మరో పదేళ్లయినా ఇంట్లో సామగ్రి సమకూర్చుకోవడం కష్టమే
విజయవాడలో బుడమేరు బాధితుల పరిస్థితి దయనీయం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/పటమట/కృష్ణలంక: విజయవాడ ముంపు ప్రాంతాల్లోని పేదల జీవితాలు పదేళ్లు వెనక్కి వెళ్లిపోయాయి. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముంపు తగ్గినా.. అక్కడి పేదలను కష్టాలు చుట్టుముట్టడంతో ఎలా బయటపడాలో తెలియక తమలో తామే కుమిలిపోతున్నారు. కష్టపడి సమకూర్చుకున్న ఇంటి సామగ్రి అంతా వరదపాలైంది. రెక్కలు ముక్కలు చేసుకుని బతికే ఒక్కో పేద కుటుంబం సైతం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల విలువైన సామాన్లను కోల్పోయింది.
ఇంటి సామగ్రిని సమకూర్చుకోవాలంటే మరో పదేళ్లు శ్రమించినా కష్టమే అవుతుందని తల్లడిల్లిపోతున్నారు. పనులకు వెళ్లే అవకాశం లేకపోవడంతో మానసికంగా కుంగిపోతున్నారు. ముంపు కాలనీల్లో లక్ష మందికి పైగా ఆటో, మోటార్, హమాలీ, భవన నిర్మాణ కార్మికులు, షాపు వర్కర్లు, రోజువారీ కూలీలే కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటికీ చాలామంది ఇంట్లో పొయ్యి వెలిగించలేని దుస్థితిలో ఉన్నారు. కనీసం వంట పాత్రలైనా సమకూర్చుకునే వరకు భోజనాల ప్యాకెట్లు సరఫరా చేయాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వం వరద బాధితులకు సరఫరా చేసే భోజనం ప్యాకెట్లను సోమవారం నుంచే నిలిపివేసింది. దీంతో వారు దాతలు ఇచ్చే భోజనాల కోసం ఎదురు చూస్తున్నారు.
ఆ కాలనీలను వీడని ముంపు
జక్కంపూడి వైఎస్సార్ కాలనీ, రాజీవ్‌నగర్ కండ్రిక, కుందావారి కండ్రిక, ఉడా కాలనీ, అంబాపురం కాలనీల్లో ఇంకా వరద నీరు నిలిచే ఉంది. దీంతో కొందరు చర్చిలు, కమ్యూనిటీ హాళ్లలో తలదాచుకుంటున్నారు. జవసత్వాలు కూడదీసుకుని నెమ్మదిగా రోడ్డెక్కే ప్రయత్నం చేస్తున్నారు. సుందరయ్య నగర్‌లో ఇళ్లు దెబ్బ తినడంతో ఇంట్లో ఉండలేక వృద్ధ దంపతులైన బండి రమణమ్మ, ఆమె భర్త వెంకటేశ్వరరావు బయటే చిన్న గుడారం వేసుకుని ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ పది రోజులపాటు బయటే ఉన్నారు. రమణమ్మ దివ్యాంగురాలు కావడంతో మంచంపైనే ఉండిపోయింది.
దాతలు ఇచ్చే ఆహారంతో కాలం వెళ్లదీస్తున్నారు. బుధవారం ఆమె భర్త ఆహారం తెచ్చేందుకు వెళ్లిన సమయంలో ఆ వృద్ధురాలు మృతిచెందగా.. ఈ ఘటన కాలనీవాసుల్లో విషాదం నింపింది. చాలా కాలనీల్లో మురుగు పేరుకుపోయింది. చెత్త ఎక్కడికక్కడ గుట్టలుగా పేరుకుపోవడంతో పలు కాలనీల్లోని రోడ్లు డంపింగ్ యార్డులను తలపిస్తున్నాయి. తాగునీటి పైపులు మురుగులో ఉండటంతో నగరపాలక సంస్థ సరఫరా చేస్తున్న నీటిని తాగటం లేదు. ట్యాంకర్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. విష పురుగుల సంచారంతో బెంబేలెత్తిపోతున్నారు.
మరోవైపు నిన్నటి వరకు వరద తమను వణికిస్తే... ఇప్పుడు దొంగలు భయపెడుతున్నారని.. మిగిలిన కొద్దిపాటి సామాన్లు కాపాడుకునేందుకు ఇంటిలో ఒకరు కాపలా ఉండాల్సి వస్తోందని ముంపు ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. మరోవైపు వరద నష్టంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సర్వే బృందాలు తమ ఇళ్లకు రాకుండా వీధి మొదట్లో ఉండి తమను ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని చెబుతున్నారని కండ్రిక ప్రాంత ప్రజలు వాపోతున్నారు.
10 రోజులుగా పనుల్లేవు
కండ్రిక ప్రాంతానికి చెందిన ఈమె పేరు ఎన్.నాగమణి. వరద ముంపు నుంచి ఇంట్లోని సామగ్రి కాపాడుకునే ప్రయత్నంలో ఆమె భర్త కాలు విరిగింది. ఆయన్ను ఆస్పత్రిలో చేర్చి, నాగమణి ఇంటికి వచ్చింది.
‘వరద తగ్గినా ఇంట్లోకి వెళ్లలేకపోతున్నాం. సర్వం కోల్పోయి పది రోజులుగా పనిలేకుండా ఉన్నాం. ఓ వైపు భర్త ఆస్పత్రి పాలయ్యాడు. వరదలో మునిగిన ఇంటిని చూస్తూ ఏడవటం తప్ప ఏమీ చేయలేకపోతున్నా. వరద వస్తుందని ముందుగా చెప్పి ఉంటే సామాన్లు సర్దుకుని వెళ్లిపోయేవాళ్లం. ఇలా మునిగిన ఇళ్లను కాపలాకాసే పరిస్థితి వచ్చేది కాదు. ఇంట్లో సామగ్రి సమకూర్చుకోవడం పదేళ్లకైనా మాలాంటోళ్లకు కష్టమే’ అని నాగమణి ఆవేదన చెందుతోంది.
వంట పాత్రలైనా ఇవ్వండయ్యా
వరద వచ్చినప్పుడు ప్రభుత్వం మాకు సమాచారం ఇవ్వాలి కదా.. ఒక్కసారిగా వచ్చిన వరదతో సామాన్లన్నీ వదిలేసి ప్రాణాలు కాపాడుకునేందుకు వెళ్లాం. ఇంట్లో ఇంకా వరద తగ్గలేదు. ఒక్క సామాను కూడా పనికివచ్చేలా లేదు. ప్రభుత్వం స్పందించి వంట పాత్రలు, బకెట్లు వంటివి ఇవ్వాలి. – శైలజ, కండ్రిక
ఇంట్లో ఉండలేం.. బయటకు వెళ్లలేం
ఇల్లంతా వరద నీరు. నీరు తోడటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. చర్చిలో తలదాచుకుంటున్నాం. మాకు ఆహారం ఇవ్వడం ప్రభుత్వం మానేసింది. దాతలు పంపిన ఆహారంతోనే కడుపు నింపుకుంటున్నాం. మా అమ్మకు బ్రెయిన్‌స్ట్రోక్ వచ్చింది. ఎక్కడికి వెళ్లలేని స్థితి. ఇంట్లో ఉండలేం. బయటకు వెళ్లలేం. – దేవర నాగమల్లేశ్వరి, కండ్రిక
Comments
Please login to add a commentAdd a comment