ట‘మాటే’ వద్దు! | no tomato! | Sakshi
Sakshi News home page

ట‘మాటే’ వద్దు!

Published Tue, Jan 27 2015 2:04 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

ట‘మాటే’ వద్దు! - Sakshi

ట‘మాటే’ వద్దు!

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు జి వీరారెడ్డి. ఈయన చింతకొమ్మదిన్నె మండలం గోర్లపల్లెలో ఎకరం పొలంలో టమాట నాటాడు. మంచి ధర వస్తుందని, పంటల కోసం చేసిన పెట్టుబడులన్నీ తీరతాయని అశించాడు. తీరా పంట చేతికి వచ్చేసరికి ధరలు కుప్పకూలాయి. పంట కోసం తెచ్చిన అప్పులు పెట్టుబడిలో కొంతలో కొంతైనా తీర్చాలనే తలంపుతో మోటారు సైకిల్‌పై టమాటాలను తీసుకుని సమీప పల్లెలో తిరుగుతూ అమ్ముతున్నాడు. అయినా మోటారు సైకిల్ పెట్రోలుకు కూడా డబ్బులు రావడం లేదని వాపోతున్నాడు. జిల్లాలో టమాట సాగు చేసిన రైతులందరూ ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తున్నారు.
 

కడప అగ్రికల్చర్: జిల్లాలో టమాటా ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. పది రోజుల క్రితం వరకు కిలో రూ. 15 నుంచి రూ.20లు పలికిన ధర నేడు కిలో రూ. 8లకు పడిపోయింది. దిగుబడి లేనప్పుడు ధర బాగా ఉండి.. దిగుబడి పెరిగే సమయంలో ధరలు పడిపోవడం పరిపాటిగా మారింది. పంట కోసం వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టినా వందల రూపాయలు చేతికొచ్చే సూచనలు కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు.

ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో కిలో టమాటా ధర రూ.15-20 మధ్య పలకడంతో కొందరు రైతులు అప్పట్లో ఎకరా పంటకు ఖర్చులన్నీ పోను రూ. 80వేల నుంచి లక్ష రూపాయల దాకా లాభాలు గడించారు. దీంతో మరికొంత  మంది రైతులు సెప్టెంబర్, అక్టోబరు నెలల్లో బోరుబావుల కింద జిల్లాలోని రాయచోటి, చిన్నమండెం, సంబేపల్లె, వీరబల్లి, టి. సుండుపల్లె, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, చక్రాయపేట, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, ఖాజీపేట, మైదుకూరు, దువ్వూరు, చాపాడు మండలాల్లో అధికంగాను, మిగిలిన మండలాల్లో తక్కువగాాను సరాసరి 5500 ఎకరాల్లో సాగు చేశారు.

ప్రస్తుతం రోజుకు సగటున ఈ పంట మార్కెట్‌కు 95 టన్నుల దిగుబడి వస్తోందని ఉద్యాన అధికారులు తెలిపారు. 15-20 రోజుల కిందట గంప (20 నుంచి 30 కిలోలు) రూ. 400 నుంచి రూ.600లు పలికింది. అదే ప్లాస్టిక్ క్రేట్ (15 నుంచి 20 కిలోలు) రూ. 450 నుంచి రూ. 500లు పలికింది. దీంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో పంటసాగు చేశారు. అయితే ఉన్నట్లుండి ఒక్కసారిగా అదే గంప, అదే క్రేట్ టమాటాల ధర రూ.120 రూపాయలకు పడిపోవడంతో రైతన్నలు జీర్ణించుకోలేక పోతున్నారు.

కొందరు రైతులైతే మార్కెట్ ధరలను చూసి అధిక వడ్డీలకు అప్పుతెచ్చి మరీ పంట సాగు చేశారు. ఇప్పుడున్న ధరలతో పంటను అమ్ముకోలేక, కూలీలకు కూలీ ఖర్చులు కూడా ఇవ్వలేక,అప్పులకు వడ్డీలు చెల్లించలేక లబోదిబో మంటున్నారు. ఇదే టమాటా కిలో రైతు వద్ద వ్యాపారులు, దళారులు రూ.4 లెక్కన కొనుగోలు చేసి వాటిని మార్కెట్‌కు తరలించి కిలో 8-10 రూపాయలకు చిరువ్యాపారులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. టమాటాలు డిమాండ్ ఉన్న ప్రాంతాలకు ఇక్కడ నుంచి తరిలించి గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘాలు డిమాడ్ చేస్తున్నాయి.
 
టమాట సాగుతో అప్పులే మిగిలాయి
మంచి ధరలు ఉండటంతో తోటి రైతులందరితోపాటు టమాట సాగు చేశా. ఊహించని విధంగా ధరలు ఆకాశాన్ని అంటడంతో ఈసారి ఖరీఫ్‌లో నష్టపోయిన పంటల స్థానంలో రబీ టమాట అప్పులు తీర్చుతుందని భావించా. తీరా మార్కెట్‌కు వచ్చే సమయంలో ధరలు కుప్పకూలాయి. దీంతో పంటకు చేసిన అప్పులే మిగిలాయి.
     - బాలిరెడ్డి, టమాట రైతు, గోర్లపల్లె
 
ఎటూకాని సీజన్ రావడంతోనే...
అటు ఖరీఫ్ కాకుండా, ఇటు ర బీ దాటి పంట దిగుబడులు మార్కెట్‌ను ముంచెత్తడంతో ధరలు తగ్గాయి. రైతులకు పెట్టుబడులకు కూడా రాని పరిస్థితి ఉంది. సాగుకు సహాయం అందించగలంగాని, ధరల విషయంలో మేము చేసేదేమీ ఉండదు. అదంతా ప్రభుత్వం, మార్కెటింగ్‌శాఖలే చూసుకుంటాయి.     - మధుసూదనరెడ్డి,
     అసిస్టెంట్ డెరైక్టర్, జిల్లా ఉద్యానశాఖ-1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement