న్యూఢిల్లీ: రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు చార్జీల్లో అందించే రాయితీని తిరిగి పునరుద్ధరించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 60 ఏళ్లు పైబడిన పురుషులకు 40 శాతం, 58 ఏళ్లు దాటిన మహిళలకు టికెట్ ధరలో 50 శాతం చొప్పున అన్ని రైళ్లలోని అన్ని తరగతుల్లోనూ రాయితీ ఉండేది. కరోనా నేపథ్యంలో 2020 మార్చి 20 నుంచి దీన్ని రద్దు చేశారు. బీజేపీ ఎంపీ రాధా మోహన్ సింగ్ సారథ్యంలోని రైల్వే శాఖ స్టాండింగ్ కమిటీ డిమాండ్ ఫర్ గ్రాంట్లపై సోమవారం పార్లమెంట్‌కు సమర్పించిన 14వ నివేదికలో దీన్ని ప్రస్తావించింది. ఈ రాయితీని పునరుద్ధరించాలని కోరింది. కనీసం స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీకైనా వర్తింపజేయాలని సూచించింది. అయితే అలాంటి యోచనేదీ లేదని రైల్వే శాఖ గతంలోనే స్పష్టం చేసింది. ప్రయాణికులకు ఇప్పటికే టికెట్ ధరపై 55 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్టు తెలిపింది.
వందేభారత్ రైళ్ల ఉత్పత్తిపై ఆందోళన
వందేభారత్ రైళ్ల తయారీ మందగమనంపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘2022–23లో 35 రైళ్లు తయారవాల్సి ఉండగా ఇప్పటిదాకా కేవలం 8 రైళ్లే సిద్ధమయ్యాయి. లక్ష్యాన్ని చేరుకోవాలన్నా, రైలు ప్రయాణికుల ఆకాంక్షలు నెరవేరాలన్నా వందేభారత్ రైలు ఇంజన్లు, బోగీల తయారీ వేగాన్ని ముమ్మరం చేయాలి. ఇందుకోసం పలు ప్రాంతాల్లోని ఉత్పత్తి కేంద్రాలకు రైల్వేశాఖ సాంకేతిక తోడ్పాటు అందించాలి’’ అని సూచించింది.
సీనియర్ సిటిజన్లకు రైలు చార్జీల్లో రాయితీ పునరుద్ధరించాలి
Published Tue, Mar 14 2023 6:25 AM | Last Updated on Tue, Mar 14 2023 6:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment