Senior Citizens Saving Scheme
-
చిన్న మొత్తాల పొదుపు పథకాల నిబంధనల్లో మార్పులు
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలలో కొన్నింటికి సంబంధించినిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం కీలక సవరణలు తెచి్చంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), టైమ్ డిపాజిట్ల పథకాల నిబంధనల్లో మార్పులు చేసింది. నూతన నోటిఫికేషన్ ప్రకారం.. పదవీ విరమణ ప్రయోజనాలు (నిధులు) చేతికి అందిన రోజు నుంచి మూడు నెలల వరకు ఎస్సీఎస్ఎస్ ఖాతా ప్రారంభించడానికి అవకాశం లభించింది. ఇప్పటి వరకు ఇది ఒక నెలగానే అమల్లో ఉంది. 55 ఏళ్ల నుంచి 60 ఏళ్లు దాటని వారికే ఇది వర్తిస్తుంది. ఎస్సీఎస్ఎస్ డిపాజిట్ ఐదేళ్ల కాల వ్యవధి ముగిసిన అనంతరం రెన్యువల్ చేసుకునే వారికి అప్పుడు అమల్లో ఉన్న వడ్డీ రేటును అమలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగి (కేంద్ర, రాష్ట్ర) అయి, 50 ఏళ్లు నిండిన అనంతరం మరణించినట్టయితే, అప్పుడు వచ్చే ప్రయోజనాలను జీవిత భాగస్వామి ఎస్సీఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెట్టుబడి పెట్టి ఏడాదిలోపు వెనక్కి తీసుకుంటే డిపాజిట్లో ఒక శాతాన్ని మినహాయిస్తారు. ఎస్సీఎస్ఎస్ డిపాజిట్‌ను ఐదేళ్లు ముగిసిన తర్వాత మరో మూడేళ్ల కాలానికి రెన్యువల్ చేసుకోవచ్చు. ఇక నుంచి అలా ప్రతి మూడేళ్లకోసారి రెన్యువల్ చేసుకుంటూ వెళ్లొచ్చు. అలాగే, పీపీఎఫ్ ఖాతాను ముందస్తుగా మూసివేయడానికి సంబంధించిన నిబంధనల్లో మార్పులు తెచ్చింది. ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌ను నాలుగేళ్లు ముగిసిన తర్వాత వెనక్కి తీసుకుంటే, పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతాకు అమలయ్యే వడ్డీ రేటునే చెల్లిస్తారు. ప్రస్తుతం నాలుగేళ్ల తర్వాత ఉపసంహరించుకుంటే మూడేళ్ల కాలానికి అమలయ్యే రేటును ఇస్తున్నారు. -
సీనియర్ సిటిజన్లకు రైలు చార్జీల్లో రాయితీ పునరుద్ధరించాలి
న్యూఢిల్లీ: రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు చార్జీల్లో అందించే రాయితీని తిరిగి పునరుద్ధరించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 60 ఏళ్లు పైబడిన పురుషులకు 40 శాతం, 58 ఏళ్లు దాటిన మహిళలకు టికెట్ ధరలో 50 శాతం చొప్పున అన్ని రైళ్లలోని అన్ని తరగతుల్లోనూ రాయితీ ఉండేది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి 20 నుంచి దీన్ని రద్దు చేశారు. బీజేపీ ఎంపీ రాధా మోహన్ సింగ్ సారథ్యంలోని రైల్వే శాఖ స్టాండింగ్ కమిటీ డిమాండ్ ఫర్ గ్రాంట్లపై సోమవారం పార్లమెంట్‌కు సమర్పించిన 14వ నివేదికలో దీన్ని ప్రస్తావించింది. ఈ రాయితీని పునరుద్ధరించాలని కోరింది. కనీసం స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీకైనా వర్తింపజేయాలని సూచించింది. అయితే అలాంటి యోచనేదీ లేదని రైల్వే శాఖ గతంలోనే స్పష్టం చేసింది. ప్రయాణికులకు ఇప్పటికే టికెట్ ధరపై 55 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది. వందేభారత్ రైళ్ల ఉత్పత్తిపై ఆందోళన వందేభారత్ రైళ్ల తయారీ మందగమనంపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘2022–23లో 35 రైళ్లు తయారవాల్సి ఉండగా ఇప్పటిదాకా కేవలం 8 రైళ్లే సిద్ధమయ్యాయి. లక్ష్యాన్ని చేరుకోవాలన్నా, రైలు ప్రయాణికుల ఆకాంక్షలు నెరవేరాలన్నా వందేభారత్ రైలు ఇంజన్లు, బోగీల తయారీ వేగాన్ని ముమ్మరం చేయాలి. ఇందుకోసం పలు ప్రాంతాల్లోని ఉత్పత్తి కేంద్రాలకు రైల్వేశాఖ సాంకేతిక తోడ్పాటు అందించాలి’’ అని సూచించింది. -
పన్ను భారం తగ్గించుకోవాలంటే..
వేతన జీవులకు ఆదాయపన్ను చట్టంలోని పలు సెక్షన్లు గణనీయంగా పన్ను మినహాయింపులు ఇస్తున్నాయి. పాత పన్ను విధానంలో రూ.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేకపోగా, అందుబాటులోని అన్ని మినహాయింపులు, తగ్గింపు ప్రయోజనాలను వినియోగించుకుంటే మరో రూ.5 లక్షల ఆదాయంపైనా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే తమ ఆదాయం, పన్ను బాధ్యతలకు అనుగుణంగా ప్రణాళిక వేసుకుని, పెట్టుబడులు చేసుకోవడం మెరుగైన మార్గం. కానీ, చాలా మందికి ఇది ఆచరణలో అసాధ్యంగా ఉంటుంది. ఆర్థిక సంవత్సరం చివరిలోనే పన్ను ఆదా బాధ్యతలపై ఎక్కువ మంది దృష్టి సారిస్తుంటారు. ఈ సమయంలో పన్ను భారం తగ్గించుకునేందుకు అందుబాటులో ఉన్న సాధనాలపై కథనం ఇది. ఏడాది చివర్లో వ్యవధి తక్కువగా ఉన్నప్పుడు, హడావిడిగా చేసే పెట్టుబడుల్లో తప్పులకు చోటు ఇవ్వకూడదు. అదే సమయంలో పన్ను ఆదా ఒక్కటే ప్రామాణిక అంశం కూడా కాకూడదు. ఒకవైపు పన్ను ఆదా ప్రయోజనాన్ని ఇస్తూనే, మరోవైపు చేసిన పెట్టుబడి మంచి ప్రతిఫలాన్ని కూడా అందించేలా ఉండాలి. పైగా మనలో కొందరు చిన్న వయసులో ఉంటారు. మరికొందరు మధ్య వయసులో, కొందరు రిటైర్మెంట్కు దగ్గర్లో ఉండొచ్చు. కొందరి ఆర్జన మెరుగ్గా, కొందరి ఆర్జన మధ్యస్థంగా, తక్కువగాను ఉండొచ్చు. ఆదాయానికి అనుగుణంగా తీసుకునే రిస్క్ సామర్థ్యం మారిపోతుంటుంది. ఉదాహరణకు ఈఎల్ఎస్ఎస్ అన్నది సెక్షన్ 80సీ కింద అర్హత కలిగిన పన్ను సాధనాల్లో ఒకటి. అచ్చం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే ఈ సాధనంలో పెట్టుబడులపై రాబడి దీర్ఘకాలంలో ఏటా 12 శాతానికి పైనే లభిస్తుంది. ఇందులో వ్యయాలు చాలా తక్కువ. మూడేళ్ల లాకిన్ పీరియడ్ ముగిసిన తర్వాత లిక్విడిటీ సమస్యే ఉండదు. కానీ, కొందరికి ఈక్విటీలు నచ్చకపోవచ్చు. కొందరికి పెట్టుబడులు అన్నింటినీ ఈక్విటీలకు కేటాయించడం ఇష్టం లేకపోవచ్చు. అందుకనే అందుబాటులో సాధనా లు, వాటి మంచి చెడులను అర్థం చేసుకుంటే, ఇన్వెస్టర్లు తమకు నచ్చినవి ఎంపిక చేసుకోవచ్చు. ఎన్పీఎస్– మూడు ప్రయోజనాలు ఇందులో రాబడులు గడిచిన ఐదేళ్ల కాలంలో వార్షికంగా 8–11 శాతం మధ్య ఉన్నాయి. ఇందులో చేసే పెట్టుబడులు రిటైర్మెంట్ వరకు లాకిన్లోనే ఉంటాయి. డెట్ నుంచి ఈక్విటీ, ఈక్విటీ నుంచి డెట్‌కు అలోకేషన్‌ను మార్చుకునే సౌలభ్యం ఉంది. ఎన్పీఎస్కు సంబంధించి మూడు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలను ఇందులో ఇన్వెస్ట్ చేసి, ఆ మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 మొత్తంపై అదనపు పన్ను మినహాయింపు కూడా అందుబాటులో ఉంది. ఉద్యోగి మూలవేతనం, డీఏలో 10 శాతాన్ని ఎన్పీఎస్కు కంపెనీలు జమ చేస్తే, ఆ మొత్తంపైనా పన్ను ఉండదు. సెక్షన్ 80సీసీడీ (2) కింద ఈ ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. కనుక ఎన్పీఎస్ ఇచ్చే ప్రయోజనాలతను వేరొక సాధనంతో పోల్చడం సరికాదు. ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ, కార్పొరేట్ బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ (గిల్ట్ ఫండ్స్) అనే మూడు కేటగిరీలు ఉంటాయి. ఇన్వెస్టర్లు ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతం మించకుండా కేటాయింపులు చేసుకోవచ్చు. మిగిలిన రెండింటిలో నూరు శాతం కేటాయింపులకు అనుమతి ఉంది. మూడింటి మధ్య తమ రిస్క్‌స్థాయిని బట్టి కేటాయింపుల్లో మార్పులు చేసుకోవచ్చు. ఏడాదిలో నాలుగు సార్లు ఇలా చేసుకునేందుకు అనుమతి ఉంది. పనితీరు నచ్చకపోతే ఫండ్ మేనేజర్లను కూడా మార్చుకోవచ్చు. మార్కెట్ల పట్ల అవగాహన ఉన్న వారికి ఇది అనుకూలమైన టూల్. వీటికి అదనంగా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ విభాగం కూడా ఉంది. జీవిత బీమా పథకాలు జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లలో రాబడి దీర్ఘకాలానికి 5 శాతంగా ఉంటుంది. పన్ను ఆదా కోసం ఇది మెరుగైన ఎంపిక కాదు. దీనికంటే కూడా యులిప్‌లు మెరుగైనవి. లేదంటే ఈఎల్ఎస్ఎస్, పీపీఎఫ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. బీమా ఎండోమెంట్ ప్లాన్లలో జీవిత బీమా కవరేజీ కూడా చెల్లించే ప్రీమియానికి నామమాత్రంగానే ఉంటుంది. రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ రూ.12,0000 ప్రీమియానికి వస్తుంది. కానీ, ఎండోమెంట్ ప్లాన్‌లో రూ.50 లక్షల కవరేజీ కావాలంటే ఏటా రూ.4–5 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. జీవితానికి రక్షణ కోణంలోనే బీమా ఉత్పత్తులు కొనుగోలు చేయాలి. ఎన్ఎస్సీ, పన్ను ఆదా ఎఫ్డీలు ఎన్ఎస్సీలను పోస్టాఫీసు నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. పన్ను ఆదా ఎఫ్డీని బ్యాంకుల్లో తీసుకోవచ్చు. రెండింటిలోనూ లాకిన్ పీరియడ్ ఐదేళ్లు. ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీపై డీసీబీ బ్యాంక్ అత్యధికంగా 8.10 శాతం రేటును ఆఫర్ చేస్తుంటే, యాక్సిస్ బ్యాంక్ రూ.7.75 శాతం ఇస్తోంది. మిగిలిన బ్యాంకుల్లో 6.70 శాతం నుంచి 7.50 శాతం మధ్య రేట్లు ఉన్నాయి. పన్ను ఆదా ఎఫ్డీ అంటే పెట్టుబడిపైనే. వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఎన్ఎస్సీ కేవలం పోస్టాఫీసులోనే కొనుగోలు చేసుకోగలరు. దీంతో పోలిస్తే ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీని బ్యాంకుల్లో ప్రారంభించడం, క్లోజ్ చేసుకోవడం సులభం. కొన్ని బ్యాంక్‌లు ఆన్‌లైన్‌లోనూ ఆఫర్ చేస్తున్నాయి. ఎన్ఎస్సీలో ప్రస్తుతం 7 శాతం రేటు అమల్లో ఉంది. ఎన్ఎస్సీలో పెట్టుబడిని సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. యులిప్‌లు యులిప్‌లలో గడిచిన ఐదేళ్ల కాలంలో వార్షిక రాబడి 8–9 శాతం మధ్య ఉంది. యులిప్ అన్నది ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసే బీమా సాధనం. బీమా సంస్థలు ఒకవైపు పాలసీదారులకు బీమా రక్షణ ఇస్తూ.. మరోవైపు ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టి, వచ్చిన రాబడిని పంచుతాయి. యులిప్లోనూ ఎన్‌పీఎస్‌లో మాదిరే ఈక్విటీ, డెట్ మధ్య కేటాయింపులను మార్చుకునే సౌలభ్యం ఉంది. ఇలా మార్చుకుంటే పన్ను కట్టక్కర్లేదు. ఈక్విటీల విలువలు గరిష్టాలకు చేరినప్పుడు డెట్‌కు మారి, మార్కెట్లు దిద్దుబాటుకు గురైనప్పుడు తిరిగి ఈక్విటీల్లోకి పెట్టుబడులను మళ్లించుకోవచ్చు. రాబడులపై పన్ను లేకపోవడం మరో ఆకర్షణీయ అంశం. యులిప్‌లో పెట్టుబడులపై ఐదేళ్ల పాటు లాకిన్ ఉంటుంది. ఆ తర్వాత కోరుకున్నప్పుడు పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో మాదిరి ఇందులో ఫండ్ మేనేజర్‌ను మార్చుకోవడానికి అవకాశం లేదు. యులిప్‌ను జీవితంలో ముఖ్యమైన లక్ష్యాల కోసం పెట్టుబడి సాధనంగా ఉపయోగించుకోవచ్చు. వార్షిక పెట్టుబడితో పోలిస్తే జీవిత బీమా కవరేజీ కనీసం 10 రెట్లు ఉంటే సెక్షన్ 10(10డీ) కింద మెచ్యూరిటీ సమయంలో తీసుకునే మొత్తంపైనా పన్ను ఉండదు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఇది ఐదేళ్ల పథకం. తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఇందులో వడ్డీ రేటు ప్రస్తుతం 8 శాతంగా ఉంది. 60 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి (త్రైమాసికం ఆరంభంలో) ఆదాయం అందుకునేందుకు ఇది అనుకూలం. ఇందులో పెట్టుబడులను సెక్షన్ 80సీ కింద చూపించి మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. కాకపోతే 60 ఏళ్లు నిండిన వారికి ఏటా రూ.50 వేల వరకు వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు అమల్లో ఉంది. అంటే ఈ పథకంలో రూ.6.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక ఏడాదిలో రూ.50,000 పన్ను లేని ఆదాయం అందుకోవచ్చు. వార్షికాదాయం రూ.50వేలు మించితే టీడీఎస్ అమలు చేస్తారు. పీపీఎఫ్ ఇందులో ప్రస్తుత వడ్డీ రేటు 7.1 శాతం. పెట్టుబడులు 15 ఏళ్ల పాటు లాకిన్‌లో ఉంటాయి. పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. పెట్టుబడి, రాబడి, ఉపసంహరణ ఇలా ఏ దశలోనూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేని సాధనం ఇది. కనుక స్థిరాదాయ పథకాలతో పోలిస్తే మెరుగైనది. బ్యాంక్ ఎఫ్‌డీలపైనా ఇంతే వడ్డీ రేటు లభిస్తున్నప్పటికీ, అది పన్ను పరిధిలోకి వస్తుంది. పీపీఎఫ్‌ను అన్ని ప్రభుత్వరంగ, ప్రైవేటు వాణిజ్య బ్యాంకుల్లో ప్రారంభించొచ్చు. పోస్టాఫీసులోనూ దీన్ని తెరవొచ్చు. బ్యాంకుల్లో మరింత సౌకర్యంగా ఉంటుంది. సొంత ఖాతా నుంచే పీపీఎఫ్ కంట్రిబ్యూషన్ బదిలీ చేసుకోవచ్చు. కోరుకున్నప్పుడు ఈ–స్టేట్మెంట్ తీసుకోవచ్చు. ఆరో ఏట తర్వాత పాక్షిక ఉపంసహరణకు అనుమతి ఉంటుంది. నాలుగో ఏడాది చివరి నాటికి ఉన్న బ్యాలన్స్నుంచి సగం తీసుకోవచ్చు. 15 ఏళ్ల కాల వ్యవధి తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. మూడో ఏట నుంచి ఆరో ఏట వరకు బ్యాలన్స్‌పై రుణం తీసుకునే సదుపాయం కూడా ఉంది. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తుత వడ్డీ 7.6%. కుమార్తెల పేరిట ప్రారంభించి, పెట్టుబడులు పెట్టుకునే పథకం ఇది. వారికి 18 ఏళ్లు వచ్చే వరకు దీన్ని కొనసాగించుకోవచ్చు. పదేళ్లలోపు ఆడపిల్లలను కలిగిన తల్లిదండ్రులు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. ఏటా రూ.1.50 లక్షల పెట్టుబడిపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. గడువు ముగిసిన తర్వాత తీసుకునే మొత్తంపైనా పన్ను ఉండదు. ఈ పథకంలో వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంటుంది. బ్యాంకు శాఖలు, తపాలా కార్యాలయాల్లో ప్రారంభించుకోవచ్చు. కనీస పెట్టుబడి రూ.1,000. గరిష్టంగా ఇద్దరు కుమార్తెల పేరిట దీన్ని తెరుచుకునేందుకు అనుమతి ఉంది. ఇద్దరి పేరిట ఖాతాలు తెరిచినా సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలకే పన్ను మినహాయింపు కోరగలరు. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ వీటిల్లో గత మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక రాబడులు 7–13 శాతం మధ్య ఉన్నాయి. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను సైతం సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్ పథకాలు పెట్టుబడుల్లో 40 శాతాన్ని ఈక్విటీలకు, 55–60 శాతాన్ని డెట్ సాధనాలకు కేటాయిస్తుంటాయి. ఫ్రాంక్లిన్ పెన్షన్ ఫండ్, యూటీఐ రిటర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ఫండ్ ఇందుకు ఉదాహరణలు. వీటిల్లో రిస్క్ తక్కువ. తక్కువ రిస్క్ ఉండాలని కోరుకునే ఇన్వెస్టర్లు రిటైర్మెంట్ కోసం వీటిల్లో ఇన్వెస్ట్ చేసి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వీటిల్లో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. రాబడి మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది. డెట్‌కు ఎక్కువ కేటాయింపులు చేస్తే, డెట్ ఫండ్స్ మాదిరిగా లాభంపై 20 శాతం పన్ను చెల్లించాలి. లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించొచ్చు. -
రానున్న బడ్జెట్లో ఆ పథకాలకు పెద్ద పీట, వారికి బిగ్ బూస్ట్
న్యూఢిల్లీ: రానున్న కేంద్ర బడ్జెట్లో సీనియర్ సిటిజన్ సేవింగ్, ఇతర స్మాల్ సేవింగ్ పథకాలకు ఊరట లభించనుందా అంటే అవుననే సంకతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రానున్న ఎన్నికలు, బీజేపీ నేతృత్వంలోని మోదీ సర్కార్‌కు ఈ దఫా చివరి బడ్జెట్ నేపథ్యంలో చిన్న పెట్టుబడిదారులకు భారీ ఉపశమనం లభించనుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. సుకన్య సమృద్ధి యోజన, ఇతర చిన్న పొదుపు పథకాలు పెద్ద ప్రోత్సాహాన్ని అందించే అవకాశం ఉందనే ఊహాగానాలున్నాయి. ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ బడ్జెట్ 2023లో ఆర్థిక లోటును పూరించుకునేందుకు ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై ఆధారపడే అవకాశం ఉందని, వాటి నుండి దాదాపు రూ. 5 లక్షల కోట్లు సేకరించవచ్చని అంచనా. సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న పొదుపు పథకం 2023-24 కోసం రాబోయే కేంద్ర బడ్జెట్లో ఊపందుకోవచ్చని ఎస్బీఐ రీసెర్చ్ ఒక నివేదికలో పేర్కొంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) వంటి చిన్న పొదుపు పథకాలకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభించే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈ పథకం 7.6 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ప్రభుత్వం ఇటీవల చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచినా ఇందులో ఎస్‌ఎస్‌వైని చేర్చకపోవడం గమనార్హం. సుకన్య సమృద్ధి యోజన చిన్న పొదుపు పథకాలలో సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్వై) ఒకటి. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో ప్రారంభించింది. 10 సంవత్సరాల లోపు ఆడబిడ్డ ఉన్న తల్లిదండ్రులు ఈ పథకంలో చేరడానికి అర్హులు. ఈ పథకంలో కేవలం రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అలాగే ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ ప్రకారం మొత్తం రూ. 1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఏదైనా అధీకృత బ్యాంకు లేదా పోస్టాఫీసులో సుకన్య సమృద్ధి ఖాతాను తెరవవచ్చు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన చిన్న మొత్తాల పొదుపు పథకం. 60 యేళ్లకు మించిన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే ముందస్తు పదవీ విరమణ చేసిన 55 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వారు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం దీనిపై 8 శాతం వరకు వడ్డీ రేటు అందిస్తోంది. అలాగే ఈ స్కీంలో ఆదాయపు పన్ను సెక్షన్ 80 సీ కింద పెట్టుబడిపై రూ .1.50 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రైళ్లలో వృద్ధులకు రాయితీలు ఇప్పుడే కాదు: కేంద్రం
న్యూఢిల్లీ: రైల్వేలపై ఖర్చుల భారం విపరీతంగా పెరిగిపోతోందని ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. గతేడాది ప్యాసింజర్ సేవలకు రూ.59,000 కోట్ల రాయితీలు ఇచ్చామని, పెన్షన్లు, జీతాల బిల్లు భారీగానే ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రైళ్లలో వృద్ధులకు రాయితీలను ఇప్పట్లో పునరుద్ధరించే అవకాశం లేదని పరోక్షంగా చెప్పారు. వాటిని కరోనా సమయంలో రద్దు చేయడం తెలిసిందే. ‘‘ప్రయాణికుల సేవలకు ఏటా రూ.59,000 కోట్ల రాయితీలివ్వడం మామూలు విషయం కాదు. పైగా రూ.60,000 కోట్ల పెన్షన్ బిల్లు, రూ.97,000 కోట్ల జీతాల బిల్లు, రూ.40,000 కోట్ల ఇంధన ఖర్చు భరించాల్సి వస్తోంది. కొత్త నిర్ణయాలు తీసుకొనే ముందు రైల్వేల ఆర్థిక పరిస్థితినీ పరిగణనలోకి తీసుకోవాలి’’ అని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: AP: 8.22లక్షల మందికి సున్నా వడ్డీ రాయితీ -
ఖాతాదారులకు హెచ్డీఎఫ్సీ శుభవార్త
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ సీనియర్ సిటిజన్లకు శుభవార్త చెప్పింది. కోవిడ్ విజృంభణ సమయంలో అత్యధికంగా వడ్డీ చెల్లించేలా సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ఫిక్స్డ్ డిపాజిట్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఆ స్కీమ్ గడువును పెంచుతున్నట్లు తెలిపింది. సీనియర్ సిటిజన్ల కోసం హెచ్డీఎఫ్సీ మే 18, 2020లో ‘సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీ’ అనే స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఆ ఎఫ్డీ పథంలో చేరిన ఖాతాదారులకు .. సాధారణ డిపాజిట్ల కంటే ఎక్కువగా వడ్డీ చెల్లిస్తుంది. అయితే ఆ పథకంలో చేరే గడువు సెప్టెంబర్ 30,2022తో ముగియగా..తాజాగా ఆ గడువును మార్చి 31,2023 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. 0.25శాతం అదనపు వడ్డీతో మే 18, 2020 నుండి మార్చి 31, 2023 మధ్య కాలంలో సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీలో చేరిన ఖాతాదారులకు ఐదేళ్ల టెన్యూర్, లేదంటే ఒక రోజు నుంచి 10 ఏళ్ల టెన్యూర్ కాలానికి రూ.5కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లపై 0.25శాతం అదనంగా వడ్డీ చెల్లిస్తామని తెలిపింది. తేడా ఎంతంటే ఐదు సంవత్సరాలు, ఒక రోజు నుండి పదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు సాధారణ వడ్డీ రేటు 5.75 శాతం అందిస్తుంది. కానీ సీనియర్ సిటిజన్ కేర్ ఫిక్స్డ్ డిపాజిట్ కింద అదనంగా 6.50 శాతం వడ్డీ రేటును సీనియర్ సిటిజన్లు పొందుతారు. టెన్యూర్ లోపు డ్రా చేస్తే అయితే, పైన పేర్కొన్నట్లుగా ఐదేళ్లలోపు డిపాజిట్లను ప్రీ క్లోజ్ చేసుకుంటే బ్యాంకు లబ్ధి దారులకు చెల్లించే వడ్డీరేటులో ఒకశాతం తగ్గుతుందని, లేదా డిపాజిట్ ఉన్న కాలానికి వర్తించే బేస్ రేటు ఉంటుందని బ్యాంక్ తెలిపింది. చదవండి👉 బ్యాంకులకు అప్పులు ఎగవేసిన కంపెనీలు.. మాఫీ అయిన లక్షల కోట్ల జాబితా ఇదే! -
వృద్ధులకు క్రమం తప్పకుండా వచ్చే ఆదాయ మార్గాలివే!
నా వయసు 62 ఏళ్లు. స్థిరమైన ఆదాయం కోసం నాకు ఉన్న మార్గాలు ఏంటి? – నారాయణ్ విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలంటే అందుకు తగినంత నిధిని సమకూర్చుకుని ఉండాలి. సీనియర్ సిటిజన్లు సహజంగా సంప్రదాయ మార్గాలనే ఎంపిక చేసుకుంటూ ఉంటారు. అత్యవసరాల్లో కావాల్సినప్పుడు వెంటనే పొందే లిక్విడిటీ కూడా ఉండాలని కోరుకుంటారు. ఇన్వెస్ట్ చేయడానికి ముందు ప్రతీ నెలా ఎంత మొత్తం కావాలో నిర్ణయించుకోవాలి. ఇతర మార్గాల ద్వారా ఏదైనా ఆదాయం వస్తుంటే దానిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అద్దె ఆదాయం, పెన్షన్ లేదా మరొకటి కావచ్చు. ఏటా ఎంత మొత్తం పెట్టుబడి నుంచి కావాలో స్పష్టతకు రావాలి. ఒకవేళ ఏటా 4–6 శాతానికంటే ఎక్కువ కోరుకుంటుంటే అంచనాలను తగ్గించుకోవాల్సిందే. ఉదాహరణకు మీ పెట్టుబడి నిధి రూ.కోటి ఉందనుకుంటే వార్షికంగా ఉపసంహరించుకునే మొత్తం రూ.6 లక్షలకు మించి ఉండకూడదు. ఒకవేళ 6 శాతానికి మించి వెనక్కి తీసుకుంటే కనుక ఆ తర్వాతి సంవత్సరాల్లో తక్కువ ఆదాయానికి సిద్ధం కావాల్సిందే. ద్రవ్యోల్బణాన్ని విస్మరించడానికి లేదు. నేడు నెలవారీ ఖర్చులకు రూ.50,000 సరిపోతుంటే.. 5, 10, 15 ఏళ్ల తర్వాత ఈ మొత్తం చాలదు. ఆ సమయంలో ఇంకాస్త అధికంగా కావాల్సి ఉంటుంది. అందుకనే రిటైర్మెంట్ తీసుకున్న వారు ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని రాబడులను ఇచ్చే మార్గాలను చూసుకోవాలి. అందుకని రిటైర్మెంట్ తర్వాత కూడా ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించాలి. అప్పుడే దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం మించి రాబడులకు అవకాశం ఉంటుంది. పెట్టుబడుల మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. 30–40 శాతం చాలు. మిగతా మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల్లోనే ఉంచాలి. ప్రభుత్వ హామీతో కూడిన పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్‌స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), ప్రధానమంత్రి వయవందన యోజన, పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకాలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక ఇన్వెస్టర్ ఈ పథకాలు అన్నింటిలోనూ కలిపి రూ.34.5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని అధిక నాణ్యతతో కూడి డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా 30–40 శాతం మేర ఉండేలా ఏడాదికోసారి పెట్టుబడులను మార్పులు చేసుకోవాలి. డైనమిక్ బాండ్ ఫండ్స్ ఎన్ఏవీ పతనం అవుతుంటే నిశ్చితంగా ఉండొచ్చా? – గాయత్రి డైనమిక్ బాండ్ ఫండ్స్ అన్నవి వాటి నిర్వహణలోని పెట్టుబడులను దీర్ఘకాలం నుంచి స్వల్ప కాలానికి, స్వల్ప కాలం నుంచి దీర్ఘకాలానికి మార్చుకోగల సౌలభ్యంతో ఉంటాయి. ఈ పథకాలు ఎక్కువగా మధ్య కాలం నుంచి దీర్ఘకాలంతో కూడిన పెట్టుబడుల పత్రాలను నిర్వహిస్తుంటాయి. కనుక వడ్డీ రేట్లు పెరిగే తరుణంలో ఈ పథకాలపై ప్రభావం పడుతుంది. ఇది ఎన్ఏవీ క్షీణించడానికి దారితీస్తుంది. ఈల్డ్స్ ఇక్కడి నుంచి ఇంకా పెరిగే అవకాశమే ఉంది. వడ్డీ రేట్లను అన్ని సమయాల్లోనూ ఊహించడం కష్టం. కనుక ఇన్వెస్టర్లు తమ అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టుకోవాలి. స్థిరాదాయ పథకాల్లో కొద్ది తేడాతో ఇంటరెస్ట్ రేట్ కాల్స్‌ను తీసుకునే పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వివిధ కాల వ్యవధుల మధ్య పెట్టుబడులు మారుస్తూ ఎక్కువ రాబడులకు ప్రయత్నించే పథకాల కంటే.. అక్రూయల్ ఇన్‌కమ్‌పై ఆధారపడే నాణ్యమైన పోర్ట్‌ఫోలియోకు ప్రాధాన్యం ఇవ్వాలి. చాలా సందర్భాల్లో షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ అన్నవి డైనమిక్ బాండ్ ఫండ్స్ కంటే మెరుగ్గా పనిచేస్తుంటాయి. ఈ రెండింటి మధ్య 2010 నుంచి ఐదేళ్ల రోలింగ్ రాబడులను పోల్చి చూస్తే ఇదే తెలుస్తుంది. మీరు ఒకవేళ డైనమిక్ బాండ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకుంటే అవి రాబడులు ఇచ్చినా కానీ, ఫండ్ మేనేజర్ పెట్టుబడుల నిర్వహణకు అనుగుణంగా ఆటుపోట్లతో ఉంటాయి. తక్కువ ఆటుపోట్లతో స్థిరమైన రాబడులు కోరుకునే వారు షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. -
పోస్టల్ ఖాతాదారులకు అలర్ట్.. ఆ పథకాలను ఖాతాతో లింకు చేశారా?
