పొలాల్లోనే కాయలు వదిలివేస్తున్న అన్నదాతలు
తిరుపతి : టమాట ధరలు భారీగా పడిపోయాయి. రైతులకు కోలుకోని దెబ్బ తగ్గింది. రవాణా చార్జీలు, కూలి గిట్టుబాటుకాక రైతులు పొలాల్లోనే కాయలు వదిలేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రాంతంలో 35,000 ఎకరాల్లో రైతులు పంట సాగు చేశారు. ఒక ఎకరాలో పంట సాగుకు సగటున రూ 1.0 నుంచి 1.25 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ధర లేక పోవడంతో రైతులకు పెట్టుబడి కూడా దక్కడం లేదు.
మదనపల్లె మార్కెట్‌కు చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా, అనంతపురం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున టమాట తరలిరావడంతో ధర లు పతనమయ్యాయి. తంబళ్లపల్లె, కలకడ ప్రాంతాల్లో 30 కిలోల టమాట బాక్స్ ధర రూ. 30-45లు పలుకుతుండటంతో కోసిన కూలి కూడా రాదనే ఉద్దేశంతో రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు. ప్రతి ఏడాది ఈ సీజన్‌లో మార్కెట్‌కు 100-150 టన్నుల మేర టమాట కాయలు మచ్చేవి. ఈ ఏడాది పంట సాగు పెరగడం, దిగుబడులు బాగా రావడంతో ప్రతిరోజు 260-300 టన్నుల వరకు వస్తున్నాయి. దీనికితోడు వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో ధరలు పడిపోయాయి.
రవాణా ఖర్చు కూడా రావడంలేదు
కూలీల ఖర్చు దేవుడెరుగు. మార్కెట్‌కు తరలించిన రవాణా ఖర్చులు కూడా చేతికి అందడం లేదు. టమాట కాయలు కోసేందుకు రూ.300 వరకు రోజు కూలి ఇవ్వాలి. మార్కెట్‌లో గేటు,కమీషన్ పోను చేతికి వచ్చేది వాహనబాడుగులకే సరిపోతుంది. కూలీల ఖర్చు రైతు చేతి నుంచి పడుతోంది. దీంతో కాయలు కోయకుండా తోటలోనే వదిలేశాను.
--దొరబాబు, టమాట రైతు, ఎర్రసానిపల్లె, తంబళ్లపల్లె మండలం
నూతన పద్ధతుల్లో సాగు చేసా ...ఫలితం లేదు
టమాటతో అధిక ఆదాయం వస్తుందని ఆశపడ్డా. నూతన పద్ధతులతో రెండు ఎకరాల్లో హైబ్రీడ్ రకం పంట సాగు చేశా. కట్టెలు నాటి తీగలు కట్టి తోటను పెంచాను. ఎకరాకు లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేశా. పంట ఏపుగా పెరిగింది. కాయలు అనుకున్నదాని కంటే రెట్టింపుగా కాశాయి. మార్కెట్‌లో ధర పూర్తిగా పడిపోయింది. పెట్టుబడికి చేసిన అప్పులే మిగిలాయి. ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. సేద్యం కుంటుపడినట్లే.
--గంగయ్యనాయక్, టమాట రైతు, ఆర్.ఆన్.తాండా, మదనపల్లె మండలం
టమాట ధరలు పతనం
Published Wed, Feb 24 2016 12:24 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
Advertisement