దేశంలో ప్రజలందరికీ కావాల్సిన దరిదాపు అన్ని నిత్యావసరాలు మనమే పండించుకుంటున్నాం. ఇటువంటి స్థితిలో, అంటే సరఫరా తగిన స్థాయిలో ఉన్నప్పుడు నిత్యావసరాల ధరలు పెరగకూడదు. కానీ, జరుగుతున్నది అదే. మార్కెట్ తాలూకూ డిమాండ్ –సరఫరా సాఫీగా జరగడాన్ని కాపాడవలసిన ప్రభుత్వాలే స్వయంగా వ్యాపార వర్గాల అనుకూలతను చూపడం వల్ల వ్యాపారులు తమ ఇష్టానుసారం సరుకులను నిల్వ చేస్తూ, కొరతలను సృష్టిస్తూ, ధరలను పెంచే వీలు ఏర్పడుతోంది. పైగా ప్రభుత్వమే తన వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని విదేశీ మారక ద్రవ్యం కోసం అమ్ముతోంది. ఈ లాభాపేక్ష లేకుండా... నిల్వ పెట్టిన సరుకులను మార్కెట్‌లోకి తరచుగా విడుదల చేస్తే ధరల పెరుగుదల నుంచి ప్రజలను కాపాడవచ్చు.
గత సంవత్సర కాలంలో దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. గోధుమల ధర ఈ కాలంలో సుమారు 22 శాతం పెరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం భారత ఆహార సంస్థ గోడౌన్ల నుంచి 2.5 మిలియన్ టన్నుల గోధుమలను బహిరంగ మార్కెట్‌లో అమ్మాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అనంతర వారంలోనే వాటి ధర 10 శాతం మేరకు తగ్గింది. ఇది సాధారణ మార్కెట్ సూత్రం. సరఫరా పెరిగితే డిమాండ్ తగ్గడం ఈ ధర తగ్గుదల వెనుకన పనిచేస్తోంది. గత సంవత్సర కాలంగా ఇతరత్రా నిత్యావసరాల ధరలు అన్నీ పెరిగిపోతోంటే ప్రభుత్వం చేష్టలుడిగి ఎందుకు ఉండిపోయింది? 2022 ఆగస్టు నాటికే అంతకు ముందరి సంవత్సర కాలంతో పోలిస్తే గోధుమల ధర 14 శాతం మేరన పెరిగి ఉంది. అయినా ప్రస్తుతం చేస్తున్నట్లుగా బహిరంగ మార్కెట్‌లోకి ధాన్యాన్ని విడుదల చేయలేదు. ఫలితంగా ధరల పెరుగుదల అలాగే కొనసాగింది. దీనికి కారణం, అప్పట్లో ప్రభుత్వం గోధుమలు, బియ్యం వంటి ధాన్యాలను విదేశాలకు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తోంది.
రష్యా– ఉక్రెయిన్ యుద్ధ క్రమంలో అంతర్జాతీయంగా ఏర్పడ్డ ధాన్యం కొరతలు, ముఖ్యంగా గోధుమల కొరత, విదేశీ మారక ద్రవ్య సముపార్జనకు బాగా కలిసి వచ్చింది. కానీ, ఇదే భారత ఆహార సంస్థ వద్ద గోధుమల కొరతకు దారి తీసింది. ఫలితమే అప్పుడు మార్కెట్‌లో ధర పెరిగినా గోధుమ గింజల సరఫరాను పెంచి, ధరలను తగ్గించలేని స్థితి. నేడు నడుస్తున్నది ఎన్నికల సంవత్సరం. ప్రజలను పెరిగే ధరల పాలు చేసి, వారిలో అసంతృప్తి పెరిగి అది తన ఎన్నికల పరాజయానికి దారి తీయకూడదన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. గత సంవత్సరం జరిగిన భారీ ఎగుమతుల నేపథ్యంలో అది నిల్వల కొరతకు దారి తీసిన తర్వాత... ప్రభుత్వం గోధుమల ఎగుమతులను నిషేధించింది. ఈ నిర్ణయాన్ని మార్పు చేయించేందుకు, అమెరికా నుంచి ఒత్తిడులు కూడా వచ్చాయి. చైనా మాత్రమే దేశీయ కొరతల నేపథ్యంలో, ఎగుమతులను నిషేధించాలన్న మన నిర్ణయాన్ని సమర్థించింది. 2022 సంవత్సర కాలంలో మన దేశం బియ్యాన్ని కూడా రికార్డు స్థాయిలో ఎగుమతి చేసింది. వాస్తవానికి నాడు దేశంలో బియ్యం నిల్వలు తగినంత స్థాయిలోనే ఉన్నప్పటికీ ఈ బియ్యం ఎగుమతుల నిర్ణయం దేశీయంగా బియ్యం ధరల పెరుగుదలకు కారణమయ్యింది.
గత సంవత్సర కాలం పైబడి నిత్యావసరాల ధరలు తీవ్ర స్థాయిలో పెరిగిన స్థితి మనకు తెలిసిందే. దీనికి కొంత మేరకు విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకొనే వంటనూనెలు, చమురు వంటి వాటి ధరలు అంతర్జాతీయంగానే పెరగడం కారణం కావచ్చును. అయితే, ఇది పాక్షిక సత్యం మాత్రమే. దేశీయంగా వివిధ సరుకుల ధరలను ప్రధానంగా నిర్ణయించే మార్కెట్ శక్తులయిన ‘డిమాండ్ – సరఫరా’ల యాజమాన్యంలో జరుగుతోన్న లోపాలు ధరల పెరుగుదలకు ముఖ్య కారణం. దీనికి, యూపీఏ హయాం నుంచి కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి. నాడు యూపీఏ పాలనా కాలంలో దేశంలో ధరలు పెరుగుతోన్న తరుణంలోనే... భారత ఆహార సంస్థ గోడౌన్లలోని ధాన్యాన్ని ఎలుకలు తినేయడం, లేదా అవి ముక్కిపోవడం జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఈ విషయానికి సంబంధించి నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, ఆ ప్రభుత్వం ‘ఉచిత భోజనం లేదు’ అంటూ గోడౌన్ల లోని ధాన్యాన్ని మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు తిరస్కరించింది. మరో పక్కన అదే ధాన్యాన్ని విదేశాలకు... అక్కడ జంతువుల దాణాగా వాడకానికి ఎగుమతి చేసింది. దేశీయ ప్రజలను పెరుగుతోన్న ధరల నుంచి ఆదుకునేందుకు ప్రయత్నం చేయడం లేదా వారి క్షుద్భాదకు పరిష్కారం చూపడం ప్రభుత్వానికి లక్ష్యాలుగా లేవు. దాని ప్రధాన లక్ష్యం విదేశీ మారక ద్రవ్య సముపార్జన మాత్రమే!
