ఈక్విటీకి హెడ్జింగ్
అన్ని రకాల పెట్టుబడులకు ద్రవ్యోల్బణం రిస్క్ ఉంటుంది. ఈక్విటీలు సైతం అందుకు అతీతం కాదు. కంపెనీల వ్యాపారాలపైనా ద్రవ్యోల్బణం ప్రభావం ఉంటుందని గుర్తించాలి.
ద్రవ్యోల్బణం వల్ల కంపెనీలకు ముడి సరుకుల ధరలు పెరిగిపోతాయి. దీనివల్ల తయారీ కంపెనీల లాభాల మార్జిన్లు తగ్గిపోతాయి. అధిక ద్రవ్యోల్బణం ఉన్న సమయాల్లో పరిశీలించినప్పుడు.. 2009–10లో నిఫ్టీ 50 కంపెనీల (ఫైనాన్షియల్ కంపెనీలు మినహా) ఎబిట్డా 19.86 శాతంగా ఉంటే, 2013–14 నాటికి 16.31 శాతానికి క్షీణించింది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం తర్వాత నెలకొన్న పరిస్థితులు ఇందుకు దారితీశాయి.
ఆ సమయాల్లో వినియోగదారుల కొనుగోలు శక్తి కూడా క్షీణిస్తుంది. దాంతో అవసరమైన కొనుగోళ్లకు పరిమితమై.. అనవసరపు ఖర్చును నియంత్రించుకునేందుకు వినియోగదారులు మొగ్గు చూపిస్తారు. దాంతో కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోతుంది. కనుక ద్రవ్యోల్బణం కొన్ని కంపెనీలకు ప్రతికూలిస్తే.. కొన్ని కంపెనీలకు అనుకూలిస్తుందని చెప్పుకోవాలి. కనుక పెట్టుబడుల్లో వైవిధ్యమైన కంపెనీలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడు సహజంగానే హెడ్జింగ్ (రక్షణ) ఉండేలా చూసుకోవచ్చు. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న సమయాల్లో కొన్ని రకాల థీమ్‌లను పరిశీలించొచ్చు.
రెండేళ్ల క్రితం 2020 మార్చిలో సన్ ఫ్లవర్ నూనె లీటర్ రూ.85. రెండు నెలల క్రితం రూ.120. ఇప్పుడు రూ.180–200కు పైనే. 2019 జూలైలో పెట్రోల్ లీటర్ ధర రూ.73. 2020 జూన్‌లో రూ.80. 2021 జూలైలో రూ.100. 2022 ఏప్రిల్‌లో రూ.120. ఇలా నిత్యావసరాల ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. దీన్నే ద్రవ్యోల్బణంగా చెప్పుకోవాలి. కరెన్సీ విలువను తినేసే చెద పురుగు ఇది.
పెట్టుబడికి రాబడి తోడైనప్పుడే సంపదగా మారుతుంది. ఈ క్రమంలో పెట్టుబడి విలువను హరించే ద్రవ్యోల్బణం గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? మెజారిటీ ఇన్వెస్టర్లు పట్టించుకోని అంశం ఇది. ఇంటి నిర్మాణం అప్పుడే చెక్కకు చెద పట్టకుండా కెమికల్ కోటింగ్ వేయిస్తాం. అలాగే, పెట్టుబడి చేస్తున్నప్పుడే ద్రవ్యోల్బణం రక్షణ గురించి కూడా యోచించాలి. ప్రస్తుతం ప్రపంచదేశాలు ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ఉక్రెయిన్–రష్యా సంక్షోభంతో నిత్యావసరాల ధరలు రెక్కలు విప్పుకున్నాయి. దీనికంటే ముందు కరోనా కారణంగా సరఫరా వ్యవస్థలో సమస్యలు ఏర్పడ్డాయి. ఇవన్నీ ధరల ఒత్తిళ్లకు దారితీశాయి. అధిక ద్రవ్యోల్బణం నికర రాబడిని తగ్గించేస్తుంది. కనుక ప్రతి ఇన్వెస్టర్‌కు పెట్టుబడితోపాటు, ద్రవ్యోల్బణం రక్షణ గురించి కూడా తెలుసుకోవాలి.
