దారి మలుపులో పొదుపు దీపం
ఉమన్ ఫైనాన్స్
వృద్ధాప్యంలో ఒక నిర్ణీత మొత్తం నిర్ణీత కాలంలో అందే విధంగా ఉంటూ, వారి ఖర్చులకు ఉపయోగపడటమనే ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం 2004లో ‘సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్’ ప్రారంభించింది. ఈ స్కీమును పోస్ట్ ఆఫీస్‌లో, వివిధ బ్యాంకులలో నిర్ణీత బ్రాంచీల ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ స్కీములో డిపాజిట్ చేయడానికి అర్హతలు భారతీయులై ఉండాలి. అయితే ఎన్.ఆర్.ఐ.లు, హెచ్.యు.ఎఫ్.లు (హిందూ అన్ డివెడైడ్ ఫ్యామిలీ) డిపాజిట్ చేయడానికి వీలుండదు. 60 సం.లు, ఆ పై వయసు గలవారు అయివుండాలి.
అయితే రిటైరై లేదా వి.ఆర్.ఎస్. (వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్) తీసుకుని 55 నుండి 60 సం. మధ్య వయసు గల వారైనా డిపాజిట్‌కు అర్హులే. కానీ వారు రిటైర్మెంట్ సొమ్ము తీసుకున్న నెల లోపు స్కీమును ప్రారంభించాలి. అలాగే డిపాజిట్ చేసే సొమ్ము రిటైర్మెంటు సొమ్మును మించకూడదు. ఈ ఖాతాను వ్యక్తిగతంగాను, జాయింట్ గానూ; భార్యాభర్తలిద్దరి పేరు మీద కూడా ప్రారంభించవచ్చు.
ఈ స్కీము ఎలా పని చేస్తుంది?
రు. 1000 మొదలుకుని రు. 15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. డిపాజిట్ ఒకేసారి చెయ్యాలి. ఒక వ్యక్తి ఎన్ని ఖాతాలనైనా ప్రారంభించవచ్చు. కానీ అన్ని ఖాతాలలోనూ డిపాజిట్ చేయబడిన మొత్తం కలిపి గరిష్ట పరిమితిని మించకూడదు. ఈ స్కీములో డిపాజిట్ మొత్తానికి 5 సం. కాలపరిమితి ఉంటుంది. {పతి మూడు నెలలకు ఒకసారి వడ్డీని ఖాతాదారుని సేవింగ్స్ ఖాతాకు బదలీ చేస్తారు. {పస్తుతం 9.3 శాతం వడ్డీని అందజేస్తున్నారు. డిపాజిట్ చేసే సొమ్ము లక్ష లోపు ఉంటే సొమ్మును డెరైక్టుగా డిపాజిట్ చేయవచ్చు. ఒక వేళ లక్షకు పైగా అయితే చెక్కు రూపంలో డిపాజిట్ చేయాలి. ఖాతాను రద్దు చేసుకుని సొమ్మును వెనక్కు తీసుకోవాలి అనుకుంటే ఏడాది వరకు వీలు కాదు. సంవత్సరం తర్వాత కూడా డిపాజిట్ సొమ్ము మీద 1.5 శాతం పెనాల్టీ, 2 సం. తర్వాత ఐతే 1 శాతం పెనాల్టీని చెల్లించి సొమ్మును వెనక్కి తీసుకోడానికి వీలవుతుంది. ఐదు సంవత్సరాల కాల పరిమితి ముగిసిన తర్వాత ఇంకా ఖాతాని పొడిగించదలచుకుంటే మరొక 3 సం. వరకు పొడిగించవచ్చు. ఇందుకోసం చివరి సంవత్సరంలో పొడిగింపునకు సంబంధించిన పత్రాలను అందజేయాలి.
ఖాతాను పొడిగించిన తర్వాత గడువు తీరకముందే వెనక్కి తీసుకోవాలి అంటే ఒక సంవత్సరం తర్వాత ఎటువంటి పెనాల్టీ లేకుండా వెనక్కి తీసుకోవచ్చు. ఈ ఖాతాలో డిపాజిట్ చేసిన సొమ్ముకు ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 సి కింద మినహాయింపు పొందవచ్చు. కానీ ఈ సొమ్ముపై వచ్చే వడ్డీకి పన్ను వర్తిస్తుంది. వడ్డీ కనుక ఒక సంవత్సరానికి 10,000 రూపాయలకు మించితే టి.డి.ఎస్. (టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) కూడా వర్తిస్తుంది. ఖాతాను ప్రారంభించేటప్పుడు లేదా ప్రారంభించిన తర్వాత కూడా నామినీని నమోదు చేసుకునే సదుపాయం ఉంది.
వృద్ధాప్యంలో ఒక నిర్ణీత మొత్తం ఎటువంటి రిస్క్ లేకుండా గ్యారెంటీగా రావాలని కోరుకునే వారికి ఈ స్కీము చక్కగా ఉపయోగపడుతుంది. డిపాజిట్ చేయాలనుకునే సొమ్ము కనీసం రెండు ఖాతాలలో డిపాజిట్ చేసే విధంగా చూసుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో సొమ్ము అవసరమై తీసుకోవాలనుకున్నప్పుడు ఒక ఖాతాను కొనసాగిస్తూ మరొక ఖాతాలోంచి సొమ్ము తీసుకోవచ్చు.
రజని భీమవరపు
ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’