యూపీఏ అయినా, ఎన్డీయే అయినా అమలు జరుగుతోన్న విధానాలు ఒకటే. కాకుంటే యూపీఏలో సంస్కరణల పేరిట ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించడంలో కొంత వెనుకా ముందు, లేదా మొహమాటాలు ఉన్నాయి. అలాగే, యూపీఏ ప్రభుత్వం కాస్తలో కాస్త నయంగా కొన్ని ప్రజానుకూల సంక్షేమ పథకాలను తెచ్చింది. దానిలో భాగమే జాతీయ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రతా చట్టాల వంటివి. ప్రస్తుతం ఎటువంటి మొహమాటం లేకుండా... కార్పొరేట్, ధనవంతులు, వ్యాపార వర్గాల అనుకూల విధానాలను బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనంతటి ఫలితమే నేడు దేశంలో మొత్తంగా నిత్యావసరాల ధరల పెరుగుదల! ప్రభుత్వం ధరల నియంత్రణకు చిత్తశుద్ధితో పూనుకొని తగిన విధానాలను అనుసరిస్తే ఇంత స్థాయిలో పెరిగి ఉండేవే కాదు. ప్రస్తుతం జరిగిన విధంగా మార్కెట్‌లోకి గోధుమల నిల్వలను విడుదల చేసి ప్రైవేట్ వ్యాపారులు తమ ఇష్టానుసారం ధర పెంచగల అవకాశాన్ని కట్టడి చేయగలగడం ఒక ఉదాహరణ. మరింత ప్రాధాన్యత గల మరో ఉదాహరణ కేరళ వంటి రాష్ట్రాలది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదలైన సందర్భాలలో కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలలో ఇది అతి తక్కువ స్థాయిలో ఉంటూ రావడం గమనార్హం. దీనికి కారణం ఆ రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థలు అమలు జరుగుతోన్న తీరు. ఈ రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, దరిదాపు కుటుంబాలకు అవసరమైన అన్ని నిత్యావసరాలు పంపిణీ అవుతున్నాయి. ఫలితంగా బహిరంగ మార్కెట్‌లోని వ్యాపారులకు, ప్రజా పంపిణీ వ్యవస్థతో పోటీ ఏర్పడి, వ్యాపారులు తమ ఇష్టానుసారం సరుకులను నిల్వ చేస్తూ, వాటి కొరతలను సృష్టిస్తూ, తద్వారా ధరలను పెంచుకుంటూ పోయే పరిస్థితి లేకుండా పోయింది.
అత్యంత సాధారణంగా కనపడే ఈ ఇంగితాన్ని ఆచరణలో అమలులో పెట్టి అటు రైతాంగానికీ, ఇటు వినియోగదారుడికీ ప్రయోజనాన్ని చేకూర్చే విధానాల అమలు సాధ్యమేనని ఈ ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే నిల్వ పెట్టిన సరుకులను మార్కెట్‌లోకి తరచుగా విడుదల చేస్తూ పోతే ధరల పెరుగుదల బెడద నుంచి ప్రజలను శాశ్వతంగా కాపాడడం సాధ్యమే. ఎన్నికల సంవత్సరంలో మాత్రమే ధరల తగ్గింపును సవాలుగా తీసుకుంటూ, మిగతా నాలుగు సంవత్సరాల కాలంలో ప్రజానీకాన్ని... వ్యాపారస్తులకూ, దొంగ నిల్వలకూ, కొరతలకూ బలిచేస్తూ పోవడం అత్యంత అసహజమైనది. అది కనీసం డిమాండ్ సరఫరాల తాలూకూ మార్కెట్ సూత్రం పరిధిలో కూడా ఇమడదు. నిజానికి మన దేశంలో ప్రజలందరికీ కావాల్సిన దరిదాపు అన్ని నిత్యావసరాలు (పాలకుల నిర్లక్ష్యంతో ఉత్పత్తి పెరుగుదల లేని వంటనూనె గింజల వంటి కొద్దిపాటివి మినహా) మనమే పండించుకుంటున్నాం. ఇటువంటి స్థితిలో, అంటే సరఫరా తగిన స్థాయిలో ఉన్న స్థితిలో కూడా నిత్యావసరాల ధరలు పెరగకూడదు. కానీ, వాస్తవంలో జరుగుతున్నది అదే.
మార్కెట్ తాలూకూ డిమాండ్– సరఫరాను సాఫీగా జరగడాన్ని కాపాడవలసిన ప్రభుత్వాలే స్వయంగా వ్యాపార వర్గాల అనుకూలతను చూపడం... పైగా, స్వయంగా తానే ఒక వ్యాపారిగా తయారై భారత ఆహార సంస్థ వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని విదేశీ మారక ద్రవ్యం కోసం అమ్ముతూ పోవడం... ఫలితంగా అధిక ధరల పరిస్థితి ఏర్పడింది. ఆహార పదార్థాల నిల్వలపై పరిమితులు విధించే చట్టాలను కూడా ప్రభుత్వం రద్దు చేస్తూ పోవడం వంటి చర్యలు కూడా ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయి.
వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు, మొబైల్: 98661 79615
Comments
Please login to add a commentAdd a comment