అధిక ద్రవ్యోల్బణ సమయాల్లో నిఫ్టీ 50 నికర రాబడి మైనస్‌గా ఉండడాన్ని ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవాలి. 2002, 2013, 2016, 2018లో నిఫ్టీ 50 నికర రాబడి మైనస్‌గా నమోదైంది. గత 20 ఏళ్ల కాలంలోని సగటు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే.. దీర్ఘకాలంలో ఈక్విటీల్లో నికర రాబడి 6.5 శాతానికి పైనే ఉంటేనే పెట్టుబడి ఫలితమిచ్చినట్టు. ఈక్విటీల కంటే ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ సాధనాల్లో (డెట్) ఇన్వెస్ట్ చేసే వారిపై ద్రవ్యోల్బణ కాటు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్థిరాదాయ పథకాల్లో రాబడికి, ద్రవ్యోల్బణానికి మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుంది. 2008 నుంచి 2013 మధ్య అధిక ద్రవ్యోల్బణం సమయంలో 10 ఏళ్ల సావరీన్ బాండ్ నికర రాబడి మైనస్‌గా ఉండడాన్ని
గమనించాలి. కనుక పెట్టుబడులపై ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గించుకునే చర్యలపై దృష్టి సారించినప్పుడే అధిక ప్రయోజనం.
ద్రవ్యోల్బణం అంచనాలు..
ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కోరుకునే వారు ముందుగా మధ్య కాలానికి అది ఏ స్థాయిలో ఉంటుందన్న అంచనాలకు రావాలి. 1960నుంచి వినియోగధరల ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ) ఎన్నో సందర్భాల్లో రెండంకెల స్థాయిలో నమోదైంది. 1973–74, 1980–81, 1991–92 సంవత్సరాల్లో సగటు ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్లో కొనసాగింది. ఆయా కాలాల్లో చమురు ధరలు గణనీయంగా పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ద్రవ్యోల్బణం సెగలకు నేపథ్యంగా ఉన్నాయని చెప్పుకోవాలి. 1970ల్లో అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం.. 1980, 1990ల్లో గల్ఫ్ యుద్ధం, ఇరాక్‌పై కువైట్ దురాక్రమణ వంటివన్నీ ధరల్లో అస్థిరత్వానికి దారితీశాయి.
ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత 2008–2013 మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం 11.06 శాతం వరకు వెళ్లింది. సగటున 9.8 శాతంగా నమోదైంది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితులతో ద్రవ్యోల్బణం మరింత పైపైకి వెళ్లొచ్చన్న అంచనాలున్నాయి. చమురు ధరలు బ్యారెల్ 100 డాలర్లకు పైనే ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 5.5–6 శాతం మధ్య ఉండొచ్చని చాలా మంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు. నోమురా అయి తే 6.3%గా అంచనా వేసింది. ద్రవ్యో ల్బణం తగిన అంచ నాలతోనే పెట్టుబడి ఎక్కడ పెట్టాలి, రక్షణ ఎలా కల్పించుకోవాలన్న అంశంపై స్పష్టత సాధ్యపడుతుంది.
బంగారంతో రక్షణ ఉంటుందా?
బంగారం ధరలు ద్రవ్యోల్బణంతోపాటే పెరుగుతాయన్న ఒక నమ్మకం ఉంది. కానీ, అన్ని వేళలా ఇదే ధోరణి ఉంటుందని చెప్పలేం. బంగారం డిమాండ్ అన్నది ప్రధానంగా ఇన్వెస్టర్లు, ఆభరణాల కొనుగోలుదారులపై ఆధారపడి ఉంటుంది. ధరలు పెరుగుతున్నప్పుడు స్వల్ప కాలంలో ఆ ప్రయోజనం పొందేందుకు ఇన్వెస్టర్లు బంగారంలోకి పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తారు. కానీ, అధిక ధరల కారణంగా వినియోగదారుల నుంచి ఆభరణాలకు డిమాండ్ తగ్గుతుంది. ధరలు తగ్గుతున్నప్పుడు బంగారం ఆభరణాలకు కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఆ సమయంలో పెట్టుబడులకు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ముందుకు రారు.
బంగారాన్ని దీర్ఘకాల పెట్టుబడి సాధనంగా పరిగణించే వారు చాలా తక్కువ. దాన్ని ట్రేడింగ్, స్వల్పకాల హెడ్జింగ్ సాధనంగానే ఎక్కువ మంది పరిగణిస్తుంటారు. ఈ ధోరణి కారణంగా బంగారం అన్నది ద్రవ్యోల్బణం హెడ్జింగ్‌కు సంబంధించి ప్రభావవంతమైన సాధనంగా కాబోదు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితుల్లో బంగారం ధరలు పెరుగుతుంటాయి. పోర్ట్‌ఫోలియోకు వైవిధ్యం దృష్ట్యా ఒక పెట్టుబడి సాధనంగాను బంగారాన్ని చూడొచ్చు. ఇతర సాధనాలు ప్రతికూలతలు ఎదుర్కొంటున్న సందర్భాల్లో బంగారం నుంచి సానుకూల రాబడి అందుకోవచ్చు. కనుక పోర్ట్‌ఫోలియోలో బంగారానికి 5–10 శాతం మేర కేటాయింపులు చేసుకోవచ్చు.
స్థిరాదాయ పెట్టుబడులు (డెట్)
డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు ద్రవ్యోల్బణం తీరుపై ఎప్పుడూ కన్నేసి ఉంచాల్సిందే. ఎందుకంటే ద్రవ్యోల్బణాన్ని బట్టే వడ్డీ రేట్ల గమనం ఆధారపడి ఉంటుంది. ద్రవ్యోల్బణం కట్టలు తెంపుకుని వెళుతున్న తరుణంలో దీన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంకు కీలక విధాన రేట్ల పెంపు బాటలో వెళ్లాల్సి వస్తుంది. ఇతరత్రా ఏ చర్యలు తీసుకున్నా కానీ, రేట్ల పెంపును చేపట్టక తప్పదు. ప్రస్తుతానికి వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిలో ఉంటే, ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉంది. దీంతో సమీప భవిష్యత్తులో రిజర్వ్ బ్యాంకు రేట్ల పెంపు చేపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో బాండ్ల ఈల్డ్స్ పెరిగి, వాటి ధరలు తగ్గుతాయి. 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ 7 నుంచి 7.5 శాతానికి చేరొచ్చని అంచనా. యూఎస్ ఫెడ్ కూడా రేట్ల పెంపు విషయంలో దూకుడుగానే ఉంది. ఈ ఏడాది చివరికే 2 శాతానికి చేర్చాలన్న అంచనాలతో ఉంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాల ఒత్తిడికి కూడా కలసి సావరీన్ బాండ్ల ఈల్డ్స్ పెరిగేందుకు దారితీస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో మార్గం ఏంటి?
ఈ సమయంలో స్థిరాదాయ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారు స్వల్పకాల బాండ్లను ఎంపిక చేసుకోవడం సరైనది. దీనివల్ల రేట్ల పెరుగుదల నుంచి ప్రయోజనం పొందొచ్చు. పెట్టుబడులు స్వల్పకాలంలోనే మెచ్యూరిటీకి వస్తాయి కనుక వాటిని తిరిగి అధిక రేట్లపై ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏడాది లేదా రెండేళ్ల వ్యవధిపై ఫిక్స్‌డ్ డిపాజిట్‌కే పరిమితం కావాలి. రేట్ల పెంపు ముగిసే వరకు స్వల్పకాల బాండ్లనే నమ్ముకోవడం సరైనది. రేట్ల పెంపు ముగిసిన తర్వాత మూడేళ్ల కాలానికి పెట్టుబడులు పరిశీలించొచ్చు. 2023 లేదా 2024లో రేట్ల పెంపు ముగిసే అవకాశం ఉంది. ఎన్‌బీఎఫ్‌సీ డిపాజిట్లు, కార్పొరేట్ బాండ్లకూ ఇదే వర్తిస్తుంది. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు (రిస్క్ తీసుకోని) లిక్విడ్ లేదా మనీ మార్కెట్ ఫండ్స్‌కు పరిమితం కావాలి. స్వల్పకాలంలో పెరిగే రేట్ల నుంచి వీటికి ప్రయోజనం ఉంటుంది.
అధిక రిస్క్ తీసుకునే వారు కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఇక్కడ క్రెడిట్ రిస్క్ ఉంటుందని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. అధిక ద్రవ్యోల్బణ సమయాల్లో, వడ్డీ రేట్లు పెరిగే సమయాల్లో ఫ్లోటింగ్ రేట్ ఫండ్స్ అనుకూలం. వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు సవరించే బాండ్లలో ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఒకే విడత పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆర్‌బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ బాండ్ 2020ను ఎంపిక చేసుకోవచ్చు. దీనిపై ప్రస్తుతం 7.15 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఆరు నెలలకు ఒకసారి ఈ రేటు సవరణకు లోనవుతుంది. దీని కాల వ్యవధి ఏడేళ్లు. ప్రభుత్వ హామీతో వచ్చే మెరుగైన సాధనం ఇది. ఆరు నెలలకోసారి వడ్డీ రేటు చెల్లింపు ఉంటుంది. క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారికి కూడా అనుకూలం. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేసుకుంటామనుకునే వారు.. పీపీఎఫ్‌ను కూడా పరిశీలిం చొచ్చు. ఇందులో ప్రస్తుతం 7.1 శాతం రేటు అమల్లో ఉంది.
