equities
-
దీర్ఘకాలంలో బులిష్ గా భారత ఈక్విటీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దీర్ఘకాలికంగా భారతీయ ఈక్విటీలు బులిష్ గా కనిపిస్తున్నాయని బజాజ్ ఫిన్సర్వ్ అసెట్ మేనేజ్మెంట్ సీఐవో నిమేష్ చందన్ చెప్పారు. అయితే, అంతర్జాతీయంగా రాజకీయ, భోగోళికపరమైన అంశాల కారణంగా కొన్ని ఒడుదుడుకులు ఉండవచ్చన్నారు. ప్రస్తుతం లార్జ్ క్యాప్ కంపెనీల షేర్లు ఆకర్షణీయమైన వేల్యుయేషన్లతో లభిస్తున్నాయని తెలిపారు. అటు ఫిక్సిడ్ ఇన్‌కం సాధనాల విషయానికొస్తే మెరుగైన ఈల్డ్‌లను లాకిన్ చేసుకోవడానికి ఇది సరైన సమయమన్నారు. వడ్డీ రేట్లు క్రమంగా తగ్గే కొద్దీ మధ్యకాలికంగా క్యాపిటల్ గెయిన్స్పరమైన ప్రయోజనాలు పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాము బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్‌ను (బీఏఎఫ్) ఆవిష్కరించామని, ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల రీత్యా ఇలాంటివి గణనీయంగా రాబడులు అందించే అవకాశం ఉందన్నారు. బీఏఎఫ్తో మరిన్ని ప్రయోజనాలు.. ఈక్విటీ, ఫిక్సిడ్ ఇన్కమ్ సాధనాలకు ఏయే పాళ్లలో ఏ విధంగా పెట్టుబడులను కేటాయించవచ్చనేది బీఏఎఫ్లో నిపుణులైన అనుభవజు్ఞల పర్యవేక్షణలో జరుగుతుంది. సాధారణంగా ఈక్విటీ సూచీలతో పోలిస్తే ఈ తరహా ఫండ్స్‌లో ఒడుదుడుకులు తక్కువగా ఉంటాయి. దీర్ఘకాలికంగా కాంపౌండింగ్ ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక లక్ష్యాలు ఉన్న చాలా మందికి ఈ ఫండ్స్ అన్నివేళలా అనువైనవి. బీఏఎఫ్ అనేది ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోనూ డైవర్సిఫై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.ఏ ఈక్విటీ లేదా అసెట్ అలొకేషన్ వ్యూహమైనా సరైన పనితీరు కనపర్చాలంటే కనీసం 3–5 ఏళ్ల పాటు న్వెస్ట్మెంట్ కొనసాగించాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఫండ్స్ విషయంలోనూ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక దృష్టితో ఉండాలి. ఇక కొత్త ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా లేక పాత ఫండ్స్ (వింటేజ్) వైపు చూడాలా అని కొందరిలో మీమాంస ఉండొచ్చు. అయితే, ఫండ్ వ్యూహం, తమ అసెట్ అలొకేషన్కి అది ఎంత వరకు ఉపయోగపడుతుందనేదే చూసుకోవడం మంచిది. సాధారణంగా వింటేజ్ ఫండ్స్‌కి ఒక ట్రాక్ రికార్డు ఉంటుంది కాబట్టి అందుబాటులో ఉన్న సమాచారంతో తగిన నిర్ణయం తీసుకోవడానికి వీలుంటుంది. అయితే, ఇన్వెస్ట్మెంట్ విధానం, మేనేజ్మెంట్ బృందం మొదలైనవి మారిపోతే వాటి గత పనితీరు అనేది భవిష్యత్తులో అదే విధంగా కొనసాగుతుందనుకోవడానికి ఉండదు. వింటేజ్ ఫండ్లు చేసిన తప్పిదాల నుంచి నేర్చుకుని, అలాంటివి పునరావృతం కాకుండా ఉండేలా న్యూ ఫండ్ ఆఫర్లు ఉండవచ్చు. -
కొనసాగుతున్న ఎఫ్‌పీఐ అమ్మకాలు
న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లు పెరుగుతుండటం వంటి అంశాల నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) దేశీయంగా ఈక్విటీలను విక్రయించడం కొనసాగిస్తున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం .. నవంబర్‌లో ఇప్పటివరకు (1 నుంచి 10వ తేదీ వరకు) రూ. 5,800 కోట్ల మేర అమ్మేశారు. ఇప్పటికే అక్టోబర్‌లో రూ. 24,548 కోట్లు, సెపె్టంబర్లో 14,767 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దాని కన్నా ముందు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (మార్చి నుంచి ఆగస్టు వరకు) దాదాపు రూ. 1.74 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారు. మరోవైపు, అక్టోబర్‌లో డెట్ మార్కెట్లో రూ. 6,381 కోట్లు ఇన్వెస్ట్ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 6,053 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద ఈ ఏడాది ఇప్పటివరకు ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఈక్విటీల్లో రూ. 90,161 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 41,554 కోట్లకు చేరాయి. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఉద్రిక్తతలు, అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్‌లు పెరగడం వంటి అంశాల కారణంగా ఎఫ్‌పీఐల విక్రయాల ధోరణి కొనసాగుతోందని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాస్తవ చెప్పారు. పరిస్థితులు మెరుగుపడి ఈక్విటీల్లో తిరిగి ఇన్వెస్ట్ చేసే వరకు నిధులను స్వల్పకాలికంగా డెట్ మార్కెట్లోకి మళ్లించే వ్యూహాన్ని మదుపుదారులు అమలు చేస్తున్నట్లు పరిశీలకులు తెలిపారు. ఆర్థిక రంగ సంస్థలు మెరుగైన క్యూ2 ఫలితాలు ప్రకటిస్తూ, ఆశావహ అంచనాలు వెలువరిస్తున్నప్పటికీ ఎఫ్‌పీఐలు వాటిలో అత్యధికంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీంతో బ్యాంకింగ్ స్టాక్స్ వేల్యుయేషన్లు ఆకర్షణీయంగా మారినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిస్ట్ వీకే విజయకుమార్ తెలిపారు. -
కొత్త పన్ను విధానం.. ఎవరికి?
ఏటా బడ్జెట్లో భాగంగా ప్రకటించే ఆదాయపన్ను శ్లాబు రేట్లు, మినహాయింపుల్లో మార్పుల గురించి తెలుసుకోవాలని వేతన జీవులు ఆసక్తిగా వేచి చూస్తుంటారు. ఆదాయపన్ను చట్టంలోని 1961 కింద ప్రభుత్వం ఆఫర్ చేస్తున్న పన్ను మినహాయింపులు, తగ్గింపుల ఆధారంగానే వేతన జీవుల పన్ను ప్రణాళిక ఆధారపడి ఉంటుంది. 2023–24 ఆర్థిక సంవత్సరం (అసెస్మెంట్ సంవత్సరం 2024–25) నుంచి నూతన పన్ను విధానాన్ని డిఫాల్ట్‌గా ఉంటుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. కనుక పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానం గురించి తప్పకుండా అవగాహన కలిగి ఉండాలి. పన్నుల్లో మార్పులు నూతన పన్ను విధానంలో బేసిక్ పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెరిగింది. అలాగే, వార్షిక పన్ను ఆదాయం రూ.7 లక్షల వరకు ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా రాయితీ కల్పించారు. రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనాన్ని నూతన పన్ను విధానానికి కూడా విస్తరించారు. అంటే రూ.7.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించక్కర్లేదు. అలాగే, 37 శాతంగా ఉన్న గరిష్ట సర్‌చార్జీని 25 శాతానికి తగ్గించారు. రూ.5 కోట్లకు పైగా పన్ను ఆదాయం ఉన్న వారిపై దీని ప్రభావం ఉంటుంది. దీని వల్ల నికరంగా చెల్లించాల్సిన పన్ను రేటు 42.74 శాతం నుంచి 39 శాతానికి దిగొచ్చింది. మినహాయింపులు/తగ్గింపులు పాత పన్ను విధానంలో కొన్ని సాధనాలను వినియోగించుకోవడం ద్వారా పన్ను భారం తగ్గించుకోవచ్చు. ఈ ప్రయోజనాలు నూతన పన్ను విధానంలో లేవు. సెక్షన్ 80టీటీఏ/80టీటీబీ, లీవ్ ట్రావెల్ కన్సెషన్, హౌస్ రెంట్ అలవెన్స్, పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులు, సెక్షన్ 10 (14) కింద ప్రత్యేక అలవెన్స్‌లు, అలాగే సెక్షన్ 80సీ, 80డీ, 80ఈలు పాత పన్ను విధానంలో అందుబాటులో ఉన్నాయి. అలాగే, సొంతంగా నివసిస్తున్న ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులపైనా (సెక్షన్ 24) మినహాయింపు ప్రయోజనం ఉంది. అదనపు ప్రయోజనాలు నూతన పన్ను విధానంలో కొన్ని మినహాయింపులు కల్పించారు. ఇవి పాత పన్ను విధానంలో లేవు. ప్రత్యేక సామర్థ్యాలు కలిగిన (వైకల్య బాధితులు) వారికి ఇచ్చే రవాణా అలవెన్స్, కన్వేయన్స్ అలవెన్స్, బదిలీ సమయంలో అయ్యే వ్యయాలు, ఎన్పీఎస్కు సంస్థలు చేసే జమలు (సెక్షన్ 80సీసీడీ(2)), రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్, అడిషనల్ ఎంప్లాయీ కాస్ట్ (సెక్షన్ 80జేజేఏ) ప్రయోజనాలు కొత్త పన్ను విధానంలో ఉన్నాయి. కుటుంబ పెన్షన్ ఆదాయం కోసం చేసే వ్యయాలకు సెక్షన్ 57 (ఐఐఏ) కింద బడ్జెట్లో పన్ను ప్రయోజనం కల్పించారు. అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు సెక్షన్ 80సీసీహెచ్ (2) కింద ఇచ్చే విరాళాలకూ పన్ను మినహాయింపు ప్రకటించారు. మదింపు తర్వాతే.. పన్ను చెల్లింపుదారు తప్పకుండా తమకు వచ్చే ఆదాయం, పెట్టుబడులు, గృహ రుణం, పన్ను తగ్గింపుల గురించి ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే అంచనా వేయాలి. ఈ మదింపు ఆధారంగా అనుకూలమైన పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. తక్కువ ఆదాయం ఇచ్చే జీవిత బీమా పథకాలు, పెన్షన్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేని వారికి కొత్త పన్ను విధానం అనుకూలంగా ఉంటుంది. ఈక్విటీలు, ఇతర పెట్టుబడి సాధనాల ద్వారా మెరుగ్గా నిర్వహించుకునే వారికి కూడా నూతన విధానమే ప్రయోజనం. సెక్షన్ 80సీ, 80డీ, హెచ్ఆర్ఏ లేదా గృహ రుణం కింద ప్రయోజనాలు కోరుకునే వారు పాత విధానంలోనే కొనసాగొచ్చు. ఇలాంటి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయకుండా, పన్ను భారం తగ్గాలని కోరుకునే వారికి నూతన పన్ను విధానం అనుకూలం. - అమర్ దియో సింగ్ అడ్వైజరీ హెడ్ ఏంజెల్ వన్ -
ధరల దాడిని ఇలా ఎదుర్కోండి..!
ఈక్విటీకి హెడ్జింగ్ అన్ని రకాల పెట్టుబడులకు ద్రవ్యోల్బణం రిస్క్ ఉంటుంది. ఈక్విటీలు సైతం అందుకు అతీతం కాదు. కంపెనీల వ్యాపారాలపైనా ద్రవ్యోల్బణం ప్రభావం ఉంటుందని గుర్తించాలి. ద్రవ్యోల్బణం వల్ల కంపెనీలకు ముడి సరుకుల ధరలు పెరిగిపోతాయి. దీనివల్ల తయారీ కంపెనీల లాభాల మార్జిన్లు తగ్గిపోతాయి. అధిక ద్రవ్యోల్బణం ఉన్న సమయాల్లో పరిశీలించినప్పుడు.. 2009–10లో నిఫ్టీ 50 కంపెనీల (ఫైనాన్షియల్ కంపెనీలు మినహా) ఎబిట్డా 19.86 శాతంగా ఉంటే, 2013–14 నాటికి 16.31 శాతానికి క్షీణించింది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం తర్వాత నెలకొన్న పరిస్థితులు ఇందుకు దారితీశాయి. ఆ సమయాల్లో వినియోగదారుల కొనుగోలు శక్తి కూడా క్షీణిస్తుంది. దాంతో అవసరమైన కొనుగోళ్లకు పరిమితమై.. అనవసరపు ఖర్చును నియంత్రించుకునేందుకు వినియోగదారులు మొగ్గు చూపిస్తారు. దాంతో కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోతుంది. కనుక ద్రవ్యోల్బణం కొన్ని కంపెనీలకు ప్రతికూలిస్తే.. కొన్ని కంపెనీలకు అనుకూలిస్తుందని చెప్పుకోవాలి. కనుక పెట్టుబడుల్లో వైవిధ్యమైన కంపెనీలు ఉండేలా చూసుకోవాలి. అప్పుడు సహజంగానే హెడ్జింగ్ (రక్షణ) ఉండేలా చూసుకోవచ్చు. ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న సమయాల్లో కొన్ని రకాల థీమ్‌లను పరిశీలించొచ్చు. రెండేళ్ల క్రితం 2020 మార్చిలో సన్ ఫ్లవర్ నూనె లీటర్ రూ.85. రెండు నెలల క్రితం రూ.120. ఇప్పుడు రూ.180–200కు పైనే. 2019 జూలైలో పెట్రోల్ లీటర్ ధర రూ.73. 2020 జూన్‌లో రూ.80. 2021 జూలైలో రూ.100. 2022 ఏప్రిల్‌లో రూ.120. ఇలా నిత్యావసరాల ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. దీన్నే ద్రవ్యోల్బణంగా చెప్పుకోవాలి. కరెన్సీ విలువను తినేసే చెద పురుగు ఇది. పెట్టుబడికి రాబడి తోడైనప్పుడే సంపదగా మారుతుంది. ఈ క్రమంలో పెట్టుబడి విలువను హరించే ద్రవ్యోల్బణం గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? మెజారిటీ ఇన్వెస్టర్లు పట్టించుకోని అంశం ఇది. ఇంటి నిర్మాణం అప్పుడే చెక్కకు చెద పట్టకుండా కెమికల్ కోటింగ్ వేయిస్తాం. అలాగే, పెట్టుబడి చేస్తున్నప్పుడే ద్రవ్యోల్బణం రక్షణ గురించి కూడా యోచించాలి. ప్రస్తుతం ప్రపంచదేశాలు ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ఉక్రెయిన్–రష్యా సంక్షోభంతో నిత్యావసరాల ధరలు రెక్కలు విప్పుకున్నాయి. దీనికంటే ముందు కరోనా కారణంగా సరఫరా వ్యవస్థలో సమస్యలు ఏర్పడ్డాయి. ఇవన్నీ ధరల ఒత్తిళ్లకు దారితీశాయి. అధిక ద్రవ్యోల్బణం నికర రాబడిని తగ్గించేస్తుంది. కనుక ప్రతి ఇన్వెస్టర్‌కు పెట్టుబడితోపాటు, ద్రవ్యోల్బణం రక్షణ గురించి కూడా తెలుసుకోవాలి. అధిక ద్రవ్యోల్బణ సమయాల్లో నిఫ్టీ 50 నికర రాబడి మైనస్‌గా ఉండడాన్ని ఇన్వెస్టర్లు పరిగణనలోకి తీసుకోవాలి. 2002, 2013, 2016, 2018లో నిఫ్టీ 50 నికర రాబడి మైనస్‌గా నమోదైంది. గత 20 ఏళ్ల కాలంలోని సగటు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే.. దీర్ఘకాలంలో ఈక్విటీల్లో నికర రాబడి 6.5 శాతానికి పైనే ఉంటేనే పెట్టుబడి ఫలితమిచ్చినట్టు. ఈక్విటీల కంటే ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లో (డెట్) ఇన్వెస్ట్ చేసే వారిపై ద్రవ్యోల్బణ కాటు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్థిరాదాయ పథకాల్లో రాబడికి, ద్రవ్యోల్బణానికి మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుంది. 2008 నుంచి 2013 మధ్య అధిక ద్రవ్యోల్బణం సమయంలో 10 ఏళ్ల సావరీన్ బాండ్ నికర రాబడి మైనస్‌గా ఉండడాన్ని గమనించాలి. కనుక పెట్టుబడులపై ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గించుకునే చర్యలపై దృష్టి సారించినప్పుడే అధిక ప్రయోజనం. ద్రవ్యోల్బణం అంచనాలు.. ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కోరుకునే వారు ముందుగా మధ్య కాలానికి అది ఏ స్థాయిలో ఉంటుందన్న అంచనాలకు రావాలి. 1960నుంచి వినియోగధరల ఆధారిత ద్రవ్యోల్బణం (సీపీఐ) ఎన్నో సందర్భాల్లో రెండంకెల స్థాయిలో నమోదైంది. 1973–74, 1980–81, 1991–92 సంవత్సరాల్లో సగటు ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్లో కొనసాగింది. ఆయా కాలాల్లో చమురు ధరలు గణనీయంగా పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ద్రవ్యోల్బణం సెగలకు నేపథ్యంగా ఉన్నాయని చెప్పుకోవాలి. 1970ల్లో అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం.. 1980, 1990ల్లో గల్ఫ్ యుద్ధం, ఇరాక్‌పై కువైట్ దురాక్రమణ వంటివన్నీ ధరల్లో అస్థిరత్వానికి దారితీశాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం తర్వాత 2008–2013 మధ్య రిటైల్ ద్రవ్యోల్బణం 11.06 శాతం వరకు వెళ్లింది. సగటున 9.8 శాతంగా నమోదైంది. ప్రస్తుత ప్రతికూల పరిస్థితులతో ద్రవ్యోల్బణం మరింత పైపైకి వెళ్లొచ్చన్న అంచనాలున్నాయి. చమురు ధరలు బ్యారెల్ 100 డాలర్లకు పైనే ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 5.5–6 శాతం మధ్య ఉండొచ్చని చాలా మంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు. నోమురా అయి తే 6.3%గా అంచనా వేసింది. ద్రవ్యో ల్బణం తగిన అంచ నాలతోనే పెట్టుబడి ఎక్కడ పెట్టాలి, రక్షణ ఎలా కల్పించుకోవాలన్న అంశంపై స్పష్టత సాధ్యపడుతుంది. బంగారంతో రక్షణ ఉంటుందా? బంగారం ధరలు ద్రవ్యోల్బణంతోపాటే పెరుగుతాయన్న ఒక నమ్మకం ఉంది. కానీ, అన్ని వేళలా ఇదే ధోరణి ఉంటుందని చెప్పలేం. బంగారం డిమాండ్ అన్నది ప్రధానంగా ఇన్వెస్టర్లు, ఆభరణాల కొనుగోలుదారులపై ఆధారపడి ఉంటుంది. ధరలు పెరుగుతున్నప్పుడు స్వల్ప కాలంలో ఆ ప్రయోజనం పొందేందుకు ఇన్వెస్టర్లు బంగారంలోకి పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తారు. కానీ, అధిక ధరల కారణంగా వినియోగదారుల నుంచి ఆభరణాలకు డిమాండ్ తగ్గుతుంది. ధరలు తగ్గుతున్నప్పుడు బంగారం ఆభరణాలకు కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఆ సమయంలో పెట్టుబడులకు ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ముందుకు రారు. బంగారాన్ని దీర్ఘకాల పెట్టుబడి సాధనంగా పరిగణించే వారు చాలా తక్కువ. దాన్ని ట్రేడింగ్, స్వల్పకాల హెడ్జింగ్ సాధనంగానే ఎక్కువ మంది పరిగణిస్తుంటారు. ఈ ధోరణి కారణంగా బంగారం అన్నది ద్రవ్యోల్బణం హెడ్జింగ్‌కు సంబంధించి ప్రభావవంతమైన సాధనంగా కాబోదు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితుల్లో బంగారం ధరలు పెరుగుతుంటాయి. పోర్ట్‌ఫోలియోకు వైవిధ్యం దృష్ట్యా ఒక పెట్టుబడి సాధనంగాను బంగారాన్ని చూడొచ్చు. ఇతర సాధనాలు ప్రతికూలతలు ఎదుర్కొంటున్న సందర్భాల్లో బంగారం నుంచి సానుకూల రాబడి అందుకోవచ్చు. కనుక పోర్ట్‌ఫోలియోలో బంగారానికి 5–10 శాతం మేర కేటాయింపులు చేసుకోవచ్చు. స్థిరాదాయ పెట్టుబడులు (డెట్) డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారు ద్రవ్యోల్బణం తీరుపై ఎప్పుడూ కన్నేసి ఉంచాల్సిందే. ఎందుకంటే ద్రవ్యోల్బణాన్ని బట్టే వడ్డీ రేట్ల గమనం ఆధారపడి ఉంటుంది. ద్రవ్యోల్బణం కట్టలు తెంపుకుని వెళుతున్న తరుణంలో దీన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంకు కీలక విధాన రేట్ల పెంపు బాటలో వెళ్లాల్సి వస్తుంది. ఇతరత్రా ఏ చర్యలు తీసుకున్నా కానీ, రేట్ల పెంపును చేపట్టక తప్పదు. ప్రస్తుతానికి వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిలో ఉంటే, ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉంది. దీంతో సమీప భవిష్యత్తులో రిజర్వ్ బ్యాంకు రేట్ల పెంపు చేపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో బాండ్ల ఈల్డ్స్ పెరిగి, వాటి ధరలు తగ్గుతాయి. 10 ఏళ్ల ప్రభుత్వ బాండ్ ఈల్డ్స్ 7 నుంచి 7.5 శాతానికి చేరొచ్చని అంచనా. యూఎస్ ఫెడ్ కూడా రేట్ల పెంపు విషయంలో దూకుడుగానే ఉంది. ఈ ఏడాది చివరికే 2 శాతానికి చేర్చాలన్న అంచనాలతో ఉంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల నుంచి అమ్మకాల ఒత్తిడికి కూడా కలసి సావరీన్ బాండ్ల ఈల్డ్స్ పెరిగేందుకు దారితీస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మార్గం ఏంటి? ఈ సమయంలో స్థిరాదాయ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారు స్వల్పకాల బాండ్లను ఎంపిక చేసుకోవడం సరైనది. దీనివల్ల రేట్ల పెరుగుదల నుంచి ప్రయోజనం పొందొచ్చు. పెట్టుబడులు స్వల్పకాలంలోనే మెచ్యూరిటీకి వస్తాయి కనుక వాటిని తిరిగి అధిక రేట్లపై ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏడాది లేదా రెండేళ్ల వ్యవధిపై ఫిక్స్డ్ డిపాజిట్‌కే పరిమితం కావాలి. రేట్ల పెంపు ముగిసే వరకు స్వల్పకాల బాండ్లనే నమ్ముకోవడం సరైనది. రేట్ల పెంపు ముగిసిన తర్వాత మూడేళ్ల కాలానికి పెట్టుబడులు పరిశీలించొచ్చు. 2023 లేదా 2024లో రేట్ల పెంపు ముగిసే అవకాశం ఉంది. ఎన్బీఎఫ్సీ డిపాజిట్లు, కార్పొరేట్ బాండ్లకూ ఇదే వర్తిస్తుంది. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు (రిస్క్ తీసుకోని) లిక్విడ్ లేదా మనీ మార్కెట్ ఫండ్స్‌కు పరిమితం కావాలి. స్వల్పకాలంలో పెరిగే రేట్ల నుంచి వీటికి ప్రయోజనం ఉంటుంది. అధిక రిస్క్ తీసుకునే వారు కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఇక్కడ క్రెడిట్ రిస్క్ ఉంటుందని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే, షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. అధిక ద్రవ్యోల్బణ సమయాల్లో, వడ్డీ రేట్లు పెరిగే సమయాల్లో ఫ్లోటింగ్ రేట్ ఫండ్స్ అనుకూలం. వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు సవరించే బాండ్లలో ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఒకే విడత పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ బాండ్ 2020ను ఎంపిక చేసుకోవచ్చు. దీనిపై ప్రస్తుతం 7.15 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఆరు నెలలకు ఒకసారి ఈ రేటు సవరణకు లోనవుతుంది. దీని కాల వ్యవధి ఏడేళ్లు. ప్రభుత్వ హామీతో వచ్చే మెరుగైన సాధనం ఇది. ఆరు నెలలకోసారి వడ్డీ రేటు చెల్లింపు ఉంటుంది. క్రమం తప్పకుండా ఆదాయం కోరుకునే వారికి కూడా అనుకూలం. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేసుకుంటామనుకునే వారు.. పీపీఎఫ్‌ను కూడా పరిశీలిం చొచ్చు. ఇందులో ప్రస్తుతం 7.1 శాతం రేటు అమల్లో ఉంది. మార్కెట్ లీడర్స్ మోట్ (వ్యాపార బలాలు) ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి పెరిగిన ధరలను వినియోగదారులకు బదిలీ చేయగలవు. ధరలను పెంచినా ఆయా కంపెనీల ఉత్పత్తులు, సేవలను వినియోగదారులు పక్కన పెట్టలేని విధంగా వాటికి ఆదరణ ఉంటుంది. కనుక ఆయా కంపెనీల లాభాలు అంతగా ప్రభావితం కావు. నిఫ్టీ50 సూచీలోని కంపెనీల లాభాలు వార్షికంగా 9 శాతం చొప్పున 2010–2014 మధ్య (అధిక ద్రవ్యోల్బణ కాలం) పెరగడాన్ని గమనించొచ్చు. అంటే లాభాల మార్జిన్లపై ఒత్తిడి ఉన్నా కానీ అవి వృద్ధిని నమోదు చేయగలిగాయి. కన్జ్యూమర్ నాన్ డిస్క్రీషనరీ ద్రవ్యోల్బణం గరిష్టాలకు చేరినప్పుడు వినియోగదారులు విలాస ఉత్పత్తుల కొనుగోలు తగ్గించుకుంటారే కానీ, కన్జ్యూమర్ స్టాపుల్స్ను తగ్గించుకోలేరు. 2011–12లో 28.5%, 2012–13లో 25.3% చొప్పున బ్రిటానియా ఇండస్ట్రీస్ లాభాల్లో వృద్ధిని చూపించింది. ఆ సమయం లో రిటైల్ ద్రవ్యోల్బణం 10% మేర ఉంది. అదే సమయంలో బజాజ్ ఆటో ఆదాయంలో 10% వృద్ధి చూపించినా, లాభాల పెరుగుదల 1.3 శాతమే. కమోడిటీ స్టాక్స్ ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న సమయాల్లో కమోడిటీ స్టాక్స్‌లో పెట్టుబడులు కూడా పోర్ట్‌ఫోలియోకు రక్షణనిస్తాయి. ఆ సమయంలో ముడి చమురు, ఇతర కమోడిటీల ధరలు పెరిగిపోతాయి. దీంతో ఆయా కంపెనీల లాభాలు కూడా గణనీయ వృద్ధిని చూస్తాయి. ప్రభుత్వరంగ చమురు కంపెనీలపై ప్రభుత్వం నుంచి కొంత నియంత్రణ ఉంటుంది. అలాగే, ప్రభుత్వరంగ మెటల్ కంపెనీల పరిస్థితి కూడా ఇంచు మించు ఇలాగే ఉంటుంది. కానీ, ప్రైవేటు రంగ మెటల్ కంపెనీలైన హిందాల్కో, వేదాంత తదితర కంపెనీలు అధిక ద్రవ్యోల్బణం సమయాల్లో మంచి పనితీరు చూపిస్తుంటాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్లు) ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీల హెడ్జింగ్ సాధనంగా రీట్లను కూడా ఫండ్ మేనేజర్లు పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై ఇవి ఆదాయాన్ని ఆర్జిస్తూ డివిడెండ్ రూపంలో ఆ మొత్తాన్ని వాటాదారులకు పంపిణీ చేస్తుంటాయి. కాలానుగుణంగా వీటి నిర్వహణలోని ప్రాజెక్టుల విలువ పెరుగుతుంది. అద్దె అదాయం కూడా పెరుగుతుంది. దీంతో ఎప్పటికప్పుడు డివిడెండ్ ఆదాయానికి తోడు.. పెట్టుబడి వృద్ధిని కూడా ఇన్వెస్టర్లు చూడొచ్చు. ప్రసు ్తతం మన స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ అయిన రీట్ల సగటు డివిడెండ్ రాబడి 4–6% మధ్య ఉంది. -
రాబడి మీకోసమేనా..?
అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఫలితంగా అన్ని రకాల పరిశ్రమలకూ ఈ సెగ గట్టిగానే తగులుతోంది. ముడి చమురు ధరలు, లోహాలు, రసాయనాలు, వంటనూనెలు ఇలా దాదాపు అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. వినియోగ డిమాండ్ పెరగడం, ఉత్పత్తి, సరఫరా తగినంత లేకపోవడం దీనికి కారణంగా పేర్కొంటున్నారు. కారణాలేవైనా కానీ మన దేశంలో ద్రవ్యోల్బణం గరిష్టాల్లోనే ఉంటోంది. కనుక ఇన్వెస్టర్లు అందరూ పెట్టుబడుల నిర్ణయాలు తీసుకునే విషయంలో ఈ అంశాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందే. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందన్న అంచనాలు అధిక ద్రవ్యోల్బణానికి మార్గమే అవుతుంది. గడిచిన 12 నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 6 శాతంగా ఉంది. అంటే 6 శాతం రాబడినిచ్చే సాధనంలో ఇన్వెస్ట్ చేసినా.. నికరంగా మీ చేతికి వచ్చేది సున్నాయే. 2009 నుంచి 2014 మధ్య ద్రవ్యోల్బణం సగటున 10.4 శాతంగా మన దేశంలో కొనసాగింది. అందుకే ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడుల కోసం ఇన్వెస్టర్లు మెరుగైన సాధనాలకు పెట్టుబడుల్లో చోటివ్వాలి.. బాండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ద్రవ్యోల్బణం పెరిగిపోతుంటే నియంత్రించేందుకు సెంట్రల్ బ్యాంకులు అనుసరించే మార్గం వడ్డీ రేట్లను పెంచడం. కనుక రేట్లను పెంచే క్రమంలో బాండ్లలో పెట్టుబడులు అనుకూలం కాదు. దీనివల్ల బాండ్ల ధరలు తగ్గుతాయి. కరోనా రెండు విడతల ప్రభావంతో దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు కుంటుపడ్డాయి. వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కనుక కొంత ఆలస్యంగా వడ్డీ రేట్లను పెంచే మార్గంలోకి వెళ్లొచ్చు. కానీ, కీలక రేట్లు పెరగకపోయినా.. ద్రవ్యోల్బణం రెక్కలు తొడుగుకుంటే మార్కెట్ ఆధారిత వడ్డీ రేట్లు (పదేళ్ల జీ–సెక్‌లు) పెరిగిపోతాయి. ఇన్వెస్టర్లు 2009–2014 మధ్య భారత ప్రభుత్వ సెక్యూరిటీలను కలిగి ఉన్నట్టయితే వారికి లభించిన రాబడి రేటు వార్షికంగా 3.2 శాతమే. వాస్తవ రాబడి మైనస్ అవుతుంది. అందుకని అధిక ద్రవ్యోల్బణం కొనసాగుతుందనుకుంటే అటువంటప్పుడు దీర్ఘకాల ప్రభుత్వ సెక్యూరిటీలు, దీర్ఘకాలంతో కూడిన కార్పొరేట్ బాండ్లకు దూరంగా ఉండడమే మంచిది. బ్యాంకుల ఎఫ్డీ రేట్లు సార్వభౌమ బాండ్ల రేటు కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అయినా కానీ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఇవి చాలవు. ఈ విడత కీలక రేట్ల సవరణ విషయంలో ఆర్బీఐ వేచి చూసే ధోరణితో ఉన్నందున.. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి తగ్గట్టు వడ్డీ రేట్లు కూడా సమీప కాలంలో పెరగకపోవచ్చు. ఆర్బీఐ గణాంకాలను పరిశీలిస్తే 2009–2014 మధ్య బ్యాంకు ఎఫ్డీ రేట్లు 8.6 శాతంగా ఉన్నాయి. మంచి రేటు కదా అని అనుకోవద్దు. ఎందుకంటే ఆ సమయంలో సగటు ద్రవ్యోల్బణం 10.4 శాతంగా ఉంది. నేడు బ్యాంకు ఎఫ్‌డీల రేట్లు 5–6 శాతం మధ్యే ఉన్నాయి. ద్రవ్యోల్బణం కూడా ఇదే స్థాయిలో ఉంటోంది. కనుక వాస్తవంగా ఇన్వెస్టర్‌కు వచ్చే రాబడి ఏమీ ఉండదు. చిన్న మొత్తాల పొదు పథకాల్లో టైమ్ డిపాజిట్లు, కిసాన్ వికాస్పత్ర, ఎన్ఎస్సీ రేట్లు కూడా 6–7 శాతం మధ్యే ఉన్నాయి. కనుక వాస్తవంగా వచ్చే రాబడి ఒక్క శాతం కూడా మించదు. ఈక్విటీలు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ఎదుర్కొని మెరుగైన వాస్తవ రాబడులకు ఈక్విటీలు మార్గం చూపిస్తాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు బాండ్ల కంటే అధిక రాబడులనే ఇస్తున్నట్టు ఇప్పటి వరకు ఉన్న చారిత్రక గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. ఈక్విటీల్లో రిస్క్ ఉంటుంది. దీర్ఘకాలంలోనే ఈ రిస్క్‌ను అధిగమించే రాబడులకు అవకాశం ఉంటుంది. కనీసం పదేళ్లు అంతకుమించిన కాలానికి ఈక్విటీల్లో మెరుగైన రాబడులను ఆశించొచ్చు. స్వల్పకాలానికి మాత్రం స్టాక్స్‌లో రాబడులు బాండ్లను మించి, ద్రవ్యోల్బణాన్ని మించి ఉంటాయని చెప్పడానికి లేదు. ఎప్పుడూ కూడా స్టాక్స్ ధరలు ఆయా కంపెనీల వృద్ధినే ప్రతిఫలిస్తుంటాయి. పారిశ్రామిక ముడి పదార్థాలైన పెట్రోకెమికల్స్, కెమికల్స్, పారిశ్రామిక లోహాల ధరలు పెరుగుతుంటే అవి కంపెనీల లాభాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఎందుకంటే పెరుగుతున్న ధరలను కంపెనీలు పూర్తి స్థాయిలో వినియోగదారులకు బదిలీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొం టాయి. కరోనా రెండో విడత నేపథ్యంలో డిమాండ్ పరిస్థితులు బలహీనంగానే ఉన్నాయి. పెరిగిపోయిన ముడి సరుకుల ధరల వల్ల కంపెనీల లాభాలపై ప్రభావం పడనుంది. కానీ, ఇదే సమయంలో కమోడిటీలను ఉత్పత్తి చేసే కంపెనీలు పెరుగుతున్న ధరల సైకిల్‌తో మంచి లాభాలను నమోదు చేసుకుంటాయి. ఇలా అధిక ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు కమోడిటీలను వినియోగించేవి కాకుండా.. వాటిని ఉత్పత్తి చేసే కంపెనీలను ఎంపిక చేసుకోవడం వల్ల అధిక లాభాలను ఆర్జించేందుకు వీలుంటుంది. బంగారం ద్రవ్యోల్బణానికి రక్షణ సాధనంగా బంగారాన్ని పరిగణిస్తుంటారు. కానీ, మన దగ్గర ద్రవ్యోల్బణానికి హెడ్జ్ సాధనంగా బంగారానికి అంత ప్రాధాన్యం లేదు. అంతర్జాతీయంగా చూస్తే మాత్రం ద్రవ్యోల్బణానికి రెక్కలు వచ్చిన తరుణంలో బంగారం ప్రాధాన్య సాధనంగా ఉంటోంది. భారత ఇన్వెస్టర్లకు.. అంతర్జాతీయ సంక్షోభ సమయాలు లేదా కమోడిటీల ధరల పెరుగుదల సమయంలోనే రూపాయి క్షీణత కూడా చోటు చేసుకుంటోంది. 2009–2014 కాలంలో అధిక ద్రవ్యోల్బణం సమయంలో మన దేశ ఇన్వెస్టర్లకు బంగారం మంచి రాబడులను కురిపించింది. వార్షికంగా 13.2 శాతం చొప్పున బంగారం ఈటీఎఫ్‌లు రాబడులను ఇచ్చాయి. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుందనుకుంటే ఆ సమయంలో బంగారానికి కొంత కేటాయింపులు సహేతుకమే అవుతాయి. వివేకంతో వ్యవహరించాలి ఇటీవలే మోతీలాల్ ఓస్వాల్ సంస్థ విడుదల చేసిన నివేదికను పరిశీలించినట్టయితే.. నిఫ్టీ ఇండెక్స్‌లోని 11 కంపెనీలు పెరుగుతున్న కమోడిటీల ధరల నుంచి లబ్ధి పొందుతాయని అర్థమవుతోంది. 13 కంపెనీలపై చాలా ప్రతికూల ప్రభావం పడనుంది. మిగిలిన కంపెనీలపై ప్రభావం తటస్థంగానే ఉంటుందని తెలుస్తోంది. అధిక కమోడిటీల ధరలు ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశాలే ఉంటే.. ఇన్వెస్టర్లు ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీలకు దూరంగా ఉండడమే మంచిదవుతుంది. దిగ్గజ కంపెనీలతో పోలిస్తే.. మధ్య తరహా, చిన్న కంపెనీలకు ఉత్పత్తుల ధరలను నిర్ణయించే శక్తి తక్కువగానే ఉంటుంది. కనుక పెరుగుతున్న తయారీ వ్యయాల ప్రభావం వాటిపైనే ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ సమయంలో పెద్ద కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం సురక్షితం. నిఫ్టీ లాభాల్లో కమోడిటీ కంపెనీల వాటా 36 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉన్న 2009–14 కాలంలో నిఫ్టీ–50 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్, నిఫ్టీ 500 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్ వార్షికంగా 17 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ఆ కాలంలో ఉన్న సగటు ద్రవ్యోల్బణం 10.4 శాతం కంటే ఈక్విటీలు మెరుగైన రాబడులను ఇచ్చినట్టు అర్థమవుతోంది. కాకపోతే నాటికి, నేటికీ మధ్య స్టాక్స్ వ్యాల్యూషన్లలో వ్యత్యాసం ఉంది. బేర్ మార్కెట్ తర్వాత 2009లో స్టాక్స్ వ్యాల్యూషన్లు చౌకగా ఉన్నాయి. నిఫ్టీ 50పీఈ 2009 జనవరిలో 13.3 పీఈ వద్ద ఉంది. కానీ నేడు నిఫ్టీ 50 పీఈ 29వద్ద ఉంది. కనుక ఈ దశలో పెట్టుబడులకు ఎంపిక చేసుకునే కంపెనీల విషయంలో వివేకంతో వ్యవహరించాలి. ధరలను శాసించగల కంపెనీలను, పెరుగుతున్న కమోడిటీల ధరల నుంచి లబ్ధి పొందే వాటిని ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీలు ఏ ఇతర సాధనంతో పోల్చినా దీర్ఘకాలంలోనే మెరుగైన రాబడులను ఇచ్చాయి. స్వల్ప కాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులేవనే చెప్పాలి. -
పోర్ట్‌ఫోలియో ఇలా అయితే బెటర్!
కొత్త ఆర్థిక సంవత్సరంలోకి ప్రవేశించి ఇప్పటికే ఒక మాసం ముగిసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలు ఇన్వెస్టర్లకు లాభాల వర్షం కురిపించాయి. ప్రధాన సూచీలు 70 శాతం ర్యాలీ చేయగా.. ఎస్అండ్పీ బీఎస్ఈ 500 సూచీలో 200కు పైగా స్టాక్స్ రెట్టింపునకు పైగా పెరిగాయి. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లోనూ అదే మాదిరి లాభాలు ఆశించడం అత్యాశే అవుతుంది. పెట్టుబడులంటే ఒక్క లాభాలే కాదు. మీ పెట్టుబడికి రక్షణ కూడా అవసరం. ఒకవేళ విపత్కర పరిస్థితులు ఎదురైనా అధిగమించే విధంగా పోర్ట్‌ఫోలియో నిర్మాణం ఉండాలి. ప్రతీ ఇన్వెస్టర్ తన పెట్టుబడుల కేటాయింపుల ప్రణాళికకు కచ్చితంగా కట్టుబడి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకానీ, ఈక్విటీల్లో అధిక రాబడులను చూసి లేదా బిట్‌కాయిన్ పరుగులు చూసి భారీగా రిస్క్ తీసుకోవడం మంచిది కాదంటున్నారు. ఈక్విటీలతో పాటు ఇతరత్రా సాధనాలకు ఇన్వెస్టర్లు ఏ మేరకు పెట్టుబడులను కేటాయించుకోవాలన్న అంశంపై నిపుణుల సూచనలు ఇలా ఉన్నాయి... ఎకానమీ పుంజుకుంటుంది ప్రతీ ఇన్వెస్టర్ జీవితంలో ఏ దశలో ఉన్నారు.. లక్ష్యాలు, వాటికి ఎంత వ్యవధి ఉందనే అంశాల ఆధారంగా వివిధ సాధనాల మధ్య పెట్టుబడులను కేటాయించుకోవాలి. కరోనా రెండో విడత వల్ల తాత్కాలిక అవరోధాలు ఏర్పడినప్పటికీ 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకోనుంది. పటిష్టమైన ఆర్థిక వృద్ధి చక్రంలోకి భారత్ ప్రవేశించనుంది. కంపెనీలు బలమైన లాభాల ఆర్జనకు ఇది వీలు కల్పిస్తుంది. మార్కెట్లు మంచి పనితీరు చూపించేందుకు మద్దతుగా నిలుస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీల లాభాలు పెరగనున్నాయి. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి ఈక్విటీలు సా«ధారణం కంటే ఎక్కువే రాబడులను ఇస్తాయి. కరోనా సెకండ్‌వేవ్ సవాళ్లు విసురుతున్నప్పటికీ, వాటిని భారత్ తట్టుకోగలదన్న విశ్వాసం ఉంది. – నీరజ్ కుమార్ ఫ్యూచర్ జనరాలి ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ ఫండ్స్ /ఈటీఎఫ్‌లు మెరుగైనవి.. 2020 మార్చిలో క్లిష్ట పరిస్థితుల తర్వాత ఏడాది కాలంలో భారత ఈక్విటీ మార్కెట్ 78 శాతం ర్యాలీ చేసింది. దీంతో ఇన్వెస్టర్ల పెట్టుబడుల్లో ఈక్విటీల పరిమాణం పెరిగి ఉంటుంది. దీర్ఘకాలంలో మంచి సంపదను సమకూర్చుకునేందుకు సరైన పోర్ట్‌ఫోలియో నిర్మాణం ఎంతో అవసరం. పెట్టుబడుల లక్ష్యాలకు ఇది కీలకం. ఆయా అంశాలను పరిశీలిస్తే... ► ఈక్విటీలు: మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇండెక్స్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టడం వల్ల తక్కువ వ్యయాలకే మార్కెట్ ఆధారిత రాబడులను అందుకోవచ్చు. ► స్థిరాదాయం: స్థిరమైన, మంచి వృద్ధికి అవకాశం ఉన్న ఎన్సీడీలు ఇప్పటికీ ఉన్నాయి. మార్కెట్ అస్థిరతలను తట్టుకునేందుకు, పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీ పెట్టుబడులకు హెడ్జింగ్ కోసం ఈ విభాగాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ► అంతర్జాతీయ ఈక్విటీలు: దేశీయ మార్కెట్లలో ఉండే అస్థిరతలకు హెడ్జ్ (రక్షణగా)గా అంతర్జాతీయ ఈక్విటీలు ఉపయోగపడతాయి. అంతేకాదు బలమైన వృద్ధి అవకాశాలున్న అంతర్జాతీయ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం లభిస్తుంది. ► బంగారం: ఈక్విటీ మార్కెట్ల తీరు ప్రతికూలంగా మారిన సందర్భాల్లో బంగారం పథకాల్లో పెట్టుబడులు.. స్థిరత్వాన్నిస్తాయి. పెట్టుబడుల కేటాయింపులు.. ► ఈక్విటీలు: 70 శాతం (నేరుగా స్టాక్స్‌లో 40 శాతం, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌కు 20 శాతం, ఈఎస్జీ మ్యూచువల్ ఫండ్స్‌కు 10 శాతం) ► ఫిక్స్డ్ ఇన్కమ్: 15 శాతం (డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు 10 శాతం, ఏఏఏ రేటెడ్ కార్పొరేట్ ఎన్‌సీడీలకు 5 శాతం). డెట్ ఫండ్స్‌లో అల్ట్రా షార్ట్ టర్మ్ లేదా లో డ్యురేషన్ ఫండ్ లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్ లేదా డైనమిక్ బాండ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ► అంతర్జాతీయ ఈక్విటీలు: 10 శాతం (ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్‌కు 5 శాతం, ఇంటర్నేషనల్ ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్స్‌కు 5 శాతం) ► బంగారం: 5 శాతం (గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లేదా సార్వభౌమ బంగారం బాండ్లు) – దినేష్ రోహిరా, 5నాన్స్ డాట్‌కామ్ సీఈవో ఇక ముందూ ఈక్విటీల ర్యాలీ 2021–22లో అంతర్జాతీయంగా అధిక ద్రవ్య లభ్యత కొనసాగుతుంది. ఇది ఈక్విటీ మార్కెట్ల ర్యాలీకి, ప్రధానంగా భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల ర్యాలీకి మద్దతుగా నిలుస్తుంది. దేశీయ ఈక్విటీలకు 50–60 శాతం మధ్య, అంతర్జాతీయ ఈక్విటీలకు 20–30 శాతం మధ్య కేటాయించుకోవాలని ఇన్వెస్టర్లకు సూచిస్తున్నాం. వ్యాల్యూ స్టాక్స్‌పై దృష్టి సారించాలి. ఎందుకంటే వచ్చే ఏడాది కాలంలో ఇవి మంచి పనితీరు చూపిస్తాయి. బంగారం, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలకు 10 శాతం చొప్పున కేటాయించుకోవాలి. నిపుణుల సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలి. కేటాయింపులు.. ► బంగారం, ఫిక్స్డ్ఇన్కమ్: 10 శాతం ► అంతర్జాతీయ ఈక్విటీలు: 20–30% దేశీయ ఈక్విటీలు: 50–60% – దివమ్ శర్మ, గ్రీన్ పోర్ట్‌ఫోలియో సర్వీసెస్ 60/40 ఫార్ములా.. ఇన్వెస్టర్ వ్యక్తిగత రిస్క్ సామర్థ్యం, పెట్టుబడుల లక్ష్యాలకు అనుగుణంగా కేటాయింపులు ఉండాలి. సాధారణంగా 60/40 సూత్రాన్ని మేము సూచిస్తుంటాం. అంటే 60 శాతం కేటాయింపులు ఈక్విటీలకు, మిగిలిన 40 శాతం స్థిరాదాయాన్నిచ్చే సాధనాలు, బంగారం కలయికగా ఉండాలి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీలు భారీ ర్యాలీ చేసినప్పటికీ 2021–22లోనూ ఇతర సాధనాలతో పోలిస్తే ఈక్విటీలే అధిక రాబడులను ఇస్తాయని భావిస్తున్నాం. తక్కువ వడ్డీ రేట్లు, సరిపడా ద్రవ్యలభ్యత, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధానం, కార్పొరేట్ లాభాలు పుంజుకోవడం వచ్చే రెండేళ్ల పాటు కొనసాగుతుంది. వచ్చే రెండేళ్లపాటు ఈక్విటీలు రెండంకెల రాబడులను ఇస్తాయన్నది అంచనా. కార్పొరేట్ మార్చి త్రైమాసిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థకు కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, వాటిని దేశం అధిగమించడానికి తగిన అవకాశాలు అన్నీ ఉన్నాయి. ఇది ఈక్విటీలకు సానుకూల అంశం. కేటాయింపులు ► ఫిక్స్డ్ ఇన్కమ్: 40 శాతం (ఇందులో బంగారం, వడ్డీ ఆదాయాన్నిచ్చేవి, స్థిరాదాయాన్నిచ్చే సాధనాలు ఉండాలి) ► ఈక్విటీలు: 60 శాతం కేటాయించుకోవాలి. – గౌరవ్‌దువా, షేర్‌ఖాన్ క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటజీ హెడ్ -
రిస్క్ తక్కువతో రాబడులు
ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అంటేనే రిస్క్ అధికం. కాకపోతే ఈక్విటీల్లో లార్జ్‌క్యాప్ స్టాక్స్.. మార్కెట్ పతనాల్లో ఇతర స్టాక్స్‌తో పోలిస్తే కాస్త బలంగా నిలబడతాయి. అందుకే ఇతర స్టాక్స్‌తో పోలిస్తే లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో రిస్క్ కాస్త తక్కువ. అదే సమయంలో డెట్ ఫండ్స్‌లోనూ (క్రెడిట్‌రిస్క్ ఫండ్స్ మినహా) రిస్క్ కొంచెం తక్కువగానే ఉంటుంది. ఈ రెండింటిలోనూ పెట్టుబడులు పెట్టేవే హైబ్రిడ్ ఫండ్స్. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్ కూ డా ఒకటి. ఈ రెండు విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టే అవకాశం ఈ పథకం రూపంలో లభిస్తుంది. పెట్టుబడుల విధానం హైబ్రిడ్ ఫండ్స్ పరిస్థితులకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ విభాగాల్లోనూ పెట్టుబడుల సమతూకాన్ని మారుస్తుంటాయి. కంపెనీల వ్యాల్యూషన్లు, మార్కెట్లలో అస్థిరతలకు తగినట్టు అవసరమైతే ఈక్విటీ పెట్టుబడులు పెంచుకోవడం, తగ్గించుకోవడం చేస్తుంటాయి. కానీ, ఇన్వెస్టర్లు నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ వెసులుబాటు అంతగా ఉండదు. ఈ పథకం అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఈక్విటీ విభాగం కిందకు వస్తుంది. అంటే పెట్టుబడి అవకాశాల లభ్యతకు అనుగుణంగా 65 నుంచి 80 శాతం వరకు ఈక్విటీలకు కేటాయించే స్వేచ్ఛను కలిగి ఉంటుంది. అదే విధంగా 20–35 శాతం వరకు డెట్‌కు కేటాయిస్తుంది. కొంత రిస్క్ భరించే సామర్థ్యం ఉన్నవారు, దీర్ఘకాలం పాటు (ఐదేళ్లకు మించి) ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. పెట్టుబడుల విషయంలో ఈ ఫండ్.. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 26.42 శాతం పెట్టుబడులు ఈ రంగ కంపెనీలకు కేటాయించింది. ఆ తర్వాత ఇంధన రంగ కంపెనీల్లో 13 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 10 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. రాబడులు: ఈ పథకం 2015 జూలైలో ప్రారంభమైంది. పోటీ పథకాలతో పోలిస్తే ఇప్పటి వరకు మంచి పనితీరే చూపించింది. ఈ ఫండ్ గడిచిన ఏడాది కాలంలో 10.2 శాతం రాబడులను అందించింది. కానీ ఇదే కాలంలో ఈ విభాగం సగటు రాబడులు 8.5 శాతంగానే ఉన్నాయి. ఇక గడిచిన మూడేళ్ల కాలంలో ఈ పథకం 9.8 శాతం, ఐదేళ్లలో 9.5 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలాన్ని తెచ్చి పెట్టింది. పథకం ఆరంభం నుంచి చూస్తే రాబడులు వార్షికంగా 10.67 శాతం చొప్పున ఉన్నాయి. అన్ని కాలాల్లోనూ అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ విభాగం రాబడులతో పోలిస్తే ఈ పథకం పనితీరు ముందంజలో ఉంది. ముఖ్యంగా ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో అధిక నాణ్యత కలిగిన (ఏఏఏ) డెట్ పెట్టుబడులు ఉండడాన్ని గమనించాలి. అలాగే, ఈక్విటీ పెట్టుబడుల్లోనూ ఎక్కువ భాగాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయించింది. ఈ పథకం దాదాపు ఎక్కువ సందర్భాల్లో ఈక్విటీలకు 70 నుంచి 75 శాతం వరకే కేటాయిస్తూ వస్తోంది. ప్రస్తుతానికి ఈక్విటీ కేటాయింపులు 78 శాతంగా ఉండగా, డెట్‌లో 13.4 శాతం పెట్టుబడులు, నగదు సమానాల్లో 8 శాతం వరకు కలిగి ఉంది. ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో 56 స్టాక్స్ ఉన్నాయి. -మిరే అస్సెట్ హైబ్రిడ్ ఈక్విటీ టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ - 7.49 శాతం హెచ్డీఎఫ్సీ బ్యాంకు - 6.79 శాతం ఇన్ఫోసిస్ - 4.99 శాతం ఐసీఐసీఐ బ్యాంకు 4.68 శాతం టీసీఎస్ 4.29శాతం యాక్సిస్ బ్యాంకు 3.38 శాతం ఎస్బీఐ 2.53 శాతం ఐటీసీ 2.30 శాతం హెచ్‌యూఎల్ 2.15 ఎల్అండ్టీ 2.14 -
మార్కెట్లో స్మాల్‌క్యాప్ షేర్ల ర్యాలీ మొదలైంది: శంకర్ శర్మ
ఈక్విటీ మార్కెట్లో స్మాల్‌క్యాప్ షేర్ల ర్యాలీ మొదలైందని మార్కెట్ విశ్లేషకుడు శంకర్ శర్మ అభిప్రాయపడ్డారు. మరికొంత కాలం పాటు ఈ స్మాల్‌క్యాప్ షేర్ల హావా కొనసాగుతుందని శర్మ అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను స్మాల్‌క్యాప్ షేర్ల కొనుగోళ్లకే మొగ్గు చూపుతానని శర్మ తెలిపారు. తన పోర్ట్‌ఫోలియో మొత్తంలో 67శాతం స్మాల్‌క్యాప్స్, మిడ్ క్యాప్స్ రంగానికి చెందిన షేర్లు ఉన్నాయని తెలిపారు. భారత్‌తో సహా అనేక దేశాల స్టాక్ మార్కెట్లో ఇప్పటికే స్మాల్‌క్యాప్ షేర్ల ర్యాలీ ప్రారంభమైందని, గడచిన 4-5 ట్రేడింగ్ సెషన్లలో లార్జ్‌క్యాప్స్ షేర్ల ర్యాలీని అధిగమించాయని శర్మ తెలిపారు. ఇలాంటి సంఘటన చూసి చాలా ఏళ్లైందని శర్మ చెప్పారు. ‘‘2017లో స్మాల్‌క్యాప్స్ షేర్లు గొప్ప ర్యాలీని చేశాయి. తరువాత 2018, 2019ల్లో అదే ప్రదర్శన కొనసాగింది. 2007 గరిష్టాల నుంచి ఈ షేర్లు దాదాపు 55-60 శాతం నష్టాన్ని చవిచూశాయి. ఇప్పుడు తిరిగి ర్యాలీని ప్రారంభించాయి. కేవలం భారత్‌లోనే కాక మొత్తం ప్రపంచ మార్కెట్లలో స్మాల్‌క్యాప్ షేర్ల గణనీయమైన ర్యాలీని చూస్తున్నాము.’’ అని శర్మ తెలిపారు. స్మాల్‌క్యాప్ షేర్లలో అత్యధిక అస్థిరత ఉంటుంది. తొందరపడి గుడ్డిగా కొనడం అత్యంత ప్రమాదం. నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమని శర్మ ఈ సందర్భంగా తెలిపారు. వాస్తవానికి భారత్ ఈక్విటీ మార్కెట్ ఇతర ప్రపంచ మార్కెట్ల ర్యాలీతో పోలిస్తే చాలా తక్కువగా ఉందన్నారు. బ్రెజిల్ మార్చి కనిష్ట స్థాయి నుండి 50 శాతం పెరిగిన సంగతి ఈ సందర్భరంగా ఆయన గుర్తు చేశారు. స్టాక్స్ ర్యాలీ ఎల్లప్పుడూ నిజమైన ఆర్థిక వ్యవస్థతో చేతులు కలపవలసిన అవసరం లేదు. చౌకైన డబ్బుతో ఈక్విటీలు ఆకర్షణీయంగా మారినప్పుడు, ఆర్థిక వృద్ధికి తోడ్పడే ఫండమెంటల్స్ లేకుండానే స్టాక్స్ మార్కెట్లు పెద్ద ర్యాలీని చేస్తాయి. ఈ సూత్రం అర్థిక అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మార్కెట్లతో పాటు అన్ని మార్కెట్లకు కూడా వర్తిస్తుందని శర్మ తెలిపారు. బీఎస్ఈ గణాంకాలను పరిశీలిస్తే వారంలో రోజుల్లో బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 4శాతం లాభపడింది. ఇదే ఇండెక్స్ గడచిన నెలరోజుల్లో 12శాతం ర్యాలీ చేసింది. -
కొంత రిస్క్ తీసుకునే వారికి..
గతేడాది లార్జ్‌క్యాప్ స్టాక్స్ ర్యాలీ చేస్తే, మిడ్‌క్యాప్ స్టాక్స్ నష్టపోయాయి. లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారికి లాభాలు, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో వారికి నష్టాలు మిగిలాయి. కానీ, ఇదే పనితీరు ఎల్లప్పుడూ కొనసాగదు. ఒక్కోసారి ఒక్కో విభాగం ర్యాలీ చేస్తే, మరో విభాగం నష్టపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అన్ని రకాల స్టాక్స్‌తో కూడిన విస్తృత ర్యాలీ కూడా ఉంటుంది. అందుకే ఇన్వెస్టర్లు ఈ తరహా ఒక్కో విభాగం ర్యాలీ చేసిన సమయాల్లోనూ ప్రయోజనం పొందేందుకు లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. అలాగే, రెండు విభాగాలు ర్యాలీ చేసిన సందర్భాల్లో మరింత లాభపడొచ్చు. లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు కెనరా రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్ పథకాన్ని పరిశీలించొచ్చు. పథకం రూపం... సెబీ నిబంధనల ప్రకారం లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్ ఒక్కో విభాగంలో కనీసం 35 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కెనరా రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్ అన్నది గతంలో మిడ్‌క్యాప్ ఫండ్. 2018లో సెబీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల వర్గీకరణల్లో మార్పుల తర్వాత లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్‌గా రూపం మార్చుకుంది. అంటే గతంలో మిడ్‌క్యాప్ పథకంగా 65 శాతం వరకు మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్స్పోజర్ కలిగి ఉండేది. దాంతో రిస్క్ అధికం. ఇప్పుడు లార్జ్‌క్యాప్ పెట్టుబడులతోనూ ఉండడం కొంత రిస్క్‌ను తగ్గించేదే. అయితే, అదే సమయంలో ఈ పథకంలోని మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ పెట్టుబడులపై రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కనుక మోస్తరు రిస్క్ తీసుకునే వారు దీర్ఘకాలం కోసం సిప్ ద్వారా ఇన్వెస్ట్‌మెంట్‌ను పరిశీలించొచ్చు. పనితీరు కెనరా రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్‌లో ఏడాది రాబడులు 10.20 శాతంగా ఉన్నాయి. అదే మూడేళ్ల కాలంలో వార్షికంగా 14.3 శాతం, ఐదేళ్లలో వార్షికంగా 11.5 శాతంగా ఉన్నాయి. గతంలో కేవలం మిడ్‌క్యాప్ ఫండ్‌గానే ఉండడం, ప్రస్తుతం లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్‌గా మారినందున భవిష్యత్తు రాబడులు భిన్నంగా ఉండొచ్చు. అంటే దీర్ఘకాలానికి (5–10 ఏళ్ల కాలంలో) ఇంకాస్త మెరుగైన రాబడులను ఆశించొచ్చు. ఏడేళ్ల కాలంలో ఈ పథకం వార్షికంగా 19.65 శాతం, పదేళ్ల కాలంలో వార్షికంగా 17.77 శాతం చొప్పున రాబడులను ఇచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పోర్ట్‌ఫోలియో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రంగాలు, స్టాక్స్ ఎంపికను ఈ ఫండ్ మేనేజర్ చేస్తుంటారు. డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియోను ఇందులో చూడొచ్చు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి పెద్ద పీట వేస్తూ 33.5 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేయడాన్ని గమనించొచ్చు. ఆ తర్వాత సేవల రంగానికి చెందిన స్టాక్స్‌లో 10 శాతం, హెల్త్ కేర్ స్టాక్స్‌లో 8 శాతం వరకు పెట్టుబడులు ఉన్నాయి. టాప్ 10 స్టాక్స్‌లో ఈ ఫండ్ మొత్తం పెట్టుబడులు 37 శాతం వరకు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ పథకంలో 48.5 శాతం పెట్టుబడులు మెగా, లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో, 47 శాతం మిడ్‌క్యాప్‌లో, 4 శాతం స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో ఉన్నాయి. -
అనుకోని అవసరం.. ఇలా దాటేద్దాం!!
వినయ్ వయసు 42 ఏళ్లు. సొంతింటికి తరవాత ప్లాన్ చేద్దాంలే అని ఊరుకున్నాడు. కానీ ఓ రోజు చక్కని ఇల్లు చాలా తక్కువ ధరకు అమ్మకానికి వచ్చినట్టు స్నేహితుల ద్వారా తెలిసింది. కొనేందుకు డబ్బులు రెడీగా లేవు. అయితే, ఈక్విటీలు ఇతర సాధనాల్లో అతడు క్రమానుగతంగా ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇంటిని తక్కువ ధరకే సొంతం చేసుకునేందుకు అందులో ఏవి అమ్మేయాలా? అన్నది అతడి సందేహం. రఘురామ్ వేసవి ఎండల్ని తట్టుకోలేక రూ.38,000 ధరకు ఏసీ కొనాలని నిర్ణయించుకున్నాడు. కానీ, దీనికి ముందు నుంచి ప్రణాళిక వేసుకోలేదు. అప్పటికప్పుడు వచ్చిన అవసరం. ఏం చేయాలి..? ఇక్కడ రెండు వ్యవహారాల్లోనూ గమనించాల్సిన విషయం ఒకటుంది. వేటికవి భిన్నమే. కానీ రెండూ రెగ్యులర్ బడ్జెట్‌కు మించిన అవసరాలు. చాలామందికి నెలవారీ బడ్జెట్‌పై ఒక అంచనా... ఒక ప్రణాళిక ఉంటాయి. మరి ఇలాంటి ఊహించని అవసరాలు వచ్చిపడితే..? నిజానికి వీటిని తీర్చుకోవటానికి పలు మార్గాలున్నాయి. నెలవారీ వాయిదాలు చెల్లించగలిగితే రుణం తీసుకుని సొంతం చేసుకోవచ్చు. వడ్డీ చెల్లించడం ఇష్టం లేకపోతే తమ పెట్టుబడి సాధనాల్లో కొన్నింటిని విక్రయించొచ్చు. ఒకవేళ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలన్నదే నిర్ణయమైతే స్వల్పకాలిక అవసరాల కోసం చేస్తున్న వాటిని పరిశీలించాలనేది నిపుణుల మాట. ఓ లక్ష్యం కోసం, దీర్ఘకాలిక దృష్టితో చేస్తున్న పెట్టుబడులు మొదటి చాయిస్ కాకూడదని ఫిన్‌కార్ట్ వ్యవస్థాపకుడు తన్వీర్ ఆలమ్ సూచించారు. చాలకపోతే అప్పుడు మరింత ముందుకు బ్యాంకు ఖాతాల్లోని మిగులు బ్యాలెన్స్, అత్యవసర నిధితోనూ తీరనంత పెద్ద అవసరాలయితే అప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూడాల్సి ఉంటుంది. అవే మీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, షేర్లు. వీటిని విక్రయించేసి అవసరాలు తీర్చుకోవడం సరైనదే. మీకు లార్జ్ పోర్ట్‌ఫోలియో ఉంటే అందులో అవసరమైనంత వెనక్కి తీసుకోవచ్చు. ఉదాహరణకు రూ.5,00,000 అవసరమైందనుకోండి. నిస్సం కోచంగా షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ విక్రయించడం ద్వారా అవసరాలు అధిగమించొచ్చు. అయితే ఫండ్స్ పెట్టుబడులను ఉపసంహరించుకునే ముందు అవి ఏడాదిలోపు పెట్టుబడులయితే వాటిపై ఎగ్జిట్‌లోడ్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. అలాగే పన్ను పరమైన అంశాలు. ఏడాది దాటిన పెట్టుబడులు అయితే పన్ను భారం కాస్తంత తగ్గుతుంది. ఇది కూడా సందర్భాన్ని బట్టే ఉంటుంది. ఉదాహరణకు వినయ్ చౌకగా వస్తున్న ఇల్లు కొనాలనుకుంటున్నాడు. అతడి విషయానికొస్తే ఎగ్జిట్‌లోడ్, పన్ను వంటి అంశాలను పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. ఎందుకంటే అతడు కొంటున్నది చౌకగా. అలాగే, వినయ్ విషయంలో జీవిత బీమా పాలసీలు కూడా అక్కరకు వస్తాయి. ప్రాపర్టీపై బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణం తీసుకోవచ్చు. జీవిత బీమా ఎండోమెంట్ పాలసీపై రుణం సులభంగానే లభిస్తుంది. పాలసీకి సరెండర్ వ్యాల్యూ అని ఉంటుంది. దీని ఆధారంగా ఎంత రుణం లభిస్తుందన్నది ఆధారపడి ఉంటుంది. ఈ రుణాలపై సాధారణంగా 10% వడ్డీ ఉంటుంది. ఒకవేళ ఎల్ఐసీ నుంచే రుణం తీసుకుంటే వడ్డీ 9 శాతమే. పాలసీపై రుణం తీసుకునేట్టు అయితే దానిపై హక్కులను ఎల్ఐసీకి బదలాయిస్తున్నట్టు ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే, పాలసీని రద్దు చేసుకోవడం సరైన నిర్ణయం కాదని సూచిస్తున్నారు నిపుణులు. ఎండోమెంట్ పాలసీని సాధారణంగా ఏదో ఒక దీర్ఘకాలిక లక్ష్యం కోసం తీసుకుని ఉంటారు. మధ్యలో వచ్చే ఆకస్మిక అవసరాల కోసం పాలసీని రద్దు చేయడం ద్వారా వాటిని కోల్పోవాల్సి వస్తుంది. దీనికి బదులు పాలసీపై రుణం పొందడం మంచి ఆలోచన. ఇక హెచ్డీఎఫ్సీ ప్రాపర్టీ విలువలో 60 శాతాన్ని రుణంగా ఇస్తోంది. వడ్డీ రేటు 9.7 శాతం నుంచి 10.5 శాతం మధ్య ఉంది. ముందు ఏది ఎంచుకోవాలి...? అవసరం రాగానే ఎవరైనా ముందు చూడాల్సింది బ్యాంకు ఖాతా బ్యాలెన్స్వైపే. ఎందుకంటే బ్యాంకులు ఖాతాల్లోని బ్యాలెన్స్‌పై ఇచ్చే వడ్డీ రేటు ద్రవ్యోల్బణ తరుగు స్థాయిలోనే ఉంటుంది. ఒక్కోసారి అంతకంటే తక్కువే. కనుక ఏ మాత్రం రాబడి లేని బ్యాంకు ఖాతాల్లోని నిల్వలను తొలుత వినియోగించుకోవటం మంచిది. నెలవారీ బడ్జెట్ అవసరాల కోసం ఉద్దేశించినవి కాకుండా ఖాతాల్లోని మిగులు నిల్వలకే ఇది వర్తిస్తుంది. ఆ తర్వాత చూడాల్సింది అత్యవసర నిధి వైపు. సాధారణంగా ఇది ఉద్యోగం కోల్పోతే తిరిగి మరో ఉద్యోగం సంపాదించుకునే వరకు కుటుంబ పోషణ కోసం ఉద్దేశించినది. అయితే కొన్ని సందర్భాల్లో చిన్న అవసరాల కోసం వినియోగించుకోవడం సరైదనే. పై ఉదాహరణలో రఘురామ్ ఏసీ కొనుగోలుకు అత్యవసర నిధి వైపు చూడొచ్చు. ప్రణాళిక పరిధిలో లేకుండా వచ్చే అవసరాలకు అత్యవసర నిధి తొలి ఆప్షన్‌గా చూడొచ్చని ‘లాడర్7.కామ్’ వ్యవస్థాపకుడు సురేష్ సెడగోపన్ చెప్పారు. అత్యవసర నిధి అన్నది సాధారణంగా ఓ వ్యక్తి మూడు నుంచి ఆరు నెలల కుటుంబ అవసరాలను తీర్చేంత ఉండాలి. అయితే, ఉద్యోగం కోల్పోయే రిస్క్ ఎక్కువగా ఉండేవారు (ఉద్యోగ భద్రత లేమి), ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉండేవారు కనీసం తొమ్మిది నెలల నుంచి ఏడాది పాటు అవసరాలను తీర్చేంత అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలన్నది నిపుణుల సూచన. ఈ నిధిని ఆకస్మికంగా ఎదురయ్యే అవసరాలకు వినియోగించుకోవచ్చు. దీనివల్ల అప్పులు చేసి వడ్డీలు కట్టాల్సిన ఇబ్బంది తప్పుతుంది. అత్యవసర నిధిని ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకునేందుకు వీలుగా లిక్విడ్ లేదా షార్ట్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల రాబడులు కూడా అందుకోవచ్చు. ఇలా ఇన్వెస్ట్ చేసే ముందు ఎగ్జిట్ చార్జీలు, పన్ను పరమైన నిబంధనలు, పథకం పనితీరును చూడటం మర్చిపోవద్దు. -
బీమా నుంచి గాడ్జెట్ల దాకా!!
మన దేశీ జనాభాలో దాదాపు సగం మంది పాతికేళ్ల కన్నా తక్కువ వయసున్న వారే. ఇక ముప్ఫై అయిదేళ్ల కన్నా తక్కువ వయసున్న వారిని చూస్తే ఏకంగా 65 శాతం. ఇందులో చాలా మంది ఇప్పటికే ఏదో ఒక ఉద్యోగం చేస్తున్న వారో.. లేదా త్వరలో చేరబోయే వారో, స్వయం ఉపాధిలో ఉన్నవారో ఉన్నారు. ఇంత భారీ స్థాయిలో యువజనాభా ఉండటం.. దేశానికి ప్రయోజనకరమే. అయితే, వీరంతా రిటైరయ్యాక పరిస్థితి ఏంటి? రిటైరయిన వారికీ భరోసానిచ్చేలా సామాజిక భద్రత పథకాలు, వృద్ధులకు చెప్పుకోతగ్గ స్థాయిలో ఆదాయాన్నిచ్చే ఆర్థికపరమైన తోడ్పాటు మన దగ్గర లేకపోవడంతో.. వీరంతా తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు సమస్యలు తప్పవు. పైగా.. దేశీయంగా ఉద్యోగానికి సైతం భద్రత తగ్గిపోతోంది. అందుకే... నేటి యువతరం కాస్త ముందు నుంచే ఆర్థిక ప్రణాళికలను వేసుకోవడం మంచిది. భవిష్యత్ అవసరాలు చిన్నవైనా, పెద్దవైనా... లక్ష్యాలు స్వల్పకాలికమైనా, దీర్ఘకాలికమైనవైనా... స్మార్ట్‌గా అధిగమించవచ్చు. స్వల్ప, మధ్యకాలిక లక్ష్యాల కోసం సిప్‌లు.. అన్నింటికన్నా ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి తీసుకోవడం ప్రధానం. మీ కంపెనీ నుంచి ఆరోగ్య బీమా కవరేజీ ఉన్నప్పటికీ.. కుటుంబం మొత్తానికి ఉపయోగపడేలా ప్రత్యేకంగా ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ఒకటి తీసుకోవడం శ్రేయస్కరం. ఇందుకోసం ప్రీమియం వార్షికంగా చెల్లించేలా ప్లాన్ చేసుకోండి. మిగతా కాలవ్యవధులతో పోలిస్తే.. దీని వల్ల ప్రీమియం కొంత తగ్గుతుంది. అటుపైన స్వల్పకాలిక డెట్ ఫండ్‌లో నెలవారీగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌లో (సిప్) ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టండి. తర్వాత ప్రతి ఏటా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి అవసరమైన మొత్తాన్ని క్రమంగా సదరు డెట్‌ఫండ్ సిప్ నుంచి విడ్‌డ్రా చేసి కట్టేయొచ్చు. ఈ విధానంతో రెండురకాల ప్రయోజనాలుంటాయి. మొదటిది... వార్షికంగా కట్టడం వల్ల ప్రీమియం కొంత తగ్గుతుంది. అదే సమయంలో మీరు సిప్‌లో ఇన్వెస్ట్ చేస్తూ వచ్చే పెట్టుబడి ఏడాది పొడవునా ఎంతో కొంత రాబడి అందిస్తూనే ఉంటుంది. అలాగే, కాస్త ముందుగా ప్లాన్ చేసుకుంటే.. స్మార్ట్ఫోన్లూ, ల్యాప్‌టాప్‌లు, బైక్‌లు, కార్లు.. ఇతర గాడ్జెట్స్ లాంటివి కొనుక్కోవడానికి ఈఎంఐల బాట పట్టకుండా సొంతంగానే కొనుక్కునే వీలుంటుంది. ఇందుకోసం కూడా స్వల్పకాలిక సిప్‌లు ప్రారంభించవచ్చు. తర్వాత వాటి నుంచి కొద్దికొద్దిగా విత్‌డ్రా చేసుకుని మీరు కోరుకున్న గాడ్జెట్స్.. లేదా వస్తువులు కొనుక్కోవచ్చు. దీర్ఘ కాలికానికీ సిప్‌లు... యుక్త వయసులో కాస్త రిస్కు సామర్థ్యం ఎక్కువగానే ఉంటుంది కనుక... దీర్ఘకాలంలో అధిక రాబడులిచ్చే అవకాశాలున్న ఈక్విటీల్లో అధికంగా ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించొచ్చు. ఎందుకంటే దీర్ఘకాలికంగా షేర్లలో రిస్కులు క్రమంగా తగ్గి రాబడులు పెరిగే అవకాశాలుంటాయి. పైపెచ్చు అనేక సంవత్సరాలుగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండటం వల్ల చక్రవడ్డీ తరహా కాంపౌండింగ్ మహిమ కూడా తోడై మరింత మెరుగైన రాబడులందుకునే ఆస్కారముంటుంది. చాలా మటుకు మిగతా ఇన్వెస్ట్మెంట్ సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలంలో ఈక్విటీలు అధిక రాబడులు అందిస్తాయి. యుక్తవయస్సులోనే ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టడం వల్ల పెట్టుబడుల్లో ఒకటి రెండు తప్పిదాలేమైనా చేసినా.. సత్వరం సరిదిద్దుకునేందుకు కొంత అవకాశం ఉంటుంది. అదే రిటైర్మెంట్కి దగ్గరవుతుండగా.. ఏ చిన్న తప్పిదం చేసినా సరిదిద్దుకునేందుకు ఎక్కువ సమయం ఉండదు. టాప్ రేటెడ్ ఫండ్స్‌లోనే... దీర్ఘకాలంలో సంపదను గణనీయంగా పెంచుకునే దిశగా టాప్ రేటెడ్ ఈక్విటీ ఫండ్స్‌లో మాత్రమే సిప్ చేయడం మంచిది. అత్యంత తక్కువగా రూ.1,000 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించి... జీతం పెరిగే కొద్దీ కేటాయింపులూ పెంచుకుంటూ వెళ్లండి. ఉదాహరణకు.. సగటున పదిహేను శాతం వార్షిక రాబడులు ఇచ్చే సిప్‌లో ప్రతి నెలా రూ. 1,000 పెట్టుబడితో మొదలుపెట్టారనుకుందాం. ఏటా ఈ మొత్తాన్ని రూ. 1,000 చొప్పున పెంచుకుంటూ పోతే.. ముప్ఫై ఏళ్ల తర్వాత ఏకంగా రూ. 4.8 కోట్ల సంపద పోగవుతుంది. కాబట్టి స్మార్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తే.. లక్ష్యం ఎలాంటిదైనా సులువుగా సాధించవచ్చు. -
రిస్క్ లేదు... రాబడి ఎక్కువ!
పెట్టుబడిని బట్టే రాబడి. అదే అధిక రాబడి కావాలంటే... అక్కడ రిస్క్ కూడా అధికంగానే ఉంటుంది. కాకపోతే తక్కువ రిస్క్‌తో కాస్తంత ఎక్కువ రాబడులనిచ్చే పథకాలు కూడా మార్కెట్లో చాలానే ఉన్నాయి. వయో వృద్ధులకు, కాస్త క్రమానుగతంగా పొదుపు చేసే వారికి, తమ పెట్టుబడిని పోగొట్టుకునే పరిస్థితిలో లేమని భావించేవారికి... ఇలాంటివారికి ఈ పథకాలు అనువుగా ఉంటాయి. అవన్నీ వివరించేదే ఈ ప్రాఫిట్ ప్లస్ కథనం... గడిచిన మూడేళ్లలో స్థిరాదాయం కోసం ఈక్విటీలను నమ్ముకున్న సీనియర్ సిటిజన్లకు (వృద్ధులు) రాబడులు బాగానే వచ్చాయి. సురక్షిత సాధనాల్లో రాబడులు క్షీణించిపోవడంతో రిస్క్ సాధనాలైన ఈక్విటీ సేవింగ్స్ పథకాలు, బ్యాలన్స్డ్ ఫండ్స్ తదితర వాటిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. సంప్రదాయ స్థిరాదాయ పథకాల వడ్డీ రేట్లు మూడేళ్ల తర్వాత మళ్లీ మెల్లగా పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో ఆర్బీఐ కీలక రేట్ల తగ్గింపునకు బ్రేక్ వేసింది. 2017 ఆగస్ట్ నుంచి యథాతథ స్థితినే కొనసాగిస్తూ వస్తోంది. రానున్న ఏడాదిలో వడ్డీ రేట్లను పెంచొచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. బ్యాంకులు ఇప్పటికే మెల్లగా రేట్ల పెంపును ప్రకటిస్తూ ఉండగా... ఈ రేట్ల పెంపును బాండ్ల మార్కెట్ ఇప్పటికే సర్దుబాటు కూడా చేసేసుకుంది. బాండ్ల మార్కెట్‌కు బెంచ్ మార్క్ అయిన పదేళ్ల ప్రభుత్వ బాండ్ల రాబడులు 130 బేసిస్ పాయింట్ల మేర పెరిగి 7.5 శాతానికి చేరాయి. దీంతో మార్కెట్లో ఇతరులు కూడా దీన్ని అనుసరించక తప్పదు. ఈ నేపథ్యంలో బ్యాంకులు, కంపెనీలు రానున్న నెలల్లో కనీసం పదేళ్ల బాండ్ల ఈల్డ్ స్థాయికి అయినా రేట్లను పెంచక తప్పని పరిస్థితి ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రిస్క్ వద్దనుకునే సీనియర్ సిటిజన్లు స్థిరాదాయం కోసం ఈక్విటీలు కాకుండా ఇతర సాధనాలతో పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. బ్యాంకు ఎఫ్డీలు... రానున్న కాలంలో వడ్డీ రేట్ల పెరుగుదల అవకాశాల నేపథ్యంలో స్థిరాదాయం కోరుకునే సీనియర్ సిటిజన్లు దీర్ఘకాలిక డెట్ సాధనాలకు బదులు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లను పరిశీలించొచ్చు. మూడు నెలల నుంచి ఏడాది కాలానికి కూడా వీటిలో ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఏడాది కాలానికి చాలా బ్యాంకులు మంచి రేటునే ఆఫర్ చేస్తున్నాయి. దీర్ఘకాలానికి ఎఫ్డీలపై తక్కువ రేటు ఉంది. కనుక ఆరు నెలల నుంచి ఏడాది కాలానికి ఎఫ్డీలను ఆశ్రయించొచ్చు. సెక్షన్ 80టీటీబీ కింద సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు పైబడిన వారు) ఏడాదిలో వడ్డీ ఆదాయం రూ.50,000 వరకూ ఎలాంటి పన్నూ విధించకుండా తాజా బడ్జెట్లో రాయితీ ఇవ్వటం ఆకర్షణీయం. అంటే రూ.50,000 వరకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత/ బ్యాంకు స్థాయిలో) ఉండదు. కమర్షియల్ బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసు డిపాజిట్లపై ఈ మినహాయింపు ఉంటుంది. అయితే, కోపరేటివ్ బ్యాంకుల్లో ఎఫ్డీలు రిస్క్‌తో కూడినవి. అలాగే, పోస్టాఫీసులో డిపాజిట్లపై వడ్డీ ఆదాయం 6.6 శాతం స్థాయిలోనే ఉంది. వీటికంటే బ్యాంకు డిపాజిట్లు మెరుగ్గా ఉన్నాయి. కోటక్ మహింద్రా బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐడీఎఫ్సీ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అధిక రాబడులను ఆఫర్ చేస్తున్నాయి. ఐడీఎఫ్సీ బ్యాంకు 366 రోజుల డిపాజిట్‌పై సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. కోటక్ మహింద్రా బ్యాంకు 390 రోజుల కాల వ్యవధి కలిగిన బ్యాంకు డిపాజిట్‌పై 7.35 శాతం వడ్డీని అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఈ రేటు 7.25 శాతంగా ఉంది. ఈ మూడు బ్యాంకులు కూడా నెలవారీ, త్రైమాసిక వారీ వడ్డీ ఆదాయం చెల్లింపు ఆప్షన్ అందిస్తున్నాయి. 7.25 శాతం వడ్డీ రేటుపై సీనియర్ సిటిజన్లకు రూ.7 లక్షల డిపాజిట్‌పై ఏటా రూ.50,000 ఆదాయం లభిస్తుంది. కాకపోతే పన్ను చెల్లించాల్సిన ఆదాయం ఉన్న సీనియర్ సిటిజన్లు ముందుగా కొత్తగా ప్రవేశపెట్టిన రూ.50,000 వడ్డీ ఆదాయం మినహాయింపును ఉపయోగించుకోవడం ద్వారా పన్ను రహిత ఆదాయం పెంచుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ మిగతా పథకాలపై వడ్డీ రేట్లు తగ్గిపోగా, పోస్టాఫీసు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) ఇప్పటికీ అధిక స్థాయిలో 8.3 శాతం వార్షిక రాబడులను ఆఫర్ చేస్తోంది. మార్కెట్ రేట్ల కంటే ఇది ప్రీమియం రేటే. ఈ పథకంలో ఏడాది తర్వాత కార్పస్‌పై 1.5 శాతం పెనాల్టీ చెల్లించడం ద్వారా పెట్టుబడులను వెనక్కి తీసుకునే సౌలభ్యం కూడా ఉంది. కనుక ఐదేళ్ల కాల వ్యవధి కలిగిన ఈ పథకాన్ని సీనియర్ సిటిజన్లు స్థిరమైన రాబడుల కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. కాకపోతే ఈ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఆదాయపన్ను చట్టం కింద వార్షికంగా రూ.3 లక్షల ఆదాయం వరకు సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపు ఉన్నందున ఎక్కువ మందికి పన్ను పరమైన ఇబ్బందేమీ ఉండదు. పైగా సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పెట్టుబడి వరకూ దీనికి మినహాయింపు ఉంది. ఈ అవకాశాలు కూడా చూడొచ్చు... సీనియర్ సిటిజన్లకు ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చిన 7.75 శాతం ప్రభుత్వ బాండ్లు లేదా ఎన్బీఎఫ్సీ సంస్థల బాండ్ల ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఆర్బీఐ 7.75 శాతం బాండ్లు గతంలో ఉన్న 8 శాతం వడ్డీ రేట్ల బాండ్ల స్థానంలో తీసుకొచ్చినవి. భద్రత పరంగా ఢోకా లేనివి ఇవి. కాకపోతే దీనిపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. టీడీఎస్ కూడా వర్తిస్తుంది. ఇతర సంప్రదాయ సాధనాల కంటే కాస్త మెరుగైన రాబడులకు ఇందులో హామీ ఉంటుంది. ఎస్బీఐతోపాటు పలు ఇతర జాతీయ బ్యాంకుల నుంచి వీటిని డీమ్యాట్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఏడేళ్ల పాటు లాకిన్ పీరియడ్ ఉండడం ప్రతికూలత. 60–70 ఏళ్ల వయసులో ఉన్న వారు ఆరేళ్ల తర్వాత ఉపసంహరణకు అవకాశం ఉంది. అదే 70 ఏళ్లు దాటిన వారు అయితే ఐదేళ్ల తర్వాత, 80 ఏళ్ల వారు నాలుగేళ్ల తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. దీర్ఘకాలం పాటు లాకిన్ పీరియడ్ ఉండడం అన్నది మారే వడ్డీ రేట్ల నేపథ్యంలో ప్రతికూలతగానే చూడాల్సి ఉంటుంది. కొంచెం రిస్క్ అయినా ఫర్వాలేదనుకుంటే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) అందించే బాండ్లను పరిశీలించొచ్చు. ఏఏఏ రేటింగ్ ఉన్న బాండ్లను స్వల్ప కాలం కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎం అండ్ ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఏడాదికి 7.5 శాతం), హెచ్డీఎఫ్సీ (7.4 శాతం), బజాజ్ ఫైనాన్స్ (7.6 శాతం) బాండ్లను రాబడులు, కాస్తంత భద్రత ఉన్నవాటిగా పరిగణించొచ్చు. వీటికి లాకిన్ పీరియడ్ లేకపోవడం అనుకూలత. కావాలనుకున్నప్పుడు పెట్టుబడులు వెనక్కి తీసుకోవచ్చు. ఎల్ఐసీ పదేళ్ల వయవందన యోజనలో పెట్టుబడుల పరిమితిని పెంచుతామని తాజా బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. అది అందుబాటులోకి వచ్చినప్పుడు వీటిలో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుని నచ్చిన వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. -
ఇన్వెస్టర్లు యులిప్‌ల బాట పట్టొచ్చు
ముంబై: ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ) వేయడంతో బీమా పథకాలు, ముఖ్యంగా యూనిట్ ఆధారిత బీమా పథకాల(యులిప్)కు ఆకర్షణ పెరుగుతుందని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. బడ్జెట్లో ఎల్‌టీసీజీని తిరిగి ప్రవేశపెడుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ నెల 1న ప్రకటించిన వెంటనే మార్కెట్లు భారీగా పతనమై కోలుకోగా, మరుసటి రోజు మళ్లీ భారీ క్షీణత(2.3 శాతం)ను నమోదు చేసిన విషయం విదితమే. ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై ఒక ఏడాదిలో దీర్ఘకాలిక లాభం రూ.లక్ష మించితే 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పంపిణీ చేసే డివిడెండ్లపైనా కేంద్రం 10 శాతం పన్ను విధించింది. ‘‘తాజా ప్రతిపాదన నేపథ్యంలో జీవిత బీమా పాలసీలు ముఖ్యంగా యులిప్‌లు మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో ఆకర్షణీయంగా మారొచ్చని భావిస్తున్నాం’’అని మోర్గాన్‌స్టాన్లీ తన వారంతపు నివేదికలో వివరించింది. ఆదాయపన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం జీవిత బీమా పథకాల నుంచి అందే ఆదాయంపై పన్ను లేదన్న విషయాన్ని నివేదికలో గుర్తు చేసింది. బడ్జెట్ ప్రతిపాదనలపై మరింత స్పష్టత కోసం చూస్తున్నామని, ప్రస్తుత వివరాలు కచ్చితమే అయితే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ వంటి ప్రైవేటు కంపెనీలకు లాభం కలుగుతుందని పేర్కొంది. మరోవైపు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై ఎల్‌టీసీజీతోపాటు డివిడెండ్ పంపిణీపైనా పన్ను వేయడం ఈ రంగంలోకి పెట్టుబడుల రాకకు కొంత మేర అడ్డంకి కాగలదని నిపుణులు సైతం భావిస్తున్నారు. -
ఈక్విటీల్లో తగ్గిన ‘బీమా’ పెట్టుబడులు
2016–17లో రూ.16,793 కోట్లకు పరిమితం ముంబై: ఎల్ఐసీ సహా జీవిత బీమా కంపెనీలు ఈక్విటీల్లో తాజా పెట్టుబడులను గణనీయంగా తగ్గించాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీల్లో బీమా కంపెనీల పెట్టుబడులు నికరంగా రూ.39,535 కోట్లు ఉండగా, అవి గత ఆర్థిక సంవత్సరం (2016–17)లో ఏకంగా 57 శాతం తగ్గి రూ.16,793 కోట్లకు పరిమితమయ్యాయి. స్టాక్ మార్కెట్లు మార్చి చివరికి గరిష్ట స్థాయి (సెన్సెక్స్ 29,620)లకు చేరుకోవడమే ఇందుకు కారణం. జీవిత బీమా కంపెనీల మొత్తం ఈక్విటీ పెట్టుబడుల విలువ గత ఆర్థిక సంవత్సరంలో రూ.7.56 లక్షల కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న రూ.5.95 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 25% పెరిగింది. ఈక్విటీల్లో పెట్టుబడులు తగ్గించిన జీవిత బీమా కంపెనీలు... మరోవైపు రిస్క్ తక్కువగా ఉండే ఫిక్స్డ్ ఇన్కమ్ (అధిక శాతం ప్రభుత్వ సెక్యూరిటీలు) పథకాల్లో 15% అధికంగా రూ.21,67,143 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. జీవిత బీమా సంస్థల అన్ని రకాల పెట్టుబడుల విలువ 2015–16లో రూ.25.29 లక్షల కోట్లుగా ఉంటే, ఈ విలువ 2016–17లో రూ.29.81 లక్షల కోట్లకు వృద్ధి చెందడం విశేషం. ‘‘2016–17లో ఈక్విటీల్లో బీమా సంస్థల కొనుగోళ్ల కంటే విక్రయాలే ఎక్కువ. బీమా కంపెనీల ఈక్విటీ పెట్టుబడుల విలు వ అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 25.5% పెరిగి, రూ.7.56 లక్షల కోట్లకు చేరింది. ఈ వృద్ధి అన్నది పూర్తి ఏడాది పాటు కొనసాగింది’’ అని అని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సెక్రటరీ వి.మాణిక్యం తెలిపారు. రూ.1.61 లక్షల కోట్ల మేర పెట్టుబడుల విలువ పెరగ్గా, అందులో ఒక్క ఎల్ఐసీ వాటాయే రూ.1.28 లక్షల కోట్ల మేర ఉన్నట్టు చెప్పారు. -
పెట్టుబడికి ఏది బెటర్?
సాక్షి, హైదరాబాద్ : బంగారం, ఈక్విటీలు, షేర్లు, స్థిరాస్తి.. వీటిల్లో పెట్టుబడికి ఏదీ బెటర్ అని అడిగితే? చాలా మంది నుంచి వచ్చే సమాధానం స్థిరాస్తి అనే! ఎందుకంటే రియల్టీ ధరలు.. అందులోనూ స్థలాల ధరలు పెరగడమే తప్ప తగ్గడమంటూ ఉండదు గనక! పైపెచ్చు ప్రభుత్వం హైదరాబాద్‌ను విశ్వనగరం వైపు అడుగులేస్తోంది కనక.. స్థలాలకు గిరాకీ పెరుగుతుందని నిపుణుల సూచన. స్థలమెక్కడ? ముందుగా మీరు స్థలంపై ఎంత పెట్టుబడి పెట్టగలరనే విషయంపై ఓ అవగాహనకు వచ్చాక.. ఆ తర్వాత ఎక్కడ కొనాలో నిర్ణయించుకోండి. ఇప్పుడు కాకపోయినా ఓ పదేళ్లయ్యాకైనా స్థలం విలుల రెట్టింపయ్యే అవకాశం గల ప్రాంతాన్ని ఎంచుకోండి. ఉద్యోగావకాశాలను కల్పించడానికి ఆస్కారమున్న ప్రాంతాలైతే ఉత్తమం. హెచ్ఎండీఏ లాంటి స్థానిక సంస్థలు తరచూ వేలం పాటలను నిర్వహిస్తాయి కాబట్టి వీలుంటే ఓసారి కనుక్కోండి. క్రమం తప్పకుండా లావాదేవీలు నిర్వహించే మీ బ్యాంకు ఆమోదం ఉన్న లే అవుట్లు ఉన్నాయోమో ఓసారి ఆరా తీయండి. బృహత్ ప్రణాళిక ప్రకారం మీరు కొనే ప్రాంతం రెసిడెన్షియల్ జోన్ పరిధిలో ఉంటే ఉత్తమం. పెట్టుబడికి ఏది బెటర్? మీరు కొనాలనుకున్న స్థలం దేని పరిధిలోకి వస్తుంది? అంటే రెసిడెన్షియల్ జోన్ కిందికొస్తుం దా? కన్జర్వేషన్ జోన్ పరిధిలోకి వస్తుందా? అనే విషయాల్ని కనుక్కోండి. హెచ్ఎండీఏ తాజా బృహత్ ప్రణాళిక ప్రకారం.. దాదాపు ఆరు వేల కిలో మీటర్లు విస్తరించిన హుడా ఎక్స్టెండెడ్ ఏరియాను 12 స్థల వినియోగ జోన్లుగా వర్గీకరించారు. ఏ స్థలం ఏయే జోన్ పరిధిలోకి వస్తుందో తెలియని పరిస్థితి. హెచ్ఎండీఏ అధికారుల్ని అడిగినా సరైన సమాధానం రాకపోవచ్చు. రిక్రియేషన్ జోన్ పరిధిలోని స్థలం కొని విశాలమైన ఇల్లు కట్టుకుంటానంటే కుదరదు. కాబట్టి, ఈ విషయంలో ముందే అవగాహనకు రండి. ధర ఎంత? మాంద్యం తర్వాత మార్కెట్లో స్థలాల ధరలు తగ్గుముఖం పట్టాయి. మరి మీరు ఎంపిక చేసుకున్న ప్లాటులో ప్రస్తుతం ధరెంత చెబుతున్నారు. బూమ్ సమయంలో ధర ఎంతుందో బేరీజు వేయండి. ఆ తర్వాత సదరు సంస్థ నుంచి స్థలం పత్రాలు, టైటిల్ డీడ్, పన్ను రశీదులుంటే అడిగి తీసుకోండి. వాటిని లాయర్‌తో పరిశీలింపజేయండి. ♦ స్థానిక సంస్థల నుంచి స్థలం కొనాలని భావిస్తే బేరమాడే అవకాశముండదు. అదే ప్రైవేటు సంస్థలనుకోండి.. మీరు ఎంత దాకా పెట్టగలరో సూటిగా చెప్పొచ్చు. ధర విషయంలో మీరో నిర్ణయానికి రాగానే.. సంస్థ నిబంధనల ప్రకారం కొంత సొమ్ము ముందు చెల్లించండి. మిగతా మొత్తాన్ని ఎలా చెల్లిస్తారో వివరించండి. కొన్ని ప్రైవేటు రియల్టీ సంస్థలూ బ్యాంకులతో అవగాహన కుదుర్చుకుని రుణాలిస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దు. రిజిస్ట్రేషన్ మీ పేరిటే మీరు సొమ్మంతా కట్టేశాక.. స్థలాన్ని మీ పేరిట రిజిస్టర్ చేసుకోండి. ఏదేనీ లే అవుట్లో స్థలం కొంటే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఖాళీగా ఉన్న ప్రాంతంలో కొంటే ముందుగా పునాది వేసుకోండి. వీలైతే గోడ కూడా కట్టుకోండి. అపరిచితులు ఆక్రమించకుండా ఉండాలంటే మాత్రం మీరు క్రమం తప్పకుండా మీ స్థలంపై దృష్టి సారించాలి. -
వ్యక్తిగత సంపదలో భారత్‌కు 10వ స్థానం
న్యూఢిల్లీ: దేశాల వారీగా వ్యక్తిగత సంపద విషయంలో భారత్ ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది. దేశం మొత్తం ప్రైవేటు సంపద విలువ 3,492 బిలియన్ డాలర్లు. ఆస్తి, నగదు, ఈక్విటీలు, బిజినెస్ ప్రయోజనాలుసహా ప్రతి దేశంలోని వ్యక్తులందరి ప్రైవేటు సంపద ప్రాతిపదికన న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ 2015కు సంబంధించి ఈ నివేదికను విడుదల చేసింది. ఈ వరుసలో 48,734 బిలియన్ డాలర్లతో అమెరికా ముందు నిలిచింది. వరుసలో తరువాత 8 స్థానాల్లో చైనా(17,254 బిలియన్ డాలర్లు), జపాన్(15,230 బి. డాలర్లు), జర్మనీ (9,358 బి. డాలర్లు), బ్రిటన్(9,240 బి. డాలర్లు), ఫ్రాన్స్(8,722 బి. డాలర్లు), ఇటలీ (7,308 బి. డాలర్లు), కెనడా(4,796 బి. డాలర్లు), ఆస్ట్రేలియా(4,497 బి. డాలర్లు) నిలిచాయి. తలసరి విషయంలో 20వ ర్యాంక్. కాగా ఈ సంపద తలసరి విషయానికి వచ్చే సరికి భారత్ 20వ స్థానంలో నిలిచింది. భారతీయుని సగటు సంపద 2,800 డాలర్లుగా ఉంది. అధిక జనాభా దీనికి కారణంగా కనిపిస్తోంది. 2,85,100 డాలర్లతో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంది. అయితే 2000వ సంవత్సరంలో భారత్‌లో వ్యక్తిగత సంపద తలసరి కేవలం 900 డాలర్లు. 2015 నాటికి 211 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ఈ 15 సంవత్సరాల్లో భారీగా సంపద వృద్ధి నమోదుచేసుకున్న దేశం ర్యాంకుల్లో భారత్ 5వ స్థానాన్ని దక్కించుకుంది. -
పుత్తడి కన్నా షేర్లు మిన్న!
- ఆకర్షణీయమైన పెట్టుబడిగా ఈక్విటీలు - సెబీ చైర్మన్ యూకే సిన్హా... ముంబై: పుత్తడితో పోల్చుకుంటే షేర్లే అధిక రాబడులనిచ్చాయని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పేర్కొంది. 15-20 ఏళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే పుత్తడిలో పెట్టుబడులు 5-6 శాతం వార్షిక వృద్ధినే ఇచ్చాయని సెబీ చైర్మన్ యు.కె. సిన్హా చెప్పారు. షేర్లలో పెట్టుబడులు 15 శాతం వార్షిక వృద్ధిని ఇచ్చాయని వివరించారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు భారత వృద్ధికి ఇతోధికంగా దోహదం చేశాయని వివరించారు. షేర్లలో పెట్టిన పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. పుత్తడి ధరల్లో పతనం, దీర్ఘకాలం పాటు రియల్టీ మార్కెట్ ఎదుగూ బొదుగూ లేకపోవడం వల్ల షేర్లు ఆకర్షణీయంగా మారాయని, కుటుంబాల పొదుపుల్లో అధిక భాగం ఈక్విటీ మార్కెట్లోకి రావడం మొదలైందని వివరించారు. ప్రస్తుతానికి పుత్తడి ధరలు ఆశావహంగా లేవని, అందుకని ప్రజలు ఇతర ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారని, దీర్ఘకాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే స్టాక్ మార్కెట్ మంచి రాబడులనిచ్చిందని, ఇదే ఈ మార్కెట్ అందమని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయని, భారత్‌లో నాలుగేళ్ల కనిష్టానికి, అంతర్జాతీయ మార్కెట్లో ఆరేళ్ల కనిష్టానికి పడిపోయాయని చెప్పారు. స్టాక్ మార్కెట్ ఏడాది కాలంలో 2,000పాయింట్లు పెరిగిందని తెలిపారు. కంపెనీల ఆర్థిక ఫలితాలు బలహీనంగా ఉండడం, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ ఆరు నెలల్లో మాత్రం స్టాక్ మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురైందని వివరించారు. గత ఏడాది స్టాక్ మార్కెట్ 30 శాతం రాబడులిచ్చిందని వివరించారు. -
కొత్త ఏడాదిలో తొలి లాభం
కొత్త ఏడాదిలో ఐదురోజులపాటు వరుస నష్టాలు చవిచూసిన స్టాక్ సూచీలు బుధవారం తొలిసారిగా లాభపడ్డాయి. స్వల్ప శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 36 పాయింట్లు ఎగిసి 20,729 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 6,174 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎంపికచేసిన పీఎస్‌యూ, ఫార్మా, ఆటో షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలుచేశారు. కోల్ ఇండియా, గెయిల్, సిప్లా, బ్యాంక్ ఆఫ్ బరోడాలు 2-3%ర్యాలీ జరిపాయి. టాటా పవర్, కెయిర్న్ ఎనర్జీ, ఎన్ఎండీసీ, పీఎన్బీ, డాక్టర్ రెడ్డీస్ షేర్లు 1-2% మధ్య పెరిగాయి. ప్రధాన బ్యాంకింగ్ షేర్లన్నీ మందకొడిగా ట్రేడయినా, ప్రత్యేక డివిడెండ్ ప్రకటిస్తున్నాయన్న వార్తలతో మిడ్‌సైజ్ పీఎస్‌యూ బ్యాంక్ షేర్లు 4-8% మధ్య భారీ ట్రేడింగ్ పరిమాణంతో ర్యాలీ జరిపాయి. ఎఫ్ఐఐలు రూ. 79 కోట్ల పెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 88 కోట్లు వెనక్కు తీసుకున్నాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్ కౌంటర్లలో లాంగ్ బిల్డప్... మిడ్‌సైజ్ పీఎస్‌యూ బ్యాంకింగ్ కౌంటర్లలో భారీ నగదు కొనుగోళ్లతో పాటు ఫ్యూచర్ కాంట్రాక్టుల్లో పెద్ద ఎత్తున లాంగ్ బిల్డప్ జరిగింది. అన్నిటికంటే అధికంగా 8 శాతం ర్యాలీ జరిపిన సిండికేట్ బ్యాంక్ ఫ్యూచర్ కాంట్రాక్టులో 14.28 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 61.08 లక్షల షేర్లకు పెరిగింది. అలహాబాద్ బ్యాంక్ ఫ్యూచర్ ఓఐలో 17.22 లక్షల షేర్లు (34 శాతం), యూనియన్ బ్యాంక్ ఫ్యూచర్లో 13.72 లక్షల షేర్లు (15 శాతం), ఐడీబీఐ బ్యాంక్ ఫ్యూచర్లో 9.52 లక్షల షేర్లు (11 శాతం), బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్యూచర్లో 15.08 లక్షల షేర్లు (24 శాతం), కెనరా బ్యాంక్ ఫ్యూచర్లో 5.74 లక్షల షేర్ల (9.5 శాతం) చొప్పున యాడ్ అయ్యాయి. అయితే నిఫ్టీ 50 షేర్లలో భాగమైన స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఫ్యూచర్లలో ఓఐ తగ్గింది. బీవోబీ 2 శాతం పెరిగినప్పటికీ, ఎస్బీఐ స్వల్పంగా తగ్గింది. -
పథకాలన్నీ కలిస్తేనే పొదుపు..
సంక్షోభాల్లో బంగారం సంక్షోభాల్లో బంగారం అక్కరకు వస్తుందనేది చాలామంది వాదన. అందుకే దేశీయంగా లేదా అంతర్జాతీయంగా ఏదైనా ఆర్థిక సంక్షోభం వస్తే బంగారంలో ఇన్వెస్ట్ చేయడం మేలని సూచిస్తారు. కాని ఇందులో చాలా మంది ప్రజల్లో నెలకొన్న భయాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే అలా సలహా ఇస్తారు కాని, నిజంగా ఆ ఇన్వెస్టర్‌కి బంగారం ఉపయోగకరంగా ఉందా లేదా అన్న అంశాన్ని పరిశీలించరు. ఈక్విటీలు, డెట్ పథకాలు మాదిరే పుత్తడి కూడా ఒక విలువైన ఇన్వెస్ట్మెంట్ సాధనమే. ప్రతీ ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో బంగారం ఉండే విధంగా చూసుకోవాలి. అంతే కాని మొత్తం పెట్టుబడి అంతా బంగారంలోకి మార్చేయకూడదు. సాధారణంగా మొత్తం పెట్టుబడుల విలువలో బంగారం వాటా 5-10 శాతం వరకు ఉంటే సరిపోతుంది. సంక్షోభ సమయాల్లో కూడా ఈ వాటాలో ఎలాంటి మార్పులు ఉండవు. ఒకవేళ ఇప్పటికే మీ పోర్ట్‌ఫోలియోలో బంగారం తగినంత ఉంటే... పుత్తడిలో పెట్టుబడులు పెట్టండి అంటూ వచ్చే సూచనలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బాండ్స్ మేలు దేశ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడికి లోనవుతున్నప్పుడు బాండ్స్‌లో పెట్టుబడి పెడితే కనీసం అసలుకు రక్షణ ఉంటుందని చాలా మంది భావిస్తారు. కాని ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాల సమయంలో దీర్ఘకాలిక బాండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా నష్టాలను అందిస్తాయి. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు, రూపాయి-డాలర్ కదలిక, కరెంట్ అకౌంట్ లోటు వంటి అనేక కీలక గణాంకాలు బాండ్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి సంక్షోభ సమయంలో లాంగ్‌టర్మ్ బాండ్స్, డెట్ పథకాలు సురక్షితమైనవన్న వాదన నిజం కాదు. వీటిల్లో కూడా నష్టాలు ఉంటాయన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. రేటింగ్ ఫండ్స్ బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల వలే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ పథకాలకు కూడా రేటింగ్‌ను ఇస్తున్నారు. గత కొంత కాలంగా పథకాలు అందించిన రాబడుల ఆధారంగా ఈ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాని ఫైవ్‌స్టార్ రేటింగ్ ఉన్న పథకం ఆ తర్వాతి కాలంలో కూడా అదే విధమైన లాభాలను గ్యారంటీగా అందిస్తుందన్న శాస్త్రీయ ఆధారం ఏదీ లేదు. రేటింగ్ తర్వాత ఆ పథకం అంతకంటే ఇంకా మెరుగైన లాభాలు అందించొచ్చు లేకపోతే నష్టాలను కూడా ఇవ్వొచ్చు. మరి రేటింగ్‌తో కలిగే ప్రయోజనం ఏమిటంటే... ప్రస్తుతం బాగా పనిచేస్తున్న పథకాలను సాకల్యంగా పరిశీలించే వీలుకలుగుతుంది. వీటిలో మీ పోర్ట్‌ఫోలియోకు సరిపడే పథకాన్ని ఎంచుకుంటే సరిపోతుంది. ఈక్విటీలూ ఉండాల్సిందే ఒక్కసారి మార్కెట్లు పడటం మొదలైతే లాభాలన్నీ హరించుకుపోవడమే కాకుండా భారీ నష్టాలు కూడా వస్తాయన్న ఉద్దేశంతో చాలా మంది ఈక్విటీల గురించి భయపడుతుంటారు. కాని ఇవి ద్రవ్యోల్బణం వంటి సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాయన్న అంశాన్ని గుర్తించరు. ఉదాహరణకు సగటు ద్రవ్యోల్బణం (అంటే ధరల పెరుగుదల) 6 శాతం, ఫిక్స్డ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 8 శాతం ఉందనుకుందాం. ఈ పరిస్థితుల్లో నికరంగా మీకు వచ్చే వడ్డీ రెండు శాతం మాత్రమే. ఇక్కడ అసలుకు ఎటువంటి ఢోకా ఉండదు కాని ద్రవ్యోల్బణం వల్ల మీ కొనుగోలు శక్తి క్రమేపీ తగ్గిపోతుంటుంది. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి బ్యాలెన్సింగ్‌గా మీ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీలకు కూడా చోటు కల్పించండి.