మొన్నటి వరకు టమాటా పేరు వింటేనే భయమేసేది.. కిలో రూ. 20నుంచి రూ. 30 ధర పలుకుతుంటే వాటివైపు చూడడమే మానేశాం.. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అందరూ ఆశ్చర్య పోయే స్థితికి వాటి ధర చేరింది. కిలో మూడు రూపాయలే ధర పలుకుతుంది. పంట చేతికొచ్చే సమయంలో ఒక్కసారిగా ధర పడిపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. కాయ తెంపేందుకు అయిన కూలి కూడా రాక పంటను చేలోనే వదిలేస్తున్నారు.
- ధరూరు
ధరూర్: మొన్నటి వరకు కిలో రూ. 20 నుంచి రూ.30 పలికిన టమాట ధర వారం రోజుల్లోపే ఏకంగా రూ. 3కు పడిపోయింది. గతేడాది ఇదే సమయంలో టమాటాకు మంచి డిమాండ్ ఉండడంతో రైతులు ఈసారిఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. అయితే, పంట చేతికొస్తే మంచి ధర పలికి చేసిన అప్పులు తీరుతాయని సంబరపడిన రైతన్నకు ఆశాభంగమే ఎదురైంది. టమాటను తెంపేందుకు వచ్చే కూలీల ఖర్చులు కూడా రాని దుస్థితి దాపురించింది.
దీంతో ఏం చేయాలో తోచక ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కోయకుండానే పంటలను వదిలేస్తున్నారు. ధరూరు మండల పరిధిలోని జాంపల్లి, ధరూరు, మార్లబీడు, అల్వాలపాడు, కోతులగిద్ద, కొండాపురం, మన్నాపురం, బురెడ్డిపల్లి తదితర గ్రామాల్లో రైతులు అత్యధికంగా టమాట పంటను సాగు చేశారు. టమాట పంటను కోసి మార్కెట్‌కు తరలిస్తే గంపకు రూ.30కు మించి రావడం లేదని, ఆటో ఖర్చులే 20 రూపాయలు అవుతున్నాయని, మిగిలిన రూ.10తో కూలీలకు డబ్బులు చెల్లించడం కష్టతరంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల పంటను పశువుల మేతగా వదిలేశారు. మరికొందరు రైతులు మరికొన్ని రోజులు ఆగితే గిట్టుబాటు ధర రాకపోతుందా అని పంటను కాపాడుతూ వస్తున్నారు. చేసిన అప్పులను ఎలా తీర్చుకోవాలో తెలియక అన్నదాతలు మదన పడుతున్నారు.
ధరలు తగ్గిపోయాయి...
టమాట ధరలు పూర్తిగా తగ్గిపోయాయి. ఎన్నో ఆశలతో సాగు చేసుకున్న పంటను చేనులోనే వదలివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టమాటలు తెంపేందుకు వచ్చే కూలీలకు డబ్బులు చేతినుంచి చెల్లించాల్సి వస్తుంది. టమాట అమ్మితే వచ్చిన డబ్బుల కంటే కూలీలకు ఇచ్చేది ఎక్కువ అవుతుంది. దీంతో ఏం చేయాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నాం.
-ఆనందం,రైతు, ధరూరు.
ఇతర పంటలదీ అదే పరిస్థితి....
కూరగాయల ధరలు మార్కెట్‌లో బాగానే ఉంటున్నా, మా వరకు వచ్చేసరికి పూర్తిగా తగ్గించేస్తున్నారు. ఎటూ పాలుపోవడం లేదు. కిలో ధర రూ.5 నుంచి రూ.3కి పడిపోయింది. పెట్టిన పెట్టుబడులు ఎలా రాబట్టుకోవాలో అర్థం కావడం లేదు.
-రైతు సాయన్న, ధరూరు
టమాఠా
Published Tue, Mar 10 2015 3:26 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement