భావించాలి. అయితే వడ్డీరేట్ల పెరుగుదల వల్ల వృద్ధికి కలిగే విఘాతాలను సెంట్రల్ బ్యాంక్ ఎలా పరిష్కరిస్తుందన్న అంశంపై మనం దృష్టి పెట్టాలి. ఈ అంశానికి సంబంధించి మేము ఆర్బీఐ నుండి స్పష్టమైన దిశను ఆశిస్తున్నాము. తదుపరి ద్రవ్య విధాన సమీక్షలో సెంట్రల్ బ్యాంక్ నుంచి ఈ మేరకు ప్రకటనలు వెలువడతాయని భావిస్తునాము. ► అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) 7.4–8.2 శాతం శ్రేణిలో ఉంటుందని సీఐఐ అంచనావేస్తోంది. ► 2022–23కి సంబంధించి ‘బియాండ్ ఇండియా @75: పోటీతత్వం, వృద్ధి, సుస్థిరత, అంతర్జాతీయీకరణ’ అన్న థీమ్‌ను సీఐఐ అనుసరిస్తుంది. ఆయా అంశాలపై దృష్టి సారిస్తుంది. ► ఆర్థిక వృద్ధి సామర్థ్యాన్ని పెంపొందించడానికి, ప్రపంచ ఆర్థిక సవాళ్లు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల నుంచి బయటపడ్డానికి కేంద్రం బలమైన విధాన సంస్కరణలతో ముందుకు నడవాలని మేము సూచిస్తున్నాము. ► ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పెట్టుబడులు, వ్యవస్థలో బలమైన డిమాండ్, పీఎల్ఐ (ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం), వ్యవసాయ రంగం తోడ్పాటు వంటి అంశాలు దేశ ఎకానమీకి సమీప కాలంలో తోడ్పాటును అందిస్తాయని విశ్వసిస్తున్నాం. ► ఇంధన ఉత్పత్తులపై పన్నులను కొత్త తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని తక్షణం కొంత కట్టడి చేయవచ్చు. పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలలో పన్నుల వాటా అధికంగా ఉన్న సంగతి తెలిసిందే. వీటిపై పన్ను తగ్గింపునకు సంబంధించి కేంద్రం– రాష్ట్రాలు సమన్వయంతో కృషి చేయాలని సీఐఐ కోరుతోంది. ► 2026–27 నాటికి 5 ట్రిలియన్ డాలర్లు, 2030–31 నాటికి 9 ట్రిలియన్ డాలర్ల మైలురాళ్లతో 2047 నాటికి అంటే భారత్‌కు స్వాతంత్యం వచ్చి 100 ఏళ్లు వచ్చేనాటికి దేశం 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని మేము విశ్వసిస్తున్నాం. ► భారత్ వృద్ధికి సేవలు, తయారీ రెండు యంత్రాల వంటివి. ప్రభుత్వ సానుకూల విధానాలు ముఖ్యంగా పీఎల్ఐ పథకం వంటి చర్యలు 2047–48 ఆర్థిక సంవత్సరం నాటికి తయారీ రంగాన్ని బలోపేత స్థానంలో నిలబెడతాయని ఆశిస్తున్నాం. జీడీపీలో ఈ రంగం వాటా 27 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. ► ఇక సేవల రంగం వాటా కూడా జీడీపీలో 55 శాతంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం. 2047 నాటికి అప్పటి సమాజం, సమాజ అవసరాలపై పరిశ్రమ ప్రధానంగా దృష్టి పెట్టాలి. ఫిన్‌టెక్, ఇ–కామర్స్ మొదలైన డిజిటల్ విప్లవ అంశాలు భారతీయ పరిశ్రమకు అపారమైన అవకాశాలను సృష్టిస్తున్నాయి. ఆయా అంశాలు సమాజ అవసరాలను తీర్చడానికి భవిష్యత్తును సిద్ధం చేస్తున్నాయి. ఇవన్నీ ‘‘భారతదేశం ః100’’ ఎజెండాలో అంతర్భాగంగా ఉంటాయి. – సంజీవ్ బజాజ్ -
ధరల దాడిని ఇలా ఎదుర్కోండి..!
ఈక్విటీకి హెడ్జింగ్ అన్ని రకాల పెట్టుబడులకు ద్రవ్యోల్బణం రిస్క్ ఉంటుంది. ఈక్విటీలు సైతం అందుకు అతీతం కాదు. కంపెనీల వ్యాపారాలపైనా ద్రవ్యోల్బణం ప్రభావం ఉంటుందని గుర్తించాలి. ద్రవ్యోల్బణం వల్ల కంపెనీలకు ముడి సరుకుల ధరలు పెరిగిపోతాయి. దీనివల్ల తయారీ కంపెనీల లాభాల మార్జిన్లు తగ్గిపోతాయి. అధిక ద్రవ్యోల్బణం ఉన్న సమయాల్లో పరిశీలించినప్పుడు.. 2009–10లో నిఫ్టీ 50 కంపెనీల (ఫైనాన్షియల్ కంపెనీలు మినహా) ఎబిట్డా 19.86 శాతంగా ఉంటే, 2013–14 నాటికి 16.31 శాతానికి క్షీణించింది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం తర్వాత నెలకొన్న పరిస్థితులు ఇందుకు దారితీశాయి. ఆ సమయాల్లో వినియోగదారుల కొనుగోలు శక్తి కూడా క్షీణిస్తుంది. దాంతో అవసరమైన కొనుగోళ్లకు పరిమితమై.. అనవసరపు ఖర్చును నియంత్రించుకునేందుకు వినియోగదారులు మొగ్గు చూపిస్తారు. దాంతో కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోతుంది. కనుక ద్రవ్యోల్బణం కొన్ని కంపెనీలకు ప్రతికూలిస్తే.. కొన్ని కంపెనీలకు అనుకూలిస్తుందని చెప్పుకోవాలి. కనుక పెట్టుబడుల్లో వైవిధ్యమైన కంపెనీలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడు సహజంగానే హెడ్జింగ్ (రక్షణ) ఉండేలా చూసుకోవచ్చు. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న సమయాల్లో కొన్ని రకాల థీమ్‌లను పరిశీలించొచ్చు. రెండేళ్ల క్రితం 2020 మార్చిలో సన్ ఫ్లవర్ నూనె లీటర్ రూ.85. రెండు నెలల క్రితం రూ.120. ఇప్పుడు రూ.180–200కు పైనే. 2019 జూలైలో పెట్రోల్ లీటర్ ధర రూ.73. 2020 జూన్‌లో రూ.80. 2021 జూలైలో రూ.100. 2022 ఏప్రిల్‌లో రూ.120. ఇలా నిత్యావసరాల ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. దీన్నే ద్రవ్యోల్బణంగా చెప్పుకోవాలి. కరెన్సీ విలువను తినేసే చెద పురుగు ఇది. పెట్టుబడికి రాబడి తోడైనప్పుడే సంపదగా మారుతుంది. ఈ క్రమంలో పెట్టుబడి విలువను హరించే ద్రవ్యోల్బణం గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? మెజారిటీ ఇన్వెస్టర్లు పట్టించుకోని అంశం ఇది. ఇంటి నిర్మాణం అప్పుడే చెక్కకు చెద పట్టకుండా కెమికల్ కోటింగ్ వేయిస్తాం. అలాగే, పెట్టుబడి చేస్తున్నప్పుడే ద్రవ్యోల్బణం రక్షణ గురించి కూడా యోచించాలి. ప్రస్తుతం ప్రపంచదేశాలు ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ఉక్రెయిన్–రష్యా సంక్షోభంతో నిత్యావసరాల ధరలు రెక్కలు విప్పుకున్నాయి. దీనికంటే ముందు కరోనా కారణంగా సరఫరా వ్యవస్థలో సమస్యలు ఏర్పడ్డాయి. ఇవన్నీ ధరల ఒత్తిళ్లకు దారితీశాయి. అధిక ద్రవ్యోల్బణం నికర రాబడిని తగ్గించేస్తుంది. కనుక ప్రతి ఇన్వెస్టర్‌కు పెట్టుబడితోపాటు, ద్రవ్యోల్బణం రక్షణ గురించి కూడా తెలుసుకోవాలి. అధిక ద్రవ్యోల్బణ సమయాల్లో నిఫ్టీ 50 నికర రాబడి మైనస్‌గా ఉండడాన్ని ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవాలి. 2002, 2013, 2016, 2018లో నిఫ్టీ 50 నికర రాబడి మైనస్‌గా నమోదైంది. గత 20 ఏళ్ల కాలంలోని సగటు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే.. దీర్ఘకాలంలో ఈక్విటీల్లో నికర రాబడి 6.5 శాతానికి పైనే ఉంటేనే పెట్టుబడి ఫలితమిచ్చినట్టు. ఈక్విటీల కంటే ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో (డెట్) ఇన్వెస్ట్ చేసే వారిపై ద్రవ్యోల్బణ కాటు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్థిరాదాయ పథకాల్లో రాబడికి, ద్రవ్యోల్బణానికి మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుంది. 2008 నుంచి 2013 మధ్య అధిక ద్రవ్యోల్బణం సమయంలో 10 ఏళ్ల సావరీన్ బాండ్ నికర రాబడి మైనస్‌గా ఉండడాన్ని గమనించాలి. కనుక పెట్టుబడులపై ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గించుకునే చర్యలపై దృష్టి సారించినప్పుడే అధిక ప్రయోజనం. ద్రవ్యోల్బణం అంచనాలు.. ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కోరుకునే వారు ముందుగా మధ్య కాలానికి అది ఏ స్థాయిలో ఉంటుందన్న అంచనాలకు రావాలి. 1960నుంచి వినియోగధరల ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ) ఎన్నో సందర్భాల్లో రెండంకెల స్థాయిలో నమోదైంది. 1973–74, 1980–81, 1991–92 సంవత్సరాల్లో సగటు ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్లో కొనసాగింది. ఆయా కాలాల్లో చమురు ధరలు గణనీయంగా పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ద్రవ్యోల్బణం సెగలకు నేపథ్యంగా ఉన్నాయని చెప్పుకోవాలి. 1970ల్లో అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం.. 1980, 1990ల్లో గల్ఫ్ యుద్ధం, ఇరాక్‌పై కువైట్ దురాక్రమణ వంటివన్నీ ధరల్లో అస్థిరత్వానికి దారితీశాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత 2008–2013 మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం 11.06 శాతం వరకు వెళ్లింది. సగటున 9.8 శాతంగా నమోదైంది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితులతో ద్రవ్యోల్బణం మరింత పైపైకి వెళ్లొచ్చన్న అంచనాలున్నాయి. చమురు ధరలు బ్యారెల్ 100 డాలర్లకు పైనే ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 5.5–6 శాతం మధ్య ఉండొచ్చని చాలా మంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు. నోమురా అయి తే 6.3%గా అంచనా వేసింది. ద్రవ్యో ల్బణం తగిన అంచ నాలతోనే పెట్టుబడి ఎక్కడ పెట్టాలి, రక్షణ ఎలా కల్పించుకోవాలన్న అంశంపై స్పష్టత సాధ్యపడుతుంది. బంగారంతో రక్షణ ఉంటుందా? బంగారం ధరలు ద్రవ్యోల్బణంతోపాటే పెరుగుతాయన్న ఒక నమ్మకం ఉంది. కానీ, అన్ని వేళలా ఇదే ధోరణి ఉంటుందని చెప్పలేం. బంగారం డిమాండ్ అన్నది ప్రధానంగా ఇన్వెస్టర్లు, ఆభరణాల కొనుగోలుదారులపై ఆధారపడి ఉంటుంది. ధరలు పెరుగుతున్నప్పుడు స్వల్ప కాలంలో ఆ ప్రయోజనం పొందేందుకు ఇన్వెస్టర్లు బంగారంలోకి పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తారు. కానీ, అధిక ధరల కారణంగా వినియోగదారుల నుంచి ఆభరణాలకు డిమాండ్ తగ్గుతుంది. ధరలు తగ్గుతున్నప్పుడు బంగారం ఆభరణాలకు కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఆ సమయంలో పెట్టుబడులకు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ముందుకు రారు. బంగారాన్ని దీర్ఘకాల పెట్టుబడి సాధనంగా పరిగణించే వారు చాలా తక్కువ. దాన్ని ట్రేడింగ్, స్వల్పకాల హెడ్జింగ్ సాధనంగానే ఎక్కువ మంది పరిగణిస్తుంటారు. ఈ ధోరణి కారణంగా బంగారం అన్నది ద్రవ్యోల్బణం హెడ్జింగ్‌కు సంబంధించి ప్రభావవంతమైన సాధనంగా కాబోదు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితుల్లో బంగారం ధరలు పెరుగుతుంటాయి. పోర్ట్‌ఫోలియోకు వైవిధ్యం దృష్ట్యా ఒక పెట్టుబడి సాధనంగాను బంగారాన్ని చూడొచ్చు. ఇతర సాధనాలు ప్రతికూలతలు ఎదుర్కొంటున్న సందర్భాల్లో బంగారం నుంచి సానుకూల రాబడి అందుకోవచ్చు. కనుక పోర్ట్‌ఫోలియోలో బంగారానికి 5–10 శాతం మేర కేటాయింపులు చేసుకోవచ్చు. స్థిరాదాయ పెట్టుబడులు (డెట్) డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు ద్రవ్యోల్బణం తీరుపై ఎప్పుడూ కన్నేసి ఉంచాల్సిందే. ఎందుకంటే ద్రవ్యోల్బణాన్ని బట్టే వడ్డీ రేట్ల గమనం ఆధారపడి ఉంటుంది. ద్రవ్యోల్బణం కట్టలు తెంపుకుని వెళుతున్న తరుణంలో దీన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంకు కీలక విధాన రేట్ల పెంపు బాటలో వెళ్లాల్సి వస్తుంది. ఇతరత్రా ఏ చర్యలు తీసుకున్నా కానీ, రేట్ల పెంపును చేపట్టక తప్పదు. ప్రస్తుతానికి వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిలో ఉంటే, ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉంది. దీంతో సమీప భవిష్యత్తులో రిజర్వ్ బ్యాంకు రేట్ల పెంపు చేపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో బాండ్ల ఈల్డ్స్ పెరిగి, వాటి ధరలు తగ్గుతాయి. 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ 7 నుంచి 7.5 శాతానికి చేరొచ్చని అంచనా. యూఎస్ ఫెడ్ కూడా రేట్ల పెంపు విషయంలో దూకుడుగానే ఉంది. ఈ ఏడాది చివరికే 2 శాతానికి చేర్చాలన్న అంచనాలతో ఉంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాల ఒత్తిడికి కూడా కలసి సావరీన్ బాండ్ల ఈల్డ్స్ పెరిగేందుకు దారితీస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్గం ఏంటి? ఈ సమయంలో స్థిరాదాయ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారు స్వల్పకాల బాండ్లను ఎంపిక చేసుకోవడం సరైనది. దీనివల్ల రేట్ల పెరుగుదల నుంచి ప్రయోజనం పొందొచ్చు. పెట్టుబడులు స్వల్పకాలంలోనే మెచ్యూరిటీకి వస్తాయి కనుక వాటిని తిరిగి అధిక రేట్లపై ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏడాది లేదా రెండేళ్ల వ్యవధిపై ఫిక్స్డ్ డిపాజిట్‌కే పరిమితం కావాలి. రేట్ల పెంపు ముగిసే వరకు స్వల్పకాల బాండ్లనే నమ్ముకోవడం సరైనది. రేట్ల పెంపు ముగిసిన తర్వాత మూడేళ్ల కాలానికి పెట్టుబడులు పరిశీలించొచ్చు. 2023 లేదా 2024లో రేట్ల పెంపు ముగిసే అవకాశం ఉంది. ఎన్బీఎఫ్సీ డిపాజిట్లు, కార్పొరేట్ బాండ్లకూ ఇదే వర్తిస్తుంది. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు (రిస్క్ తీసుకోని) లిక్విడ్ లేదా మనీ మార్కెట్ ఫండ్స్‌కు పరిమితం కావాలి. స్వల్పకాలంలో పెరిగే రేట్ల నుంచి వీటికి ప్రయోజనం ఉంటుంది. అధిక రిస్క్ తీసుకునే వారు కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఇక్కడ క్రెడిట్ రిస్క్ ఉంటుందని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. అధిక ద్రవ్యోల్బణ సమయాల్లో, వడ్డీ రేట్లు పెరిగే సమయాల్లో ఫ్లోటింగ్ రేట్ ఫండ్స్ అనుకూలం. వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు సవరించే బాండ్లలో ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఒకే విడత పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ బాండ్ 2020ను ఎంపిక చేసుకోవచ్చు. దీనిపై ప్రస్తుతం 7.15 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఆరు నెలలకు ఒకసారి ఈ రేటు సవరణకు లోనవుతుంది. దీని కాల వ్యవధి ఏడేళ్లు. ప్రభుత్వ హామీతో వచ్చే మెరుగైన సాధనం ఇది. ఆరు నెలలకోసారి వడ్డీ రేటు చెల్లింపు ఉంటుంది. క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారికి కూడా అనుకూలం. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేసుకుంటామనుకునే వారు.. పీపీఎఫ్‌ను కూడా పరిశీలిం చొచ్చు. ఇందులో ప్రస్తుతం 7.1 శాతం రేటు అమల్లో ఉంది. మార్కెట్ లీడర్స్ మోట్ (వ్యాపార బలాలు) ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి పెరిగిన ధరలను వినియోగదారులకు బదిలీ చేయగలవు. ధరలను పెంచినా ఆయా కంపెనీల ఉత్పత్తులు, సేవలను వినియోగదారులు పక్కన పెట్టలేని విధంగా వాటికి ఆదరణ ఉంటుంది. కనుక ఆయా కంపెనీల లాభాలు అంతగా ప్రభావితం కావు. నిఫ్టీ50 సూచీలోని కంపెనీల లాభాలు వార్షికంగా 9 శాతం చొప్పున 2010–2014 మధ్య (అధిక ద్రవ్యోల్బణ కాలం) పెరగడాన్ని గమనించొచ్చు. అంటే లాభాల మార్జిన్లపై ఒత్తిడి ఉన్నా కానీ అవి వృద్ధిని నమోదు చేయగలిగాయి. కన్జ్యూమర్ నాన్ డిస్క్రీషనరీ ద్రవ్యోల్బణం గరిష్టాలకు చేరినప్పుడు వినియోగదారులు విలాస ఉత్పత్తుల కొనుగోలు తగ్గించుకుంటారే కానీ, కన్జ్యూమర్ స్టాపుల్స్ను తగ్గించుకోలేరు. 2011–12లో 28.5%, 2012–13లో 25.3% చొప్పున బ్రిటానియా ఇండస్ట్రీస్ లాభాల్లో వృద్ధిని చూపించింది. ఆ సమయం లో రిటైల్ ద్రవ్యోల్బణం 10% మేర ఉంది. అదే సమయంలో బజాజ్ ఆటో ఆదాయంలో 10% వృద్ధి చూపించినా, లాభాల పెరుగుదల 1.3 శాతమే. కమోడిటీ స్టాక్స్ ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న సమయాల్లో కమోడిటీ స్టాక్స్‌లో పెట్టుబడులు కూడా పోర్ట్‌ఫోలియోకు రక్షణనిస్తాయి. ఆ సమయంలో ముడి చమురు, ఇతర కమోడిటీల ధరలు పెరిగిపోతాయి. దీంతో ఆయా కంపెనీల లాభాలు కూడా గణనీయ వృద్ధిని చూస్తాయి. ప్రభుత్వరంగ చమురు కంపెనీలపై ప్రభుత్వం నుంచి కొంత నియంత్రణ ఉంటుంది. అలాగే, ప్రభుత్వరంగ మెటల్ కంపెనీల పరిస్థితి కూడా ఇంచు మించు ఇలాగే ఉంటుంది. కానీ, ప్రైవేటు రంగ మెటల్ కంపెనీలైన హిందాల్కో, వేదాంత తదితర కంపెనీలు అధిక ద్రవ్యోల్బణం సమయాల్లో మంచి పనితీరు చూపిస్తుంటాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్లు) ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల హెడ్జింగ్ సాధనంగా రీట్లను కూడా ఫండ్ మేనేజర్లు పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ఇవి ఆదాయాన్ని ఆర్జిస్తూ డివిడెండ్ రూపంలో ఆ మొత్తాన్ని వాటాదారులకు పంపిణీ చేస్తుంటాయి. కాలానుగుణంగా వీటి నిర్వహణలోని ప్రాజెక్టుల విలువ పెరుగుతుంది. అద్దె అదాయం కూడా పెరుగుతుంది. దీంతో ఎప్పటికప్పుడు డివిడెండ్ ఆదాయానికి తోడు.. పెట్టుబడి వృద్ధిని కూడా ఇన్వెస్టర్లు చూడొచ్చు. ప్రసు ్తతం మన స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ అయిన రీట్ల సగటు డివిడెండ్ రాబడి 4–6% మధ్య ఉంది. -
ద్రవ్యోల్బణం, ఫెడ్ నిర్ణయాలు కీలకం
ముంబై: అమెరికా ఫెడ్ రిజర్వ్ సమావేశ నిర్ణయాలతో (బుధవారం వెలువడనున్న) పాటు ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం దేశీయ మార్కెట్ గమ నాన్ని నిర్ధేశిస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధ పరిణామాలు, క్రూడాయిల్ ధరలు, అంతర్జాతీయ పరిస్థితులపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, రూపాయి విలువ అంశాలూ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. హోళీ సందర్భంగా శుక్రవారం(మార్చి 18న) ఎక్సే్చంజీలకు సెలవుకావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగురోజులే జరగనుంది. గతవారంలో సెన్సెక్స్ 1,216 పాయింట్లు, నిఫ్టీ 386 పాయింట్లు లాభపడ్డాయి. ‘‘అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరతలు తగ్గేంత వరకు ఒడిదుడుకుల ట్రేడింగ్ కొనసాగవచ్చు. ముఖ్యంగా యుద్ధ పరిస్థితులు మార్కెట్లను నడిపించనున్నాయి. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పరపతి నిర్ణయాలు క్రూడాయిల్ ధరలు కూడా కీలకం కానున్నాయి. ఇక దేశీయంగా సోమవారం వెలువడనున్న ద్రవ్యోల్బణ టోకు, రిటైల్ గణాంకాలు, ఎఫ్ఐఐల అమ్మకాలపై ఇన్వెస్టర్లు దృష్టిని సారించవచ్చు. సాంకేతికంగా దిగువస్థాయిలో నిఫ్టీకి 16,400 వద్ద కీలక మద్దతు స్థాయి కలిగి ఉంది. ఎగువస్థాయిలో 16,800 వద్ద బలమైన నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ శామ్కో సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ యశ్ షా తెలిపారు. కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఈ మార్చి మొదటి రెండు వారాల్లో విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా నిలిచారు. ఈ నెల 2–4 తేదీల మధ్య ఎఫ్ఐఐలు మొత్తం రూ.45,608 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఇందులో ఈక్విటీల రూపంలో రూ. 41,168 కోట్లు, డెట్ విభాగం నుండి రూ. 4,431 కోట్లు, హైబ్రిడ్ సాధనాల నుండి రూ. 9 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీల గణాంకాలు చెబుతున్నాయి. ‘‘పెరిగిన కమోడిటీ ధరల ప్రభావం భారత్ మార్కెట్‌పై ఎక్కువ ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ తెలిపారు. ఐపీవోకు నవీ టెక్నాలజీస్ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సహవ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ ఏర్పాటు చేసిన నవీ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 3,350 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. ఐపీవో నిధుల కోసం పూర్తిగా తాజా ఈక్విటీని జారీ చేయనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటివరకూ నవీ టెక్నాలజీస్‌లో రూ. 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ప్రమోటర్ బన్సల్ ఐపీవోలో భాగంగా ఎలాంటి వాటాను విక్రయించబోవడంలేదని ప్రాస్పెక్టస్ ద్వారా కంపెనీ వెల్లడించింది. -
సెన్సెక్స్.. రోలర్ కోస్టర్; +416 నుంచి –545కు..
ముంబై: కీలక ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకటనకు ముందు స్టాక్ మార్కెట్లో అప్రమత్తత చోటు చేసుకుంది. అమెరికాతో సహా ఇదే వారంలో పలుదేశాల కేంద్ర బ్యాంకుల ద్రవ్య పాలసీ సమీక్ష సమావేశాల నేప థ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గుచూపారు. అలాగే ఒమిక్రాన్ భయాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఈ పరిణామాలతో మార్కెట్ సోమవారం భారీ పతనాన్ని చవిచూసింది. సెన్సెక్స్ 503 పాయింట్లు నష్టపోయి 58,283 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 143 పాయింట్లు కోల్పోయి 17,368 వద్ద నిలిచింది. సూచీలకిది రెండోరోజూ నష్టాల ముగింపు. ఒక ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తి డిని ఎదుర్కొన్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక షేర్లలో అధిక విక్రయాలు జరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2743 కోట్ల షేర్లను అమ్మేశారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.1351 కోట్ల షేర్లను కొన్నారు. ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. గరిష్టం నుంచి 960 పాయింట్ల పతనం సెన్సెక్స్ ఉదయం 317 పాయింట్ల లాభంతో 59,104 వద్ద, నిఫ్టీ 108 పాయింట్లు పెరిగి 17,619 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 416 పాయింట్లు పెరిగి 59,203 వద్ద, నిఫ్టీ 155 పాయింట్లు ర్యాలీ చేసి 17,511 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. అయితే జాతీయ, అంతర్జాతీయ ప్రతికూలతలతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. మిడ్‌సెషన్‌లోనూ యూరప్ మార్కెట్ల బలహీన ప్రారంభం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్ గత ముగింçపుతో పోలిస్తే 545 పాయింట్లు కోల్పోయింది. వెరసి ఇంట్రాడే గరిష్టం(59,203) నుంచి 960 పాయింట్లు పతనమై 58,243కు చేరింది. అమ్మకాలు ఎందుకంటే...? ► అమెరికా ఫెడ్ రిజర్వ్‌తో పాటు ఈ వారంలో యూరోపియన్ యూనియన్ బ్యాంక్(ఈసీబీ), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్‌లు పరపతి సమీక్ష గణాంకాలు వెల్లడి కానున్నాయి. వడ్డీరేట్లు, బాండ్ల క్రయ, విక్రయాలు, ద్రవ్యవిధానంపై ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు తమ వైఖరిని ప్రకటించనున్నాయి. ఇప్పటికే యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలు తెరపైకి వచ్చాయి. ► ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి కర్ఫ్యూలు, సరిహద్దుల మూసివేతతో సప్లై చైన్ దెబ్బతింది. ఫలితంగా అమెరికా నవంబర్ ద్రవ్యోల్బణం 39 ఏళ్ల గరిష్ట స్థాయికి ఎగిసింది. దేశీయంగానూ ఇవే కారణాలతో ద్రవ్యోల్బణం పెరగవచ్చనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. ద్రవ్యోల్బణ కట్టడికి కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపునకు మొగ్గుచూపాయనే సంగతి తెలిసిందే. ► బ్రిటన్‌లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైనట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. కట్టడి చర్యలను మరింత కఠినం చేస్తే ఆర్థిక రికవరీ ఆగిపోవచ్చని ఆందోళనలు మార్కెట్ వర్గాలను కలవరపెట్టాయి. ► విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలు కొనసాగడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ఈ డిసెంబర్లో ఇప్పటి వరకు రూ.8,879 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఇందులో రూ.7,462 కోట్ల ఈక్విటీ మార్కెట్ నుంచి, డెట్ మార్కెట్ నుంచి రూ.1,272 కోట్లు, హైబ్రిడ్ ఫండ్స్ నుంచి రూ.145 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఐటీ, బ్యాంకింగ్ షేర్లను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. రూ. లక్ష కోట్ల సంపద మాయం సూచీలు ఒకటిన్నర శాతం నష్టపోవడంతో రూ. లక్ష కోట్ల సంపద ఆవిరైంది. ఫలితంగా బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.266 లక్షల కోట్లకు దిగివచ్చింది. గడిచిన రెండు రోజుల్లో సెన్సెక్స్ 523 పాయింట్లు, నిఫ్టీ 149 పాయింట్లను కోల్పోయాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► పేటిఎం యాప్ ద్వారా గత రెండు నెలల్లో వర్తకులకు చేసిన మొత్తం చెల్లింపుల విలువ(జీఎంవీ) రెట్టింపు అయినప్పటికీ.., పేటీఎం షేరు 1% నష్టపోయి రూ.1555 వద్ద స్థిరపడింది. ► బోర్డు సమావేశానికి ముందుకు ఈజీమైట్రిప్ షేరు పదిశాతం ర్యాలీ చేసి రూ.1039 వద్ద ముగిసింది. ► ఎంకే బ్రోకరేజ్ సంస్థ ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించినా., స్టార్ హెల్త్ షేరు ఒకశాతం క్షీణించి రూ.897 వద్ద నిలిచింది. -
Stock Market: ప్రపంచ పరిణామాలే దిక్సూచి
ముంబై: ప్రపంచ పరిణామాలతో పాటు ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపవచ్చని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ తదితర అంశాల నుంచీ సంకేతాలను మార్కెట్ అందిపుచ్చుకోవచ్చని అంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం అనూహ్యరీతిలో పెరగడంతో ధరల కట్టడికి కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు నిర్ణయాన్ని తీసుకోవచ్చు. బాండ్లపై రాబడులు పెరగవచ్చు. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులపై ప్రభావం చూపవ చ్చు. ఈ నేపథ్యంలో సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. స్టాక్ సూచీలు నేడు (సోమవారం) ముందుగా గత వారాంతంలో విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలకు స్పందించాల్సి ఉంది. ఈ రోజు విడుదల కానున్న టోకు ధరల ద్రవ్యోల్బణం డేటాపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. గురునానక్ జయంతి సందర్భంగా శుక్రవారం ఎక్స్చెంజీలకు సెలవు. కనుక ట్రేడింగ్ నాలుగురోజులే జరగనుంది. గత వారంలో సెన్సెక్స్ 619 పాయింట్లు, నిఫ్టీ 186 పాయింట్లు లాభపడిన సంగతి తెలిసిందే. ‘‘పండుగలు, కార్పొరేట్ల త్రైమాసిక ఫలితాల సీజన్ దాదాపు ముగిసింది. ఈ పరిస్థితుల్లో మార్కెట్ స్థిరీకరణ(కన్సాలిడేషన్)కు అవకాశం ఉంది. ద్రవ్యోల్బణ ఆందోళనలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగితే సూచీలు నష్టాన్ని చవిచూడవచ్చు’’ అని రిలిగేర్ బ్రోకరింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. కొనసాగుతున్న అమ్మకాలు... దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ నవంబర్ ప్రథమార్థంలో రూ.4,694 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఇందులో డెట్ మార్కెట్ నుంచి రూ.3,745 కోట్లను, ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.949 కోట్లను వెనక్కి తీసుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. భారత ఈక్విటీలు అధిక విలువ ట్రేడ్ అవుతున్నాయనే కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడుతున్నారని మార్నింగ్‌స్టార్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాత్సవ తెలిపారు. -
బంగారానికి ‘ద్రవ్యోల్బణం’ భరోసా
ముంబై: ద్రవ్యోల్బణం భయాలు, డాలర్ ఇండెక్స్ బలోపేతం వంటి అంశాల నేపథ్యంలో బంగారం ధర మళ్లీ రికార్డు స్థాయిల వైపు నడుస్తోంది. అమెరికా, చైనా, భారత్‌వంటి దేశాల్లో ద్రవ్యోల్బణం భయాలు తీవ్రమవుతున్నాయి. దీనితో పెట్టుబడులకు సురక్షిత సాధనంగా ఇన్వెస్టర్లు తక్షణం పడిడివైపు చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర 1,900 డాలర్ల దిశగా కదులుతోంది. ఈ వార్త రాస్తున్న 11 గంటల సమయంలో బుధవారం ముగింపుతో పోల్చితే ఔన్స్ 20 డాలర్ల లాభంతో 1,865 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దేశీయంగా ధర అంతర్జాతీయ సరళిని అనుసరిస్తోంది. అంతర్జాతీయంగా బులిష్ ధోరణితోపాటు రూపాయి బలహీనత కూడా దేశంలో బంగారానికి వరంగా మారుతోంది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)లో ధర 10 గ్రాములకు రూ. 400 లాభంతో 49,250 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశంలో ప్రధాన స్పాట్ మార్కెట్ ముంబైలో ధర క్రితంతో పోల్చితే 99.9 స్వచ్చత 10 గ్రాముల ధర రూ.980 లాభంతో రూ.49,351 వద్ద ముగిసింది. 99.5 స్వచ్చత ధర రూ.976 పెరిగి రూ.49,153 వద్దకు చేరింది. కేజీ వెండి ధర రూ.1,814 పెరిగి రూ.66,594 వద్ద ముగిసింది. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో పసిడి కూడా ధర రూ.883 పెరిగి రూ.48,218 వద్ద ముగిసింది. వెండి కేజీ ధర రూ.1,890 ఎగసి రూ.65,190కి చేరింది. -
టోకు ద్రవ్యోల్బణం... 9 నెలల గరిష్టం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్‌లో 1.55 శాతంగా నమోదయ్యింది. అంటే టోకు బాస్కెట్‌లోని ఉత్పత్తుల ధర 2019 నవంబర్‌తో పోల్చితే, 2020 నవంబర్‌లో 1.55 శాతం పెరిగిందన్నమాట. ఫిబ్రవరిలో 2.26 శాతం నమోదు తర్వాత, గడచిన తొమ్మిది నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. మొత్తం సూచీలో దాదాపు 60 శాతంగా ఉన్న తయారీ ఉత్పత్తుల ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. 2020 అక్టోబర్‌లో టోకు ద్రవ్యోల్బణం స్పీడ్ 1.48 శాతం అయితే, గత ఏడాది నవంబర్‌లో ఇది 0.58 శాతంగా ఉంది. ► నవంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం 3.94 శాతంగా ఉంది. అక్టోబర్ (6.37 శాతం)లో నమోదుకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. ఒక్క కూరగాయల ధరలను చూస్తే, 12.24 శాతం పెరిగాయి. ఆలూ విషయంలో ధరల పెరుగుదల తీవ్రంగా 115.12 శాతంగా ఉంది. ► నాన్–ఫుడ్ ఆర్టికల్స్ విషయానికి వస్తే, ధరల పెరుగుదల 8.43%. ► ఫ్యూయెల్, పవర్ బాస్కెట్లో ధర లు పెరక్కపోగా 9.87% తగ్గాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 6.93 శాతం మరోవైపు వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా దిగివస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నవంబర్‌లో ఇది 6.93 శాతంగా నమోదయ్యింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష, కీలక రేట్ల నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదికగా ఉంటుంది. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 6 – 2 శాతం మధ్య ఉండాలి. దీని ప్రకారం నవంబర్ సూచీ అధికంగానే ఉన్నప్పటికీ, అక్టోబర్ 7.61 శాతం కన్నా తగ్గడం గమనార్హం. -
అదుపులోకిరాని రిటైల్ ధరలు
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోనికి రావడంలేదు. 2020 అక్టోబర్‌లో 7.61 శాతంగా నమోదయ్యింది. అంటే సూచీలోని ఉత్పత్తుల బాస్కెట్ ధర 2019 అక్టోబర్‌తో పోల్చితే 2020 అక్టోబర్‌లో 7.61 శాతం పెరిగిందన్నమాట. ఆహారోత్పత్తుల ధరల పెరుగుదల మొత్తం సూచీపై ప్రభావం చూపిస్తోంది. సెప్టెంబర్‌లో సూచీ 7.27 శాతంగా ఉంది. సూచీలోని ప్రధాన విభాగాల్లో ఒకటైన ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 10.68 శాతం ఉంటే, అక్టోబర్‌లో 11.07 శాతంగా నమోదయ్యింది. కూరగాయల ధరలు వార్షికంగా చూస్తే, అక్టోబర్‌లో 22.51 శాతం పెరిగాయి. వడ్డీరేట్ల తగ్గింపు కష్టమే! రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోనికిరాని పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4శాతం) మరింత తగ్గించే అవకాశాలు లేనట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలని కేంద్రం ఆర్బీఐకి నిర్దేశిస్తోంది. అయితే ఈ స్థాయికి మించి ఈ రేటు నమోదవుతోంది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో ఎనిమిది నెలల గరిష్టం 7.27 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, రిటల్ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్ట్, అక్టోబర్ నెలల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగించింది. తగ్గుతుందన్న విశ్వాసం... అయితే సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ అంచనావేస్తోంది. వ్యవసాయ రంగం పరిస్థితి ఆశాజనకంగా ఉండడం, ముడి చమురు ధరలు ఒక నిర్దిష్ట శ్రేణితో తిరుగుతుండడం, లాక్డౌన్ నిబంధనల సడలింపులతో సరఫరాల వ్యవస్థ మెరుగుపడుతుండడం ఆర్బీఐ అంచనాలకు ప్రధాన కారణాలు. వెరసి డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3) 5.4 శాతానికి, మార్చి త్రైమాసికంలో (క్యూ4) 4.5 శాతానికి ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న అంచనాలను వెలువరించింది. క్యూ3లో 3.2–5.9 శాతం శ్రేణి ఉంటే, క్యూ4లో ఈ శ్రేణి 2.4–6.6 శాతం మధ్య ఉంటుందని ఆర్బీఐ తన పాలసీ సమీక్షలో భావించింది. ఈ అంచనాల నేపథ్యంలో వృద్ధికి దోహదపడే సరళతర ద్రవ్య విధానంవైపే ఆర్బీఐ మొగ్గుచూపుతోంది. మరోవైపు ఇప్పటికే ఏడాది ఆపైన కాలపరిమితుల స్థిర డిపాజిట్ రేటు 4.90 నుంచి 5.50 శాతం శ్రేణిలో ఉన్నాయని, ప్రస్తుత ద్రవ్యోల్బణంతో పోల్చితే ఇది నెగటివ్ రిటర్న్స్ అనీ ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. -
ఎన్నికల ఫలితాలు, గణాంకాలు కీలకం
బిహార్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ వారం మార్కెట్‌పై ఉంటుందని నిపుణులంటున్నారు. ఈ వారంలో వెలువడే పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు, కంపెనీల ఆర్థిక ఫలితాలు, ప్రపంచ రాజకీయ పరిణామాలు కూడా తగినంతగా ప్రభావం చూపుతాయని వారంటున్నారు. వీటితో పాటు డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ, కరోనా కేసులు, కరోనా టీకా సంబంధిత పరిణామాలు కూడా కీలకమేనని విశ్లేషకులంటున్నారు. చివరి దశకు క్యూ2 ఫలితాలు.... మూడు దశల్లో జరిగిన బిహార్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 10న(మంగళవారం) వెలువడతాయి. ఇక గురువారం (ఈ నెల 12న) సెప్టెంబర్ నెల పారిశ్రామికోత్పత్తి, అక్టోబర్ నెల ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడతాయి. కంపెనీల ఆర్థిక ఫలితాలు చివరి దశకు వచ్చాయి. ఈ వారంలో మొత్తం 2,600 కంపెనీలు తమ తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. టాటా స్టీల్, ఓఎన్జీసీ, హిందాల్కో, హిందుస్తాన్ కాపర్, ఐడీఎఫ్సీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆయిల్ ఇండియా, ఎన్ఎమ్డీసీ, అరబిందో ఫార్మా, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, గెయిల్ కంపెనీలు క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. కొత్త శిఖరాలకు స్టాక్ సూచీలు...! ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీని సూచిస్తున్నాయని, ఇది మార్కెట్‌కు ప్రతికూలాంశమని మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకులు హేమాంగ్ జని పేర్కొన్నారు. కాగా అమెరికా అధ్యక్షుడిగా జో బైడన్ గెలవడం సానుకూలాంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్ జోరుగా పెరిగితే ఈ వారంలోనే సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త శిఖరాలకు ఎగబాకే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఐదు రోజుల్లో రూ.8,381 కోట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటివరకూ జరిగిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూ.8,381 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం, వ్యాపార కార్యకలాపాలు పూర్తిగా రికవరీ అవుతాయనే అంచనాలు, డాలర్ బలహీనపడటం, కరోనా కేసులు తగ్గుతుండటం...ఈ కారణాల వల్ల విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు పెరుగుతోందని నిపుణులంటున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం, విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.6,564 కోట్లు, డెట్ సెగ్మెంట్లో రూ.1,817 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. కాగా గత నెలలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.22,033 కోట్లుగా ఉన్నాయి. అమెరికా ఎన్నికలు ముగిసినందున సెంటిమెంట్ మరింత స్థిరంగా ఉండనున్నదని విశ్లేషకులంటున్నారు. ఎమ్ఎస్సీఐ అంతర్జాతీయ సూచీల్లోని భారత షేర్లలో విదేశీ ఇన్వెస్టర్ల యాజమాన్య పరిమితుల పునర్వవ్యస్థీకరణ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని వారంటున్నారు. అక్టోబర్‌లో ఈక్విటీల నుంచి ఫండ్స్ భారీ ఉపసంహరణలు... వరుసగా ఐదోసారి ఈక్విటీల నుంచి మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) భారీ మొత్తాన్ని విత్‌డ్రా చేశాయి. అక్టోబర్ నెలలో రూ.14,344 కోట్ల మొత్తాన్ని ఉపసంహరించుకున్నాయి. దీంతో కలిపి జూన్ నుంచి ఎంఎఫ్‌లు ఉపసంహరణ చేసిన మొత్తం రూ.37,498 కోట్లు. ఫండ్ మేనేజర్లు రెస్క్యూ స్టాక్స్‌ను విక్రయించడమే విత్‌డ్రాకు ప్రధాన కారణం. ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్య ఎంఎఫ్‌లు స్టాక్ మార్కెట్లో రూ.40 వేల కోట్ల పైనే పెట్టుబడులు పెట్టారని సెక్యూరిటీస్ అండ్ ఎక్సే్చంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) డేటా వెల్లడించింది. అమెరికా ఎన్నికలపై ఆందోళన, మందగించిన దేశీయ ఆర్థ్ధిక వ్యవస్థ వంటి కారణాలతో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో నిరంతర ప్రవాహాన్ని గమనించామని ఫినాలజీ సీఈఓ ప్రంజల్ కమ్రా తెలిపారు. అయితే ఆర్థ్ధిక సంవత్సరం ముగియనుండటం, మార్కెట్ సెంటిమెంట్ సానుకూలంగా మారుతుండటంతో ఇన్‌ఫ్లోలో పెరుగుదల కనబడుతోందని కమ్రా తెలిపారు. సెప్టెంబర్ త్రైరమాసికంలో ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ రూ.7,200 కోట్ల ఔట్‌ఫ్లో ఉందని, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) నుంచి ఔట్‌ఫ్లో తగ్గిపోయిందని తెలిపారు. ‘ ‘ఇది అనిశ్చితి కాలంలో కనిపించే ఒక సాధారణ ప్రక్రియ. క్రాష్ తర్వాత మార్కెట్లు కోలుకున్నప్పుడు, పెట్టుబడిదారులు బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్నప్పుడు ఉపసంహరణ సహజమని’’ గ్రోవ్ కో–ఫౌండర్ అండ్ సీఓఓ హర్‡్ష జైన్ అన్నారు. వ్యక్తిగతంగా ఎంఎఫ్‌లు విత్‌డ్రా చేసిన మొత్తం నెలల వారీగా చూస్తే.. సెప్టెంబర్‌లో రూ.4,134 కోట్లు, ఆగస్టులో రూ.9,213 కోట్లు, జూలైలో రూ.9,195 కోట్లు, జూన్‌లో రూ.612 కోట్లుగా ఉన్నాయి. మార్చిలో మార్కెట్ పతనం తర్వాత ఎంఎఫ్ ఇన్వెస్టర్లు తమ నికర ఆస్తి విలువ (ఎన్ఏవీ)లో గణనీయమైన నష్టాలను చవిచూశారు. ఎన్ఏవీలు కోలుకున్న తర్వాత తమ పెట్టుబడుల నుంచి నిష్క్రమించడం వల్లే ఉపసంహరణ జరగిందని క్వాంటమ్ ఏఎంసీ ఫండ్ మేనేజర్ నీలేష్ శెట్టి తెలిపారు. -
కూరగాయల ధరలు 37% అప్!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 1.32 శాతంగా నమోదయ్యింది. ఏడు నెలల గరిష్టస్థాయి ఇది. ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన గణాకాల ప్రకారం– సూచీలో దాదాపు 14 శాతం వెయిటేజ్ ఉన్న ఆహార ఉత్పత్తుల బాస్కెట్ ధర భారీగా పెరిగింది. కూరగాయల ధరలు 37 శాతం పెరిగితే (2019 సెప్టెంబర్ ధరలతో పోల్చి), ఆలూ విషయంలో ద్రవ్యోల్బణం ఏకంగా 108 శాతంగా ఉంది. సూచీలోని 3 ప్రధాన విభాగాలూ ఇలా... ► మొత్తం సూచీలో 20.12%గా ఉన్న ప్రైమరీ ఆర్టికల్స్ (ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌సహా)లో ద్రవ్యోల్బణం 5.10 శాతంగా నమోదయ్యింది. ఇందులో 14.34 శాతం వెయిటేజ్ ఉన్న ఫుడ్ ఆర్టికల్స్‌లో ధరాభారం 8.17 శాతంగా ఉంది. అయితే 4.26 శాతం వెయిటేజ్ ఉన్న నాన్ ఫుడ్ బాస్కెట్ ధర మాత్రం 0.08 శాతం తగ్గింది. ► ఇక 14.91 శాతం వెయిటేజ్ ఉన్న ఫ్యూయెల్ అండ్ పవర్ విభాగంలో ద్రవ్యోల్బణం కూడా 9.54 శాతం తగ్గింది. ► 64.97 శాతం వెయిటేజ్ ఉన్న తయారీ ఉత్పత్తుల్లో ధరలు 1.61 శాతం పెరిగాయి. కూరగాయల ధరలు చూస్తే... ఫుడ్ ఆర్టికల్స్‌లో ధరాభారం ఎనిమిది నెలల గరిష్ట స్థాయిలో 8.17 శాతం పెరిగితే, కూరగాయలు, ఆలూ ధరలు సామాన్యునికి భారంగా మారిన పరిస్థితి నెలకొంది. పప్పుదినుసుల ధరలు 12.53 శాతం ఎగశాయి. కాగా, ఉల్లిపాయలు (31.64%), పండ్లు (3.89%), తృణ ధాన్యాల (3.91%) ధరలు తగ్గాయి. రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో 7.34%గా నమోదయ్యింది. గత 8 నెలల్లో ఇంత అధిక స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. -
ఒడిదుడుకులుంటాయ్...!
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లో ఈ వారం తీవ్ర ఒడిదుడుకులు ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా వైరస్ సంబంధిత పరిణామాలే ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను నిర్దేశిస్తాయని వారంటున్నారు. ప్రపంచ మార్కెట్ల పోకడ, అంతర్జాతీయ సంకేతాలు కూడా కీలకమేనని నిపుణులంటున్నారు. ఈ నెల 14(మంగళవారం) అంబేడ్కర్ జయంతి సందర్భంగా సెలవు కావడంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానున్నది. నేడు రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు.... మార్చి నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు నేడు (సోమవారం), టోకు ధరల ద్రవ్యోల్బణ గణాం కాలు మంగళవారం(ఏప్రిల్ 14న) వెలువడుతాయి. ఇక ఈవారం నుంచే క్యూ4 ఫలితాల సీజన్ మొద లవుతోంది. బుధవారం(ఈ నెల 15న) విప్రో, ఈ నెల 16న(గురువారం) టీసీఎస్, ఈ నెల 18న (శనివారం) హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు వస్తాయి. లాక్‌డౌన్‌కు, మార్కెట్‌కు లింక్! దశలవారీగానైనా లాక్‌డౌన్‌ను తొలగిస్తే, ఆర్థిక కార్యకలాపాలు పాక్షికంగానైనా పుంజుకుంటాయనే అంచనాలతో ఇటీవల మార్కెట్ భారీగా పెరిగింది. అయితే లాక్డౌన్ పొడిగింపు సూచనలే కనిపిస్తుండటం.. మార్కెట్‌పై బాగానే ప్రభావం చూపుతుందని అంచనా. అయితే జనాలే కాదు, జీవనోపాధి కూడా ముఖ్యమేనని ప్రధాని వ్యాఖ్యానించడంతో లాక్డౌన్ నుంచి ఒకింత ఊరట లభించవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. కొనసాగుతున్న ‘విదేశీ’ విక్రయాలు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో సురక్షిత మదుపు సాధనాలైన పుత్తడి, డాలర్ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయడానికే విదేశీ ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే భారత్ లాంటి వర్ధమాన దేశాల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. కాగా ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ.2,951 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.6,152 కోట్లు.. వెరసి మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.9,103 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. గత నెలలో రికార్డ్ స్థాయిలో రూ.1.1 లక్షల కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. -
గణాంకాలతో నష్టాలు
పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు నిరాశపరచడంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. చైనాలో కోవిడ్–19(కరోనా) వైరస్ సంబంధిత కొత్త కేసులు పెరగడంతో ప్రపంచ మార్కెట్లు నష్టపోవడం ప్రతికూల ప్రభావం చూపించింది. ముడి చమురు ధరలు 2 శాతం మేర తగ్గినప్పటికీ, మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు. బీఎస్ఈ సెన్సెక్స్ 106 పాయింట్లు పతనమై 41,460 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 27 పాయింట్లు నష్టపోయి 12,175 వద్ద ముగిశాయి. దెబ్బతిన్న సెంటిమెంట్.... గత ఏడాది డిసెంబర్లో పారశ్రామికోత్పత్తి 0.3 శాతం తగ్గింది. ఇక జనవరిలో రిటైల్ ద్రవ్యల్బోణం ఐదున్నరేళ్ల గరిష్ట స్థాయి, 7.59 శాతానికి ఎగసింది. కోవిడ్–19(కరోనా) వైరస్ కష్టాల కారణంగా చైనాలో కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతింటాయని, ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉండగలదని, దీంతో అంతర్జాతీయంగా చమురుకు డిమాండ్ తగ్గగలదని అంతర్జాతీయ ఇంధన సంస్థ(ఐఈఏ) హెచ్చరించడం.. ఈ అంశాలన్నీ కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. 371 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్.... సెన్సెక్స్ లాభాల్లోనే ఆరంభమైనా, ఆ తర్వాత నష్టాల్లోకి జారిపోయింది. రోజంతా నష్టాలు కొనసాగాయి. ఆరంభంలోనే 143 పాయింట్లు పెరిగినా, ఆ తర్వాత 228 పాయింట్లు నష్టపోయింది. రోజంతా 371 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ► ద్రవ్యోల్బణం పెరగడంతో రేట్ల కోత ఆశలు ఆవిరి కావడంతో వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లు నష్టపోయాయి. ► ఇండస్ఇండ్ బ్యాంక్ 3.8 శాతం నష్టంతో రూ.1,230 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ నష్టపోయినప్పటికీ, పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. హెచ్‌యూఎల్, అవెన్యూ సూపర్‌మార్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఇప్కా ల్యాబ్స్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, ట్రెంట్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. -
నిజంగా ‘దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉంది’!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో పప్పు దినుసులతోపాటు కూరగాయ ధరలు మండిపోతున్నాయి. రిటైల్ ద్రవ్యోల్భణం గత అక్టోబర్ నెలలో 4.62 శాతానికి చేరుకొని 16 నెలల్లో గరిష్ట స్థాయి రికార్డును నెలకొల్పింది. మరోపక్క నేరాలు ఘోరంగా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడల్లా ‘దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది....’ అని ఓ తెలుగు సినిమాలో నూతన్ ప్రసాద్ పాత్ర పదే పదే వాపోతుంది. అదేం లేదు, ‘దేశంలో విమానాశ్రయాలు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రజలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి బాగుందనడానికి ఇంతకన్నా ఉదాహరణలు ఏమి కావాలి?’ మన కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సురేశ్ అంగడీ శుక్రవారం సవాల్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ అంచనాల ప్రకారం ద్రవ్యోల్పణం ఎప్పుడూ నాలుగు శాతం లోపలే ఉండాలి. దాన్ని దాటిందంటే దేశంలో ఆర్థిక మాంద్యపు ప్రమాద ఘంటికలు మోగినట్లే. దేశంలో కూరగాయలు ఒక్క నెలలోనే 26.1 శాతం పెరగ్గా, పప్పు దినుసులు 11.72 శాతం పెరిగాయి. ఈ నెలలో ఢిల్లీలో కిలో ఉల్లి గడ్డలు 80 రూపాయలకు చేరుకోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ సంబంధిత అధికారులను ఆదేశించడం తెల్సిందే. గత నెలలో కిలో 55 రూపాయలుండగా, ఒక్క నెలలోనే పాతిక రూపాయలు పెరిగింది. మరో రెండు, మూడు నెలలు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని ‘కేర్ రేటింగ్స్’ హెచ్చరించింది. వచ్చే ఏడాది మార్చి త్రైమాసికానికి రిటేల్ ద్రవ్యోల్భణాన్ని నాలుగు శాతం లోపలికి తీసుకరాకపోతే ముప్పని తెలిపింది. గత సెప్టెంబర్ నెలలో దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి 4.3 శాతం పడిపోయింది. గత ఎనిమిదేళ్లలోనే ఇది అత్యధిక శాతమని ఆర్థిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ ఐదుశాతానికి పడిపోయింది. గత ఐదేళ్లలో ఇదే కనిష్టం. ఇది నాలుగు–నాలుగున్నర శాతానికి పడిపోయే ప్రమాదం ఉందని, అది జరిగితే కష్టకాలం వచ్చినట్లేనని ఐసీఐసీఐలో ఆర్థిక వేత్తగా పనిచేస్తున్న ఏ. దేవ్‌ధర్ హెచ్చరించారు. జీడీపీ రేటు పడిపోయినప్పుడల్లా ఆర్బీఐ రెపో రేట్లను తగ్గిస్తూ వస్తోంది. ఇప్పటికే బాగా తగ్గించారని, మరింత రెపో రేట్లను తగ్గించడం సాధ్యం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో దేశం సుభిక్షంగా ఉన్నట్లు సురేశ్ అంగడి మాట్లాడారు. దేశంలో విమానాలు, రైళ్లు కిటకిటలాడితే సామాన్య ప్రజలకు కష్టాలు లేనట్లేనా! అందుకేనా పలు రైళ్లలో టిఫిన్లు, భోజనం చార్జీలను భారీగా పెంచింది?! -
క్యూ2 ఫలితాలే దిక్సూచి..!
ఈ వారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలివర్, విప్రో, అంబుజా, తదితర దిగ్గజ సంస్థలు తమ క్యూ2 ఫలితాలను వెల్లడించనున్నాయి. కంపెనీల క్యూ2 ఫలితాలతో పాటు ప్రపంపవ్యాప్తంగా చోటు చేసుకునే పరిణామాలు కూడా ఈ వారం మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులంటున్నారు. మరోవైపు నేడు (సోమవారం) విడుదలయ్యే రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాల, గత శుక్రవారం వెల్లడైన పారిశ్రామికోత్పత్తి గణాంకాల ప్రభావం కూడా మార్కెట్‌పై ఉంటుందని వారంటున్నారు. పాక్షిక ఒప్పందం.... గత 15 నెలలుగా జరుగుతున్న అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధానికి గత శుక్రవారం జరిగిన పాక్షిక ఒప్పందంతో ఒకింత తెరపడింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన పాక్షిక ఒప్పందం ఒకింత సానుకూల ప్రభావం చూపించవచ్చు. అయితే పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు భగ్గుమంటే ఆ ప్రభావం మన మార్కెట్‌పై ప్రతికూలంగానే ఉంటుంది. నేడు రిటైల్ గణాంకాలు నేడు సెప్టెంబర్ నెలకు సంబంధించిన రిటైల్, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడవుతాయి. రేపు(ఈ నెల 15న) ఎగుమతుల గణాంకాలు వస్తాయి. ఇక ఈ నెల 1–4న జరిగిన ఆర్బీఐ ద్రవ్య, పరపతి విధాన సమావేశ వివరాలు (మినిట్స్) 18న(శుక్రవారం) వెల్లడవుతాయి. ఒడిదుడుకులు... ఫలితాల సీజన్ ఆరంభమై ఇది రెండో వారం. ఈ వారంలో దాదాపు 96 కంపెనీలు తమ ఫలితాలను వెల్లడించనున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందుస్తాన్ యూనిలివర్, ఎస్బీఐ లైఫ్, విప్రో, ఏసీసీ, జీ ఎంటర్టైన్మెంట్, హెచ్డీఎప్సీ బ్యాంక్, అంబుజా సిమెంట్స్, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, టీవీఎస్ మోటార్స్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, పీవీఆర్, ఈ జాబితాలో ఉన్నాయి. కంపెనీల ఫలితాలు మార్కెట్ మూడ్‌ను నిర్దేశిస్తాయని శామ్కో సెక్యూరిటీస్ ఎనలిస్ట్ జిమీత్ మోదీ పేర్కొన్నారు. దిగ్గజ కంపెనీల ఫలితాల వెల్లడి కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకోవచ్చని ఎపిక్ రీసెర్చ్ ఎనలిస్ట్ ముస్తఫా నదీమ్ అంచనా వేస్తున్నారు.ఇక అంతర్జాతీయంగా చూస్తే, చైనా క్యూ3 జీడీపీ గణాంకాలు ఈ నెల 18న వస్తాయి. అమెరికా సెప్టెంబర్ నెలకు సంబంధించిన రిటైల్ అమ్మకాల వివరాలు ఈ నెల 16న (బుధవారం) వస్తాయి. 6,200 కోట్ల విదేశీ నిధులు వెనక్కి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటిదాకా మన క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.6,200 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. ఎఫ్‌పీఐలు స్టాక్ మార్కెట్ నుంచి రూ.4,955 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.1,262 కోట్లు చొప్పున మొత్తం రూ.6,217 కోట్లు పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అంతర్జాతీయ వృద్ధి భయాలు, వాణిజ్య యుద్ధ ఆందోళనలు, ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నా, ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో పుంజుకోలేకపోవడం దీనికి కారణాలు. కంపెనీల క్యూ2 ఫలితాలు, ప్రపంచ వాణిజ్య పరిణామాలు, ఆర్థిక మందగమనాన్ని నిరోధించేందుకు ప్రభు త్వం తీసుకునే చర్యలు తదితర అంశాలపై విదేశీ నిధుల భవిష్యత్తు పెట్టుబడులు ఆధారపడి ఉంటాయని నిపుణులంటున్నారు. -
ఫలితాలు, గణాంకాలు నడిపిస్తాయ్ !
కీలక కంపెనీల మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాలు ఈ వారం మార్కెట్‌ను నడిపిస్తాయని విశ్లేషకులు అంటున్నారు. వీటితో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల గమనం, డాలర్‌తో రూపాయి మారకం కూడా తగిన ప్రభావాన్ని చూపిస్తాయని వారంటున్నారు. గత శుక్రవారం వెలువడిన పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలకు సోమవారం మార్కెట్ ప్రతిస్పందిస్తుంది. పారిశ్రామికోత్పత్తి 17 నెలల గరిష్ట స్థాయి, 8.4 శాతానికి ఎగియగా, రిటైల్ ద్రవ్యోల్బణం కూడా 17 నెలల గరిష్ట స్థాయి, 5.2 శాతానికి ఎగిశాయి. మార్కెట్ జోరు కొనసాగుతుంది... ఇక మంగళవారం టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు వస్తాయి. ఈ వారంలో భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, విప్రో, హిందుస్తాన్ యూనిలివర్, యస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, తదితర దిగ్గజ సంస్థల క్యూ3 ఫలితాలు వెలువడుతాయి. ప్రపంచ మార్కెట్ల జోరు, నిధుల ప్రవాహం బాగా ఉండటంతో స్టాక్ మార్కెట్లో ప్రస్తుత సానుకూలతలు కొనసాగుతాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. అయితే కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు, బడ్జెట్ సంబంధించిన సంకేతాలు మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్, టీసీఎస్ ఫలితాలు అంచనాలకనుగుణంగానే వచ్చాయని, మార్కెట్ జోరు కొనసాగుతుందని అరిహంత్ క్యాపిటల్ మార్కెట్స్ హోల్‌టైమ్ డైరెక్టర్ అనితా గాంధీ చెప్పారు. విదేశీ పెట్టుబడులు ః రూ.5,200 కోట్లు భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) రూ.5,200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం ఈ నెల 1–12 మధ్యన విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో రూ.2,172 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.3,080 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశారు. ఈల్డ్స్ ఆకర్షణీయంగా ఉండడం, కంపెనీల క్యూ3 ఫలితాలు ఆశావహంగా ఉంటాయనే అంచనాలు దీనికి కారణమని నిపుణులంటున్నారు. ఇవే కారణాల వల్ల విదేశీ పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వారంటున్నారు. గత ఏడాది డెట్, ఈక్విటీల్లో కలిపి విదేశీ ఇన్వెస్టర్లు మొత్తం రూ.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. -
గణాంకాలే కీలకం..
న్యూఢిల్లీ: రెండు రోజుల సెలవుల కారణంగా మూడు రోజులే ట్రేడింగ్ ఉండే ఈ వారంలో గణాంకాలు కీలకమని నిపుణులంటున్నారు. పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ముడి చమురు ధరలు, రూపాయి కదలికలు కూడా తగిన ప్రభావం చూపుతాయని వారంటున్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఈ నెల 14న(గురువారం), శ్రీరామ నవమి సందర్భంగా ఈ నెల 15న(శుక్రవారం) మార్కెట్‌కు సెలవులు. ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితమైనందున ఒడిదుడుకులుండవచ్చని, వ్యవస్థాగత ఇన్వెస్టర్లు పరిమితంగానే ట్రేడింగ్‌లో పాల్గొనడం దీనికి ప్రధాన కారణమని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. పరిమితంగా ట్రేడింగ్: ఈ నెల 12(మంగళవారం)న వెల్లడయ్యే ఫిబ్రవరి నెల పారిశ్రామికోత్పత్తి, మార్చి నెల వినియోగదారుల ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ సెంటిమెంట్‌ను నడిపిస్తాయని సింఘానియా వివరించారు. కంపెనీలు వెల్లడించే గత ఆర్థిక సంవత్సరపు నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలే.. సమీప కాలంలో స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపే కీలక అంశమని తెలిపారు. శుక్రవారం వెల్లడయ్యే ఇన్ఫోసిస్ ఫలితాలతో క్యూ4 ఫలితాల సీజన్ ఆరంభం కానున్నది. రెండు రోజుల సెలవుల కారణంగా ఇన్వెస్టర్లు, ట్రేడర్లు పరిమితంగా ట్రేడింగ్ జరుపుతారని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్(రీసెర్చ్) రవి షెనాయ్ చెప్పారు. షెడ్యూల్ ప్రకారం టోకు ధరల సూచీ గణాంకాలను ప్రభుత్వం ఈ నెల 14న విడుదల చేయాల్సి ఉంది. కానీ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆ రోజు సెలవు కారణంగా ఈ గణాంకాలను ఈ నెల 18న (వచ్చే సోమవారం) వెల్లడిస్తారు. ఇక అంతర్జాతీయ అంశాల విషయానికి వస్తే, చైనా ట్రేడ్ బ్యాలెన్స్ గణాంకాలు ఈ నెల 12న, అమెరికా ముడి చమురు నిల్వల గణాంకాలు ఈ నెల 13న(బుధవారం), చైనా జీడీపీ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ నెల 14న(గురువారం)వెలువడతాయి. రెండో నెలలోనూ బుల్లిష్‌గానే... భారత స్టాక్ మార్కెట్ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా రెండో నెలలోనూ బుల్లిష్‌గానే ఉన్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ మన క్యాపిటల్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,600 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఆర్బీఐ రేట్ల కోత అంచనాలతో గత నెలలో రూ.19,967 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు వచ్చాయి. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లో రూ.7,964 కోట్లు పెట్టుబడులు పెట్టగా, డెట్ మార్కెట్ నుంచి రూ.3,202 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. మొత్తం వీరి నికర పెట్టుబడులు రూ.4,762 కోట్లుగా ఉన్నాయి. ఇక ఈ నెల పెట్టుబడుల విషయానికి వస్తే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈక్విటీల్లో రూ.3,469 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.4,152 కోట్లు చొప్పున మొత్తం రూ.7,625 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఆర్బీఐ రేట్ల కోత కారణంగా బాండ్ ధరలు ర్యాలీ జరిపాయని, ఫలితంగా ఎఫ్‌పీఐల నుంచి మరిన్ని నిధులు వచ్చాయని ఎస్ఏఎస్ ఆన్లైన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ) సిద్ధాంత్ జైన్ చెప్పారు. -
సుప్రీం, గణాంకాలపై దృష్టి
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కు సంబంధించి సుప్రీం కోర్టులో మంగళవారం విచారణకు తెరలేవనుంది. గత రెండు దశాబ్దాలలో(1993 నుంచి 2010 వరకూ) వివిధ ప్రభుత్వాలు చేపట్టిన కేటాయింపులన్నీ అక్రమమేనంటూ ఇప్పటికే సుప్రీం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో జరగనున్న విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. మరోవైపు ఈ వారంలో పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) గణాంకాలతోపాటు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు వె ల్లడికానున్నాయి. ఈ అంశాలన్నింటినీ ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని, దీంతో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులను చవిచూసే అవకాశాలున్నట్లు స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే బుల్లిష్ ధోరణిలో సాగుతున్న మార్కెట్లకు ఇకపై ఆర్థిక గణాంకాలు కీలకంగా నిలవనున్నాయని తెలిపారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల కేసులో హియరింగ్ ప్రభావం మెటల్, పవర్ షేర్లపై కనిపిస్తుందని పేర్కొన్నారు. మరింత ముందుకు.... జూలై నెలకు ఐఐపీ, ఆగస్ట్ నెలకు సీపీఐ గణాంకాలు శుక్రవారం(12న) వెలువడనున్నాయి. వీటితోపాటు ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ మార్కెట్ల సంకేతాలు వంటి అంశాలు సైతం సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు వివరించారు. గడచిన వారంలో సెన్సెక్స్ 389 పాయింట్లు లాభపడి 27,027 వద్ద ముగిసింది. ఒక దశలో 27,226 పాయింట్ల కొత్త గరిష్టానికి సైతం చేరింది. డెరివేటివ్ లావాదేవీలు, ట్రేడర్ల ఆసక్తి, బలపడ్డ సెంటిమెంట్ వంటి అంశాల ఆధారంగా ఈ వారంలోనూ మార్కెట్లు మరింత పుంజుకుంటాయని అంచనా వేస్తున్నట్లు బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేష్ గోయల్ చెప్పారు. కొనసాగుతున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు కూడా ఇందుకు సహకరిస్తాయని అభిప్రాయపడ్డారు. జీడీపీతో జోష్: ఈ ఏడాది తొలి క్వార్టర్లో జీడీపీ 5.7%కు పుంజుకోవడం గత వారంలో ఇన్వెస్టర ్లకు ప్రోత్సాహాన్నిచ్చిందని పలువురు నిపుణులు పేర్కొన్నారు. ఎఫ్ఐఐల పెట్టుబడులు, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం చల్లబడటం వంటి అంశాలు దీనికి జతకలిశాయని చెప్పారు. ఇకపై ఐఐపీ, సీపీఐ గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెడతారని వెరాసిటీ బ్రోకింగ్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ జిగ్నేష్ చౌదరి చెప్పారు. ఇంతక్రితం విడుదలైన ఈ గణాంకాల్లో వృద్ధి నమోదుకావడంతో వీటిపై సానుకూల అంచనాలున్నాయని తెలిపారు. కాగా, సాంకేతిక అంశాల ప్రకారం మార్కెట్లు మరింత పురోగమిస్తాయని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అంచనా వేశారు. అయితే బొగ్గు క్షేత్రాల కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో పరిమాణాలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తారని తెలిపారు. గడచిన శుక్రవారం యూరోపియన్ కేంద్ర బ్యాంక్(ఈసీబీ) పాలసీ రేట్లను తగ్గించడంతోపాటు, అదనపు సహాయక ప్యాకేజీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మరిన్ని విదేశీ నిధులు భారత్ వంటి వర్ధమాన మార్కెట్లకు తరలి వస్తాయన్న అంచనాలు పెరిగాయని డీలర్లు చెప్పారు. తొలి వారం రూ. 9,000 కోట్ల పెట్టుబడులు దేశీ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఈ నెల తొలి వారంలో నికరంగా రూ. 9,000 కోట్లను(150 కోట్ల డాలర్లు) ఇన్వెస్ట్ చేశారు. వీటిలో రూ. 3,972 కోట్లను(65.6 కోట్ల డాలర్లు) స్టాక్స్ కొనుగోలుకి వెచ్చించగా, రూ. 5,013 కోట్లను(82.8 కోట్ల డాలర్లు) బాండ్లలో ఇన్వెస్ట్ చేశారు.