పెట్టుబడిని బట్టే రాబడి. అదే అధిక రాబడి కావాలంటే... అక్కడ రిస్క్ కూడా అధికంగానే ఉంటుంది. కాకపోతే తక్కువ రిస్క్‌తో కాస్తంత ఎక్కువ రాబడులనిచ్చే పథకాలు కూడా మార్కెట్లో చాలానే ఉన్నాయి. వయో వృద్ధులకు, కాస్త క్రమానుగతంగా పొదుపు చేసే వారికి, తమ పెట్టుబడిని పోగొట్టుకునే పరిస్థితిలో లేమని భావించేవారికి... ఇలాంటివారికి ఈ పథకాలు అనువుగా ఉంటాయి. అవన్నీ వివరించేదే ఈ ప్రాఫిట్ ప్లస్ కథనం...
గడిచిన మూడేళ్లలో స్థిరాదాయం కోసం ఈక్విటీలను నమ్ముకున్న సీనియర్ సిటిజన్లకు (వృద్ధులు) రాబడులు బాగానే వచ్చాయి. సురక్షిత సాధనాల్లో రాబడులు క్షీణించిపోవడంతో రిస్క్ సాధనాలైన ఈక్విటీ సేవింగ్స్ పథకాలు, బ్యాలన్స్‌డ్ ఫండ్స్ తదితర వాటిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. సంప్రదాయ స్థిరాదాయ పథకాల వడ్డీ రేట్లు మూడేళ్ల తర్వాత మళ్లీ మెల్లగా పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో ఆర్‌బీఐ కీలక రేట్ల తగ్గింపునకు బ్రేక్ వేసింది. 2017 ఆగస్ట్ నుంచి యథాతథ స్థితినే కొనసాగిస్తూ వస్తోంది. రానున్న ఏడాదిలో వడ్డీ రేట్లను పెంచొచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. బ్యాంకులు ఇప్పటికే మెల్లగా రేట్ల పెంపును ప్రకటిస్తూ ఉండగా... ఈ రేట్ల పెంపును బాండ్ల మార్కెట్ ఇప్పటికే సర్దుబాటు కూడా చేసేసుకుంది. బాండ్ల మార్కెట్‌కు బెంచ్ మార్క్ అయిన పదేళ్ల ప్రభుత్వ బాండ్ల రాబడులు 130 బేసిస్ పాయింట్ల మేర పెరిగి 7.5 శాతానికి చేరాయి. దీంతో మార్కెట్లో ఇతరులు కూడా దీన్ని అనుసరించక తప్పదు. ఈ నేపథ్యంలో బ్యాంకులు, కంపెనీలు రానున్న నెలల్లో కనీసం పదేళ్ల బాండ్ల ఈల్డ్ స్థాయికి అయినా రేట్లను పెంచక తప్పని పరిస్థితి ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రిస్క్ వద్దనుకునే సీనియర్ సిటిజన్లు స్థిరాదాయం కోసం ఈక్విటీలు కాకుండా ఇతర సాధనాలతో పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.
బ్యాంకు ఎఫ్‌డీలు...
రానున్న కాలంలో వడ్డీ రేట్ల పెరుగుదల అవకాశాల నేపథ్యంలో స్థిరాదాయం కోరుకునే సీనియర్ సిటిజన్లు దీర్ఘకాలిక డెట్ సాధనాలకు బదులు బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లను పరిశీలించొచ్చు. మూడు నెలల నుంచి ఏడాది కాలానికి కూడా వీటిలో ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఏడాది కాలానికి చాలా బ్యాంకులు మంచి రేటునే ఆఫర్ చేస్తున్నాయి. దీర్ఘకాలానికి ఎఫ్‌డీలపై తక్కువ రేటు ఉంది. కనుక ఆరు నెలల నుంచి ఏడాది కాలానికి ఎఫ్‌డీలను ఆశ్రయించొచ్చు. సెక్షన్ 80టీటీబీ కింద సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు పైబడిన వారు) ఏడాదిలో వడ్డీ ఆదాయం రూ.50,000 వరకూ ఎలాంటి పన్నూ విధించకుండా తాజా బడ్జెట్లో రాయితీ ఇవ్వటం ఆకర్షణీయం. అంటే రూ.50,000 వరకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత/ బ్యాంకు స్థాయిలో) ఉండదు. కమర్షియల్ బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసు డిపాజిట్లపై ఈ మినహాయింపు ఉంటుంది. అయితే, కోపరేటివ్ బ్యాంకుల్లో ఎఫ్‌డీలు రిస్క్‌తో కూడినవి. అలాగే, పోస్టాఫీసులో డిపాజిట్లపై వడ్డీ ఆదాయం 6.6 శాతం స్థాయిలోనే ఉంది. వీటికంటే బ్యాంకు డిపాజిట్లు మెరుగ్గా ఉన్నాయి. కోటక్ మహింద్రా బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అధిక రాబడులను ఆఫర్ చేస్తున్నాయి.
ఐడీఎఫ్‌సీ బ్యాంకు 366 రోజుల డిపాజిట్‌పై సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. కోటక్ మహింద్రా బ్యాంకు 390 రోజుల కాల వ్యవధి కలిగిన బ్యాంకు డిపాజిట్‌పై 7.35 శాతం వడ్డీని అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఈ రేటు 7.25 శాతంగా ఉంది. ఈ మూడు బ్యాంకులు కూడా నెలవారీ, త్రైమాసిక వారీ వడ్డీ ఆదాయం చెల్లింపు ఆప్షన్ అందిస్తున్నాయి. 7.25 శాతం వడ్డీ రేటుపై సీనియర్ సిటిజన్లకు రూ.7 లక్షల డిపాజిట్‌పై ఏటా రూ.50,000 ఆదాయం లభిస్తుంది. కాకపోతే పన్ను చెల్లించాల్సిన ఆదాయం ఉన్న సీనియర్ సిటిజన్లు ముందుగా కొత్తగా ప్రవేశపెట్టిన రూ.50,000 వడ్డీ ఆదాయం మినహాయింపును ఉపయోగించుకోవడం ద్వారా పన్ను రహిత ఆదాయం పెంచుకోవచ్చు.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్
మిగతా పథకాలపై వడ్డీ రేట్లు తగ్గిపోగా, పోస్టాఫీసు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్‌సీఎస్‌ఎస్) ఇప్పటికీ అధిక స్థాయిలో 8.3 శాతం వార్షిక రాబడులను ఆఫర్ చేస్తోంది. మార్కెట్ రేట్ల కంటే ఇది ప్రీమియం రేటే. ఈ పథకంలో ఏడాది తర్వాత కార్పస్‌పై 1.5 శాతం పెనాల్టీ చెల్లించడం ద్వారా పెట్టుబడులను వెనక్కి తీసుకునే సౌలభ్యం కూడా ఉంది. కనుక ఐదేళ్ల కాల వ్యవధి కలిగిన ఈ పథకాన్ని సీనియర్ సిటిజన్లు స్థిరమైన రాబడుల కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. కాకపోతే ఈ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఆదాయపన్ను చట్టం కింద వార్షికంగా రూ.3 లక్షల ఆదాయం వరకు సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపు ఉన్నందున ఎక్కువ మందికి పన్ను పరమైన ఇబ్బందేమీ ఉండదు. పైగా సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పెట్టుబడి వరకూ దీనికి మినహాయింపు ఉంది.
ఈ అవకాశాలు కూడా చూడొచ్చు...
సీనియర్ సిటిజన్లకు ఆర్‌బీఐ కొత్తగా తీసుకొచ్చిన 7.75 శాతం ప్రభుత్వ బాండ్లు లేదా ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల బాండ్ల ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఆర్‌బీఐ 7.75 శాతం బాండ్లు గతంలో ఉన్న 8 శాతం వడ్డీ రేట్ల బాండ్ల స్థానంలో తీసుకొచ్చినవి. భద్రత పరంగా ఢోకా లేనివి ఇవి. కాకపోతే దీనిపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. టీడీఎస్ కూడా వర్తిస్తుంది. ఇతర సంప్రదాయ సాధనాల కంటే కాస్త మెరుగైన రాబడులకు ఇందులో హామీ ఉంటుంది. ఎస్‌బీఐతోపాటు పలు ఇతర జాతీయ బ్యాంకుల నుంచి వీటిని డీమ్యాట్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఏడేళ్ల పాటు లాకిన్ పీరియడ్ ఉండడం ప్రతికూలత. 60–70 ఏళ్ల వయసులో ఉన్న వారు ఆరేళ్ల తర్వాత ఉపసంహరణకు అవకాశం ఉంది. అదే 70 ఏళ్లు దాటిన వారు అయితే ఐదేళ్ల తర్వాత, 80 ఏళ్ల వారు నాలుగేళ్ల తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. దీర్ఘకాలం పాటు లాకిన్ పీరియడ్ ఉండడం అన్నది మారే వడ్డీ రేట్ల నేపథ్యంలో ప్రతికూలతగానే చూడాల్సి ఉంటుంది.
కొంచెం రిస్క్ అయినా ఫర్వాలేదనుకుంటే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) అందించే బాండ్లను పరిశీలించొచ్చు. ఏఏఏ రేటింగ్ ఉన్న బాండ్లను స్వల్ప కాలం కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎం అండ్ ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఏడాదికి 7.5 శాతం), హెచ్‌డీఎఫ్‌సీ (7.4 శాతం), బజాజ్ ఫైనాన్స్ (7.6 శాతం) బాండ్లను రాబడులు, కాస్తంత భద్రత ఉన్నవాటిగా పరిగణించొచ్చు. వీటికి లాకిన్ పీరియడ్ లేకపోవడం అనుకూలత. కావాలనుకున్నప్పుడు పెట్టుబడులు వెనక్కి తీసుకోవచ్చు. ఎల్‌ఐసీ పదేళ్ల వయవందన యోజనలో పెట్టుబడుల పరిమితిని పెంచుతామని తాజా బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. అది అందుబాటులోకి వచ్చినప్పుడు వీటిలో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుని నచ్చిన వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment