టమాట నష్టం రూ.200కోట్లు!
టమాట పంట రైతులను నట్టేట ముంచింది. ధరల పతనంతో పెట్టుబడి సైతం దక్కే పరిస్థితి కనిపించడం లేదు. నెల రోజుల కిందట రూ.40 పలికిన ధర క్రమంగా పతనం అవుతూ ప్రస్తుతం కిలో రూపాయి నుంచి రెండు రూపాయలకు చేరింది. మూడేళ్ల పాటు వరుసగా లాభాలు చవి చూసిన రైతులు ఈసారి కనీసం రూ.200కోట్ల పెట్టుబడిని కోల్పోవలసి వస్తుంది. ఇప్పటికే చాలాచోట్ల రైతులు పంటను పొలాల్లోనే వదిలేశారు.
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: జిల్లాలో ప్రస్తుతం 16,224 హెక్టార్ల (40,560 ఎకరాల్లో)లో టమాట సాగులో ఉంది. ఇందులో అత్యధికంగా తీగలపంటే ఉంది. ఇప్పుడీ సాగు నుంచి అత్యధిక టమాట దిగుబడి వస్తోంది. జిల్లాలో అత్యధికంగా పడమటి ప్రాంతాలైన ములకలచెరువు మండలంలో 1,347 హెక్టార్లలో, కురబలకోటలో 1,228, మదనపల్లెలో 1,133, నిమ్మనపల్లెలో 1,024, పెద్దతిప్పసముద్రంలో 948, గుర్రంకొండలో 764, కలికిరిలో 653, తంబళ్లపల్లెలో 490, పుంగనూరులో 757, పెద్దపంజాణిలో 507, బి.కొత్తకోటలో 491, కేవీపల్లెలో 207, పెద్దమండ్యంలో 285 హెక్టార్లలో పంట సాగులో ఉంది. అలాగే వాల్మీకిపురం మండలంలో 390 హెక్టార్లలో, కలకడలో 281, చిన్నగొట్టిగల్లులో 279, పీలేరులో 136, కుప్పంలో 225, గుడుపల్లెలో 507, శాంతిపురంలో 322, వీ.కోటలో 488, పలమనేరులో 571, బెరైడ్డిపల్లెలో 297, రామకుప్పంలో 432 హెక్టార్లలో టమాట పంట సాగులో ఉంది.
ఎకరా సాగుకు రూ.లక్ష
ఎకరా పంట దిగుబడి అయ్యేంత వరకు రూ. 80 వేల నుంచి రూ.లక్ష ఖర్చు చేయాలి. నెల రోజుల కిందట రూ.40 పలికిన ధర క్రమంగా పతనం అవుతూ ప్రస్తుతం కిలో రూపాయి నుంచి రెండు రూపాయలకు చేరింది. ఎకరాకు 30 నుంచి 40 టన్నుల దిగుబడి లభిస్తుంది. ఇప్పుడున్న ధరతో మొత్తం దిగుబడి విక్రయిం చినా రూ.45 వేల నుంచి రూ.60 వేలకు మించి దక్కదు. అంటే రైతులు ఎకరాకు రూ.50వేల నుంచి రూ.60 వేలదాకా ప్రత్యక్షంగా నష్టపోవాలి. ధరల్లో మార్పువచ్చి కిలో రూ.5పలికితే రైతులకు ఊరట లభిస్తుంది. ఇప్పటికే చాలామంది రైతులు పంటను పొలాల్లోనే వదిలేశారు. పంటనుతీసి మరింత నష్టపోయేం దుకు సిద్ధం కావడం లేదు. ఇలాంటి రైతులు పూర్తిపెట్టుబడిని కోల్పోతున్నారు. ప్రస్తుతమున్న ధరల పరిస్థితి ఇలాగే కొనసాగితే జిల్లావ్యాప్తంగా రైతులు రూ.200 కోట్లకుపైనే నష్టాలను భరించాల్సి వస్తుంది. ఈ నష్టాలు తగ్గాలంటే ధరలు పెరగాలి. ఇప్పట్లో ధరలు పెరుగుతాయన్న ఆశలు కనిపించడంలేదు. దీంతో టమాట రైతులు నిరాశలో మునిగిపోయారు.
పతనానికి ఇదే కారణం...
మదనపల్లె మార్కెట్ నుంచి మామూలుగా టమాట రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. ఇక్కడ పండే టమాటను కొనుగోలుచేసే.. వైఎస్సార్ జిల్లాలోని మైదుకూరు, బద్వేలు, కర్నూలు జిల్లాలోని నం ద్యాల, కర్నూలు, విశాఖపట్టణం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోనూ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో ఈ సారి టమాట సాగు చేశారు. ఆ ప్రాంతాల వారు మన జిల్లా లోని పంటపై ఆధారపడడం లేదు. మార్కెట్‌కు ఉత్పత్తి ఎక్కువగా వస్తుండడంతో ధరలు పత నావస్థకు చేరుకున్నాయి.