ఠారెత్తిస్తున్న టమోటా రైతుబజారులో రూ.73.. బహిరంగ మార్కెట్లో రూ.80..
పదిరోజుల్లో దాదాపు రెట్టింపు ఉల్లి రేట్లతోనూ ఉలిక్కిపాటు
కర్నూలువి రూ.45.. మహారాష్ట్రవి అయితే రూ.70పై మాటే
సలసలా కాగుతున్న నూనె ధరలు
బియ్యం.. మరింత ప్రియం– 25 కేజీల
బస్తా రూ.1,450–1,600కు విక్రయం
పూల ధరలకూ రెక్కలు
రాష్ట్రంలో ధరలు నియంత్రించే యంత్రాంగం కరువు
మండిపోతున్న నిత్యావసరాల ధరలతో సామాన్యుడు సతమతం
తెనాలి: రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు నింగినంటుతున్నాయి. దసరా పండుగ సమీపిస్తున్న కొద్దీ ఈ జోరు మరింత ఎక్కువగా ఉంది. శరన్నవరాత్రుల సంబరాల హోరులో టమాటా, ఉల్లి సహా అనేక నిత్యావసర సరుకుల ధరలు సామాన్య, మధ్య తరగతి ప్రజలు ‘కొనబోతే కొరివి..’ అన్నట్లుగా ఉన్నాయి. ముందుముందు ఇవి ఇంకెంత భారమవుతాయోనని బెంబేలెత్తిపోతున్నారు.
ఉదా.. బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, వంట నూనెలు, నిమ్మకాయ, పూల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. రైతుబజారులో టమాటా కిలో ధర గురువారం రూ.64 ఉంటే, శుక్రవారానికి రూ.73కు చేరుకుంది. బహిరంగ మార్కెట్లో రూ.80లకు విక్రయిస్తున్నారు. పది రోజుల క్రితం వరకూ రూ.40–45 పలికిన టమాటా ఇప్పుడు రెట్టింపు కావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. మిగిలిన కూరగాయల పరిస్థితి కూడా కొంచెం అటూఇటుగా అదే పరిస్థితి.
ఘాటెక్కిన ఉల్లి..వెల్లుల్లి ధరలు..
ఉల్లిపాయలైతే కర్నూలువి రూ.45 పైమాటే. మహారాష్ట్ర నుంచి వచ్చే ఆరుదల పాయ కిలో రూ.70 పైమాటగానే ఉంది. వెల్లుల్లి ధర చుక్కలనంటింది. నాణ్యత ప్రకారం కిలో రూ.250 నుంచి రూ.450 వరకు అమ్ముతున్నారు. ఇక అన్ని రకాల నూనెలూ లీటరుకు రూ.20 పెరిగాయి. అయిదు లీటర్ల డబ్బాలు దాదాపు అన్నీ కొంచెం అటూఇటుగా రూ.680లకు అమ్ముతున్నారు.
బియ్యం ధరలూ పైపైకి..
బియ్యం ధరలు కూడా పెరిగిపోతున్నాయి. 25 కిలోల బియ్యం బస్తా రూ.1,450–1,600లకు అమ్ముతున్నారు. ఎగుమతులకు అనుమతివ్వడంతో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయని చెబుతున్నారు. స్థానిక నిమ్మ మార్కెట్లో నిమ్మకాయలు కిలో రూ.70 ఉంటే రిటైల్ మార్కెట్లో డజను రూ.70కి తక్కువకు దొరకటంలేదు. అలాగే, పూల ధరలు ఠారెత్తిస్తున్నాయి.
హోల్‌సేల్‌లో మల్లెపూలు కిలో రూ.1,500 కాగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా రిటైల్‌లో మూర రూ.100లకు అమ్ముతున్నారు. సన్నజాజులు కిలో రూ.1,000, కనకాంబరాలు కిలో రూ.2,000గా ఉంది. ఇతర రకాలైనా కనీసం రూ.50–60 పెట్టనిదే మూర పూలు లభించడంలేదు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలతో ఏర్పడిన డిమాండ్‌తో వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
వరదలే కారణమట..
మరోవైపు.. ధరల పెరుగుదలకు ఇటీవల వచ్చిన వరదలను కారణంగా చెబుతున్నారు. ధరలను నియంత్రించే యంత్రాంగమేదీ రాష్ట్రంలో ఉన్నట్లుగా కనిపించటంలేదు. పండుగ రోజుల్లో ఈ విధంగా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతంగా పెరగడంతో సామాన్య ప్రజలు పండగ గట్టెక్కేదెలా అని మథనపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment