కిలో రూ. 60 దాటి పైపైకి..గుంటూరులో కిలో రూ. 80
రైతు బజార్లలో నాసిరకం
పలు జిల్లాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంట
విజయవాడ: సామాన్యులకు మొన్న ఉల్లి కంటతడి పెట్టిస్తే.. నిన్న పప్పన్నం దూరమైంది. నేడు టమాట ఠారెత్తిస్తోంది. గత నెల మొదటి పక్షంలో కిలో రూ.10గా ఉన్న ధర, నెలాఖరుకు రూ. 20కి చేరింది. ఇప్పుడు పలు జిల్లాల్లో కిలో రూ. 50 నుంచి రూ. 60 వరకూ అమ్ముతున్నారు. ఇక రాజధాని ప్రాంతమైన గుంటూరులో ఏకంగా రూ. 80కిపైగా విక్రయిస్తున్నారు.
వైఎస్సార్ కడప జిల్లాలో మాత్రం ధర రూ. 30గా ఉంది. మరోవైపు రాష్ట్రంలోని రైతు బజార్‌ల ద్వారా కిలో రూ. 34 నుంచి రూ. 40కి అమ్ముతున్న టమాటాలు మచ్చలు, పుచ్చులతో నాసిరకంగా ఉంటున్నాయి. టమాట ధరను నియంత్రించడానికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంపై సామాన్యులు మండిపడుతున్నారు.పలు జిల్లాల్లో పంట మరో 10 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని, అప్పటి వరకూ ధర ఇలాగే ఉంటుందని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. అయి తే వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పంటలు దెబ్బతినడంతో ధర తగ్గడమెలా ఉన్నా పెరిగే చూచనలు కనిపిస్తున్నాయి.
పొరుగు రాష్ట్రాల్లో దెబ్బతీసిన వర్షాలు
పొరుగు రాష్ట్రాల్లో వర్షాలు టమాట పంటను దెబ్బతీస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావం వల్ల పలు జిల్లాల్లో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ప్రధానంగా అనంతపురం, మదనపల్లితో పాటు తెలంగాణలోని వరంగల్ ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు టమాట దిగుమతి అయ్యేది. ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు, ఏపీలోని చిత్తూరు జిల్లాల్లో వర్షాలకు పంట దెబ్బతింది.
మరోవైపు కర్నూలు, వైఎస్సార్, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోను వర్షాభావంతో బోర్లు, బావులు, చెరువులు అడుగంటి టమాట సాగు తగ్గిపోయింది. ఏపీలో టమాట మార్కెట్‌కు కీలకంగా ఉండే చిత్తూరు జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా అరకొరగా చేసిన సాగు కూడా ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతింది. దీనికితోడు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ వర్షాలకు పంట దెబ్బతినడంతో అక్కడికి రవాణా చేసేందుకు హోల్‌సేల్ వ్యాపారులు ఎగబడుతుండటంతో ధరలు ఠారెత్తిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే కిలో రూ. 5 నుంచి రూ. 45 వరకూ పెరుగుతూ వచ్చింది. ఇక రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ ఆంక్షల ఫలితంగా వేలాది ఎకరాలు బీడువారాయి. దీంతో టమాట సాగు కూడా గణనీయంగా తగ్గిపోయింది. దీంతో అక్కడ రైతు బజార్‌లో కిలో టమాట రూ. 60, బహిరంగ మార్కెట్‌లో రూ. 80 చొప్పున విక్రయిస్తున్నారు.
ధరలు నియంత్రిస్తాం: మంత్రి పుల్లారావు
రాష్ట్రంలో టమాటతోపాటు ఇతర కూరగాయల ధరల పెరుగుదలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. విజయవాడలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. టమోటాను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని సబ్సిడీపై సరఫరా చేయాలని మార్కెటింగ్ అధికారులను ప్రభుత్వం ఆదేశించిందన్నారు.
సంక్షోభంలో ఉన్న ఆయిల్ ఫాం రైతులను ఆదుకోవటానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 12,13 తేదీల్లో ఒక నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారని పుల్లారావు వెల్లడించారు. రాష్ట్రంలో కరువు మండలాలను గుర్తించేందుకు రీసర్వే జరుగుతుందని మంత్రి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పంటలను రక్షించేందుకు ఒకటి రెండు రోజుల్లో 1500 రెయిన్‌గన్స్ ద్వారా ప్రయోగాలు చేస్తామన్నారు