వరద నీటిలో మునిగిన ఆటోల యజమానులకు కొత్త కష్టాలు
మరమ్మతుల కోసం షోరూంల వద్ద క్యూ కడుతున్న వందలాది ఆటోలు
మూడు నెలలకు పైగా సమయం పడుతుందంటున్న షోరూం సిబ్బంది
లేదంటే వన్ టైం సెటిల్‌మెంట్ చేసుకొని వెనక్కి ఇచ్చేయాలని సూచన
ఉపాధి ఎలా అంటూ ఆటోవాలాల ఆందోళన
ఆటోనగర్ (విజయవాడ తూర్పు): విజయవాడను ముంచెత్తిన వరదల కారణంగా ఇక్కడి ఆటోవాలాలకు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. వరదలో మునిగిన ఆటోలు మరమ్మతులు చేయడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని, అప్పటి వరకు వేచి ఉండాలని, లేదంటే బయట మెకానిక్‌ల వద్ద రిపేర్లు చేయించుకోవాలని షోరూం యజమానులు తెగేసి చెబుతున్నారు. దీంతో కంగుతింటున్న ఆటోవాలాలు అన్ని రోజుల పాటు ఉపాధి కోల్పోతే కుటుంబ పోషణ, ఆటోల ఈఎంఐల చెల్లింపు ఎలా అని ఆందోళన చెందుతున్నారు.
ఆటో యజమానులను మరింత ఆందోళనకు గురిచేసేలా షోరూం యజమానులు ఓ ప్రతిపాదన కూడా పెడుతున్నారు. వన్‌టైం సెటిల్‌మెంట్ చేసుకుని ఆటోను వెనక్కి ఇచ్చేస్తే.. కట్టిన వాయిదాలను, ఆటో కండిషన్‌ను బట్టి రూ. 10 వేల నుంచి రూ. 20 వేల వరకు నగదు ఇస్తామని చెబుతున్నారు.
బయట రిపేర్లంటే కష్టమే..
బయట మరమ్మతులు చేయించుకోవాలంటే కష్టమేనని, తాము ఇబ్బంది పడతామని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. కొత్త మోడళ్ల ఆటోల రిపేర్లు బయట మెకానిక్‌లకు తెలియదని, సరిగా చేయకపోతే మళ్లీ మొరాయిస్తాయని వాపోతున్నారు. షోరూం వాళ్లు మూడు నెలల సమయం పెడితే ఈఎంఐ ఎలా చెల్లించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరదల కారణంగా ఇప్పటికే ఉపాధిలేక నానా ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడంలేదని చెబుతున్నారు. వన్‌టైం సెటిల్‌మెంట్ చేసుకోవాలంటే సంబంధిత ఫైనాన్స్ కంపెనీల నుంచి కచి్చతంగా క్లయిం నంబర్ తీసుకోవాలని, ఆ నంబర్ ఇవ్వడానికి కూడా ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులు రూ. 4 వేల నుంచి రూ. 5 వేలు డిమాండ్ చేస్తున్నారని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకులు, ఇతర ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి అప్పులు చేసి ఆటోలు కొనుక్కున్నామని, ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు షోరూం వాళ్ల తీరుతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని పలువురు ఆటో డ్రైవర్లు వాపోయారు.
సమస్యను వారంలో పరిష్కరిస్తానని సీఎం చెప్పారు
ఆటోల మరమ్మతులు వారం రోజుల్లో చేయిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇది ఆచరణలో సాధ్యం కాలేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఆటో మరమ్మతుకు మూడు నెలల సమయం పడుతుందని షోరూం వారు చెబుతున్నారు.
అప్పటి వరకు ఏమి చేసి కుటుంబాన్ని నడపాలి. ఏమి చేయాలో అర్థం కావడంలేదు. వన్‌టైం సెటిల్‌మెంట్ చేసుకోవడం కుదరదు. గతంలో చెల్లించిన కిస్తీల పరిస్థితి ఏంటో చెప్పడంలేదు. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించి మమ్మల్ని ఆదుకోవాలి. – ఇ.సింహాచలం, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ
Comments
Please login to add a commentAdd a comment