చిన్న మొత్తాల్లో పొదుపు చేసే వారికి పోస్ట్ ఆఫీస్ తీసుకొచ్చే పొదుపు పథకాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ఎస్సిఎస్ఎస్, టైమ్ డిపాజిట్ వంటి పొదుపు ఖాతాలలో చాలా మంది పొదుపు చేశారు. ఈ పథకాల ద్వారా చాలా మందికి నెలవారీ, త్రైమాసిక, వార్షికానికి ఒకసారి వడ్డీ లభిస్తుంది. అయితే, వడ్డీని నగదు రూపంలో విత్ డ్రా చేసుకుంటున్నారని గుర్తించిన పోస్టల్ శాఖ ఇటీవల ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం.. 01.04.2022 నుంచి అలా నగదు రూపంలో పొదుపు పథకాల వడ్డీని నగదు రూపంలో విత్ డ్రా చేయలేరు అని పేర్కొంది. పోస్టల్ డిపార్ట్ మెంట్ జారీచేసిన తాజా సర్క్యులర్ ప్రకారం.." ఎమ్ఐఎస్/ఎస్సిఎస్ఎస్/టీడీ ఖాతాల ద్వారా లభించే వడ్డీని 01.04.2022 నుంచి అకౌంట్ హోల్డర్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ లేదా బ్యాంక్ ఖాతాలో మాత్రమే క్రెడిట్ చేయనున్నారు. ఒకవేళ ఖాతాదారుడు తన పొదువు ఖాతాను ఎమ్ఐఎస్/ఎస్సిఎస్ఎస్/టీడీ ఖాతాలతో 31.03.2022 వరకు లింక్ చేయకపోతే ఎమ్ఐఎస్/ఎస్సిఎస్ఎస్/టీడీ సండ్రీ ఆఫీసు ఖాతాల్లో వడ్డీ క్రెడిట్ చేయనున్నట్లు తెలిపింది. అలా బకాయి వడ్డీని పోస్ట్ఆఫీస్ సేవింగ్స్ ఖాతా లేదా చెక్ ద్వారా మాత్రమే చెల్లించనున్నారు. 01.04.2022 నుంచి ఎమ్ఐఎస్/ఎస్సిఎస్ఎస్/టీడీ సండ్రీ ఆఫీసు అకౌంట్ నుంచి వడ్డీని క్యాష్ రూపంలో చెల్లించరు" అని తెలిపింది. సేవింగ్స్ ఖాతాకు లింక్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు: ఎమ్ఐఎస్/ఎస్సిఎస్ఎస్/టీడీ నుంచి లభించే వడ్డీ పొదుపు ఖాతాలో జమ అయినట్లు అయితే, మీకు అదనంగా వడ్డీ లభిస్తుంది. డిపాజిటర్లు పోస్టాఫీసును సందర్శించాల్సిన పని లేకుండా ఆన్లైన్ ద్వారా డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఎమ్ఐఎస్/ఎస్సిఎస్ఎస్/టీడీ వడ్డీ కోసం ప్రతిసారీ విత్ డ్రా ఫారాలను నింపాల్సిన అవసరం లేదు. డిపాజిటర్లు ఎమ్ఐఎస్/ఎస్సిఎస్ఎస్/టీడీ ఖాతాల లభించే వడ్డీని పివో సేవింగ్స్ అకౌంట్ నుంచి రికరింగ్ డిపాజీట్ ఖాతాలకు ఆటోమేటిక్ క్రెడిట్ అయ్యే సౌకర్యాన్ని పొందవచ్చు. (చదవండి: యాపిల్ తిక్క కుదిరింది.. ఐఫోన్‌కు దీటుగా రష్యా కొత్త ఫోన్..!) -
సీనియర్ సిటిజన్స్ కోసం అదిరిపోయే స్కీమ్, రిస్క్ లేకుండా అధిక వడ్డీతో..
సీనియర్ సిటిజన్స్ కోసం తక్కువ రిస్క్, అధికరాబడిని అందించే రకరకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో పోస్టాఫీస్ అందించే ఈ స్కీమ్ ప్రత్యేకం. ఎందుకంటే మిగిలిన స్కీమ్స్‌తో పోలిస్తే ఈ పథకంలో రాబడి ఎక్కువగా ఉందని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు మనం ఆ స్కీమ్ గురించి, ఆ స్కీమ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పోస్టాఫీస్‌లో ఈ స్కీమ్‌ను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) అని పిలుస్తారు. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు తక్కువ రిస్క్‌తో పోస్టల్ స్కీమ్ అందిస్తుంది. అధిక వడ్డీ రేటు, ఆదాయపు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీస్‌లో లేదా కొన్ని బ్యాంకుల్లో కూడా తెరవవచ్చు. ముఖ్యంగా పథకంలో డబ్బులు పొదుపు చేయాలంటే ఈ ఖాతా తెరిచే సయమానికి సంబంధిత ఖాతాదారుని వయస్సు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. అయితే కొన్ని వర్గాలకు చెందిన వ్యక్తులకు వయో సడలింపు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఖాతాలో సీనియర్ సిటిజన్లు రూ.15 లక్షల వరకు డిపాజిట్లపై త్రైమాసిక వడ్డీని పొందవచ్చు. ఎవరు అర్హులు పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్ లైన అతని/ఆమె విడివిడిగా లేదంటే సంయుక్తంగా ఎస్సీఎస్ఎస్ ఖాతాను ఓపెన్ చేయొచ్చు. వడ్డీ రేటు ప్రస్తుతం ఎస్సీఎస్ఎస్ వడ్డీరేటు 7.4శాతం ఉండగా కేంద్రం త్రైమాసిక ప్రాతిపదికన ఇతర పథకాలతోపాటు ఈస్కీమ్ వడ్డీ రేటును సవరిస్తుందనే విషయాల్ని గుర్తించుకోవాలి. ఇటీవల కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ స్కీమ్ వడ్డీ రేటు 2022 (నూతన సంవత్సరం 2022 మొదటి త్రైమాసికంలో) మారలేదు. ఆదాయపు పన్ను మినహాయింపు ఎస్సీఎస్ఎస్ ఖాతాలో చేసిన పెట్టుబడి ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపు పొందచవ్చు. అధికారిక పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్ నుండి వచ్చిన అప్డేట్ల ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని ఎస్సీఎస్ఎస్ ఖాతాలలో మొత్తం వడ్డీ రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే వడ్డీపై పన్ను విధించబడుతుంది. మెచ్యూరిటీ పీరియడ్ ఎస్సీఎస్ఎస్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి ఐదు సంవత్సరాల కాలవ్యవధికి వడ్డీ లభిస్తుందని డిపాజిటర్లు తప్పనిసరిగా గమనించాలి. డిపాజిటర్ ఖాతా మెచ్యూరిటీ అయిన ఒక సంవత్సరంలోపు, మూడు సంవత్సరాలకు ఒకసారి పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిపాజిట్ పరిమితి సీనియర్ సిటిజన్లు గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఎస్సీఎస్ఎస్ ఖాతాలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎస్సీఎస్ఎస్ ఖాతాను తెరవడానికి అవసరమైన కనీస మొత్తం రూ.1000గా ఉంది. చదవండి: ఎల్ఐసీకి భారీ షాక్, తగ్గుతున్న ఆదాయం -
బంపరాఫర్ ! పోస్టాఫీస్‌లో వెయ్యితో ఖాతా తెరిస్తే ఐదేళ్లలో రూ.14 లక్షలు! పూర్తి వివరాలు
సాధారణంగా పోస్టాఫీస్‌కు సంబంధించిన అన్ని స్కీములు అధిక వడ్డీని అందిస్తాయనే విషయం తెలిసిందే! వినియోగదారుల పొదుపుకు అధిక మొత్తంలో లాభాలను అందించడంలో పోస్టాఫీస్ స్కీములు ఎప్పుడూ ముందుంటాయి. ఐతే తాజాగా మరొక అదిరిపోయే స్కీమ్‌ను మీకు పరిచయం చేస్తోంది. ఆ వివరాలు మీ కోసం.. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్). ఈ స్కీమ్ ద్వారా మదుపరులకు ఏకంగా 7.4 శాతం వడ్డీని అందిస్తోంది పోస్టల్‌శాఖ. ఈ స్కీమ్ రిటైర్ అయినవారికి, సేవింగ్ ఎకౌంట్ ఉన్న వారికి చాలా ప్రయోజనకరం. ఈ స్కీమ్ ద్వారా అధికమొత్తంలో తిరిగి సొమ్ము అందితుంది. ఎలాగంటే.. ►60 యేళ్ల పై వయసున్నవారు మాత్రమే ఎస్సీఎస్ఎస్లో అకౌంట్ తెరవడానికి అర్హులు. ► ఆసక్తి ఉన్నవారు 1000 రూపాయలతో ఖాతా తెరవొచ్చు. ►ఇలా మొత్తం పది లక్షల రూపాయలను ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత 7.4 శాతం వడ్డీతో కలిపి రూ. 14,28,964 లక్షలు రిటర్న్ వస్తాయి. ►ఆ లెక్కన మొత్తం ఐదేళ్లలో సుమారు రూ. 4 లక్షల 28 వేల వడ్డీ అందుతుంది. ►సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ గరిష్టంగా రూ. 15 లక్షల వరకు మదుపు చేయవచ్చు. ►అంతేకాదు మెచ్యురిటీ పీరియడ్ ఐదేళ్లయినప్పటికీ ఈ సమయాన్ని మరో మూడేళ్ల వరకు పొడిగించుకునే సదుపాయం కూడా ఉంది. ►ఎస్సీఎస్ఎస్లో వెయ్యి నుంచి లక్ష రూపాయలలోపు ఖాతా తెరవవచ్చు. ఐతే వడ్డీ విషయంలో ఎటువంటి మార్పు ఉండదు. ►ఈ పథకంలోని పెట్టుబడులకు సెక్షన్ 80 సి కింద ఆదాయపన్ను నుంచి మినహాయింపు కూడా ఉంది. ఇక ఆలస్యమెందుకు అవసరమైన డాక్యుమెంట్లతో మీ సమీపంలోని పోస్టాఫీస్‌లో వెంటనే అకౌంట్ తెరవండి... మీ విశ్రాంత జీవితానికి మరింత భద్రత పొందండి. చదవండి: అదృష్టమంటే ఇది.. రూ.2250 కి కొంటే.. ఏకంగా 374 కోట్లపైనే!! -
ఈ సేవ్సింగ్స్ స్కీమ్ సీనియర్ సిటిజన్స్‌కి ఆసరా
కేంద్రం అమలు చేస్తోన్న సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం.. మలి దశలో అండగా నిలుస్తోంది. అతి తక్కువ మొత్తంతో ఈ స్కీములో చేరడమే కాకుండా ఎప్పుడైనా సరే డిపాజిట్ వెనక్కి తీసుకునే అవకాశం ఉండటంతో గత ఐదేళ్లుగా ఈ స్కీమ్‌లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వడ్డీ ఎక్కువ సాధారణ సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్‌తో పోల్చితే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌లో వడ్డీ ఎక్కువగా లభిస్తుంది. ఈ పథకంలో జమ చేసే సొమ్ముకు 7.40 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఐదేళ్ల కాలానికి ఇందులో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత మరో మూడేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం. మినహాయింపులు ఐదేళ్ల కాల పరిమితికి సీనియర్ సిటిజన్ పథకంలో పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. అయితే రెండేళ్లలోపు డిపాజిట్ వెనక్కి తీసుకుంటే మొత్తం సొమ్ములో 1.5 శాతం మినహాయించుకుని చెల్లింపులు చేస్తారు. రెండేళ్ల నుంచి ఐదేళ్లలోపు డిపాజిట్ వెనక్కి తీసుకుంటే మొత్తం సొమ్ములో 1 శాతం మినహాయించుకుంటారు. మరిన్ని వివరాలు - సీనియర్ సిటీజన్స్ సేవింగ్స్‌లో డిపాజిట్ చేయాలంటే 60 ఏళ్లు పైబడిన వారు అర్హులు. ముందస్తుగా వీఆర్ఎస్ పెట్టుకుని 55 ఏళ్లు నిండిన వారూ ఈ పథకానికి అర్హులే. - కనీస మొత్తం రూ. 1000 కాగా గరిష్టంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడిగా పెట్టొచ్చు. డిపాజిట్ చేసిన మొత్తంపై 7.4 శాతం వడ్డీ లభిస్తుంది - ఎప్పుడైనా డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవచ్చు - ఆదాయపు పన్ను చట్టం 80 సీ కింద పన్ను మినహాయింపు - ఈ పథకంలో సేవ్ చేసిన వారు గరిష్టంగా 1.5 లక్షల రూపాలయను పన్ను మినహాయింపు పొందవచ్చు. - పోస్టాఫీసు, బ్యాంకులలో ఈ సేవింగ్స్ పథకం అందుబాటులో ఉంది - ప్రతీ మూడు నెలలకు ఒకసారి వడ్డీ చెల్లిస్తారు పెరుగుతున్న ఆదరణ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గిపోవడం, స్టాక్ మార్కెట్లో రిస్క్ ఎక్కువ కావడంతో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ పథకానికి ఆదరణ పెరుగుతోంది. వాస్తవానికి 2018 వరకు ఈ పథకానికి వార్షిక వడ్డీ రేటు 8.4 శాతంగా ఉండేంది. ప్రస్తుతం తగ్గించి 7.4 శాతానికే పరిమితం చేశారు. ఐనప్పటికీ ఈ పథకాన్ని సీనియర్స్ ఆదరిస్తున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఇందులో డిపాజిట్లు రూ. 24,754 కోట్లు ఉండగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈ మొత్తం రూ.73,051 కోట్లకు చేరుకుంది. చదవండి : gratuity amount: ఆ 9 లక్షల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటారు? -
Post Office Schemes: పోస్ట్ ఆఫీస్ టాప్ - 5 డిపాజిట్ స్కీమ్స్
ఎటువంటి రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడులపైన మంచి ఆదాయం రావాలంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటిలో పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ స్కీమ్స్ ఉత్తమమైనవి అని చెప్పుకోవాలి. పోస్టాఫీసు పెట్టుబడులపై భద్రతతో పాటు మంచి రాబడి కూడా అందిస్తుంది. పోస్టాఫీసు పథకాలు నమ్మదగినవి. ఈ పథకాలు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తాయి. గరిష్ట వడ్డీ రేట్లతో ప్రజాదరణ పొందిన తపాలా కార్యాలయ పథకాలు కొన్ని సుకన్య సమృద్ధి పథకం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీం, కిసాన్ వికాస్ పాత్రా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ వంటివి ఉన్నాయి. వీటి గురుంచి ఇప్పుడు మనం తెలుసుకుందాం. (చదవండి: వన్‌ప్లస్ 9 ఆర్టీ స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ప్రాసెసర్) సుకన్య సమృద్ధి పథకం సుకన్య సమృద్ధి పథకాన్ని సంరక్షకుడు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లల పేరిట ప్రారంభించవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.250, గరిష్టంగా రూ.1,50,000 వరకు జమ చేయవచ్చు. సంవత్సరానికి 7.6 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రాతిపదికన లెక్కిస్తారు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం అనేది రిటైర్డ్ వ్యక్తులు, వృద్ధులకొరకు ప్రజాదరణ పొందిన పథకం. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 5 ఏళ్లు ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. మీరు రూ.1000తో ఈ స్కీమ్‌లో ఖాతా తెరవొచ్చు. గరిష్టంగా రూ.15 లక్షల వరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఒకేసారి రూ.10 లక్షలు ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. ఐదేళ్లలో మీకు రూ.14 లక్షలకు పైగా వస్తాయి. వడ్డీ రూపంలో రూ.4,28,964 వరకు పొందొచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్)ను ఎవరైనా తెరవవచ్చు. పిపిఎఫ్ కింద పెట్టుబడి పెట్టె నగదుపై ఏడాదికి 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500, గరిష్టంగా రూ.1,50,000 నగదు జమ చేయవచ్చు. పీపీఎఫ్‌లో డబ్బులు పెడితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మనిహాయింపు లభిస్తుంది. పీపీఎఫ్ ఖాతాలో ఏడాదికి రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. 15 ఏళ్ల తర్వాత చేతికి రూ.40 లక్షలకు పైగా వస్తాయి. కిసాన్ వికాస్ పత్ర కిసాన్ వికాస్ పాత్రా పథకం కింద కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టవచ్చు. 124 నెలల్లో (10 సంవత్సరాలు 4 నెలలు) పెట్టుబడి పెట్టిన మొత్తం రెట్టింపు అవుతుంది. వార్షికంగా 7.7 వడ్డీ వడ్డీ రేటు లభిస్తుంది మీరు రూ.50,000 డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీ కాలం తర్వాత రూ.73,126 లభిస్తాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టవచ్చు. వార్షికంగా 6.8 శాతం వడ్డీ లభిస్తోంది. అయితే మెచ్యూరిటీ కాలం తర్వాత మాత్రమే వడ్డీ అసలు చెల్లిస్తారు. ఎన్ఎస్సీ స్కీమ్‌లో రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత చేతికి దాదాపు రూ.21 లక్షలు వస్తాయి. -
సీనియర్ సిటిజన్లకు ఎక్కువ వడ్డీ అందించే బ్యాంకులు ఇవే
ఎలాంటి రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కోరుకునే సీనియర్ సిటిజన్లు ఫిక్స్డ్ డిపాజిట్లను ఎంచుకుంటారు. అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇంటస్ట్ర్ రేట్లు ఒక్కో బ్యాంక్‌ను బట్టి ఒక్కోలా ఉంటాయి. పెద్ద పెద్ద బ్యాంకుల్లో ఇంట్రస్ట్ రేట్లు తగ్గుతున్నప్పటికీ కొన్ని బ్యాంక్ లు మాత్రం మూడు సంవత్సరాల ఎఫ్డీలపై 7.25 శాతం ఇంట్రస్ట్ ను చెల్లిస్తున్నట్లు 'బ్యాంక్ బజార్' తన డేటాలో వెల్లడించింది. . ఇప్పుడు మనం ఎఫ్డీపై అత్యుత్తమ వడ్డీ రేట్లను అందించే బ్యాంకుల గురించి తెలుసుకుందాం. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - సీనియర్ సిటిజన్స్ కోసం మూడు సంవత్సరాల ఎఫ్డీలపై 7.25 శాతం వడ్డీని అందిస్తుంది. పెట్టుబడి పెట్టిన రూ.లక్ష రూపాయల మొత్తం మూడు సంవత్సరాలలో రూ.1.24 లక్షలకు పెరుగుతుంది. ప్రారంభ డిపాజిట్ రూ.1,000. డీసీబీ బ్యాంక్, ఎస్ బ్యాంక్ - సీనియర్ సిటిజన్లకు మూడు సంవత్సరాల ఎఫ్డీలపై 7 శాతం వడ్డీని అందిస్తాయి. రూ .1 లక్ష డిపాజిట్ చేస్తే మూడు సంవత్సరాలలో రూ .1.23 లక్షలకు పెరుగుతుంది. ప్రారంభ డిపాజిట్ రూ. 10,000. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ - సీనియర్ సిటిజన్లకు మూడు సంవత్సరాల ఎఫ్డీలపై 6.85 శాతం వడ్డీని అందిస్తుంది. రూ.లక్ష డిపాజిట్ చేస్తే మూడు సంవత్సరాలలో రూ .1.22 లక్షలకు పెరుగుతుంది. ఆర్బిఎల్ బ్యాంక్ - సీనియర్ సిటిజన్లకు కోసం మూడు సంవత్సరాల ఎఫ్‌డిలపై 6.80 శాతం వడ్డీని అందిస్తుంది. రూ.లక్ష పెట్టుబడి మూడు సంవత్సరాలలో రూ .1.22 లక్షలకు పెరుగుతుంది. -
ఇన్‌కంట్యాక్స్ నుంచి మినహాయింపు కావాలా? ఇవిగో మార్గాలు
వ్యాపారం ఎంతో రిస్క్‌తో కూడిన పని. అనేక కష్టనష్టాలకు ఓర్చితేనే ఏదైనా కంపెనీ లాభాల బాట పడుతుంది. అయితే ఈ లాభాల నుంచి ఆదాయపన్ను కట్టాల్సి వస్తుంది. బడా కంపెనీలకు ఇది పెద్ద సమస్య కాకపోయినా ఎదుగుతున్న కంపెనీలు పన్ను మినహాయింపు ఆశిస్తాయి. ప్రతీనెల జీతం తీసుకునే ఉద్యోగులు ఆదాయం పన్ను మినహాయింపును కోరుకుంటారు. ఇలాంటి వారి కోసం చట్ట పరంగా పన్ను మినహాయింపులు ఇస్తోంది ప్రభుత్వం. ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చే వాటిలో కొన్ని.. టర్మ్ లైఫ్ ఇన్సురెన్స్ పాలసీ అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మనకు, మన కుటుంబానికి ఇన్సురెన్స్ భద్రత అందిస్తుంది. ఆదాయపన్ను కడుతున్నవారు ఇన్వెస్ట్ చేయాల్సిన వాటిలో ఇన్సురెన్స్ ప్రధానమైంది. ఇన్సురెన్స్ పాలసీ ప్రీమియంగా చెల్లించిన మొత్తానికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. ఏ ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం కడితే ఆ ఏడాదికి సంబంధించి పన్ను మినహాయింపు పొందవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ చట్టపరంగా ఇన్‌కంట్యాక్స్‌ను తగ్గించుకునేందుకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం చక్కనగా ఉపకరిస్తుంది. ఏదైనా బ్యాంకు లేదా పోస్టాఫీసులో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాను ప్రారంభించి, అందులో జమ చేసిన సొమ్ముకు పన్ను నుంచి మినహయింపు ఉంటుంది. అయితే ఇందులో జమ చేసే మొత్తాన్ని 15 ఏళ్ల వరకు విత్‌డ్రా చేయడానికి వీలులేదు. ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు పొందేందుకు ఎక్కువ మంది ఎంచుకునే మార్గాల్లో ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఒకటి. ఈక్విటీ మార్కెట్లతో పోల్చితే రిస్క్ తక్కువ, గ్యారంటీ రిటర్న్స్ ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు అయితే డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ లభిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్ పథకం ద్వారా పన్ను రాయితీ పొందవచ్చు. తక్కువ ఆదాయం పొందే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది. రిటర్న్స్ కూడా ఎక్కువగా అందిస్తుంది. ఈ పథకం ద్వారా రూ. 1.50 లక్షల వరకు రాయితీ పొందే అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం అరవై ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు పన్ను రాయితీ కల్పించేందుకు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కనీసం వెయ్యి రూపాయలు పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఐదేళ్లు మెచ్యూరిటీ పీరియడ్‌గా ఉంటుంది. గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. -
క్రమం తప్పకుండా ఆదాయం
పదవీ విరమణ చేసిన వారికి ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆదాయం కోసం కచ్చితంగా ఒక ఏర్పాటు అనేది ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ ప్రయోజనాలు ఉంటాయి. ప్రైవేటు రంగంలోని వారికి సైతం పదవీ విరమణ తర్వాత పెన్షన్ కోసం ఈపీఎఫ్‌వో అందించే ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ఒకటి ఉంది. కానీ, దీనిపై వచ్చే పెన్షన్ చాలా తక్కువ. కనుక ప్రైవేటు రంగంలోని వారు, స్వయం ఉపాధిలో ఉన్న వారు పదవీ విరమణ అనంతరం క్రమం తప్పకుండా ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. వీరికోసం అందుబాటులో ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందరికీ తెలిసిన ఫిక్స్డ్ డిపాజిట్‌తోపాటు.. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా క్రమం తప్పకుండా కొంత మొత్తాన్ని ఉపసంహరించుకోవడం (ఎస్‌డబ్ల్యూపీ) ఇలా ఎన్నో. అయితే, అందరికీ అన్నీ అనుకూలంగా ఉంటాయని చెప్పలేం. కనుక ఈ సాధనాలు, వాటిల్లో రాబడులు, రిస్క్ ఏ మేరకు తదితర వివరాలను తెలియజేసే ప్రాఫిట్ కథనం ఇది.. తమ పెట్టుబడులు, రాబడులపై ఎటువంటి రిస్క్ వద్దనుకునే వారు పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకాన్ని (పీవోఎంఐఎస్) పరిశీలించొచ్చు. అన్ని వయసుల వారు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రధానమంత్రి వయవందన యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వంటివి 60 ఏళ్లు నిండిన వారికి మాత్రమే. కానీ, ఇవన్నీ సురక్షిత సాధనాలు. మూడు నెలలకోసారి అయినా ఫర్వాలేదనుకుంటే అందుకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఈ మూడింటిలో అధిక రాబడులను ఇచ్చే సాధనం. పోస్టాఫీసు ఎంఐఎస్ పథకంలో ప్రస్తుతం పెట్టుబడులపై 7.6 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది. ఒక్కరు గరిష్టంగా రూ.4.5 లక్షలు, అదే జాయింట్‌గా అయితే రూ.9 లక్షల వరకే ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతి ఉంది. దీని కాల వ్యవధి ఐదేళ్లు. ఏడాది పూర్తయిన తర్వాత ముందస్తుగా వెనక్కి తీసుకునేందుకు అనుమతిస్తారు. కాకపోతే పెట్టుబడిలో 2 శాతాన్ని తపాలా శాఖ మినహాయించుకుంటుంది. అదే మూడేళ్ల తర్వాత వెనక్కి తీసుకుంటే అప్పుడు ఒక్క శాతమే కోల్పోవాల్సి వస్తుంది. పీవోఎంఐఎస్ పథకం ద్వారా వచ్చే వడ్డీ ఆదాయం ఆ వ్యక్తి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. ఇతర ఆదాయ మార్గంలో దీన్ని చూపించి అవసరమైతే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వయవందన యోజన ప్రధాన మంత్రి వయవందన యోజన (పీఎంవీవీవై) కూడా నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ఉద్దేశించిన పెట్టుబడి సాధనం. ఇందులో ప్రస్తుతం 8 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. కాల వ్యవధి పదేళ్లు. కనీసం రూ.1.5 లక్షలు, గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఒక వ్యక్తి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పీఎంవీవీవై ద్వారా వచ్చే వడ్డీ ఆదాయాన్ని కూడా వార్షిక ఆదాయ రిటర్నుల్లో ఇతర ఆదాయ మార్గం కింద చూపించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) పథకంలో పెట్టుబడులను సెక్షన్ 80సీ కింద చూపించుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడులపై ప్రస్తుతం 8.6 శాతం వడ్డీ రేటు అమలవుతోంది. ఒకరు గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా రిటైర్మెంట్ సమయంలో వచ్చిన మొత్తాన్ని.. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అంత మేరకే ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతిస్తారు. 60 ఏళ్లు నిండిన వారు ఎవరైనా ఇందులో పెట్టుబడులకు అర్హులు. అదే ముందస్తు పదవీ విరమణ తీసుకున్న వారు (55–60 ఏళ్ల మధ్య) ఒక నెల వ్యవధి మించకుండా ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం ప్రతీ త్రైమాసికం చివర్లో.. జూన్, సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెల చివరి తేదీన వడ్డీ చెల్లింపులు చేస్తారు. యాన్యుటీ ప్లాన్లు బీమా కంపెనీలు ఆఫర్ చేసే ఇమీడియట్ యాన్యుటీ పథకాలు కూడా నెలవారీ ఆదాయం కోరుకునే వారికి అందుబాటులో ఉన్న సాధనం. వీటిల్లోనూ రిస్క్ తక్కువే. మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై, మరుసటి నెల నుంచే పెన్షన్ అందుకోవచ్చు. కాకపోతే వీటిల్లో పెట్టుబడులపై రాబడులు తక్కువగా ఉంటాయి. వీటిల్లో గరిష్ట రాబడి రేటు కేవలం 6 శాతమే. వీటిపై వచ్చే ఆదాయాన్ని ఇతర మార్గాల కింద వచ్చిన ఆదాయంగా ఐటీఆర్‌లో చూపించాల్సి ఉంటుంది. వీటన్నింటిలోకి రాబడులు ఎస్సీఎస్ఎస్లోనే ఎక్కువ అని చెప్పుకోవాలి. కాకపోతే గరిష్ట పెట్టుబడి రూ.15 లక్షలు. పైగా మూడు నెలలకోసారి మాత్రమే చెల్లింపులు జరుగుతాయి. మొదటి మూడు నెలలకు సరిపడా నిధి మీ వద్ద ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని ఎస్సీఎస్ఎస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, ఈ పథకంలో పెట్టుబడులు సౌకర్యంగా, రాబడులు మెరుగ్గా ఉంటాయి. ఇది అనుకూలంగా లేదనుకున్న వారు వయవందన యోజనను పరిశీలించొచ్చు. అలాగే, ఒక పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితికి మించి ఇంకా నిధి మిగిలి ఉంటే అప్పుడు మరో పథకాన్ని ఎంచుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు రిస్క్ కొంచెం తక్కువ కోరుకునే వారి కోసం బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి. కాకపోతే జాతీయ బ్యాంకుల్లో అయితే దీర్ఘకాలానికి వడ్డీ రేటు 7 శాతం వరకే ఉంది. ఒకవేళ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఆసక్తిగా ఉంటే 7–9 శాతం మధ్య వడ్డీ రాబడి పొందొచ్చు. సాధారణంగా బ్యాంకులు త్రైమాసికం వారీగా వడ్డీ చెల్లింపులు చేస్తాయి. అయితే, డిపాజిటర్ కోరితే నెలవారీగా చెల్లింపులు చేసే బ్యాంకులు కూడా ఉన్నాయి. కాకపోతే నెలవారీగా కోరుకుంటే వచ్చే ఆదాయం కాస్త తగ్గుతుంది. ఐసీఐసీఐ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ మంత్లీ ఇన్కమ్ ఆప్షన్ అనే పథకాన్ని నిర్వహిస్తోంది. సాధారణ ఎఫ్‌డీతో పోలిస్తే ఇది భిన్నమైనది. ఇందులో పెట్టుబడి కాల వ్యవధి తర్వాత చెల్లింపుల కాలవ్యవధి ఆరంభమవుతుంది. అంటే 24 నెలల పాటు పెట్టుబడి కాల వ్యవధిని ఎంచుకున్నారనుకంటే... ఆ తర్వాత, తదుపరి 24 నెలల పాటు చెల్లింపులు జరుగుతాయి. వడ్డీ రేటు 7.25 శాతం. చెల్లింపుల సమయంలో ప్రతి నెలా చెల్లింపులు చేయగా మిగిలిన మొత్తంపై వడ్డీ కలుస్తూ ఉంటుంది. ఎన్బీఎఫ్సీ డిపాజిట్లు అధిక రిస్క్ తీసుకునే వారు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఆఫర్ చేసే ఫిక్స్డ్ డిపాజిట్లను పరిశీలించొచ్చు. కాకపోతే మంచి క్రెడిట్ రేటింగ్ ఉన్న వాటినే పరిశీలించడం మంచిది. బ్యాంకులతో పోలిస్తే ఎన్బీఎఫ్సీలు అధిక రేటును ఆఫర్ చేస్తాయి. అందుకే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఏఏఏ రేటింగ్ కలిగిన బజాజ్ ఫైనాన్స్ ప్రస్తుతం 7.72 నుంచి 8.05 శాతం వరకు వార్షిక వడ్డీని నెలవారీగా చెల్లింపులపై ఆఫర్ చేస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే ఆదాయాన్ని ఇతర ఆదాయ మార్గం కింద చూపించాల్సి ఉంటుంది. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు 60 ఏళ్లు నిండిన వారు మినహాయింపు పొందొచ్చు. సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ మార్కెట్ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తితో ఉన్న వారు మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ)ను పరిశీలించొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే సాధనం (సిప్)కు ఇది పూర్తి వ్యతిరేకం. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల నుంచి క్రమం తప్పకుండా ఇంత మొత్తాన్ని వెనక్కి తీసుకునేదానిని ఎస్డబ్ల్యూపీగా పేర్కొంటారు. తన మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల నుంచి ప్రతీ నెలా ఇంత మొత్తం కావాలని ఏఎంసీకి ఇన్స్ట్రక్షన్ ఇస్తే చాలు. మ్యూచువల్ ఫండ్స్‌లోనూ మీ రిస్క్‌ను బట్టి, పూర్తిగా డెట్ లేదా ఈక్విటీ లేదా ఈక్విటీ డెట్ కలయికతో కూడిన ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇన్వెస్ట్ చేసిన మరుసటి నెల నుంచే తీసుకుంటే మొదటి ఏడాది వరకు ఎగ్జిట్‌లోడ్‌ను భరించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఇది ఒక శాతంగా ఉండొచ్చు. పైగా ఎస్‌డబ్ల్యూపీపై ప్రతి నెలా వెనక్కి తీసుకునే మొత్తంపై లాభం ఆర్జిస్తే, అది మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తుంది. ఈక్విటీ పథకాలు అయితే స్వల్పకాల మూలధన లాభాలు (ఏడాదిలోపు)పై 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి మించిన పెట్టుబడులను వెనక్కి తీసుకుంటే మాత్రం.. మూలధన లాభం రూ.లక్ష వరకు ఉంటే పన్ను లేదు. అంతకుమించి ఉంటే ఆ మొత్తంపైనే 10 శాతం పన్ను అమలవుతుంది. ఈక్విటీ కాకుండా ఇతర పథకాలు అయినా మూడేళ్లకు మించి కొనసాగించినట్టయితే అప్పుడు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను 20 శాతం వర్తిస్తుంది. మూడేళ్ల లోపు కాలంలో వచ్చే లాభాలను వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. -
ఎక్కువ వడ్డీ... ఎక్కువ భద్రత!
దేశంలో అత్యధిక జనాభాది అయితే స్వయం ఉపాధి... లేకుంటే ప్రయివేటు ఉద్యోగమే. అందుకే ఇక్కడ వృద్ధాప్యంలో సామాజిక భద్రతనేది చాలా పెద్ద సమస్య. అప్పటిదాకా కొంత సొమ్ము దాచుకున్నా... దానిపై నెలనెలా ఎంతో కొంత సొమ్ము చేతికి వస్తుండాలి. అది కూడా స్థిరంగా ఉండి... ఎలాంటి ఆందోళనకూ తావివ్వని రీతిలో ఉండాలి. రిస్క్ తీసుకోలేరు కనక... ఒకవైపు పెట్టుబడికి భద్రత, మరోవంక మెరుగైన రాబడి అవసరం. అందుకనే ఇపుడు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ను (ఎస్సీఎస్ఎస్) మంచి ఆప్షన్‌గా సూచిస్తున్నారు నిపుణులు. ఆ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం.. సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం మూడు నెలలకోసారి వడ్డీ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌ను ప్రభుత్వం 2004లో ప్రవేశపెట్టింది. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ ఆదాయాన్ని అందించడం ద్వారా సీనియర్ సిటిజన్ల అవసరాలకు నిధులివ్వటమే ఈ పథకం వెనక అసలు ఉద్దేశం. వడ్డీ తీసుకోకుండా వదిలేస్తే దానిపై మరింత రాబడి పొందే అవకాశం దీన్లో లేదు. మూడు నెలలకోసారి వడ్డీ తీసుకోవాల్సిందే. త్రైమాసికానికి ఎంత చెల్లిస్తారనేది డిపాజిట్ మొత్తం, వడ్డీ రేటు ఆధారంగా ప్రారంభంలోనే ఖరారు చేస్తారు. ప్రారంభించటం ఎలా..? రిటైర్మెంట్ సమయంలో వచ్చిన నిధుల్ని ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే గరిష్టంగా రూ.15 లక్షల వరకే డిపాజిట్ చేసే అవకాశముంది. ఏ పోస్టాఫీసుకు వెళ్లినా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఖాతాను ప్రారంభించుకోవచ్చు. లేదా ప్రభుత్వరంగ బ్యాంకులైన ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎన్బీ, బ్యాంకు ఆఫ్ బరోడా, ఆంధ్రా బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా తదితర బ్యాంకుల్లో ఎంపిక చేసిన శాఖల్లోనూ ఎస్సీఎస్ఎస్ ఖాతాను తెరుచుకోవచ్చు. ప్రయివేటు రంగ ఐసీఐసీఐ బ్యాంకూ దీన్ని ఆఫర్ చేస్తోంది.దీనికోసం ముందుగా సేవింగ్స్ ఖాతాను తెరవాలి. తర్వాత దరఖాస్తు పత్రం, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, గుర్తింపు ధ్రువీకరణ పత్రం (ఒరిజినల్), చిరునామా ధ్రువీకరణకు ఆధార్, పాస్ పోర్ట్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ వీటిలో ఏదో ఒకటి తీసుకెళ్లాలి. పాన్‌కార్డు లేనివారు చట్టంలోని నిబంధనల మేరకు ఫామ్ 60 లేదా 61ను డిక్లరేషన్‌గా ఇవ్వాలి. ఎవరైనా ప్రారంభించొచ్చా? 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్లు అందరూ ఈ పథకంలో చేరటానికి అర్హులే. ఉద్యోగం నుంచి ముందే రిటైర్ అయిన వారు 55 ఏళ్లకే ఇందులో చేరొచ్చు. రక్షణ రంగంలో పనిచేసి ఎక్స్ సర్వీస్ హోదా కలిగిన వారు 50 ఏళ్లకే ఇందులో పెట్టుబడి పెట్టుకునేందుకు అవకాశం ఉంది. పన్ను ప్రయోజనాలివీ... ఆదాయపన్ను చట్టం (ఐటీ) లోని సెక్షన్ 80సీ కింద ఎస్సీఎస్ఎస్లో చేసే డిపాజిట్‌కు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షలకు పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే, ఈ డిపాజిట్‌పై వచ్చే వడ్డీకి ఆదాయపన్ను వర్తిస్తుంది. కాగా ఈ వడ్డీ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేలు దాటితేనే పన్ను. రూ.50,000 దాటినా టీడీఎస్ మినహాయించకూడదంటే ఫామ్ 15హెచ్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఎస్సీఎస్ఎస్ – ఫిక్స్డ్ డిపాజిట్ ♦ సాధారణ ఐదేళ్ల టర్మ్ డిపాజిట్‌పై వడ్డీ రేటుతో పోలిస్తే ఎస్సీఎస్ఎస్లో వడ్డీ రేటు సుమారు ఒక శాతం ఎక్కువ. ఉదాహరణకు ఎస్బీఐ 3–5 ఏళ్ల కాల వ్యవధి కలిగిన డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఎస్సీఎస్ఎస్ పథకంలోని 8. 3 శాతం వడ్డీ రేటుతో పోల్చి చూస్తే 1.3%తక్కువ. ♦ రెగ్యులర్ టర్మ్ డిపాజిట్లో లాకిన్ పీరియడ్ ఉండకపోవటం మంచిదే. పైగా వీటిపై వడ్డీని మెచ్యూరిటీ సమయంలో తీసుకునేందుకు క్యుములేటివ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎస్సీఎస్ఎస్లో ఇది లేదు. రెగ్యులర్‌గా ఆదాయం అవసరం లేదనుకునే వారికి, వడ్డీ కాస్త తక్కువైనా ఫర్వాలేదనుకునే వారికి టర్మ్ డిపాజిట్లే మార్గం. కానీ, సీనియర్ సిటిజన్లకు ఎప్పటికప్పుడు ఆదాయాన్నిచ్చే పథకాల అవసరమే ఎక్కువ. అందుకుని వారికి ఎస్సీఎస్ఎస్ పథకం అనువుగా ఉంటుంది. వడ్డీ రేటు ఎంతంటే... కేంద్ర ఆర్థిక శాఖ ప్రతి మూడు నెలలకోసారి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేట్లను నోటిఫై చేస్తుంది. 2018–19 ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు (ఏప్రిల్–జూన్) ఈ పథకంలో వడ్డీ రేటు 8.3 శాతంగా ఉంది. ప్రతీ త్రైమాసికానికి ఓ సారి వడ్డీ చెల్లిస్తారు. పథకం కాల వ్యవధి ఐదేళ్లు. పెట్టుబడి పెట్టే సమయంలో అమల్లో ఉన్న వడ్డీ రేటే ఐదేళ్ల వరకు వర్తిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడులకు ఐదేళ్ల లాకిన్ పీరియడ్. అంటే ఐదేళ్లలోపు అవసరం ఏర్పడినా పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోలేరు. తర్వాత పెట్టుబడులను కొనసాగించాలని భావిస్తే మరో మూడేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంది. పొడిగించుకోకపోతే, ఐదేళ్లు కూడా ముగిసిపోతే ఆ డిపాజిట్ కాల వ్యవధి తీరిపోయినట్టే. ఎప్పుడైనా విత్ డ్రా చేసుకోవచ్చు. ఐదేళ్ల డిపాజిట్ గడువు ముగిసిన వెంటనే విత్ డ్రా చేసుకోకుండా కొన్ని రోజుల తర్వాత తీసుకున్నారనుకోండి. అప్పుడు ఆ కాల వ్యవధిపై అమల్లో ఉన్న వడ్డీ రేటును చెల్లిస్తారు. ఏడాది తర్వాత ముందస్తు ఉపసంహరణను 1.5 శాతం పెనాల్టీపై అనుమతిస్తారు. రెండేళ్ల తర్వాత అయితే 1 శాతం నష్టపోవాలి. -
రిస్క్ లేదు... రాబడి ఎక్కువ!
పెట్టుబడిని బట్టే రాబడి. అదే అధిక రాబడి కావాలంటే... అక్కడ రిస్క్ కూడా అధికంగానే ఉంటుంది. కాకపోతే తక్కువ రిస్క్‌తో కాస్తంత ఎక్కువ రాబడులనిచ్చే పథకాలు కూడా మార్కెట్లో చాలానే ఉన్నాయి. వయో వృద్ధులకు, కాస్త క్రమానుగతంగా పొదుపు చేసే వారికి, తమ పెట్టుబడిని పోగొట్టుకునే పరిస్థితిలో లేమని భావించేవారికి... ఇలాంటివారికి ఈ పథకాలు అనువుగా ఉంటాయి. అవన్నీ వివరించేదే ఈ ప్రాఫిట్ ప్లస్ కథనం... గడిచిన మూడేళ్లలో స్థిరాదాయం కోసం ఈక్విటీలను నమ్ముకున్న సీనియర్ సిటిజన్లకు (వృద్ధులు) రాబడులు బాగానే వచ్చాయి. సురక్షిత సాధనాల్లో రాబడులు క్షీణించిపోవడంతో రిస్క్ సాధనాలైన ఈక్విటీ సేవింగ్స్ పథకాలు, బ్యాలన్స్డ్ ఫండ్స్ తదితర వాటిని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. సంప్రదాయ స్థిరాదాయ పథకాల వడ్డీ రేట్లు మూడేళ్ల తర్వాత మళ్లీ మెల్లగా పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో ఆర్బీఐ కీలక రేట్ల తగ్గింపునకు బ్రేక్ వేసింది. 2017 ఆగస్ట్ నుంచి యథాతథ స్థితినే కొనసాగిస్తూ వస్తోంది. రానున్న ఏడాదిలో వడ్డీ రేట్లను పెంచొచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. బ్యాంకులు ఇప్పటికే మెల్లగా రేట్ల పెంపును ప్రకటిస్తూ ఉండగా... ఈ రేట్ల పెంపును బాండ్ల మార్కెట్ ఇప్పటికే సర్దుబాటు కూడా చేసేసుకుంది. బాండ్ల మార్కెట్‌కు బెంచ్ మార్క్ అయిన పదేళ్ల ప్రభుత్వ బాండ్ల రాబడులు 130 బేసిస్ పాయింట్ల మేర పెరిగి 7.5 శాతానికి చేరాయి. దీంతో మార్కెట్లో ఇతరులు కూడా దీన్ని అనుసరించక తప్పదు. ఈ నేపథ్యంలో బ్యాంకులు, కంపెనీలు రానున్న నెలల్లో కనీసం పదేళ్ల బాండ్ల ఈల్డ్ స్థాయికి అయినా రేట్లను పెంచక తప్పని పరిస్థితి ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రిస్క్ వద్దనుకునే సీనియర్ సిటిజన్లు స్థిరాదాయం కోసం ఈక్విటీలు కాకుండా ఇతర సాధనాలతో పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. బ్యాంకు ఎఫ్డీలు... రానున్న కాలంలో వడ్డీ రేట్ల పెరుగుదల అవకాశాల నేపథ్యంలో స్థిరాదాయం కోరుకునే సీనియర్ సిటిజన్లు దీర్ఘకాలిక డెట్ సాధనాలకు బదులు బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లను పరిశీలించొచ్చు. మూడు నెలల నుంచి ఏడాది కాలానికి కూడా వీటిలో ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఏడాది కాలానికి చాలా బ్యాంకులు మంచి రేటునే ఆఫర్ చేస్తున్నాయి. దీర్ఘకాలానికి ఎఫ్డీలపై తక్కువ రేటు ఉంది. కనుక ఆరు నెలల నుంచి ఏడాది కాలానికి ఎఫ్డీలను ఆశ్రయించొచ్చు. సెక్షన్ 80టీటీబీ కింద సీనియర్ సిటిజన్లకు (60 ఏళ్లు పైబడిన వారు) ఏడాదిలో వడ్డీ ఆదాయం రూ.50,000 వరకూ ఎలాంటి పన్నూ విధించకుండా తాజా బడ్జెట్లో రాయితీ ఇవ్వటం ఆకర్షణీయం. అంటే రూ.50,000 వరకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ (మూలం వద్ద పన్ను కోత/ బ్యాంకు స్థాయిలో) ఉండదు. కమర్షియల్ బ్యాంకులు, కోపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసు డిపాజిట్లపై ఈ మినహాయింపు ఉంటుంది. అయితే, కోపరేటివ్ బ్యాంకుల్లో ఎఫ్డీలు రిస్క్‌తో కూడినవి. అలాగే, పోస్టాఫీసులో డిపాజిట్లపై వడ్డీ ఆదాయం 6.6 శాతం స్థాయిలోనే ఉంది. వీటికంటే బ్యాంకు డిపాజిట్లు మెరుగ్గా ఉన్నాయి. కోటక్ మహింద్రా బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐడీఎఫ్సీ బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు అధిక రాబడులను ఆఫర్ చేస్తున్నాయి. ఐడీఎఫ్సీ బ్యాంకు 366 రోజుల డిపాజిట్‌పై సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. కోటక్ మహింద్రా బ్యాంకు 390 రోజుల కాల వ్యవధి కలిగిన బ్యాంకు డిపాజిట్‌పై 7.35 శాతం వడ్డీని అందిస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఈ రేటు 7.25 శాతంగా ఉంది. ఈ మూడు బ్యాంకులు కూడా నెలవారీ, త్రైమాసిక వారీ వడ్డీ ఆదాయం చెల్లింపు ఆప్షన్ అందిస్తున్నాయి. 7.25 శాతం వడ్డీ రేటుపై సీనియర్ సిటిజన్లకు రూ.7 లక్షల డిపాజిట్‌పై ఏటా రూ.50,000 ఆదాయం లభిస్తుంది. కాకపోతే పన్ను చెల్లించాల్సిన ఆదాయం ఉన్న సీనియర్ సిటిజన్లు ముందుగా కొత్తగా ప్రవేశపెట్టిన రూ.50,000 వడ్డీ ఆదాయం మినహాయింపును ఉపయోగించుకోవడం ద్వారా పన్ను రహిత ఆదాయం పెంచుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ మిగతా పథకాలపై వడ్డీ రేట్లు తగ్గిపోగా, పోస్టాఫీసు సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) ఇప్పటికీ అధిక స్థాయిలో 8.3 శాతం వార్షిక రాబడులను ఆఫర్ చేస్తోంది. మార్కెట్ రేట్ల కంటే ఇది ప్రీమియం రేటే. ఈ పథకంలో ఏడాది తర్వాత కార్పస్‌పై 1.5 శాతం పెనాల్టీ చెల్లించడం ద్వారా పెట్టుబడులను వెనక్కి తీసుకునే సౌలభ్యం కూడా ఉంది. కనుక ఐదేళ్ల కాల వ్యవధి కలిగిన ఈ పథకాన్ని సీనియర్ సిటిజన్లు స్థిరమైన రాబడుల కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. కాకపోతే ఈ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఆదాయపన్ను చట్టం కింద వార్షికంగా రూ.3 లక్షల ఆదాయం వరకు సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపు ఉన్నందున ఎక్కువ మందికి పన్ను పరమైన ఇబ్బందేమీ ఉండదు. పైగా సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల పెట్టుబడి వరకూ దీనికి మినహాయింపు ఉంది. ఈ అవకాశాలు కూడా చూడొచ్చు... సీనియర్ సిటిజన్లకు ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చిన 7.75 శాతం ప్రభుత్వ బాండ్లు లేదా ఎన్బీఎఫ్సీ సంస్థల బాండ్ల ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఆర్బీఐ 7.75 శాతం బాండ్లు గతంలో ఉన్న 8 శాతం వడ్డీ రేట్ల బాండ్ల స్థానంలో తీసుకొచ్చినవి. భద్రత పరంగా ఢోకా లేనివి ఇవి. కాకపోతే దీనిపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. టీడీఎస్ కూడా వర్తిస్తుంది. ఇతర సంప్రదాయ సాధనాల కంటే కాస్త మెరుగైన రాబడులకు ఇందులో హామీ ఉంటుంది. ఎస్బీఐతోపాటు పలు ఇతర జాతీయ బ్యాంకుల నుంచి వీటిని డీమ్యాట్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఏడేళ్ల పాటు లాకిన్ పీరియడ్ ఉండడం ప్రతికూలత. 60–70 ఏళ్ల వయసులో ఉన్న వారు ఆరేళ్ల తర్వాత ఉపసంహరణకు అవకాశం ఉంది. అదే 70 ఏళ్లు దాటిన వారు అయితే ఐదేళ్ల తర్వాత, 80 ఏళ్ల వారు నాలుగేళ్ల తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. దీర్ఘకాలం పాటు లాకిన్ పీరియడ్ ఉండడం అన్నది మారే వడ్డీ రేట్ల నేపథ్యంలో ప్రతికూలతగానే చూడాల్సి ఉంటుంది. కొంచెం రిస్క్ అయినా ఫర్వాలేదనుకుంటే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ) అందించే బాండ్లను పరిశీలించొచ్చు. ఏఏఏ రేటింగ్ ఉన్న బాండ్లను స్వల్ప కాలం కోసం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎం అండ్ ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఏడాదికి 7.5 శాతం), హెచ్డీఎఫ్సీ (7.4 శాతం), బజాజ్ ఫైనాన్స్ (7.6 శాతం) బాండ్లను రాబడులు, కాస్తంత భద్రత ఉన్నవాటిగా పరిగణించొచ్చు. వీటికి లాకిన్ పీరియడ్ లేకపోవడం అనుకూలత. కావాలనుకున్నప్పుడు పెట్టుబడులు వెనక్కి తీసుకోవచ్చు. ఎల్ఐసీ పదేళ్ల వయవందన యోజనలో పెట్టుబడుల పరిమితిని పెంచుతామని తాజా బడ్జెట్లో కేంద్రం ప్రకటించింది. అది అందుబాటులోకి వచ్చినప్పుడు వీటిలో పెట్టుబడుల్ని వెనక్కి తీసుకుని నచ్చిన వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. -
దారి మలుపులో పొదుపు దీపం
ఉమన్ ఫైనాన్స్ వృద్ధాప్యంలో ఒక నిర్ణీత మొత్తం నిర్ణీత కాలంలో అందే విధంగా ఉంటూ, వారి ఖర్చులకు ఉపయోగపడటమనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం 2004లో ‘సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్’ ప్రారంభించింది. ఈ స్కీమును పోస్ట్ ఆఫీస్‌లో, వివిధ బ్యాంకులలో నిర్ణీత బ్రాంచీల ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ స్కీములో డిపాజిట్ చేయడానికి అర్హతలు భారతీయులై ఉండాలి. అయితే ఎన్.ఆర్.ఐ.లు, హెచ్.యు.ఎఫ్.లు (హిందూ అన్ డివెడైడ్ ఫ్యామిలీ) డిపాజిట్ చేయడానికి వీలుండదు. 60 సం.లు, ఆ పై వయసు గలవారు అయివుండాలి. అయితే రిటైరై లేదా వి.ఆర్.ఎస్. (వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్) తీసుకుని 55 నుండి 60 సం. మధ్య వయసు గల వారైనా డిపాజిట్‌కు అర్హులే. కానీ వారు రిటైర్మెంట్ సొమ్ము తీసుకున్న నెల లోపు స్కీమును ప్రారంభించాలి. అలాగే డిపాజిట్ చేసే సొమ్ము రిటైర్మెంటు సొమ్మును మించకూడదు. ఈ ఖాతాను వ్యక్తిగతంగాను, జాయింట్ గానూ; భార్యాభర్తలిద్దరి పేరు మీద కూడా ప్రారంభించవచ్చు. ఈ స్కీము ఎలా పని చేస్తుంది? రు. 1000 మొదలుకుని రు. 15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. డిపాజిట్ ఒకేసారి చెయ్యాలి. ఒక వ్యక్తి ఎన్ని ఖాతాలనైనా ప్రారంభించవచ్చు. కానీ అన్ని ఖాతాలలోనూ డిపాజిట్ చేయబడిన మొత్తం కలిపి గరిష్ట పరిమితిని మించకూడదు. ఈ స్కీములో డిపాజిట్ మొత్తానికి 5 సం. కాలపరిమితి ఉంటుంది. {పతి మూడు నెలలకు ఒకసారి వడ్డీని ఖాతాదారుని సేవింగ్స్ ఖాతాకు బదలీ చేస్తారు. {పస్తుతం 9.3 శాతం వడ్డీని అందజేస్తున్నారు. డిపాజిట్ చేసే సొమ్ము లక్ష లోపు ఉంటే సొమ్మును డెరైక్టుగా డిపాజిట్ చేయవచ్చు. ఒక వేళ లక్షకు పైగా అయితే చెక్కు రూపంలో డిపాజిట్ చేయాలి. ఖాతాను రద్దు చేసుకుని సొమ్మును వెనక్కు తీసుకోవాలి అనుకుంటే ఏడాది వరకు వీలు కాదు. సంవత్సరం తర్వాత కూడా డిపాజిట్ సొమ్ము మీద 1.5 శాతం పెనాల్టీ, 2 సం. తర్వాత ఐతే 1 శాతం పెనాల్టీని చెల్లించి సొమ్మును వెనక్కి తీసుకోడానికి వీలవుతుంది. ఐదు సంవత్సరాల కాల పరిమితి ముగిసిన తర్వాత ఇంకా ఖాతాని పొడిగించదలచుకుంటే మరొక 3 సం. వరకు పొడిగించవచ్చు. ఇందుకోసం చివరి సంవత్సరంలో పొడిగింపునకు సంబంధించిన పత్రాలను అందజేయాలి. ఖాతాను పొడిగించిన తర్వాత గడువు తీరకముందే వెనక్కి తీసుకోవాలి అంటే ఒక సంవత్సరం తర్వాత ఎటువంటి పెనాల్టీ లేకుండా వెనక్కి తీసుకోవచ్చు. ఈ ఖాతాలో డిపాజిట్ చేసిన సొమ్ముకు ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 సి కింద మినహాయింపు పొందవచ్చు. కానీ ఈ సొమ్ముపై వచ్చే వడ్డీకి పన్ను వర్తిస్తుంది. వడ్డీ కనుక ఒక సంవత్సరానికి 10,000 రూపాయలకు మించితే టి.డి.ఎస్. (టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) కూడా వర్తిస్తుంది. ఖాతాను ప్రారంభించేటప్పుడు లేదా ప్రారంభించిన తర్వాత కూడా నామినీని నమోదు చేసుకునే సదుపాయం ఉంది. వృద్ధాప్యంలో ఒక నిర్ణీత మొత్తం ఎటువంటి రిస్క్ లేకుండా గ్యారెంటీగా రావాలని కోరుకునే వారికి ఈ స్కీము చక్కగా ఉపయోగపడుతుంది. డిపాజిట్ చేయాలనుకునే సొమ్ము కనీసం రెండు ఖాతాలలో డిపాజిట్ చేసే విధంగా చూసుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో సొమ్ము అవసరమై తీసుకోవాలనుకున్నప్పుడు ఒక ఖాతాను కొనసాగిస్తూ మరొక ఖాతాలోంచి సొమ్ము తీసుకోవచ్చు. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’