మార్కెట్ లీడర్స్
మోట్ (వ్యాపార బలాలు) ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి పెరిగిన ధరలను వినియోగదారులకు బదిలీ చేయగలవు. ధరలను పెంచినా ఆయా కంపెనీల ఉత్పత్తులు, సేవలను వినియోగదారులు పక్కన పెట్టలేని విధంగా వాటికి ఆదరణ ఉంటుంది. కనుక ఆయా కంపెనీల లాభాలు అంతగా ప్రభావితం కావు. నిఫ్టీ50 సూచీలోని కంపెనీల లాభాలు వార్షికంగా 9 శాతం చొప్పున 2010–2014 మధ్య (అధిక ద్రవ్యోల్బణ కాలం) పెరగడాన్ని గమనించొచ్చు. అంటే లాభాల మార్జిన్లపై ఒత్తిడి ఉన్నా కానీ అవి వృద్ధిని నమోదు చేయగలిగాయి.
కన్జ్యూమర్ నాన్ డిస్క్రీషనరీ
ద్రవ్యోల్బణం గరిష్టాలకు చేరినప్పుడు వినియోగదారులు విలాస ఉత్పత్తుల కొనుగోలు తగ్గించుకుంటారే కానీ, కన్జ్యూమర్ స్టాపుల్స్‌ను తగ్గించుకోలేరు. 2011–12లో 28.5%, 2012–13లో 25.3% చొప్పున బ్రిటానియా ఇండస్ట్రీస్ లాభాల్లో వృద్ధిని చూపించింది. ఆ సమయం లో రిటైల్ ద్రవ్యోల్బణం 10% మేర ఉంది. అదే సమయంలో బజాజ్ ఆటో ఆదాయంలో 10% వృద్ధి చూపించినా, లాభాల పెరుగుదల 1.3 శాతమే.
కమోడిటీ స్టాక్స్
ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న సమయాల్లో కమోడిటీ స్టాక్స్‌లో పెట్టుబడులు కూడా పోర్ట్‌ఫోలియోకు రక్షణనిస్తాయి. ఆ సమయంలో ముడి చమురు, ఇతర కమోడిటీల ధరలు పెరిగిపోతాయి. దీంతో ఆయా కంపెనీల లాభాలు కూడా గణనీయ వృద్ధిని చూస్తాయి. ప్రభుత్వరంగ చమురు కంపెనీలపై ప్రభుత్వం నుంచి కొంత నియంత్రణ ఉంటుంది. అలాగే, ప్రభుత్వరంగ మెటల్ కంపెనీల పరిస్థితి కూడా ఇంచు మించు ఇలాగే ఉంటుంది. కానీ, ప్రైవేటు రంగ మెటల్ కంపెనీలైన హిందాల్కో, వేదాంత తదితర కంపెనీలు అధిక ద్రవ్యోల్బణం సమయాల్లో మంచి పనితీరు చూపిస్తుంటాయి.
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (రీట్‌లు)
ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల హెడ్జింగ్ సాధనంగా రీట్‌లను కూడా ఫండ్ మేనేజర్లు పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ఇవి ఆదాయాన్ని ఆర్జిస్తూ డివిడెండ్ రూపంలో ఆ మొత్తాన్ని వాటాదారులకు పంపిణీ చేస్తుంటాయి. కాలానుగుణంగా వీటి నిర్వహణలోని ప్రాజెక్టుల విలువ పెరుగుతుంది. అద్దె అదాయం కూడా పెరుగుతుంది. దీంతో ఎప్పటికప్పుడు డివిడెండ్ ఆదాయానికి తోడు.. పెట్టుబడి వృద్ధిని కూడా ఇన్వెస్టర్లు చూడొచ్చు. ప్రసు ్తతం మన స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ అయిన రీట్‌ల సగటు డివిడెండ్ రాబడి 4–6% మధ్య ఉంది.
Comments
Please login to add a commentAdd a comment