వరద బాధితులను ఆదుకోకుండా కార్పొరేట్ సంస్థతో చేతులు కలిపిన రాష్ట్ర ప్రభుత్వం
గృహోపకరణాల మరమ్మతులకు ఆ సంస్థతో ఒప్పందం
మార్కెట్‌లో ఎక్కడాలేని విధంగా ఒక్కో పనికి ఒక్కో రేటుతో ధరల పట్టిక
జేబులకు చిల్లులుపడేలా ఉన్నాయంటూ బాధితుల ఫైర్
అప్పుడు ఆదుకుంటామని చెప్పి ఇప్పుడు సొంత ఖర్చులతో చేయించుకోవాలనడంపై మండిపాటు
స్వచ్ఛందంగా ఉచిత సేవలందిస్తున్న వారిని ప్రోత్సహించకుండా వీరికి కొమ్ముకాయడమేంటని ప్రశ్న
సాక్షి, అమరావతి: అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు.. అన్నట్లుగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే. విజయవాడను వరదలు ముంచెత్తి 15 రోజులు పూర్తయినా బాధితులకు చిల్లిగవ్వ సాయం కూడా చేయని రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు వారి జేబులకు చిల్లులుపడే బాధ్యతను మాత్రం భుజానికెత్తుకుంది. బాధితులకు మేలు చేస్తున్నట్లు ఓ వైపు బిల్డప్ ఇస్తూనే మరోవైపు ఓ కార్పొరేట్ సంస్థకు మేలు చేకూర్చేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా.. బాధితుల ఇళ్లలో పనికిరాకుండా పోయిన గృహోపకరణాలతోపాటు ఇళ్లలో నీటి పైపులైన్లు, నీటి కుళాయిలు వంటి ప్లంబింగ్ పనులకు నిర్ణీత రేట్లతో మరమ్మతులు చేయించేందుకు ప్రభుత్వం ఓ కార్పొరేట్ సంస్థతో ఒప్పందం చేసుకుంది.
ఈ మరమ్మతుల రేట్లు అవాక్కయ్యేలా ఉండడం ముంపు ప్రాంతాల్లో పెద్ద చర్చనీయాంశమవుతోంది. ఉదా.. స్విచ్‌బాక్స్ బిగించడానికి రూ.279, ఫ్యాన్ రెగ్యులేటర్ మార్చడానికి రూ.99, ఫ్యాన్ రిపేరుకు రూ.199, ఫ్యాన్ మార్చడానికి రూ.239, గీజర్ చెక్ చేయడానికి రూ.299, వాష్ బేసిన్ లీకేజీ రిపేరుకు రూ.169, సింక్ డ్రెయిన్ పైపు రిపేరుకు రూ.209, డ్రెయిన్ పైపులో అడ్డుతొలగించేందుకు రూ.169, వాటర్ ట్యాప్ రిపేరుకు రూ.139, ఫ్లష్ ట్యాంకు రిపేరుకు రూ.299, వెస్ట్రన్ టాయిలెట్ రిపేరుకు రూ.799, వెస్ట్రన్ టాయిలెట్ మార్చడానికి రూ.1,499, ఇండియన్ టాయిలెట్ బిగించడానికి రూ.1,699.. అంటూ సదరు సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుని ధరలను నిర్ణయించింది.
అంటే.. ఈ ధరలను బాధితులు స్వయంగా డబ్బులు చెల్లించి రిపేర్లు చేయించుకోవాల్సి ఉంటుంది. నిజానికి.. బయట మార్కెట్లో ఈ ధరలు ఇంకా తక్కువగానే ఉన్నాయని బాధితులే స్వయంగా చెబుతున్నారు. మరోవైపు.. ఈ కార్పొరేట్ సంస్థకు అదనంగా అవసరమయ్యే టెక్నీíÙయన్లను స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా శిక్షణ పొందిన వారిని ప్రభుత్వమే కేటాయించడం గమనార్హం.
బాధితులకు యాప్ బాధ్యత ప్రభుత్వ సిబ్బందికి..
ఇదిలా ఉంటే.. వరద ముంపు బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9–12 వరకు ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ సిబ్బందితో ఇంటింటి సర్వే నిర్వహించింది. ఏ ఇంట్లో ఏ వస్తువులు పాడయ్యాయో వివరాలను సేకరించింది. ఇప్పుడు వీరి సమాచారం పరోక్షంగా ఆ సంస్థ చేతిలో ప్రభుత్వం పెట్టేసింది.
అలాగే, పొదుపు సంఘాల కార్యక్రమాలను పర్యవేక్షించే ఉన్నతాధికారులు ఇటీవలే విజయవాడ పరిధిలోని మెప్మా సిబ్బందితో సమావేశం నిర్వహించి ముంపు ప్రాంతాల్లోని పొదుపు మహిళల ఫోన్లలో సదరు కార్పొరేట్ సంస్థ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించే బాధ్యతను వారికి అప్పగించారు.
కొన్నిచోట్ల సచివాలయాల ఉద్యోగులు ఈ బాధ్యతను చేపట్టినట్లు సమాచారం. అంతేకాక.. ‘మీ ఇంట్లో పాడైన వాటిని సంబంధిత కంపెనీతో తక్కువ ఖర్చుతో బాగుచేయించుకోండి’ అంటూ ఆ సంస్థ క్యూఆర్ కోడ్‌తో ప్రభుత్వమే కరపత్రాలను బాధితులకు అందిస్తూ ఆ సంస్థను ప్రోత్సహిస్తోంది.
కళ్లుచెదిరేలా రిపేరింగ్ రేట్లు..
నిజానికి.. పాడైన వస్తువులను ఇంటి చుట్టుపక్కల ఉండే టెక్నీషియన్‌తో బాగుచేయించుకుంటే తక్కువ ఖర్చుతో అయిపోతుంది. కానీ, ప్రభుత్వ ఒప్పందం ప్రకారం నిర్ణయించిన రేట్లు చూస్తే బయట మార్కెట్ రేట్లు లేదా ఆ కార్పొరేట్ సంస్థ తన యాప్‌లో ప్రదర్శించే ధరల కన్నా ఎక్కువగా ఉన్నాయి. వీరిని ఆశ్రయిస్తే బాధితుల ఖర్చులు తడిసిమోపెడవడం ఖాయం. ఎందుకంటే.. ఒకే ఇంట మూడు ట్యూబ్‌లైట్లను ఆ కంపెనీ ద్వారా మార్చుకుంటే మొత్తం రూ.360 చెల్లించాల్సి ఉంటుంది.
కానీ, బయట మెకానిక్‌లో చేయిస్తే 150–200 మించి కావు. అలాగే.. ఎలక్ట్రికల్ స్విచ్ బాక్స్ బిగించడానికి రూ.239లు అని యాప్‌లో పేర్కొనగా, వరద ప్రాంతాల్లో ఇదే సేవకు రూ.279లుగా ధరను ప్రభుత్వం నిర్ణయించింది. లోకల్‌గా ఉండే మెకానిక్‌లు ఇదే పనికి రూ.100 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తామని చెబుతున్నారు. మరోవైపు.. ఫ్యాన్ మార్చడానికి యాప్ ధర రూ.199లు ఉంటే వరద ప్రాంతాల్లో రూ.239లుగా నిర్ణయించారు.
అదే స్థానిక మెకానిక్‌లు ఈ పనికి కేవలం రూ.100–150ల చొప్పున తీసుకుంటామని చెబుతున్నారు. నీటి కుళాయి మార్చడానికి రూ.50 అని యాప్‌లో ఉంటే ఇదే పనికి వరద ప్రాంతాల్లో ప్రభుత్వం రూ.139లు నిర్ణయించింది. స్థానిక మెకానిక్‌లు ఈ పనికి రూ.100 తీసుకుంటున్నారు. వాస్తవానికి.. అనేక ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బాధితులకు ఉచితంగా సేవలందిస్తుంటే ప్రభుత్వం వీటిని ప్రోత్సహించకుండా కార్పొరేట్ సంస్థకు కొమ్ముకాయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంతేకాక.. విపత్తు సమయంలో నిండా మునిగిన బా«ధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకుండా బాధితుల నుంచి కార్పొరేట్ కంపెనీలు అధిక ధరలు వసూలుచేసుకునేలా వీలు కల్పించడం విడ్డూరంగా ఉందని బాధితులు వాపోతున్నారు.
ఆదుకుంటామని చెప్పి ఇలా చేస్తారా!?
ఇక వరద తగ్గిన ప్రాంతాల్లో ఫైర్ ఇంజన్లతో నీట మునిగిన ఇళ్ల పరిసరాలు శుభ్రం చేయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇంట్లోని సామాన్లు, దుస్తులు, గృహోపకరణాలు పాడైపోయిన వారిని ఏ విధంగా ఆదుకోవాలో కూడా ప్రకటిస్తామన్నారు. తీరా ఇప్పుడు బాధితులే డబ్బులు కట్టి బాగుచేయించుకోవాలని సూచించడంతో పాటు ఆయా పనులకు ప్రభుత్వం ధరలు నిర్ణయించి కార్పొరేట్ సంస్థతో ఒప్పందం చేసుకోవడంపై బాధితులు మండిపడుతున్నారు. సాయం మాట దేవుడెరుగు ఇది తమను మరింత గాయపర్చేలా ఉందని వారు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment